తెలంగాణ

నో ప్లాస్టిక్...నో ఫ్లెక్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, నవంబర్ 30: తెలంగాణాలో నో ప్లాస్టిక్...నో ఫ్లెక్సీ అనే నినాదాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, పారిశుద్ధ్య నివారణతో పాటు పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రజానికానికి అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిషేధంపై శాసనసభలో చేసిన తీర్మానం హర్షణీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా ఇది అమలయ్యేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లుతోందని, ఫ్లెక్సీలతో కూడా చేటు చేకూరే అవకాశం ఉందన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి విషయంలో దేశానికి తెలంగాణ దిక్సూచిలా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమంతో పాటుగా ప్రగతి ధ్యాసతో ప్రభుత్వం ముందుకు పోతోందని, పదవులు ముఖ్యం కాదని, వాటిని బాధ్యతతో నిర్వర్తించినప్పుడే సార్ధకత ఉంటుందన్నారు. 43 యేళ్ల సుదీర్ఘ రాజకీయానుభవంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏ పదవిలో ఉన్నా జవాబుదారీతనం, పారదర్శకతతో పనిచేశారని, తెలంగాణాలో ఉన్న శాసన సభ్యులందరికీ ఆయన ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కొనియాడారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సభాపతి హోదాలో స్పీకర్ పోచారం ఆదేశించారని, ఆ బాధ్యతను తాను తప్పకుండా నెరవేరుస్తానన్నారు. బాన్సువాడ పురపాలక భవన నిర్మాణంతో పాటు వార్డుల్లో మిగిలిపోయిన రోడ్ల నిర్మాణాల కోసం తగినన్ని నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బాన్సువాడ పట్టణం అభివృద్ధి దిశగా పయనిస్తోందని, అందుకు స్పీకర్ అహరహం శ్రమిస్తున్నారని అన్నారు. క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా మినీ స్టేడియాన్ని వారికి అంకితం చేస్తున్నామని చెప్పారు. పట్టణవాసులకు ఆహ్లాద వాతావరణాన్ని కల్పించేందుకు మినీ ట్యాంక్ బండ్‌ను ప్రారంభించుకున్నట్టు మంత్రి చెప్పారు. నేషనల్ హైవే తరహాలో బాన్సువాడ పట్టణంలో వంద ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టి పనులను నాణ్యతగా జరిపించడంలో సభాపతి ప్రత్యేక శ్రద్ధ చూపారని తెలిపారు. లోగడ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అడుగు బొడుగు ఉన్న ప్రతిపక్ష కాంగ్రెస్ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారని మరోమారు స్పీకర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. బాధ్యతల నిర్వహణలో సభాపతి నిత్య విద్యార్థిగా ఉంటారని, ఆయన అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ పనులకు ఆమోదం తెలుపుతూ నిధులను మంజూరు చేస్తారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాన్సువాడ పట్టణంలో నలభై వేల జనాభా ఉంటే రెండు వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయించుకున్నారని, నియోజకవర్గంలో ఆరువేల ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు.
మరో మూడు వేల ఇళ్ల మంజూరుకు కసరత్తు చేసుకుంటున్నారని, ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా మంజూరు కాలేదని చెప్పారు. ఈ సభలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జడ్పీ చైర్మెన్లు దాదన్నగారి విఠల్‌రావు, దఫేదార్ శోభ, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు షకీల్, నల్లమడుగు సురేందర్, హన్మంత్ షిండే, బిగాల గణేష్‌గుప్తా, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, ఆకుల లలిత, వీజీ.గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కలెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...సభలో ప్రసంగిస్తున్న రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్