శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

భయాందోళన వద్దు:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 7: జిల్లాలోని వింజమూరు, వరికుంటపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో గత కొన్ని నెలలుగా వస్తున్న భూప్రకంపనలకు స్థానికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండబోదని జిల్లా కలెక్టర్ ఎం.జానకి స్పష్టం చేశారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎన్‌జిఆర్‌ఐ శాస్తవ్రేత్తలతో కలిసి ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ భూప్రకంపనలు వచ్చిన ప్రాంతాల్లో కొందరు పనిగట్టుకొని పుకార్లు పుట్టిస్తున్నారని, వాటిని నమ్మవద్దని హితవు పలికారు. అటువంటి వారి గురించి తమకు సమాచారం అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో సంబంధిత గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. దండోరాలు కూడా వేయిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మూడుచోట్ల ఏర్పాటు చేసిన భూకంప లేఖిని అధ్యయన కేంద్రాలను ఏడాదిపాటు కొనసాగిస్తామన్నారు. ఎన్‌జిఆర్‌ఐ శాస్తవ్రేత్త ప్రొఫెసర్ నగేష్ మాట్లాడుతూ జిల్లాలో వచ్చిన భూకంపాల తీవ్రత విషయంలో అసలు పరిగణనలోకి తీసుకునేవి కావన్నారు. ఇప్పటిదాకా తమ వద్ద ఉన్న సమాచారం మేరకు రిక్టర్ స్కేల్‌పై 3-3.5 సెం.మీ మధ్య కేవలం రెండు వచ్చాయనీ, 2-2.9 సెం.మీ. నడుమ 22, 1-1.9 సెం.మీ. మధ్య 25 భూకంపాలు నమోదయ్యాయని వివరించారు. తమ సంస్థ వింజమూరు, వరికుంటపాడుల నడుమ గతంలో రెండు సిస్మోగ్రాఫ్ కేంద్రాలను నెలకొల్పడం జరిగిందనీ, ఇటీవల ఆ రెండు ప్రాంతాల నడుమ చాకలికొండలోనూ మరో అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా మరింత సమాచారం క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. అక్కడి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి స్వల్ప ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగవని తెలిపారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించేందుకు మరో ఏడాది పాటు తమ అధ్యయన కేంద్రాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, గూడూరు సబ్ కలెక్టర్ గిరిషా, ఆత్మకూరు ఆర్‌డిఓ ఎస్‌వి రమణ పాల్గొన్నారు.