విజయనగరం

విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 30: విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపి ఉన్నతి సాధించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సూచించారు. విద్యారంగంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు భారీగా నిధులు వెచ్చించి వివిధ పథకాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. విజయనగరం పట్టణంలో 2.30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని కేంద్రమంత్రి అశోక్ శనివారం ప్రారంభించారు. నాబార్డు ఆర్‌ఐడిఎఫ్ నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. నిర్ణీత గడువుకు మూడునెలల ముందే ఈ భవన నిర్మాణాన్ని పూర్తిచేయడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. చదువులతోపాటు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని చెప్పారు. స్వచ్ఛ భారత్, వనం-మనం వంటి కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఎమ్మెల్యేలు మీసాల గీత, కెఎ నాయుడు, జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ, ఆర్‌ఐఓ విజయలక్ష్మి, జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక విద్యతోనే దేశాభివృద్ధి
* ఎపి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వరదరాజన్
విజయనగరం(టౌన్),జూలై 30: సాంకేతిక విద్యపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వరదరాజన్ తెలిపారు. విజయనగరం జెఎన్‌టియు ఇసిఇ విభాగం ఆధ్వర్యంలో రెండురోజలు పాటు నిర్వహించిన అంతర్జాతీయ వర్కషాప్ శనివారం ముగిసింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వరదరాజన్ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందిచిన విలువైన సలహాలు, సూచనలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని సాంకేతిక రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ముందడుగు వేయాలని చెప్పారు. అవగాహనతో చదివితే మంచి ఫలితాలు సాధించ వచ్చని హితవుపలికారు. ఇసిఇ విభాగం తీసుకున్న చొరవను ఆయన అభినందించారు. విజయనగరం క్యాంపస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలోచనలను విద్యార్ధులు కార్యరూపంలో పెట్టాలన్నారు. సహచర విద్యార్థులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. ఎలక్ట్రానిక్స్ వినియోగం లేని రంగం లేదని చెపుతూ మంచి విద్యార్థ్ధులుగా రాణించి దేశానికి సేవ చేయాలన్నారు. ఈ సదస్సులో అసిస్టెంట్ ప్రిన్సిపల్ స్వామినాయడు, ఇసిఇ విభాగం హెచ్‌ఒడి బాలాజీ, కన్వీనర్ శ్రీనివాసరావు, పలువురు ప్రొఫెసర్లు విలువైన సలహాలు అందజేశారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వ ప్రాధాన్యాతలకు అనుగుణంగా పనిచేయాలి
అధికారులకు ఇన్‌చార్జ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచన
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 30: ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వెంటవెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్, సమాచార, ఐటి శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం వివిధ అంశాలకు ఇచ్చే ప్రాధాన్యతల ఆధారంగా ఆయా కార్యక్రమాల అమలుకు అధికారులు పనిచేయాలని తెలిపారు. జిల్లా పర్యటన సందర్భంగా శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులతో మంత్రి డసమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు కష్టపడి పనిచేస్తున్నారని ఇదే స్థాయిలో అన్ని శాఖల జిల్లా అధికారులు కూడా కష్టపడితే సత్వర రాష్ట్భ్రావృద్ధి సాధ్యమన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఫిర్యాదులు అందజేసిన సందర్భంలో పరిష్కారానికి వీలుపడని ఫిర్యాదుల గురించి బాధితులకు వాస్తవాలను వివరించాలని, దీనివల్ల పదేపదే వారు కార్యాలయాల చుట్టూ తిరగడాన్ని నివారించవచ్చన్నారు. ఫిర్యాదుదారుల విషయంలో అధికారులు, సిబ్బంది సానుభూతి వైఖరితో వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు పూర్తిస్థాయిలో ఫిట్‌మెంట్‌ను అమలుచేస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఉద్యోగులు కూడా అదే స్థాయిలో ప్రజలకు సేవలందించాలన్నారు. అధికారులు, సిబ్బంది గిరిగీసుకుని పనిచేయడం మంచిదికాదని, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా విధులు ఉండాలని పేర్కొన్నారు. చంద్రన్న బీమా పథకం, వనం-మనం కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలు జరిగేలా చూడాలని, ప్రజాసాధికారిత సర్వేపై ప్రజలలో ఏర్పడిన అపోహలను తొలగించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జిలా లయంత్రాంగం సహకరించాలని కోరారు. అధికారులు, సిబ్బంది విషయంలో తాను కుటుంబ సభ్యునిగా వ్యవహరిస్తానని, తీవ్రమైన సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి స్థాయిలో పరిష్కారానికి ప్రయత్నిస్తానని చెబుతూ పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్, ఎమ్మెల్సీ జగదీష్, ఎమ్మెల్యే చిరంజీవులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజాసాధికార సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
* మండల అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 30: జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాసాధికార సర్వేపై ప్రజలలో ఏర్పడిన అపోహలను తొలగించేందుకు గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ వివేక్ యాదవ్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులతో పల్స్ సర్వే, మీకోసం, చంద్రన్న బీమా పథకం తదితర అంశాలపై తహశీల్దార్లు, ఎంపిడిఓలు, ఎపిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వేతో ఎవరికీ నష్టం ఉండదని, సర్వే సక్రమంగా జరిగితే అర్హులైన లబ్దిదారులకు మరిన్ని ప్రయోజనాలు దక్కుతాయనే విషయాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలని సూచించారు. సర్వే సందర్భంగా సాంకేతిక సమస్యలు ఏర్పడితే వెంటనే జిల్లా కేంద్రానికి వచ్చి పరిష్కరించుకోవాలని అధికారులకు తెలిపారు. ఎన్యూమరేటర్లతో మండల అధికారులు సమావేశాలు నిర్వహించి సర్వే సజావుగా జరిగేలా చూడాలని చెప్పారు. అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజనం కలిగించే చంద్రన్న బీమా పథకంపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం జరపాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటవెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.
డయల్ యువర్ ఇన్‌చార్జి మినిస్టర్‌కు స్పందన
* మంత్రి పల్లెకు భారీగా ఫిర్యాదులు

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 30: జిల్లా ఇన్‌చార్జ్, సమాచార, ఐటి శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఇన్‌చార్జ్ మినిస్టర్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఆయా సమస్యలను మంత్రి రఘునాథరెడ్డి దృష్టికి ఫోన్ ద్వారా తీసుకొచ్చారు. ఈ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చిన మంత్రి పల్లె ఈ మేరకు వెంటనే స్పందించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బొబ్బిలి మండలం రాముడువలసలో దేవస్థానానికి చెందిన ఐదెకరాల భూమిలో పంటలు పండిస్తున్న రైతులు దేవాలయానికి పైసాకూడా చెల్లించడం లేదని మోహనరావు అనే వ్యక్తి ఫోన్‌లో మంత్రికి ఫిర్యాదు చేయగా విచారణ జరపాలని పార్వతీపురం ఆర్‌డిఓను మంత్రి అదేశించారు. గరుగుబిల్లి మండలం సంబన్నవలస గ్రామ క్షేత్ర సహాయకుడు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆ గ్రామానికి చెందిన బలరాంనాయుడు ఫిర్యాదు చేయగా ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. వికలాంగులకు సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో ఇబ్బందులు కలుగుతున్నాయని అప్పలనాయుడు అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా వెంటనే సదరం కేంద్రం ఏర్పాటు చేసి వికలాంగులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. తెర్లాం మండలం గోపాలవలసలో రేషన్ డీలర్లు సక్రమంగా పనిచేయడం లేదని శ్రీనివాస్ అనే వ్యక్తి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పార్వతీపురం మండలం గుజరువాడలో అనుమతి లేకుండా గ్రానైట్ బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తున్నారని లక్ష్మణరావు అనే వ్యక్తి మంత్రికి ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితిని రెండేళ్లు పెంచాలని గుర్ల మండలం నాగళ్ల వలస గ్రామానికి చెందిన రామకృష్ణ మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ముదురుతున్న వివాదం... పెరుగుతున్న దూరం
బయటపడిన విభేదాలు
మున్సిపల్ చైర్మన్‌పై కేంద్రమంత్రి అశోక్‌కు ఫిర్యాదు
విజయనగరం (్ఫర్టు), జూలై 30: మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల మధ్య వివాదం ముదురుతోంది. గత కొన్నిరోజుల నుంచి నివురుగప్పిన నిప్పులా నలుగుతున్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ మేరకు చైర్మన్ రామకృష్ణ వ్యవహారశైలిపై 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావు నేతృత్వంలో కొంతమంది కౌన్సిలర్లు శనివారం కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఎమ్మెల్యే మీసాల గీత సమక్షంలో సమస్య పరిష్కరించుకోవాలని సూచించినట్లు తెలిసింది. మున్సిపల్ చైర్మన్ రామకృష్ణకు వ్యతిరేకంగా ఇంతవరకు పది మంది కౌన్సిలర్లు సంతకాలు చేసినట్లు తెలిసింది. మరికొంతమంది సంతకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని, అభివృద్ధి పనులు జరగడం లేదని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న ఎన్నికల్లో పట్టణంలో పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని అశోక్‌గజపతిరాజుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అదేవిధంగా చైర్మన్ వ్యవహారశైలి గురించి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మేకా కాశీవిశే్వశ్వరుడు, విజ్జపుప్రసాద్, సారిక వెంకటరమణ, కంఠ ఎరకయ్య తదితరులు కూడా అశోక్‌గజపతిరాజుతో మాట్లాడినట్లు తెలిసింది. మున్సిపాలిటీలో పరిపాలన ఏమాత్రం బాగోలేదని, అధికార పార్టీ కౌన్సిలర్లకు కూడా విలువ లేకుండాపోయిందని వారు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పట్టణంలో అభివృద్ధి పనుల కేటాయింపు, ఇతర పనులకు సంబంధించి చాలా మంది కౌన్సిలర్లు గత కొన్ని రోజులుగా చైర్మన్‌తో ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు. దీనిలో భాగంగా మూడురోజుల క్రితం మున్సిపల్ ప్యానల్ కమిటీ ఎంపిక కోసం నిర్వహించిన సమావేశానికి చాలామంది కౌన్సిల్ సభ్యులు హాజరు కాలేదు. కొంతమంది హాజరైనా కమిటీ సభ్యుల ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చైర్మన్‌తో తాడోపేడో తెల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు నిలిచిపోవడంపై చాలామంది సభ్యులు గుర్రుగా ఉన్నారు. మున్సిపాలిటీలో 40 వార్డులు ఉండగా, 32మంది అధికార తెలుగుదేశంపార్టీకి చెందిన సభ్యులే ఉన్నారు. అయితే వీరికి సరైన సయోధ్య లేకపోవడం, ఎవరికివారే యమునాతీరే అనే విధంగా వ్యవహరించడం వల్ల మున్సిపల్ పరిపాలనపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. పాలనాపరమైన వ్యవహారాలు ముందుకు సాగడం లేదు. చైర్మన్‌కు, కౌన్సిల్ సభ్యులకు మధ్య సరైన అవగాహన, సఖ్యత లేకపోవడం వల్ల పాలనాపరమైన వ్యవహారాలు ముందుకు సాగడం లేదు.
జీడితోటల పెంపకం లక్ష్యాలు పూర్తిచేయాలి

* ఐటిడిఎ పిఓ ప్రసన్నవెంకటేష్
పార్వతీపురం, జూలై 30: 2016-17లో నిర్ధేశించిన జీడితోటల లక్ష్యాన్ని సకాలంలో పూర్తిచేయాలని ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి వి.ప్రసన్నవెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం ఐటిడి ఎ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం, హార్చికల్చర్,వాటర్‌షెడ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం, సమగ్ర నీటియాజమాన్యం సంస్థల ద్వారా ఇప్పటికే 4వేల ఎకరాల్లో జీడిపెంపకం పనులు పూర్తయ్యాయని ఇంకా 26వేల ఎకరాలు పూర్తిచేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఎన్ ఆర్ ఇ జి ఎస్ పథకం కింద ఏర్పాటు చేస్తున్న బోర్లు పర్యవేక్షించి పూర్తిచేయాలని ఆదేశించారు. ఐటిడి ఎ ద్వారా 132మంది రైతుల నుండి రూ.20వేల వంతున గిరిజన రైతులు తమ వాటా దనంగా బోర్ల నిర్మాణానికి చెల్లించినందున ఆయా పనులు పూర్తిచేయాలన్నారు. గతంలో పెంపకం చేపట్టిన 18నుండి 20 ఏళ్ల వయస్సు కలిగిన జీడితోటలు 2800 ఎకరాలున్నందున వాటిలోని కొమ్మలు కత్తిరించి మరింత ఏపుగా దిగుబడి వచ్చేవిధంగా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో పిహెచ్‌వో వరప్రసాద్, పి ఎ వోశ్రీనివాసరావు, ఐ డబ్ల్యు ఎంపి ఎపిడి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధే ధ్యేయం
* కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు
గుర్ల, జూలై 30: అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. శనివారం కెల్ల గ్రామంలో ఎన్టీఆర్ సుజల శ్రవంతి, అంగన్‌వాడీ భవనం, సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నా అభివృద్ధిపథంలో నడిపించాలనే థ్యేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని, బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధి చేయడానికి అహర్నిషలు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రవేశపెట్టారన్నారు. ప్రతిరోజు మినరల్ వాటర్ తాగడం వలన ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని మాట్లాడుతూ అంగ్‌న్వాడీ కేంద్రాలు సక్రమంగా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని అధికారులకు చెప్పారు. గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ పనులు చేపట్టాని సర్పంచ్‌లకు సూచించారు. విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, జడ్పీటిసి పద్మిని, ఎంపిపి జమ్ము సత్యం, టిడిపి అధ్యక్షుడు బంగారునాయడు, సర్పంచ్ గోవింద్ పాల్గొన్నారు.
రూ. 23 కోట్లతో ఆరు కోల్డ్ స్టోరేజీల నిర్మాణం
హోల్‌సేల్ కూరగాయల కేంద్రం ప్రారంభం
రైతుబంధు పథకం కింద చిరుధాన్యాలకూ రుణాలు
రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ యార్డుల కమిషనర్ మల్లికార్జునరావు
గజపతినగరం, జూలై 30: రాష్ట్రంలో ఆరు ప్రాంతాల్లోని మార్కెట్ యార్డుల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి 23కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ యార్డుల కమిషనర్ పి మల్లికార్జున రావు అన్నారు. శనివారం గజపతినగరం మార్కెట్ యార్డులో ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన హోల్‌సేల్ కాయగూరల కేంద్రాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు పథకం కింద ధాన్యానికే కాకుండా చిరుధాన్యాలు, పప్పుదినుసులకు కూడా రుణాలు ఇస్తామన్నారు. రైతులు మార్కెట్ యార్డులకు సరుకులను తీసుకొచ్చిన మూడు రోజుల్లో రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందుకోసం పది రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. అనంతపురం జిల్లాలోని మడకసిర యార్డు పరిధిలో పోకచెక్కలు పండించే రైతులకు రుణాలు ఇచ్చేందుకు కోటి రూపాయల నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఈ ఏడాది రాష్టవ్య్రాప్తంగా 36 మార్కెట్ యార్డుల్లో 70వేల మెట్రిక్ టన్నుల మామిడికాయలు కొనుగోలు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని 25 మార్కెట్ యార్డులలో కాయగూరల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాయలసీమలోనే ఈ కేంద్రాలు ఎక్కువగా నెలకొల్పామన్నారు. కాయగూరలు పండించే రైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసి సంఘాలుగా నియమించడం వలన గిట్టుబాట ధర లభిస్త్తోందన్నారు. రాష్ట్రంలో 80 రైతు బజార్లు ఉన్నాయని, అందులో 61 రైతు బజార్లు ఆధునీకరించామని చెప్పారు. ఆ కేంద్రాల్లో మంచినీరు, రైతులకు విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు నిర్మించామన్నారు. మరో 28 బజార్లలో సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. రైతు బజార్లలో కాయగూరలు ధరలు తెలిపేందుకు ఎలక్ట్రానిక్ బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు సమాచారం, సలహాలు, సాంకేతిక సమాచారం అందించేందుకు 40 కేంద్రాల్లో ఈ-సేవా సేవలు అందజేస్తున్నామని చెప్పారు. జూలై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 మార్కెట్ యార్డుల్లో ఐదు లక్షల మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గన్నవరంలోగల మార్కెట్ యార్డులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ కెఎ నాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ చంటిరాజు, గజపతినగరం, దత్తిరాజేరు ఎంపిపిలు గంట్యాడ శ్రీదేవి, బెజవాడ రాజేశ్శరి, బొండపల్లి జడ్పీటిసి బండారు బాలాజీ, మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ డ్రైరెక్టర్ శ్రీనివాసరావు, టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రావి శ్రీధర్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మిత్తిరెడ్డి వెంకటరమణ పాల్గొన్నారు.
విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి

బొండపల్లి, జూలై 30: డిజిటల్ తరగతి గదులను ఉపయోగించుకుని విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సూచించారు. ఎంపి నియోజకవర్గ నిధులతో బొండపల్లి మండలం గొట్లాం జిల్లాపరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటుచేసిన డిజిటల్ తరగతి గదిని కేంద్రమంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డిజిటల్ తరగతుల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ జిల్లాలో మొదటిసారిగా ఇక్కడ డిజిటల్ తరగతిని ఏర్పాటు చేశామని విద్యార్థులు దీన్ని సక్రమంగా వినియోగించుకుని విద్యా పరంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. డిజిటల్ తరగతుల నిర్వహణలో అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. వివిధ సబ్జెక్టులలో మంత్రి విద్యార్థులకు ప్రశ్నలు వేసి వారినుంచి సమాధానం రాబట్టారు. కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్సీ శ్రీనివాసుల నాయుడు, ఎమ్మెల్యే కెఎ నాయుడు, మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి అరుణకుమారి, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ లింగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.