ప్రకాశం

అంతుచిక్కని చంద్రబాబు అంతరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 6: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంతరంగం అంతుచిక్కక జిల్లాలోని తెలుగు తమ్ముళ్ళు తలలు బాదుకుంటున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజార్టీ ఉన్నప్పటికీ రాష్ట్రంతోపాటు జిల్లాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులతోపాటు, ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకోవటం పట్ల పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోను తెలుగు తమ్ముళ్ళకు ప్రత్యామ్నాయంగా వైకాపా నుండి వచ్చిన నాయకులను చంద్రబాబు తెరపైకి తీసుకువచ్చి వారికి పోటీగా రంగప్రవేశం చేయించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయానికి తెలుగుతమ్ముళ్ళు సీట్ల వ్యవహరంలో పేచీలు పెట్టకుండా, అధినేతపై తిరుగుబాటు చేయకుండా నీవుకాక పోతే ప్రత్యామ్నాయ నాయకుడికి టిక్కెట్ కేటాయిస్తానన్న భావనను ముందుగానే వారికి తెలియచెప్పేందుకే ఈ చర్యలకు పూనుకుంటున్నారా, లేక వైసిపిని సమూలంగా నిర్మూలించేందుకు ఈ చర్య తీసుకుంటున్నారా అన్న చర్చ పార్టీశ్రేణుల నుండి ప్రముఖంగా వినిపిస్తోంది.
జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా ఈపాటికే 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు కొనసాగుతుండగా మిగిలిన మార్కాపురం, సంతనూతలపాడు శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్ మాత్రమే వైసిపి తరపున ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కనిగిరి, దర్శి, ఒంగోలు, కొండెపి, పర్చూరు నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు కదిరి బాబూరావు, శిద్దా రాఘవరావు, దామచర్ల జనార్దన్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు మాత్రమే గెలుపొందగా, మిగిలిన చీరాలలో స్వతంత్ర అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందగా ఆరు నియోజకవర్గాల్లో వైసిపి తరపున శాసనసభ్యులు గెలుపొందారు.
ఇదిలాఉండగా అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ తరపున కరణం బలరామకృష్ణమూర్తి ఇన్‌చార్జిగా కొనసాగుతుండగా ప్రత్యామ్నాయంగా వైకాపాకు చెందిన సిట్టింగ్ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్‌ను తెలుగుదేశంపార్టీ లోకి ఆహ్వానించారు. దీంతో ఆ నియోజకవర్గంలో గొట్టిపాటి వర్సస్ బలరాం వర్గీయుల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గంలో వైసిపి చెందిన శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకోగా, ఇప్పటివరకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న అన్నా రాంబాబు అధినేత వ్యవహర శైలిపై గుర్రుగా ఉన్నారు. కందుకూరు నియోజకవర్గంలో సిట్టింగ్ శాసనసభ్యుడు పోతుల రామారావు కూడా తెలుగుదేశం పార్టీ గూటికి చేరడంతో దేశం ఇన్‌చార్జి దివి శివరాం వర్గీయుల మధ్య విభేదాలు జోరందుకుంటున్నాయి. అదేవిధంగా తెలుగుదేశంపార్టీ తరపున సిట్టింగ్ శాసనసభ్యులుగా ఉన్న నియోజకవర్గాల్లోను ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయంగా వైసిపి నాయకులను పార్టీలోకి చేర్చుకుని వారికి చెక్ పెట్టేందుకు సిద్ధవౌతున్నట్లు సమాచారం. ఎన్నికల సమయానికి ముఖ్యమంత్రి చేపట్టిన సర్వేల్లో శాసనసభ్యులు కాని ఇన్‌చార్జులు కాని బలహీనంగా ఉంటే ఆ స్థానాల్లో వేరేవారికి స్థానం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్న చర్చ పార్టీశ్రేణుల నుండి వినిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జిల్లాలో మరో రెండు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, అందువలన ఇప్పటినుండే కొత్త నాయకులను పార్టీలో చేర్చుకుని పార్టీని బలోపేతం చేస్తూనే మరోపక్క వైసిపిని దెబ్బకొట్టేందుకే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. వైసిపికి చెందిన ఇద్దరు శాసనసభ్యుల్లో మరొకరిని కూడా తమపార్టీ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు కాని ఇన్‌చార్జులు కాని భవిష్యత్తులో తోక జాడించకుండా ఉండేందుకే ముందుగానే భవిష్యత్తు వ్యూహంలో భాగంగా వైసిపికి చెందిన శాసనసభ్యులు, ముఖ్య నాయకులను పార్టీలోకి చేర్చుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు ఉంటే ఆ ఇద్దరు నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై సమాచారం ఎప్పటికప్పుడు తనకు వస్తుందన్న ఆలోచన కూడా ముఖ్యమంత్రి మదిలో ఉన్నట్లు సమాచారం. మొత్తంమీద అధినేత చంద్రబాబు అంతరంగం అర్థంకాక తెలుగుతమ్ముళ్ళు తలలు పట్టుకున్నారు.