ఆంధ్రప్రదేశ్‌

కుప్పం టిడిపిలో ముసలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 30: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గ కేంద్రమైన మేజర్ పంచాయతీ కుప్పంలో ఆ పార్టీలో అనిశ్చితి నెలకొంది. కుప్పం సర్పంచ్, వైస్ సర్పంచ్ వర్గీయుల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. గత వారం రోజులుగా కుప్పంలో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు పార్టీ శ్రేణుల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలోనే ఆ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పార్టీ నేతలను కలవరపెడుతోంది. కుప్పం సర్పంచ్ వెంకటేష్ తీరును నిరసిస్తూ అధికార పార్టీకి చెందిన పంచాయతీ ఉప సర్పంచ్ సుధాకర్‌తోపాటు మరో 15 మంది తమ పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వీరంతా శనివారం కలెక్టర్ సిద్దార్థ జైన్‌ను కలిసి కుప్పం పంచాయతీలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదు చేశారు. అనంతరం వారు విలేఖర్లతో మాట్లాడుతూ మూడేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సర్పంచ్‌ను కోరుతున్నా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఏకపక్ష నిర్ణయాలతో నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. తమపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి వార్డు సభ్యులుగా గెలిపించినా సర్పంచ్ తీరు కారణంగా వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని వాపోయారు. పలుమార్లు సిసి రోడ్ల విషయంగాను, గ్రామ పంచాయతీ నిధులు విషయంగా ప్రస్తావించినా సర్పంచ్ సరైన సమాధానం చెప్పలేదన్నారు. ప్రధానంగా డంపింగ్ యార్డు, సిసి రోడ్లు నిర్మాణంలో భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్లు వారు ఆరోపించారు. సర్పంచ్ తీరుకు నిరసనగానే తాము పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కుప్పం పంచాయతీలో చోటుచేసుకున్న పరిణామాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు వైస్ సర్పంచ్ సుధాకర్‌తో పాటు పలువురు వార్డు సభ్యులు విలేఖర్లకు తెలిపారు. ఈ విషయమై జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు వివరణ ఇస్తూ కుప్పం పంచాయతీలో సర్పంచ్‌కు, ఇతర వార్డు సభ్యులకు మధ్య నెలకొన్న విభేదాలు చిన్నపాటివేనని వీటిని సామరస్యంగా పరిష్కరిస్తామని అంతా సవ్యంగా జరుగుతుందని తెలిపారు. ఇదిలావుండగా కుప్పం ‘పంచాయతీ’ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.