గుంటూరు

అంచనాలకు అందని వరద నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా గడిచిన మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలతో సంభవించిన వరద నష్టం అంచనాలకు మించుతోంది. ప్రధానంగా సత్తెనపల్లి, చిలకలూరిపేట, క్రోసూరు, అచ్చంపేట, అమరావతి, బాపట్ల, రేపల్లె తదితర మండలాలను వరద ముంచెత్తడంతో వివిధ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పల్నాడు ప్రాంతంలో ఒకేరోజు 20 నుండి 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం, నల్లమడ వాగు పొంగిపొర్లడం తదితర కారణాలతో సుమారు జిల్లావ్యాప్తంగా 41 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క ప్రత్తి పంటే 27 వేల హెక్టార్లకు పైగా దెబ్బతినగా, 6,400 హెక్టార్లలో వరి పంట, 6,200 హెక్టార్లలో కంది పంటలు నీటమునిగాయి. పెదకూరపాడు, చిలకలూరిపేట ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రాజెక్టులు నీటమునిగాయి. ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్ రహదారులు, చప్టాలు, వంతెనలు ఎక్కడికక్కడ కోతకు గురై రవాణా వ్యవస్థ అస్తవ్యస్థమైంది. గుంటూరు-హైదరాబాద్ ప్రధాన రహదారిలోని సత్తెనపల్లి మండల పరిధిలోని వెన్నాదేవి, ధూళిపాళ్ల, రెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో వాగులు పొంగిపొరలడంతో రహదారి నామరూపాలు లేకుండా పోయింది. అలాగే సత్తెనపల్లి, క్రోసూరు మధ్య రహదారి సైతం ఎక్కడికక్కడ కోతకు గురై వాహన రాకపోకలకు వీలులేకుండా మారింది. క్రోసూరు మండల పరిధిలోని పాకాలపాడు, రెంటపాళ్ల మధ్య ఉన్న రహదారిలో పలుచోట్ల వాగులు పొంగడంతో రోడ్లు కొట్టుకుపోయాయి. ఇలా ఉండగా వివిధ గ్రామాల మధ్య ఉన్న పంచాయతీరాజ్ లింకు రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా ఆర్‌అండ్‌బికి సంబంధించిన సుమారు 400 చోట్ల రోడ్లు వరద ఉద్ధృతికి గండ్లుపడటం, కొట్టుకుపోవడం, కోతకు గురయ్యాయి. ఈ కారణంగా సుమారు 20 నుండి 25 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. అలాగే పంచాయతీ రాజ్‌కు సంబంధించి 41 రోడ్లు 179 కిలోమీటర్ల మేర దెబ్బతినగా, ప్రాథమిక పునరుద్దరణకు 3.23 కోట్ల రూపాయలు, శాశ్వత నిర్మాణానికి 35 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేశారు.
సహాయక చర్యలు ముమ్మరం...
జిల్లాలో భారీవర్షాలకు దెబ్బతిన ప్రాంతాల్లో శాశ్వత సహాయక చర్యలు చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శుక్రవారం మంత్రులు చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, పెదకూరపాడు, సత్తెనపల్లి, క్రోసూరు మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పూర్తి నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ భారీవర్షాల కారణంగా పంట నష్టపోయిన వారికి 50 శాతం సబ్సిడీతో విత్తనాలతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇస్తున్నట్లు వివరించారు. పంట పొలాల్లోని నీరు తగ్గాక వ్యవసాయ అదికారులు ఎంత నష్టం జరిగిందీ అంచనా వేస్తారని, తదనుగుణంగా ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించే విషయంలో నిర్ణయం ప్రకటిస్తుందని చెప్పారు. వీరి వెంట కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీదర్, జివి ఆంజనేయులు, ఆర్‌డిఒ శ్రీనివాసరావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.