అక్షర

కవి జనగణ శిరోధార్య గ్రంథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిసేన మేనిఫెస్టో- ఆధునిక కావ్యశాస్తమ్-్ర
గుంటూరు శేషేంద్రశర్మ;
254 పుటలు;
వెల: రూ.300/-
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలన్నీ

కవిత్వం పట్ల కుకవుల పట్ల అపారమైన బాధ, అసలుసిసలు కవిత్వమంటే ఇది బాబూ అని సాధికారంగా చెప్పే ప్రామాణిక బోధ కలసి వెరసి కవిసేన మేనిఫెస్టో అనిపిస్తుంది.
ప్రపంచంలోను, భారతదేశంలోను చెప్పుకోదగ్గ ఆధునిక తెలుగు మహాకవుల వ్రేళ్ళ లెక్కల్లో గణించదగిన మహాకవి, ప్రాచ్యపాశ్చాత్య సాహిత్యాల సారాన్ని ఔపోసన పట్టిన విద్వత్కవి గుంటూరు శేషేంద్రశర్మ కవితా దర్శన గ్రంథమిది.
కీ.శే.శర్మ అంతగా లేక సుమారుగా అంతగా చదువుకున్న సాహిత్య నిధులు కొందరు అంతర్ముఖులయిపోయి, సమాధి స్థితుల్లో ఉండిపోయి కేవలం ఆత్మానందాశ్రయులైన వాళ్ళు లేకపోలేదు. కానీ శేషేంద్రశర్మ అలాకాక సమాజాన్ని యువతరాన్ని పట్టించుకుని తన చింతన సర్వస్వ ఆత్మగుణాలను పట్టుకుని కవి సమాజం బాగుపడడం సమాజహితంగా భావించిమరీ కవిసేనను వినిర్మించారు.
ప్రాచీన కావ్యాలు, శాస్త్రాలు మనకు పుష్కలంగా ఉన్నాయి. కానీ ‘ఆధునిక కావ్యశాస్త్రం’గా ఉన్నది ఈ కవిసేన మేనిఫెస్టో మాత్రమే. 1977లో ప్రథమ ముద్రణావచ్చి ఒక జంఝామారుతంగా ప్రశ్నలకు చర్చలకు వేదిక అయిన ఈ భావజ్వలన గ్రంథం పుత్రరత్నం శ్రీ సత్యకి ప్రోద్బలంతో మూడవ ముచ్చట కూర్పురావడం ఆహ్వానించతగ్గ అంశం.
శాశ్వత స్థితిని ఆపాదించే ప్రయత్నాలు చేయకుండా, పేలవ రచనల్ని కవిత్వాలుగా భ్రమింపజేసే, కవితా కాలక్షేప పరాయణులకు చురకలు ఈ గ్రంథం నిండా తొంగి చూస్తుంటాయి.
నా ఆశాకిరణ పుంజం యువతరం అని భావించి ఆ యువతరానికే తన గ్రంథాన్ని అంకితంచేశారు. ప్రధాన భావజాలధారలైన చింతనల్ని పరిశీలించి వాటికి ఆశ్చర్యజనక అభిన్నతనూ ఐకమత్యాన్ని ప్రతిపాదించిన నూతన తాత్త్వికుడు శేషేంద్ర.
కవిత్వం అంటే కామిక్కోమేజిక్కో కాదు, ఆఫ్రికాలో అడవుల్లో పారేసిన అంగుళీయకంలా నిరుపయోగంగా ఉండకూడదు, కవిత్వమనేది అంటారు.
కవి తీసుకునే వస్తువుతో తనకు పేచీలేదంటారు. కానీ వస్తువును కవిత్వీకరించకుండా వస్తువునే కవిత్వమని నమ్మించేవారిపై మాటల కొరడాలు ఝుళిపిస్తారు.
పుస్తకంలో 248నుండి 250 పుటల్లో, కవిసేన మేనిఫెస్టో రచనలు వాడిన ప్రామాణిక గ్రంథాల పట్టికబట్టే ఈ గ్రంథ నిర్మాణ పటిష్ట భూమిక తెలుస్తుంది. వేద, ఉపనిషద్గ్రంధాలు, సంస్కృతాలంకారిక శాస్త్ర గ్రంథాలు, మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, మావో వంటి వారి మార్క్సిస్టు గ్రంథాలు, ప్లాటో, అరిస్టాటిల్, ఇలియట్, సిడ్నీ, లోర్కా వంటి మేధావుల గ్రంథాలు మధనంచేసి, సారసంగ్రహణలు చేసి ఆధునిక కాల నిత్యస్పృహతో రాశారు ఈ గ్రంథాన్ని.
కవి గౌరవం సమాజంలో శిఖరాయమానంగా ఉండాలనే సదాశయం శేషేంద్రది. ఆయన ఆలోచనా వైశాల్యాన్ని గమనించండి-
శాస్త్రం, కళ, వ్యవసాయం, రాజకీయం, వేదాంతం, ఇత్యాది నానా రూపయావన్మానవ విజయాలూ మానవ జాతియొక్క సమష్టి సంపద. ఈ సమస్త సంపదకూ కర్తగా భోక్తగా ఉన్న మానవజాతి విశ్వరూప సాక్షాత్కారం పొందిన మానవుడే కవి. సైన్సుకు శాస్తజ్ఞ్రుడు నాయకుడు. కళలకు కళాకారుడు నాయకుడు. వ్యవసాయానికి కర్షకుడు, రాజకీయానికి రాజకీయవాది.
ఇలా వీళ్ళంతా వాళ్ళవాళ్ళ రంగాలకి పరిమితమైన నాయకులు. కానీ కవి, యావన్మానవ కార్యరంగాలన్నిటిలో సాధించబడిన విజయాలనుంచి ఉత్పన్నమైన బృహన్మానవ చేతన ఆవేశింపజేసుకున్న ఉన్నతాత్మ గనుక కవి యావన్మానవ జాతికీ నాయకుడు... ఒక్కముక్కలో చెప్పాలంటే కవి నడుస్తున్న మానవతా సంక్షిప్త శబ్దచిత్రం.. కవితాచైతన్యం లేక సాహిత్య చైతన్యం ఒక విరాట్ స్వరూపం. అయితే రాజకీయ చైతన్యం దాని వెంట్రుక ముక్క ‘‘విరాట్ స్వరూపం అనడంలో ఔన్నత్యం, ఉదాత్తతలు ఉన్నాయి. కానీ దానికన్నా రాజకీయ చైతన్యం తక్కువదని చెప్పాలంటే అది ఆయన భావ స్వాతంత్య్రానికి సంబంధించింది కానీ క్షేమేంద్రుని ఔచిత్య విచారచర్చ వంటి గ్రంథాల్ని ఆసాంతం చదివిన ఒక మహాకవి రాజకీయ చైతన్యాన్ని ఒక వెంట్రుకముక్క అనడంలో పద ఔచిత్యం, ఉదాత్తత ఉందా అనిపించింది. తన భావ తీవ్రతను వచ్చినట్టు వచ్చినట్టుగానే చెప్పాలనుకున్నదేమో మరణించిన ఆ మహాకవి.
కవిత్వానికేకాక, కవికీ సమాజంలో ఒక మహోన్నత అనుపమాన స్థానం వుంది కనకనే కవిత్వమూ, కవి ఎలా ఉండాలనే ఆశయవాణిని విన్పిస్తారు శర్మగారు.
కవిత్వాల్ని కాలక్షేప బఠాణీలుగా భావించేవారు ఈ గ్రంథం చదవక్కరలేదు. కవి, కవిత్వం అనేవి తీక్షంగా పట్టించుకోవాల్సినవి అని భావిస్తే ఈ గ్రంథం పరమప్రయోజనకారి అవుతుంది.
శేషేంద్ర అధ్యయన ఫలాలుగా ఇచ్చే ఉటంకింపులను పఠిస్తే ఆశ్చర్యచకితులమవుతాం. అలవోకగా అలాఅలా పుటలు తిప్పుకుంటూ పోలేము. ఆగ జేస్తాయి, ఆలోచింపజేస్తాయి. ఎంత లోతైన అంశాలు అని విభ్రాంతికి గురిఅవుతాం.
విశ్వజనీన కవితా జ్ఞానాంశాలతో పాటు వైయక్తిక కవితావిమర్శలు కూడా అక్కడక్కడ ఇందులో కనబడతాయి. సమకాలీన సందర్భాలు, సమకాలీనులు స్పష్టాస్పష్టంగా ఇందులో కొన్ని దృశ్యమానమయి చరిత్రలో భాగాలుగా భావింపబడతాయి.
‘నా నోటికొచ్చింది నేనురాస్తాను. నాకు నేనే ప్రమాణం’అంటే వూరుకోవద్దు. తెలుగు కవిత ఆలంకారిక ప్రమాణవిధేయం కావాలి అంటారు. కవి సేన ఆశయాలు- నియమాలు 29, 30 పుటల్లో వివరంగా ఇచ్చారు. ఇవి కవులందరూ ఆలోచించవలసిన అంశాలు. ‘కవిసేన వైజ్ఞానిక ఉద్యమం, ఇది రాజకీయ ఉద్యమంకాదు. రాజకీయ పక్షాలతోకాక రాజకీయాలతో సంబంధం వుంటుందన్నారు.
అందరూ కలిసి ఒక దిక్కుకు నడచి, కవిసేనగా మారి సమాజ కల్యాణానికి ఇతరుల పాత్ర కంటె కవులపాత్ర పోషింపబడాలనే సదాశయ శుద్ధి ఈ గ్రంథ భావ పరిమళంగా వ్యాప్తమవుతుంది. ఆంధ్రదేశంలో అనేక సాహిత్య సంస్థలు, సామూహిక కార్యక్షేత్రాలు ఉన్నప్పటికీ కవుల పార్టీగా పార్టీల కతీతంగా కవి, కవితాశిల్పాలను, కవి సమాజ సంబంధాలను పట్టించుకు ప్రచారం చేసినది కవి సేనాధిపతి గుంటూరు శేషేంద్రశర్మ అనిపిస్తుంది.
సాహిత్య విమర్శలు రొడ్డకొట్టుడు పద్ధతి మారడానికే ఈ గ్రంథం దిక్సూచి అవుతుంది. కవిత్వం, శబ్దం, వాక్యం, నిర్మాణం, అలంకార పరిజ్ఞానం, ప్రాచీన వర్తమాన భాషాభిజ్ఞత, శిల్పరహస్యాలు, ప్రేమ, ఆత్మాశ్రయ కవిత్వం- ఇలా ఒకటీరెండూ కాదు; సవాలక్ష కవితాసంబంధ జ్ఞానాంశాల కాంతిమయ విద్వత్ వేదిక ఈ గ్రంథం.
సమాజ సాహిత్యాల మార్పునకు శేషేంద్ర విప్లవభావాలు చర్చలకు, ఆచరణలకు, వ్యతిరేకతలకు ఆస్కారమయ్యే అనేక అంశాలున్నాయి.
కవి, కవిత్వం, సాహిత్యం ఈ పరిధుల కేంద్రాలకు తీసుకువెడుతూ మధ్యమధ్య దుష్టరాజకీయ భ్రష్టుల్ని, అవినీతిపరుల్ని మానవుల్ని వేరుచేసే శక్తుల్ని తీవ్ర పదాలతో విమర్శిస్తూ కవి వీరుడిగా సాక్షాత్కరిస్తారు ఈ ప్రవక్త కవి.
‘‘బాబూ! పద్యం (కవిత్వ అర్థంలో) ఒక దేవాలయం, అందులోకి ప్రవేశించాలంటే- శబ్దాలూ, భావాలు, చివరకు దేవుడు కూడా శుభ్రంగా స్నానంచేసి మడికట్టుకుని ప్రవేశించాలి’’అనే శేషేంద్ర కవితాప్రేమ పవిత్ర వాక్యాలను గమనిస్తే ఆయనవి మడి వాక్యాలుగా కనిపించే ఉమ్మడి వాక్యాలే అనిపిస్తుంది.
కవిత్వంలో కమిట్‌మెంట్ నైతికోద్రేకంతో రావాలంటారు. ‘కవిసేన మేనిఫెస్టో’లో ఆశయ లక్ష్యాల సూత్రాలుకావు ఆ సూత్రాల వ్యాఖ్యాన జ్ఞాన చర్చలూ సంబంధితాలుగానే వున్నాయి.
శేషేంద్ర ఆలోచనాధారల్లో తలమునకలయి క్రొత్త తలపులకి స్వాగతం పల్కడానికి ఈ గ్రంథం కవి జనగణ శిరోధార్యం.
.......................................................................
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.
........................................................................

-సన్నిధానం నరసింహశర్మ