తెలంగాణ

మరో డ్రైవర్‌ను బలిగొన్న ‘సమ్మె’ట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: ఆర్టీసీ సంక్షోభం మరో కార్మికుడి ప్రాణాలను బలిగొంది. కొలువు ఉంటుందో, లేదోననే మనోవేదనకు గురైన ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుకు గురై అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఎడపల్లి మండలం మంగల్‌పాడ్ గ్రామానికి చెందిన కే.రాజేందర్ (55) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. రాజేందర్ గత పుష్కర కాలం నుండి బోధన్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించేవాడు. డిమాండ్ల సాధన కోసం కొనసాగిన సమ్మెలోనూ చురుకైన పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఆయన ఒక్కసారిగా గుండెపోటుకు గురి కావడంతో కుటుంబ సభ్యులు రాజేందర్‌ను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాంబే నర్సింగ్ హోమ్‌లో చేర్పించగా, చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ సంఘటనతో నిజామాబాద్ సహా బోధన్, ఎడపల్లి తదితర ప్రాంతాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. రాజేందర్ గుండెపోటుతో మృతి చెందిన సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుని అతని భౌతిక కాయాన్ని సందర్శించారు. మృతదేహంతో డిపో వద్ద నిరసన తెలిపేందుకు సమాయత్తం అవుతుండడాన్ని గమనించిన పోలీసులు జేఏసీ, అఖిలపక్ష నాయకులను అరెస్టు చేసి ఆసుపత్రి నుండి ఆఘమేఘాల మీద మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మంగల్‌పాడ్ గ్రామంలోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. అప్పటికే ముఖ్య నేతలందరినీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అతికొద్ది మంది నాయకులు మాత్రమే అతికష్టం మీద మంగల్‌పాడ్‌కు చేరుకోగలిగారు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వ కక్షసాధింపు ధోరణి వల్లే రాజేందర్ మృతి చెందాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని రాజేందర్ అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.రమేష్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, సీఐటీయూ నాయకురాలు నూర్జహాన్ తదితరులు ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల అకాల మరణాలకు కేసీఆర్ సర్కార్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మృతుడి కుటుంబీకులు సైతం ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. ఉద్యోగాల్లో చేరతామని ప్రకటించినప్పటికీ ప్రభుత్వం అందుకు అవకాశం కల్పించకపోవడంతో రాజేందర్ మనోవేదనకు లోనయ్యాడని మృతుడి కుటుంబీకులు ఆవేదన వెలిబుచ్చారు. గడిచిన నాలుగైదు రోజుల నుండి ఇదే విషయాన్ని పదేపదే తమతో ప్రస్తావిస్తూ మానసిక ఒత్తిడికి గురి కావడం వల్లే రాజేందర్ గుండెపోటుకు గురై మృతి చెందాడని కన్నీటిపర్యంతం అయ్యారు. మృతుడికి భార్య తులసి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన సమాచారం తెలుసుకున్న బోధన్ డిపో ఆర్టీసీ అధికారులు తక్షణ ఆర్థిక సహాయం కింద బాధిత కుటుంబానికి 20వేల నగదును అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఆందోళనలు చేపట్టేందుకు ఆస్కారం లేకుండా గ్రామంలోనూ పోలీసులు గట్టి బందోబస్తును కొనసాగించగా, పోలీసుల పహారా నడుమ రాజేందర్ అంత్యక్రియలు జరిపారు.
*చిత్రాలు.. ఆర్టీసీ డ్రైవర్ రాజేందర్ మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు, అంతర చిత్రంలో రాజేందర్ ఫైల్ ఫొటో
* ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, వామపక్ష పార్టీల నాయకులు