ప్రకాశం

జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, జూన్ 6: జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి శిద్దారాఘవరావు హామీ ఇచ్చారు. చీరాల్లో నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్ష ఆరో రోజు కార్యక్రమంలో మరో రాష్ట్ర మంత్రి రావెల కిషోర్‌బాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా, జపాన్ దేశాలకు చెందిన కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఇప్పటికే రూ. 42వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాటి ద్వారా సుమారు 40వేల మందికి ఉపాధి లభించిందన్నారు. త్వరలో దొనకొండలో మరో రూ.40వేల కోట్లతో పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. అదే విధంగా కనిగిరిలో సైతం పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా మరో 50వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జిల్లాలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు దొనకొండ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. అదే విధంగా వాడరేవులో పోర్టు ఏర్పాటుకు జిల్లా మంత్రిగా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర రాజధానికి అనుసంధానంగా రూ. 80వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. రవాణా వ్యవస్థలో ఆన్‌లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, ప్రస్తుతం ఆర్టీసి బస్టాండులు ఎయిర్‌పోర్టులను తలదనే్న రీతిలో ఉన్నాయని తెలిపారు. ప్రజా రాజధాని అమరావతికి స్వచ్ఛంధంగా 33వేల ఎకరాల భూమి ఇచ్చిన వారందరికీ ముఖ్యమంత్రి అండగా ఉంటారని తెలిపారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా రూపొందిస్తుంటే కొంతమంది అక్కడి రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 900 కిలోమీటర్ల తీర ప్రాంత రహదారులను 4 లైన్లుగా విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం రైతు రుణమాఫీ కింద రూ. 40వేల కోట్లు, డ్వాక్రా రుణమాఫీ కింద రూ. 12వేల కోట్లు చెల్లించడంతో పాటు మరో రూ.6వేల కోట్లు పింఛన్ల రూపంలో అందజేశామన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు మాట్లాడుతూ ప్రజలు భాగస్వాములైనప్పుడే అది నిజమైన అభివృద్ధి అవుతుందన్నారు. పరిశ్రమలు లేకపోతే భావి తరాల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. చీరాల ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉందన్నారు. 21 రోజుల్లో పరిశ్రమలకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే అన్ని సౌకర్యాలు కల్పించి వౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు రాయితీలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ. 2వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. చేనేత రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 6లక్షల ఇళ్ల నిర్మాణం విషయంలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే అందుకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి యూనిట్ విలువను రూ. 4లక్షలకు పెంచినట్లు చెప్పారు.
ఇప్పటికే హడ్కో సంస్థ నుంచి రూ. 3వేల కోట్ల రుణం తీసుకున్నట్లు తెలిపారు. అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించే అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ చీరాల ప్రాంతంలో సుమారు 9వేల ఎకరాలకు పరిశ్రమలకు అనుకూలమైన భూమి ఉందన్నారు. జిల్లా మంత్రితో పాటు ఇన్‌చార్జి మంత్రి చొరవ తీసుకుని ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెసి హరిజవహర్‌లాల్, పరిశ్రమల శాఖ జి ఎం కోటయ్యచౌదరి, డిఆర్‌డిఎ పిడి మురళి, ఆర్డీఒ కె శ్రీనివాసరావు, చైర్మన్ మోదడుగు రమేష్, కమీషనర్ తలారి బ్రహ్మయ్య, తహశీల్దార్ బి సత్యనారాయణ, ఎంపిడి ఒ వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపిపి నాదెండ్ల కోటేశ్వరరావు, కౌన్సిలర్లు గుద్దంటి సత్యం, అంజమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఏసిబి దాడులతో
అధికారుల పరార్
మార్కాపురం, జూన్ 6: అవినీతి నిరోధకశాఖ అధికారులు సోమవారం సాయంత్రం మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏకకాలంలో దాడులు నిర్వహించారన్న సమాచారం తెలుసుకున్న సమీపంలోని ఇతర శాఖల అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పలాయనం చిత్తగించారు. గత ఏడాది క్రితం అటవీశాఖ ఉద్యోగిపై ఏసిబి దాడులు జరిగిన అనంతరం ఈ ప్రాంతంలో ఏసిబి దాడులు లేకపోవడంతో ఒక్కసారిగా రిజిస్ట్రార్‌కార్యాలయంపై ఏసిబి దాడులు జరుగుతున్నాయన్న సమాచారం పట్టణంలో దావానంలా వ్యాపించింది. దీంతో కార్యాలయాల్లో ఉన్న అధికారులు ఆఫీసులు విడిచివెళ్లి ఫోన్లు స్విచ్ ఆఫ్‌చేయడం విశేషం.
సమాచారం ఇస్తే అవినీతిని నిర్మూలిస్తాం
అవినీతి విషయంపై సమాచారం ఇస్తే నిర్మూలించేందుకుచర్యలు చేపడతామని ఎసిబి డిఎస్పీ ఆర్‌విఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. ఎక్కడయినా నగదుకోసం వేధింపులకు పాల్పడితే తమకు నేరుగాగాని, ఫోన్‌ద్వారా గాని, లిఖిత పూర్వకంగా గాని ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ దాడుల్లో సిఐ టివివిపి ప్రతాప్, ఎస్సై కరిముల్లా, హెడ్‌కానిస్టేబుల్ సుబ్బారావు, చంద్రశేఖర్, కోటి, హోంగార్డ్ శ్రీను, ఖుద్దూస్ పాల్గొన్నారు.

ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకహోదా
కాంగ్రెస్‌తోనే సాధ్యం
- మాజీ మంత్రి పనబాకలక్ష్మి
ఇంకొల్లు, జూన్ 6: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని మాజీ మంత్రి పనబాకలక్ష్మి తెలిపారు. ఇంకొల్లు పట్టణంలో తానికొండ రాజేంద్ర మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె సోమవారం ఇంకొల్లు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన రోజే పేర్కొన్నారని ఆమె తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనపై దృష్టి సారించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలన్నారు. ప్రస్తుత ప్రధాన మంత్రి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కాలయాపన చేస్తూ మాటల గారడీతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఆమె వెంట సర్పంచి తానికొండ వెంకటేశ్వర్లు, ఇంకొల్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నగంటి జానకీరామయ్య, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఉన్నారు.