తెలంగాణ

విధుల్లో చేర్చుకోవడంపై నేడు స్పష్టత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోవడానికి ప్రభుత్వం గురువారం జరిగే కేబినెట్‌లో తీసుకునే స్పష్టతపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మూకుమ్మడిగా కార్మికులందరినీ విధుల్లోకి ప్రభుత్వం ఆహ్వానిస్తుందా? లేదా కొంతమందిని తీసుకుంటుందా? అన్నది రాష్ట్ర కేబినెట్ తేల్చనుంది. రెండు రోజుల పాటు జరిగే కేబినెట్‌లో కీలకమైన నిర్ణయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇస్తారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకునే అంశంపై ప్రధానంగా చర్చకు రానుంది. కార్మికులను విధుల్లోకి తీసుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందన్న చర్చ ప్రధానంగా సాగుతోంది. దాదాపు 5,100 ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించడానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వాటికి మార్గదర్శకాలపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. రూట్లను ప్రైవేట్ సంస్థలకు అప్పజెబితే ఆయా మార్గాల్లో ఆర్టీసీ బస్సులు తిరిగే అవకాశం ఉండదు. ప్రయాణికులను ఎక్కించుకోవడానికి తప్పనిసరిగా ప్రైవేట్ బస్‌లు బస్టాండ్‌కు వెళ్లక తప్పదు. ప్రైవేట్ బస్సులు బస్టాండ్‌కు వెళ్తే సర్వీస్ చార్జి పేరుతో ప్రయాణికులపై భారం వేయక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వీస్ చార్జీలు చెల్లించడానికి ప్రయాణికులు అంగీకరిస్తారా? అన్నది ప్రభుత్వానికి పెద్ద సమస్యగా ఉందంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే ఆటోల పరిస్థితి ఏమిటి అన్న కొత్త సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రైవేట్ సంస్థలకు రూట్లను ఇస్తే ఆయా మార్గాల్లో తిరిగే షేరింగ్ ఆటోలను నియంత్రించడానికి ఎవరు బాధ్యత వహిస్తారు. ఆటోల నియంత్రణను
ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఆటోలు నడుపుతూ జీవనం సాగించే వందలాది మంది రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటో కార్మికుల పరిస్థితి ఏమిటన్నది ప్రభుత్వం తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇక సంస్థలోని కొంతమంది కార్మికులను వదిలించుకోవడానికి వీఆర్‌ఎస్‌ను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తోంది. స్వచ్ఛంద పదవీ విరమణకు ఎంతమంది సుముఖత వ్యక్తం చేస్తారో కార్మికులు మళ్లీ విధుల్లో చేరితే తప్పా స్పష్టత వచ్చే అవకాశం లేదు. పదవీ విరమణకు రెండు, లేదా అంతకు ఎక్కువ సంవత్సరాలు అమలు చేస్తే ఏమేరకు భారం పడుతుందోనని ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. వీఆర్‌ఎస్‌కు ముందుకు వచ్చే కార్మికులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేస్తే ప్రభుత్వం ఎన్నివేల కోట్లు భరించాలి అన్న ప్రశ్నలు కూడా వెంటాడుతున్నాయి. దశలవారీగా వీఆర్‌ఎస్‌ను అమలు చేస్తే ప్రభుత్వంపై తక్కవ భారం పడుతుందన్న వాదన వినిపిస్తోంది. మరోపక్క సమ్మె కాలంలో ప్రత్యామ్నాయంగా విధుల్లోకి తీసుకున్న కార్మికులకు ఎలాంటి జాబ్‌చార్ట్‌ను అమలు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఆర్టీసీ కార్మికులు దాదాపు 54 రోజులుగా విధులకు దూరంగా ఉన్నారు. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరతామని రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద నిల్చుంటున్నారు. అయితే ప్రభుత్వం ససేమిరా అంటూ కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంలేదు. కార్మిక శాఖ కోర్టులో నిర్ణయం వస్తే తప్పా సమ్మెకు దిగిన కార్మికులను తీసుకోవడానికి కుదరదని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. దీంతో కార్మికులు అయోమయంలో పడ్డారు. తమను విధుల్లోకి చేర్చుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి వైఖరిని ప్రదర్శిస్తుందోనని కార్మికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సమ్మె జోలికి పోమని కార్మికులు వాపోతున్నారు. సమ్మె దినాలకు ప్రభుత్వం ఎలాంటి వేతనం చెల్లిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు సహాయం చేస్తుందా లేక సంతాపంతో ముగిస్తుందా? అన్న ప్రశ్నలు వెంటాడుతున్నాయి. కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి ఎత్తులు అమలు చేస్తుందోనని కార్మిక నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఏదిఏమైనా గురువారం జరుగనున్న కేబినెట్ నిర్ణయాలు ఎలా ఉంటాయోనని కార్మిక వర్గ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.