అక్షర

పదాల్లో ప్రతిఫలించిన జీవన దృశ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కాకిముద్ద’
ఈతకోట సుబ్బారావు
వెల:రూ.
పేజీలు:
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

కవిత్వానికి కేంద్ర బిందువు, కొన్ని అడుగుల చప్పుడు ఊగిసలాట. ఈ తీవ్రతలోనుంచే అక్షరాలోచనలు ఊపిరి పోసుకుని సహజత్వానికి చేరువగ నిలుస్తాయి. అలాంటి సందర్భాల వెతుకులాటలోనుంచి జీవన దృశ్యాల్ని తడిమి ఒలకబోసిన పద సమూహాల ఆవేదనల సమాహారమే ఈ ‘‘కాకి ముద్ద’’ కవిత్వం.. కవి ఈతకోట సుబ్బారావు. ఈ సంపుటిలో 61 కవితలు పారదర్శకంగా వెంటాడుతాయి. సరళత్వం, సూటిదనం కలబోసిన భావాల మేళవింపు దీనిలో తొణికిసలాడుతుంది.
‘గుప్పెడంతచోటు/ గుండెల్లో ఉంటే/ ప్రపంచమంతా కంటి పాపలోనే/ కాపురం ఉంటుంది’ అంటారు కవి. ఈ మాటల్లో విశ్వమానవ భావన కవితాత్మకంగా తొంగి చూస్తుంది, ఎల్లలు లేని సామూహికత్వం బహింతర ప్రపంచాన్ని ఒక్కటి చేస్తుంది. అనేక కోణాల ప్రయాణాలను ఒకే వేదికపై కలిపి కడుతుంది. ఈ నిర్మాణం జరిగినంత కాలం మనిషి మనసులోని కవిత్వం బతికే ఉంటుంది. కవి కూడా సజీవంగా సహజీవనంతో ప్రయాణిస్తాడు. ఈ సంఘర్షణలోంచి బతుకుమూలాల వేళ్ళను తడుపుకుంటూ తడుముకుంటాడు. ఈ స్థితిలోనుంచి తననుతాను కవిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు కవి ఈతకోట సుబ్బారావు.
నిన్న చీలిన అర్ధరాత్రి/ నెర్రెలుపడ్డ పొలం దాహంతో
కలలోకొచ్చిన వూరు/ పండు ముసిలిదైపోయింది’’ అంటూ కలలోకొచ్చిన ‘ఊరు’ కవితలో ఆవేదనతో రగిలిపోతారు కవి. ఈ ఆరాటంలోని మూగ రోదనని అర్ధం చేసుకున్నట్లయితే వర్తమాన ప్రాపంచిక ఆర్థికతత్వ జీవన మూలాలను జీర్ణిచుకోగలుగుతాం. ప్రపంచీకరణ మాయాజాలంలో చిక్కుకున్న పల్లెలు పచ్చదనానికి చిరునామాని కోల్పోయి సర్వం పోగొట్టుకున్న అనాధగా మిగిలిపోయింది. మనుషులు కరువవుతున్న ఊళ్ళు శవాలబీళ్ళుగా మారిపోతుంటే, ఆ విషాద ముఖ చిత్రానికి ముగింపు కొసమెరుపే వేరు. పేగుబంధాన్ని తెంచుకున్న మానవీయ విలువలతో అడుగంటిపోతున్న సంస్కృతి మృత చిహ్నానికి ప్రతిబింబాల్లా దిగులు ఆనవాళ్ళను వెతుక్కుంటున్నాయి. ఈ వ్యధను కవిత్వంగా మలచిన తీరు సుబ్బారావుగారి అంతర్యాన్ని వ్యక్తపరుస్తాయి. కవిఅన్నవాడు మనిషి కాకుండా పోలేడుకదా? ఇక్కడ కూడా అదే జరిగింది.
‘‘డాలరు ప్రేమలోపడ్డాక/ రూపాయి చిల్లిగవ్వైపోయింది.
ఎంతైనా దూరపుకొండలు నునుపే’’ అంటారు కవి ‘కొత్త భాష’ కవితలో. జీవితాల్ని ప్రేమించడం మానేసిన మనిషి పచ్చనోట్లని విడిచిపెట్టి డాలర్ల వెంట పరుగులుతీసే నైజం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. తూతూమంత్రపు కంటి తుడుపు మాటలు మనసులకు తృప్తినివ్వవు. దూరతీరాల్ని దాటిపోయే విష వ్యాపార సంస్కృతి రాజ్యమేలుతోంది. దీనిని అభివృద్ధి అనాలో.. అంతిమ కన్నీటి దృశ్యమనాలో తెలుసుకోలేని సందిగ్ధ విషమయ పరిస్థితి స్థానికతను మించిన మెరుగైన సామాజిక వ్యవస్థను ఊహించడం ఒక సవాలుగా మారిపోయింది. ఈ నేపథ్యాల సంఘర్షణాత్మకంగా చిత్రీకరించారు కవి. ఈ ఊగిసలాటలోంచే ఆధునికతకు కొండగుర్తుగా నిలిచిపోయిన సందర్భమొకటి ఇప్పుడు మిగిలిపోయింది.
ఇలా ప్రతీ దృశ్యాన్నీ ఆకర్షీకరించే నేర్పు, అవగాహన, లోతైన పరిశీలన, వ్యక్తపరిచే తీరు పాఠక లోకానికి పరిచయంచేస్తారు కవి. ఈ మమేకత్వంలో మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే కవితావాక్యాలు పుస్తకం నిండా అనేకం కన్పిస్తాయి.
కంటి పాపలోంచి జారిపడ్డ కల/ తునాతునకలై నిశ్శబ్దం ‘‘గుప్పెడు గాయాలని గుండెల్లో దాచుకుని/ శ్వాసల వేణువులూదిన సంతోషం, ‘‘నేను నేల పొరల్లోంచి పుట్టుకొచ్చే ప్రాణశ్వాసని/ ప్రజల ఆశల పడవకు ఉతకర్రని, / ‘‘తులసి కోట గూట్లో’’/ చందమామ ప్రమిదలో వెలిగించిన/ ‘‘చిన్ని దీపమే చిరునవ్వంటే’’/ చావు పాడే పైన చివరి ఊరేగింపు/ వసంతం వచ్చినా ఏ కోయిల గొంతులో రాగం పలకడం లేదు/ కృత్రిమ ఎరువుల విషవాయువుల అలలపై / నిత్యం మృత్యుఘోష.. కలల్లేవు కళ్ళల్లో ఎడారి శూన్యం/ ‘‘నూరేళ్ళ కాలాన్ని బతుకు మీద మోసే/ నరవాహనం మనిషి’’/ ‘‘ఏమయిపోయావో నువ్వని/ మనసు అలల సముద్రమయిపోయింది’’. ‘‘పొలంలో రైతు సమాధైపోయాడు’’/ ‘‘గుండె గాయపడ్డప్పుడు/ జారే కన్నీళ్లు ఆమె భాష’’/ ‘‘బావిలో నీళ్ళు లేనప్పుడు/ పెదాలు ఎండిపోతాయి’’వంటి కవిత్వ పదాల్లో కొత్త మెరుపులేవో మెరిసి ఊహల్ని మెలిపెడతాయి. నిశ్శబ్ద లయ, వెలుతురు స్నానం, పచ్చని ఆహ్వానం, పేగుముడి విప్పుకున్న బంధంలాంటి శీర్షికల్లో వైవిధ్యం కనిపిస్తుంది. ఇలా సమాజంలోని బహుముఖ పార్శ్వాల్ని లోచూపుతో కవిత్వంగా ఆవిష్కరించడం కవికి కొత్తకాదు. ఇప్పటికే అనేక రచనలుచేసి పలు ప్రక్రియల్లో ఆరితేరినతనం కనిపిస్తుంది. స్వతహాగా మంచి కవిగా ముద్రవేసుకున్న ప్రయత్నంలో భాగమే ఈ కృషి. ఈ సంపుటి ఆసాంతం చదివాక కవి పద పొందికలోని అద్భుతానికి అబ్బురపడడం చిత్రమేమీ కాదు.

-బులుసు సరోజినీదేవి