ప్రకాశం

ప్రజా సాధికార సర్వేపై సంపూర్ణ పర్యవేక్షణ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 28: ప్రజా సాధికార సర్వేపై క్షేత్రస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు సంపూర్ణ పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యవేక్షణ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ప్రజాసాధికార సర్వేపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన ప్రజాసాధికార సర్వే చారిత్రాత్మకమైనదన్నారు. ఇప్పటి వరకు తలెత్తిన సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ కుటుంబంలోని ప్రతి ఒక్కరి సమాచారాన్ని కచ్చితంగా సేకరించాలన్నారు. సర్వే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో సర్వే సజావుగా జరుగుతుందో లేదో అనే విషయమై సూపర్‌వైజర్లు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా నోడల్ అధికారులు, సంయుక్త కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు ఆ పైన జిల్లాలకు నియమించబడిన సూపర్‌వైజరీ కార్యదర్శులు వారి వారి పరిధిలో పర్యవేక్షించాలన్నారు. గ్రామాలకు పోయి ఇంటి సమాచారం సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయాలన్నారు. చంద్రన్న బీమా పథకం గురించి సెర్ఫ్, మెప్మా, కార్మిక శాఖలు ముందుగా ఇంటింటికి పోయి ప్రజలను చైతన్యపరిచి సభ్యులుగా నమోదయ్యేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా నుండి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి, జిల్లా సూపర్‌వైజరీ అధికారి కరికాల వళవన్ ఒంగోలు నుండి మాట్లాడుతూ జిల్లాలోని గణకులందరూ క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తున్నారని, వారు లాగిన్ కావడానికి కొంత సమయం పడుతోందన్నారు. ఈ నెల 8వ తేదీ నుండి సర్వే చేస్తున్న వివరాలను సరిగ్గా అప్‌లోడ్ కావడం లేదని, సాంకేతిక బృందం ఈ విషయమై దృష్టి సారించాల్సి ఉందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.35 లక్షల ఇళ్ల సర్వే పూర్తి అయిందని, ఇంకా 6.7 లక్షల ఇళ్ల సర్వే చేయాల్సి ఉందన్నారు. రోజుకు కేవలం ఐదు ఇళ్లు సర్వే చేయగల్గుతున్నారన్నారు. ఇదే విధంగా సర్వే కొనసాగితే ఇంకా 50 రోజుల్లో సర్వే పూర్తవుతుందన్నారు. పది మంది గణకులకు ఒక పర్యవేక్షణ అధికారిగా నియమించిన సూపర్‌వైజర్లు ఎలాంటి సమాచారం అప్‌లోడ్ కాకుండా ఖాళీగా ఉంటున్నారని, వారికి సమాచారం అందివ్వగలిగితే క్రాస్‌చెక్ చేసుకోవడానికి వీలుంటుందన్నారు. ఒక కుటుంబ వివరాలు అన్నీ సేకరించాక సబ్‌మిట్‌కొడితే ఫెయిల్ అయి మొత్తం డేటా వెళ్లి పోయి మరలా సేకరించే పరిస్థితి వస్తుందని, దానిని అధిగమించేటట్లు చూడాలని కోరారు. సర్వే వివరాలు సేకరించే పరికరాలు పాతవిగా ఉన్నందున తరచూ పనిచేయక ఇబ్బంది అవుతోందని, పది శాతం కూడా అదనంగా లేదని, అందువలన సర్వే ప్రక్రియ కొంత ఆలస్యమవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాకలెక్టర్ సుజాత శర్మ, రెండవ సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్‌కుమార్, గుంటూరు మున్సిపల్ పరిపాలన శాఖ ప్రాంతీయ సంచాలకులు అనూరాధ, జడ్పి సిఇఓ బాపిరెడ్డి, డిఆర్‌డిఏ, డ్వామా పిడిలు మురళి, పోలప్ప, మెప్మా పిడి అన్నపూర్ణ, ఎన్‌ఐసిడిఐఓ వెంకట సుబ్బయ్య, ఒంగోలు, కందుకూరు ఆర్‌ఓలు శ్రీనివాసరావు, మల్లికార్జున, సర్వే నోడల్ అధికారి ఉదయభాస్కర్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ భక్తవత్సలరెడ్డి, స్టెప్ సిఇఓ రవి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటక్రిష్ణ తదితర అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.