అక్షర

సూక్ష్మపరిశీలనకు సాక్ష్యం.. బూర్గుల సాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బూర్గుల రామకృష్ణారావు రచనలు-1
నవచేతన పబ్లిషింగ్ హౌస్
వెల: రు.330
పేజీలు: 518

రాజకీయ దురంధరులు, బహుభాషా కోవిదులు, సాహితీవేత్తలు, తెలుగు జాతి వికాసానికి కృషి చేసిన మహనీయులు కీ.శే. బూర్గుల రామకృష్ణారావు. అధ్యయనం, సాహితీ సృజనం ఆయనకు నిత్య వ్యాపకాలు. వివిధ సందర్భాల్లో వివిధ భాషలలో విరచించిన కవితలు, వ్యాసాలు, అనువాద రచనలు అందుకు సాక్ష్యాలు. ఆయన పండితులే కాదు మంచి కవి కూడా. తెలుగులో, సంస్కృతంలో, ఆంగ్లంలో కూడా కవిత్వం రాసిన ప్రతిభాశాలి. కవిగా బూర్గుల రామకృష్ణారావు తొలిదశలో రాసిన ‘కృష్ణ శతకము’ భక్తి, వైరాగ్యాలతో నిండి వుంది. సత్యసాయిబాబా భక్తులుగా ఆర్తితో రచించిన భక్తిపూరిత పద్యాలు ‘పుష్పాంజలి’ పేరుతో వెలువరించారు. ‘తొలిచుక్క’ అనే ఖండ కావ్యంలో కొన్ని పద్యాలు, గేయాలు ఉన్నాయి. ఈ ఖండికలలో దైవభక్తి, శృంగార స్ఫూర్తి, ప్రకృతి వర్ణనం, సామాజిక చిత్రణం కనిపించగా అనువాద కవితలలో జీవిత చిత్రణం, తాత్త్విక చింతన ప్రధానంగా కనిపిస్తుంది. ‘నివేదన’లో ప్రణయం, ప్రకృతి చిత్రణ, దైవారాధనతో పాటు కొన్ని సంస్కృత కవితలు వున్నాయి. భగవత్ స్తుతి, ఆధ్యాత్మిక సాధనాలు ‘కరుణాలహరి’లో చూడవచ్చు. ఆయన కవిత్వంపై ఆనాటి భావకవుల ప్రభావాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు. ఆంగ్ల భాషలో ఆయన స్వయంగా రచించిన భావగీతాలు ‘ద డ్రీమ్ ఆఫ్ పొయెటస్ అండ్ అదర్ పొయెమ్స్’ పేరుతో వెలువడినాయి.
సృజనాత్మక రచయితగానే కాక సూక్ష్మ పరిశీలనా దృష్టిగల విమర్శకులుగా కూడా బూర్గులవారు ప్రసిద్ధికెక్కారు. వారి కవితా రచనలన్నీ ఒక ఎత్తు. వచన రచనలు, విమర్శ మరో ఎత్తు. బహుభాషా పరిచయం, విస్తృత అధ్యయనం, తులనాత్మక విశే్లషణతో కూడుకున్న బూర్గులవారి సారస్వత వ్యాసాలు దేనికదే ప్రత్యేకతను సంతరించుకుని వున్నాయి. ప్రాచీనాధునిక సాహిత్యాలపై ఆయనది సమదృష్టి. ఆంధ్ర దేశంలో ఎంకిపాటలపై దుమారం రేగినపుడు వీరు రాసిన ‘నవీన వాజ్ఞ్మయం-యెంకి పాటలు’ వ్యాసంలో పూర్వాపరాల స్పృహ, అభ్యుదయ దృక్పథంపై చేసిన చర్చ పెద్ద సంచలనాన్ని లేవదీసింది. ‘కాకునూరి అప్పకవి జన్మస్థానము’ ‘రెడ్డిరాజుల కాలపు మత సంస్కృతులు’ అనే రెండు ప్రామాణిక వ్యాసాలు బూర్గులవారి చారిత్రక దృష్టిని తెలియజేస్తాయి. ‘తెలుగు సాహిత్యంలో యుగకర్తలు’ అనే వ్యాసంలో ఆది యుగకర్తగా నన్నయను, దేశీ రీతికి పట్టం కట్టిన పాల్కురికి సోమనాధుడ్ని, శ్రీనాధుడు, పెద్దన, పింగళి సూరన, వేమనను యుగకర్తలుగా విశే్లషించారు. ఆధునిక కవిత్వంలో శ్రీశ్రీ వరకు గల కవులు సాహిత్యాన్ని ప్రభావితం చేయడాన్ని గుర్తిస్తునే ఒక్క గురజాడ అప్పారావునే యుగకర్తగా పేర్కొనడం గమనించదగింది. ఒక మేధావి, మరొక మేధావి వ్యక్తిత్వాన్ని ఎలా విశే్లషించారో తెలుసుకోవాలంటే ‘ప్రతాపరెడ్డి అన్నగారు’ వ్యాసం చదవాల్సిందే. సర్వేపల్లి రాధాకృష్ణ ‘్భరత దర్శనా‘న్ని వివరించిన విధానం ఆకట్టుకుంటుంది. ‘ఉర్దు భాషా సారస్వతములు, తెలుగు భాషపై ఉర్దు ప్రభావము, బహమనీ సుల్తానులు-కుతుబ్‌షాహి రాజుల ఉర్దు వాజ్ఞ్మయ పోషణము, సూఫీ సర్మద్-ఉమర్ ఖయ్యాం, ఉమర్ ఖయ్యాం-ఈశ్వర తత్త్వం వ్యాసాలను కేవలం బూర్గులవారే రాయగలరు. వారికి ఉర్దు, పారసీ భాషలపై గల పట్టు ఏమిటో తెలియజేస్తుంది. వీటిని మించిన వ్యాసాలు ఇప్పటికీ వచ్చిన దాఖలాలు కనిపించవు. అదే ఆయన గొప్పదనం. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కేరళ గవర్నర్‌గా (1956-60) పనిచేసినపుడు అక్కడ మళయాళం నేర్చుకున్నారు. ‘ప్రాచీన కేరళము, మళయాళ భాషా సాహిత్యములు, కేరళీయ ముఖ్య సంస్కృత సందేశ కావ్యములు’ అప్పుడే రాసివుంటారు. సమాచారాత్మకముగా, విజ్ఞానాత్మకములుగా వున్న ఈ పరిశోధనా వ్యాసాలు ఇప్పటికీ తమ ప్రాసంగితను కోల్పోలేదు.
ప్రాథమిక పాఠశాలనుండి ఇంటర్మీడియెట్ వరకు బూర్గులవారు ఫారసీని రెండవ భాషగా నేర్చుకోవడం వల్ల, ఆ భాషయందు అభిమానం కలిగి వుండడంవల్ల ఆ భాషా చరిత్రను, సాహిత్యాన్ని అధ్యయనం చేసి ‘పారసీక వాజ్ఞ్మయ చరిత్ర’ రాసారు. ఇందులో పారసీ భాష చరిత్రను (క్రీపూ 550-క్రీశ 1920) కాల విభజన చేసి మూడు యుగాలుగా విభజించారు. కవితా సృష్టిలో, దార్శనిక భావనా విలసనంలో, నైతిక భావ నిరతిలో, అభివ్యక్తీకరణలో, ప్రణయ వర్ణనలో, ప్రకృతి పరిశీలనలో ఫారసీ కవులు సాధించిన ప్రతిభా వ్యుత్పత్తులను సోదాహరణంగా వివరించారు.
ఇక వివిధ రచయితల గ్రంథాలకు బూర్గులవారు సమకూర్చిన పీఠికలుకూడా వారి భాషా సాహిత్య పరిజ్ఞానానికి, బహుశాస్త్ర వైదుష్యానికి నిదర్శనాలుగా నిలిచిపోతాయి. ఇందులో దాశరథి ‘మహాంద్రోద్యమం’కు రాసిన పీఠిక క్లుప్తంగా వున్నప్పటికీ ‘గాలిబ్ గీతాలు’పై రాసిన విశే్లషణాత్మక పీఠిక ఆ గ్రంథానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. శ్రీ ఆత్మానంద స్వామి ‘ఆంధ్ర మేఘ సందేశము’నకు రాసిన పీఠికలు సంస్కృత కావ్యాలను తెలుగు పద్యాలలోకి అనువదించేటప్పుడు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. శ్రీనాథుని గురించిన చర్చలో ఒక కవితను రాసిన దానికి, లేక చేసిన కల్పనకు అతనినే ఉదాహరణగా చెప్పడంలోని అనౌచిత్యాన్ని బూర్గులవారు బద్దలు కొట్టారు. ‘యజ్ఞవేది’లో యజ్ఞ స్వరూపం గురించి ఆసక్తిగా వివరించారు. సర్వజ్ఞ వచనాలపై రాసిన పీఠిక వారి కన్నడ సాహిత్య చరిత్ర సర్వజ్ఞతను వెల్లడిస్తుంది. పోణంగి శ్రీరామ అప్పారావు ’నాట్యశాస్తమ్రు’, ఆత్మకూరు గోవిందాచార్యుల ‘గోవింద రామాయణం’, గంగాపురం హనుమచ్ఛర్మ ‘దుందుభి’, కలుగోడు అశ్వత్థరావు ‘అశ్వత్థ భారతము’పై రాసిన పీఠికలు ఆయా రచయితల, కవుల హృదయావిష్కరణను గావించాయనే చెప్పాలి.

-కె.పి.అశోక్‌కుమార్