కృష్ణ

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిపై ఎసిబి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 31: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిపై ఎసిబి అధికారుల దాడి కలకలం సృష్టించింది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ జూనియర్ అసిస్టెంట్ రూ.10వేలు లంచం తీసుకుంటూ మంగళవారం అవినీతి నిరోధక శాఖాధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిపై జరిగిన ఎసిబి అధికారుల దాడి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన మునే్నటి శివ కోటేశ్వరరావు జిల్లాలోని నందిగామ, తిరువూరు, ఉయ్యూరు, మైలవరం ఏరియా ఆస్పత్రుల శానిటేషన్ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. గత పది సంవత్సరాల నుండి కోటేశ్వరరావు కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ప్రతి నెలా ఆయా ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ బిల్లులను సంబంధిత ఆస్పత్రుల సూపరింటెండెంట్‌ల ద్వారా పెడుతున్నాడు. గత యేడాది నుండి కోటేశ్వరరావుకు సంబంధించిన బిల్లులను జూనియర్ అసిస్టెంట్ తస్లీమ్ బేగ్ ఉన్నతాధికారులకు పంపకుండా నిలుపుదల చేశాడు. సుమారు రూ.20లక్షలు మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఇదేమిటని అడిగిన కోటేశ్వరరావును పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేశాడు. సుమారు రెండు మూడు నెలల నుండి కోటేశ్వరరావును తస్లీమ్ బేగ్ తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. అడిగినంత ఇవ్వకుంటే బిల్లు పాస్ చేసేది లేదంటూ ఖరాకండిగా చెప్పేశాడు. నువ్వు ఇచ్చే మొత్తం నాకొక్కడికే కాదని పై అధికారులకు కూడా పంపాలని లేకుంటే నీ పని అవ్వదంటూ హెచ్చరించాడు. దీంతో ఏం చేయాలో పాలు పోని కోటేశ్వరరావు గత వారం రోజుల క్రితం అవినీతి నిరోధక శాఖాధికారులను ఆశ్రయించాడు. ఎసిబి అధికారుల సూచనల మేరకు గత మూడు నాలుగు రోజుల క్రితం రూ.20వేలు ఇచ్చిన కోటేశ్వరరావు తాజాగా మంగళవారం మధ్యాహ్నం మరో రూ.10వేలు తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న తస్లీమ్ బేగ్‌కు ఇచ్చాడు. అప్పటికే మాటు వేసి ఉన్న ఎసిబి అధికారులు అవినీతి అధికారిని పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విజయవాడ ఎసిబి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఎసిబి డియస్‌పి గోపాలకృష్ణ పాత్రికేయులకు తెలిపారు. దీని వెనుక కొంత మంది జిల్లా అధికారుల హస్తం కూడా ఉన్నట్టు తమకు ఫిర్యాదు అందిందని, ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకుంటామని డియస్‌పి తెలిపారు. దాడిలో పట్టుబడ్డ తస్లీమ్ బేగ్‌పై కూడా చాలా ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఏ చిన్న పని చేయాలన్నా లంచం డిమాండ్ చేస్తాడన్నారు. బాధితుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ బిల్లులు మంజూరు చేసే విషయంలో తస్లీమ్ బేగ్ చాలా ఇబ్బందులకు గురి చేశారని వాపోయాడు. ఈ దాడిలో ఎసిబి సిఐలు కె వెంకటేశ్వర్లు, బి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా దాడిలో పట్టుబడ్డ తస్లీమ్ బేగ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు) సంఘ నాయకుడు కావడం విశేషం. పట్టణ ఎన్‌జిఓస్ అసోసియేషన్‌కు బేగ్ అధ్యక్షునిగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బేగ్ తప్పుకుని మరొకరికి అవకాశం కల్పించారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆదర్శంగా నిలవాల్సిన సంఘ నాయకుడే అవినీతికి పాల్పడుతూ ఎసిబి దాడిలో పట్టుబడటం కొసమెరుపు.