తెలంగాణ

దేశం కోసం త్యాగాలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంతం నిర్వహించిన సార్వజనిక ఉత్సవ మహాసభలు గురువారం నాడు ముగిశాయి. ముగింపు సమావేశంలో సంఘ్ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ మాట్లాడారు. సంఘ్ కార్యవిస్తరణకు సమాజం పట్ల ప్రేమ, శ్రమించే తత్వం ప్రధాన సాధనాలని పేర్కొన్నారు. దేశం పరమవైభవాన్ని సాధించడానికి ప్రతి కార్యకర్త సమర్పణ భావంతో సమయాన్ని కేటాయించి పనిచేయాలని హితవుపలికారు. సమాజంలో మేలు కోరే ఆలోచనలు, వాటిని తెలియజేసే విధానం కార్యవిస్తరణలో కీలకమని వాటిని ఎన్నడూ విస్మరించరాదని పేర్కొన్నారు.
విజయ సంకల్ప శిబిరం పేరిట సరూర్‌నగర్ స్టేడియంలో బుధవారం నాడు నిర్వహించిన భారీ బహిరంగ సభతో ఆర్‌ఎస్‌ఎస్ శిబిరంలో ఉత్సాహం తొణికిసలాడింది. బహిరంగ సభలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు సియంట్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి హాజరయ్యారు.
మూడు రోజుల శిబిరంలో అనేక మంది ప్రముఖులు ఉపన్యసించారు. రానున్న రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ను మరింత విస్తృతం చేయాలని, గ్రామగ్రామానికీ శాఖలను ఏర్పాటు చేసే దిశగా కృషి జరగాలని మూడు రోజుల శిబిరంలో ఆర్‌ఎస్‌ఎస్ నేతలు స్వయం సేవకులకు పిలుపునిచ్చారు. దేశం కోసం త్యాగాలకు సిద్ధం కావాలని, సమాజంలో విలువలు పెంచేందుకు, సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని ఇనుమడింపచేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 24న భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభమైన ఈ శిబిరంలో 7705 మంది ఎంపిక చేసిన ముఖ్య శిక్షక్‌లు హాజరయ్యారు. 1925లో ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్ 2024 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోందని ఆనాటికి ఆర్‌ఎస్‌ఎస్ తన లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శిబిరంలో నిర్వహించిన వివిధ శిక్షణ తరగతుల్లో బోధించారు. ఇందుకోసం మరింత వేగంగా కార్యవిస్తరణ చేసుకోవాలని సంఘ్ సంకల్పించిందని వారు పేర్కొన్నారు. తెలంగాణలో ఏడు దశాబ్దాలుగా విస్తరించిన సంఘ్ కార్యం గత ఏడాది కాలంలో మరింత విస్తరించిందని అన్నారు. 2018 నాటికి మొత్తం శాఖల సంఖ్య 2106 కాగా 2019 నాటికి ఆ సంఖ్య 3494కు పెరిగిందని అన్నారు. 2018 నాటికి 826 మండలాల్లో ఉన్న సంఘ్ కార్యం 2019 నాటికి 69 శాతానికి పెరిగిందని అన్నారు. ఇక నగరాల్లో 2018 నాటికి మొత్తం 1437 బస్తీల్లో 47 శాతం ఉన్న శాఖలు 2019 నాటికి 69.5 శాతానికి పెరిగాయని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రతి ఊరిలో ఆర్‌ఎస్‌ఎస్ తమ శాఖ కార్యకలాపాలను నిర్వహించాలని పేర్కొన్నారు.
ఆర్ధిక స్థితిగతులు, సామాజిక హోదా తారతమ్యాలు లేకుండా సాధారణ కార్యకర్త నుండి రాష్టస్థ్రాయి, దేశ స్థాయి బాధ్యతలున్న వారు అంతా ఈ శిబిరంలో పాల్గొన్నారు. చిన్న వయస్సు వారి మొదలు 77 ఏళ్ల ప్రాయం ఉన్న వారు సైతం మూడు రోజుల పాటు కఠోర శిక్షణ తరగతులను హాజరయ్యారు. శిబిరంలో పాల్గొన్న వారికి మరో వెయ్యి మంది సహకారం అందించారు. మార్గదర్శనానికి మరో 250 మంది పనిచేశారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా 110 ఎకరాల్లో జోగులాంబ నగరం, యాదాద్రి నగరం, భద్రాద్రి నగరం, సమ్మక్క సారలమ్మ నగరం, భాగ్యలక్ష్మి నగరం అని ఐదు నగరాలుగా తీర్చిదిద్దారు. ప్రతి నగరంలో 1500 నుండి 2500 మంది స్వయం సేవకుల బసతో పాటు భోజన, సభా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. అన్ని నగరాలకు కలిపి సామూహిక కార్యక్రమాలు నిర్వహించడానికి మరో పెద్ద ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఇలా ఉంటుందా ఈ రోజుల్లో కూడా ఇంతటి అనుశాసనం, క్రమశిక్షణ, దేశభక్తి ఉన్న వ్యక్తులు ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నారా అని ఈ శిబిరం చూసే పౌరులు కూడా ఆశ్చర్యపోయేలా రూపొందించారు. సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో, దేశభక్తి భావాలను జాగృతపరచడంలో సంఘ్ కృషి కొనసాగుతుందని, సంఘ్ ప్రేరణతో రాష్ట్రంలో లక్షన్నర మంది స్వయం సేవకులు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఎంపిక చేసిన వారికి మాత్రమే తాజా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించామని సంఘ్ నేతలు పేర్కొన్నారు.
సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అస్పృశ్యత నివారణకు, పర్యావరణ పరిరక్షణకు స్వయం సేవకులు పనిచేస్తున్నారని వివరించారు.
ప్రతి మూడేళ్లకోమారు జిల్లా లేదా విభాగ్ స్థాయిలో హేమంత శిబిరాలు జరుగుతుంటాయని, అయితే ఈసారి శాఖ ఆ పైస్థాయి కార్యకర్తలకు మూడు రోజుల పాటు ఈ ప్రాంత శిబిరాలను నిర్వహిస్తోందని అన్నారు.
ఈ శిబిరంలో ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత సహ సర్ కార్యవాహ్ ముకుందా, క్షేత్ర సంఘ్‌చాలక్ దూసి రామకృష్ణ, దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ ఆలే శ్యాంకుమార్, దక్షిణ మధ్య క్షేత్ర సంఘ్‌చాలక్ వీ నాగరాజు, ప్రాంత సంఘ్‌చాలక్ బూర్ల దక్షిణామూర్తి, ప్రాంత కార్యవాహ కంచం రమేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అఖిల భారత ప్రధానకార్యదర్శి పీ మురళీధరరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ , ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు , పార్టీ జాతీయ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, గరికపాటి మోహనరావు, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.