తెలంగాణ

కోర్టుల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో న్యాయమూర్తులతో పాటు కోర్టుల్లో ఖాళీలన్నీ భర్తీచేసి న్యాయవ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తాం అని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో ఫోక్సో, ఫ్యామిలీ కోర్టు నూతన భవనాలు, తాగునీటి ప్లాంట్, ఈ ఫైలింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కోర్టు సముదాయంలో వేరువేరు కోర్టులు, భవనాలు ఉన్నాయని వాటిన్నింటి స్థానంలో ఆధునిక హంగులతో నూతన కోర్టు భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తి పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. వివిధ పోస్టులను కూడా జనవరి రెండో వారంలో భర్తీ చేయటానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని న్యాయవాదుల అందరికీ వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు హైదరబాద్‌లో 10-15 ఎకరాలలో అడ్వకేట్స్ అకాడమి నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. కరీంనగర్ కోర్టులో పదేళ్ళకు పైగా 762 సివిల్ కేసులు, 20 క్రిమినల్ కేసులు, 80 ఇతర కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పాత కేసులన్నింటినీ త్వరగా పరిష్కరించేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. కొన్ని కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని, లోక్ అదాలత్‌లను వినియోగించుకొని ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయన సూచించారు. లా అండ్ ఆర్డర్ పాటించేందుకు ప్రతి వ్యక్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని చెట్లతో ఫ్యామిలీ కోర్టును నిర్మించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌రావు మాట్లాడుతూ కరీంనగర్‌లో కొత్తమోడల్ కోర్టు భవనం నిర్మిస్తామని తెలిపారు. కోర్టులలో అవసరాలకు అనుగుణంగా అదనపు సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి చల్లా కోదండరాం మాట్లాడుతూ కోర్టులలో కేసులను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. కేసుల పెండింగ్ వల్ల వేరువేరు ట్రిబ్యునల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కోర్టుల్లో గల అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, వౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. కోర్టుల బలోపేతానికి న్యాయవాదులు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా సెషన్ జడ్జి అనుపమ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర బార్ అసోసియేషన్ సభ్యులు కె.లక్ష్మణ్ కుమార్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్‌కుమార్, న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్