రాష్ట్రీయం

బాసిజం.. పోలీస్ బానిసిజం! ఖాకీవనంలో కన్నీటి కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4:కొందరి దృష్టిలో వాళ్లు.. లైసెన్సుడు గూండాలు. మరికొందరి దృష్టిలో అవినీతిపరులు. మీడియా పతాక శీర్షికలకు ఖాకీచకులు. ...అయితే అది ఒక పార్శ్వం మాత్రమే.
కానీ.. ఏ రోజూ వారిది కాదు. కుటుంబ జీవితం లేదు. ఇంట్లో అతను బాసయితే, ఉద్యోగంలో మాత్రం బానిస. అతనిపై లెక్కలేనంతమంది బాసులు. పీజీ, డిగ్రీలు చదువుకున్నా సొంత శాఖలోనే కనీస గౌరవానికి నోచుకోని దురవస్థ. తోటి స్నేహితులు చక్కగా ఇదే ఎనిమిది గంటల ఉద్యోగం చేసుకుంటుంటే, వాళ్లు మాత్రం 24 గంటలూ డ్యూటీ చేయాల్సిందే. కావడానికి రెండూ సర్కారీ ఉద్యోగాలే. కానీ తేడా మాత్రం హస్తిమశకాంతరం. విధి నిర్వహణలో అన్ని వర్గాలనూ సంతృప్తి పరచాల్సిందే. ఆ ఒత్తిళ్లకు తట్టుకునే వారయితే సరే. లేకపోతే జీవితాన్ని సగంలోనే ముగించుకుంటున్న విషాదం. వారి జీవితాల్లో రెండో కోణం ఇది. ఖాకీవనంలోకి క్యాంపస్ నుంచి నేరుగా వచ్చి చేరుతున్న కొత్త ఎస్‌ఐలు, సీఐల కన్నీటి వ్యథ ఇది.
ప్రొబేషనరీ ఎస్‌ఐ, ఆ తర్వాత ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులపై పెరుగుతున్న పని ఒత్తిళ్లు వారి జీవితాలకు అర్ధంతంరంగా ముగింపు పలుకుతున్నాయి. తెలంగాణలో ఇద్దరు ఎస్‌ఐలు, ఏపిలోని విశాఖ జిల్లాలో ఒక ఏఎస్‌పి ఆత్మహత్యకు పాల్పడటం పోలీసు శాఖలో పెరుగుతున్న ఒత్తిళ్లకు అద్దం పడుతోంది.
గతంలో పదవ తరగతి చదివి పోలీసుశాఖలోకి వచ్చేవారు. ఇప్పుడు కొత్తగా పోలీసు ఉద్యోగంలో చేరుతున్న వారిలో ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్ చదివిన వారే ఎక్కువమంది కనిపిస్తున్నారు. ఉరకలు వేసే ఉడుకు రక్తం, సమాజాన్ని మార్చేయాలన్న తపన. ఇన్ని ఆలోచనలతో పోలీసు శాఖలో చేరుతున్న యువ పోలీసు, తమ పైఅధికారుల బాసిజానికి బలైపోతున్నాడు. ప్రధానంగా కొత్తగా చేరిన ఎస్‌ఐలు, అంతకుముందు పనిచేస్తున్న ఎస్‌ఐలపై పనిభారం విపరీతంగా ఉంది. పోలీసు ట్రైనింగ్‌లో కూడా ఎస్‌ఐ, ఎస్పీ ఇద్దరే శాఖకు మూలస్తంభాలను చెబుతుంటారు. ఎస్‌ఐలపై అధికార, ప్రతిపక్ష పార్టీల ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి. ఇవికాకుండా పైస్థాయి అధికారుల బాసిజం, బందోబస్తు, మీటింగులు, విచారణ పేరిట ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వంటివి షరా మామూలు. ‘నేను ఇటీవల ఒక కేసు మీద పక్క రాష్ట్రానికి 20 రోజులు వెళ్లా. ఇంటికి వచ్చి భోజనం చేస్తున్న సమయంలోనే ఫోన్. అర్జంటుగా రావాలని బాస్ ఆదేశం. వెళ్లక తప్పదు కదా? భార్య, పిల్లలతో కూడా ఫోన్లలో మాట్లాడుకునే దౌర్భాగ్యం మాది. ఇక పెళ్లిళ్లు, పుట్టినరోజు పండుగలకు కుటుంబంతో సహా వెళ్లే అదృష్టం లేనే లేదు. సెలవడిగితే లేదు పొమ్మంటారు’ అని ఒక ఎస్‌ఐ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీరేదో పోలీసు అని మా పిల్లనిస్తే మీరు ఇంట్లో ఉండరు. మా అమ్మాయిని పట్టించుకోరు. రోజూ డ్యూటీకే అంకితమైతే ఇక పెళ్లి చేసుకోవడం ఎందుకు? మొగుడుతో బయటకు వెళ్లాలని ఎవరికైనా ఉండదా?’ అని తమ అత్తమామలు రోజూ పంచాయితీ పెడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాన’ని మరో ఎస్‌ఐ వాపోయారు. ‘ఇవన్నీ మీ మీడియాకు, జనాలకు తెలియవు. పోలీసులంటే లంచాలు తీసుకునేవాళ్లు, మామూళ్లు వసూలు చేసే వాళ్లుగా చూస్తార’ని కొత్తగా చేరిన మరో అధికారి ఎదురు ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఎస్‌ఐ శ్రీ్ధర్ ప్రతిరోజూ ఒత్తిళ్లను అధిగమించడం ఎలా అన్న దానిపై వెబ్‌సైట్స్‌ను ఆశ్రయించేవాడంటే, వారి మానసిక పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో స్పష్టమవుతోంది. ఇక మెదక్ జిల్లాలో ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తన ఆత్మహత్యకు పైఅధికారులే కారణమని సూసైడ్ నోట్‌లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
జిల్లాల్లో ఎస్‌ఐలు ఎస్‌హెచ్‌ఓలయినందున వారికి క్వార్టర్లు ఉంటాయి. భార్యాబిడ్డలు అక్కడే ఉంటారు కాబట్టి, ఏదో ఒక సమయంలో ఇంటికి వెళ్లే సౌకర్యం ఉంటుంది. కానీ హైదరాబాద్ వంటి నగరాల్లో అలాంటి చాన్స్ ఉండదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి కమిషనరేట్ల పరిధిలో కూడా వీక్లీ ఆఫ్‌లు ఇవ్వాలని పోలీసులు మొత్తుకుంటున్నారు.
పోస్టింగుల విషయాల్లో రెండు రాష్ట్రాల్లో అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఏపిలో కులం ప్రాతిపదికన పోస్టింగులు ఇస్తుంటే, తెలంగాణలో డబ్బు ప్రాతిపదికన ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఏపిలో కీలకమైన పోస్టింగులన్నీ ఒక సామాజికవర్గానికే దక్కుతున్నాయని, ఎవరైనా మిగిలిన సామాజికవర్గ అధికారికి పోస్టింగ్ ఇస్తే వారిని బదిలీ చేసేవరకూ నిద్ర పోవడం లేదు. విజయవాడ నగరంలో గుట్కా, దో నెంబర్ దందాపై ఉక్కుపాదం మోపిన ఒక అధికారిని గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి పట్టుపట్టి బదిలీ చేయించి, తన సామాజికవర్గానికి చెందిన వారికి పోస్టింగు ఇప్పించుకున్న ఉదంతం లేకపోలేదు. తెలంగాణలో ఇప్పుడు మూడు సామాజికవర్గాలకు చెందిన వారికే కీలక పోస్టింగులు దక్కుతున్నాయి. విధిగా ప్రతి ఒక్కరినీ రెండేళ్లు అన్ని విభాగాల్లో, అన్ని జిల్లాల్లో పనిచేయిస్తేనే అధికారులు స్వేచ్ఛగా పనిచేస్తారని, వారికి అప్పుడు కుటుంబాలతో గడిపే అవకాశంతోపాటు, తమ సమర్థత నిరూపించుకుంటారని వివరిస్తున్నారు. అయితే, పలుకుబడి ఉన్న వారు ఒకే నగరం, ఒకే జిల్లాల్లో లా అండ్ ఆర్డర్‌లో పనిచేస్తున్నారని, దానివల్ల సమర్ధులకు అవకాశం లభించడం లేదనీ అంటున్నారు.
ప్రొబేషనరీ ఎస్‌ఐలకు ఎస్‌హెచ్‌ఓ ఇవ్వాలని ఉన్నా, అది అంతటా అమలుకావడం లేదన్న విమర్శలున్నాయి. ఈ విధానాన్ని ఒకసారి నిజామాబాద్‌లో ప్రవేశపెట్టి మళ్లీ రద్దుచేశారని గుర్తు చేస్తున్నారు. ఇక ఎస్‌ఐ-2 విధానం వల్ల కొత్తగా విధి నిర్వహణలో చేరిన వారిని అంటరానివారిగా చూస్తున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అటు కానిస్టేబుళ్లు, ఇటు సీఐ ఎవరూ పట్టించుకోరని వాపోతున్నారు. కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో ఈ విధానం వల్ల తమ ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని, అసలు ఈ హోదాలో పనేమీలేదని, తమను అంటరానివారిగా చూస్తున్నారంటున్నారు.
రోగాల మయం
30 ఏళ్లు కూడా నిండని యువ పోలీసు ఒత్తిళ్ల ఫలితంగా రోగాల పాలవుతున్నాడు. చిన్న వయసులోనే బిపి, షుగర్ తెచ్చుకుంటున్నాడు. చాలామంది యువ అధికారులకు తిండితినే సమయం కూడా ఉండటం లేదు. అకాలభోజనం వల్ల అనారోగ్యం పాలైనవాళ్లు పోలీస్ శాఖలో బోలెడుమంది. పోలీస్ శాఖలో 42 శాతం మందికి బిపి, సుగర్లు ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది.
కుదరని లెక్క
తెలుగు రాష్ట్రాల్లో పోలీసు శాఖలో అవసరానికి తగిన సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం దేశ జనాభా ప్రకారం ప్రతి 450 మందికి ఒక పోలీసు ఉండాలి. కానీ ప్రస్తుతం 900 మందికి ఒక పోలీసు మాత్రమే ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 20 వేల పోస్టులు ఖాళీ ఉండగా, అందులో 9 వేల కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటిని భర్తీచేయడమే ఒత్తిడి సమస్యకు పరిష్కారమంటున్నారు.
ఇదేం ఫ్రెండ్లీనెస్?
తెలుగుపాలకులు ఈ మధ్య కొత్తగా చెబుతున్న ఫ్రెండ్లీ పోలీసు నినాదం పబ్లిసిటీకే పరిమితమవుతోంది. నేరుగా నియమితులైన ఐపిఎస్ అధికారులు కిందిస్థాయి అధికారులను గౌరవిస్తున్నారు. కానీ ప్రమోటీలు మాత్రం కిందిస్థాయి పోలీసులకు సీటు కూడా ఆఫర్ చేయకుండా అనాగరికంగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ విషయమై తెలంగాణ పోలీసు అధికారుల సంఘం నేత గోపిరెడ్డి మాట్లాడుతూ ‘దీనిపై మేం డీజీపీతో చర్చించాం. కచ్చితంగా ఎవరైనా పోలీసులను కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పాం. పోలీసులు ఆత్మగౌరవంతో బతికేలా మేం పోరాడుతున్నాం. అయితే, సౌకర్యాల విషయంలో చాలా రాష్ట్రాల కంటే తెలంగాణ పోలీసు చాలా బెటర్. మాకు ప్రత్యేక బడ్జెట్ ఇచ్చింది. కొత్త వాహనాలు సమకూర్చింది. అందుకు కృతజ్ఞతలు. కానీ మిగిలిన సమస్యలు కూడా పరిష్కరించాల్సి ఉంది. పోలీసుల ఆరోగ్యం, పెండింగ్ బిల్లు, లీవులు, ఇతర సౌకర్యాల కోసం మేం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నామ’ని చెప్పారు.

వీక్లీ ఆఫ్‌లకూ ఎసరు
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ వినూత్నంగా చేపట్టిన పోలీసులకు వీక్లీ ఆఫ్ విధానం అన్ని జిల్లాల్లో అమలు కావడం లేదు. నల్లగొండ జిల్లాలో తొలిసారిగా ప్రభాకర్‌రావు హయాంలో వీక్లీ ఆఫ్‌లు ఇచ్చారు. అయితే ఆయన బదిలీ తర్వాత ఆ విధానం పెద్దగా అమలుకావడం లేదు. కరీంనగర్‌లో పూర్తిస్థాయిలోనూ, ఖమ్మం జిల్లాలో పాక్షికంగానూ ఈ విధానం అమలవుతోంది.

ముంబయి ది బెస్ట్
ముంబయిలో పోలీస్ శాఖలో ఎనిమిది గంటల విధానం అమలువుతోంది. ఢిల్లీలో పోలీసుల పెళ్లిరోజు, పిల్లల పుట్టినరోజున సెలవు తీసుకునే వెసులుబాటు ఉందని పోలీసు అధికారులు గుర్తు చేస్తున్నారు. అలాంటివి తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేయాలంటున్నారు.

టూర్లతో ఒరిగిందేమిటి?
పోలీసుల పనితీరుపై అధ్యయనం పేరిట విదేశీ యాత్రలకు క్యూ కడుతున్న ఐపిఎస్ అధికారులు, అక్కడి విధానాలను ఇక్కడ అమలు చేయించడంలో ఎందుకు విఫలమవుతున్నారన్నది ప్రశ్న. కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేయడం తప్ప, అక్కడి సంస్కరణలు ఇక్కడ అమలు చేయకపోతే ఇక దానివల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మార్తి సుబ్రహ్మణ్యం