శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుటౌన్, జూలై 24: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని జిల్లా పరిషత్ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న జడ్పీ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తాను జడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి నేటికి రెండేళ్లు పూర్తయిందన్నారు. గత ప్రభుత్వాలు జడ్పీకి నిధులు అందించేవని, నేటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆవేదన వెలిబుచ్చారు. తాను బాధ్యతలు స్వీకరించిన రెండేళ్లలో మొదటి తొలి ఏడాది జడ్పీ నిధుల నుంచి జిల్లాలో నీటిఎద్దడి నివారణకు తగిన చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా జిల్లాలోని పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు వౌలిక వసతులను కల్పించామన్నారు. పదో తరగతి విద్యార్థులకు కార్పొరేటర్ విద్యాసంస్థలకు దీటుగా జడ్పీ పాఠశాల విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు మార్గదర్శిని పుస్తకాన్ని అందజేశామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళలను ప్రోత్సాహిస్తూ కుట్టుమిషన్లు ఇచ్చినట్లు తెలిపారు. రెండో ఏడాది పాలనలో జడ్పీలో పాలన చేయలేకపోయాయని అందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. అందులో మరో కారణం కూడా ఉందన్నారు. 14వ ఆర్థిక సంఘ నిధులను నేరుగా పంచాయతీలకు నరేంద్రమోదీ మళ్లించడం వల్ల జడ్పీలో నిధుల కొరత ఏర్పడిందన్నారు. దీనివల్ల జిల్లాలో జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న తాను పలు గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ స్థానిక ప్రజలు నీటికోసం బోర్లు వేయమని అడుగుతున్నా జడ్పీలో నిధులు లేక పాలనను సరిగా నిర్వర్తించలేకపోతున్నానన్నారు. జడ్పీలో చదువుతున్న పేద విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలోని అన్ని పాఠశాలలకు కంప్యూటర్లు అందించినట్లు తెలిపారు. 8,9 తరగతి విద్యార్థులకు కూడా ఈ ఏడాది నుంచి మార్గదర్శిని పుస్తకాన్ని అందించనున్నామన్నారు. ఇంటర్మీడియట్ విద్యను జడ్పీ పాఠశాల స్థాయిలో ఉంచాలని, ఇంటర్ బోర్డును రద్దు చేసి పది, పదకొండు తరగతులను ప్రాథమిక విద్యలోనే ఉంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాను జడ్పీ ఛైర్మన్‌గా ఉన్నా లేకపోయినా సీడ్ సెంకడరీ ఎడ్యుకేషన్ అనే పేరుతో ప్రైవేటు యాజమాన్య కబంధ హస్తాల్లో కూరుకుపోయిన ఇంటర్ విద్యను జడ్పీ పాఠశాలలకే పరిమితం చేసేవిధంగా ఉద్యమాలు చేపడతానని ఇందుకు తల్లిదండ్రులు, విద్యార్థులు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఇరిగేషన్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అదేవిధంగా విద్యకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం జడ్పీ నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ రెండేళ్లలో జడ్పీ చైర్మన్‌గా ఉన్న తనకు సహాయ సహకారాలు అందించిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జిల్లాపరిషత్ ప్రాంగణంలో 50 మొక్కలను నాటారు.