తెలంగాణ

హైదరాబాద్‌ను వీడని వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: హైదరాబాద్ నగరం భారీ వర్షాలు, వరదలతో వణికిపోతోంది. రోడ్లన్నీ వాగు లు, వంకలుగా మారడంతో జనజీవనం స్తంభించిపోయింది. మూడురోజుల పాటు కురిసిన వర్షాల వల్ల సికిందరాబాద్‌లో సంతోష్ అనే వ్యక్తి ఫిట్స్ వచ్చి మృతి చెందాడు. వందలాది అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి వరదనీరు చేరడంతో అపార్ట్‌మెంట్ల ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. హుస్సేన్‌సాగర్‌లోకి శుక్రవారం కొంత ఇన్‌ఫ్లో తగ్గింది. కూకట్‌పల్లి, పికెట్ నాలాలతో పాటు దుర్గం చెరువు నుంచి వచ్చే నాలాల వల్ల సాగర్‌లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరటంతో చెరువు దిగువ ప్రాంతాలైన అశోక్‌నగర్, అరుంధతినగర్, గాంధీనగర్, ఫీవర్ ఆసుపత్రి, నల్లకుంట, గోల్నాక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నిన్నటి వరకు సాగర్‌కు 4వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండటంతో అధికారులు 2500 క్యూ సెక్కుల నీటిని విడుదల చేయగా, శుక్రవారం ఔట్‌ఫ్లోను 4200 క్యూసెక్కులకు పెంచారు. హుస్సేన్‌సాగర్ దిగువ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లలో వరదబాధితులకోసం 98 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి భోజన వసతి కల్పించేందుకు 200 మంది హౌజ్ కీపింగ్ సిబ్బందిని కూడా నియమించినట్లు అధికారులు తెలిపారు. అయితే ట్యాంక్‌బండ్‌కు ఎలాంటి ముప్పు లేదని, ఇన్‌ఫ్లోకు తగిన విధంగా అవసరమైనపుడల్లా ఔట్ ఫ్లోను పెంచుతున్నామని జిహెచ్‌ఎంసి అధికారులు చెబుతున్నారు.
భారీ వర్షాలకు నిజాంపేట గ్రామం, బండారి లే అవుట్ కాలనీ అనేక అవస్థలను ఎదుర్కొంటోంది. ఈ ప్రాంతంలో తురక చెరువుకు గండిపడే అవకాశం ఉన్నందున అపార్ట్‌మెంట్ల వాసులను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. గురువారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైన భారీ వర్షం శుక్రవారం ఉదయం పది గంటల వరకు కుండపోతగా కురిసింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సర్కిల్ పరిధిలోని సుభాష్‌నగర్ డివిజన్ సుందర్‌నగర్, శ్రీసాయినగర్, సాయిబాబానగర్‌లలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హమీద్‌బస్తీ, రాళ్లకంచె బస్తీల్లో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. జీడిమెట్ల డివిజన్ గాయత్రినగర్, మీనాక్షి ఎస్టేట్స్, ఎన్‌సిఎల్ కాలనీ, క్యాంటిన్ పార్క్, అంగన్‌పేట్ ప్రాంతాలు జలమయమయ్యాయి. గణేశ్‌నగర్, శ్రీనివాస్‌నగర్, చింతల్, చంద్రానగర్, నందానగర్, భగత్‌సింగ్ నగర్ కాలనీలు నీటమునిగాయి. జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువులో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. మం డల పరిధిలోని దుండిగల్ నుండి నాగులూరుకు వెళ్లేమార్గంలో చెరువు అలుగు నుండి పారే నీరు రోడ్డు పైనుండి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.
అల్వాల్‌లో తగ్గని వరద నీరు
అల్వాల్‌లో వరద నీటి ఉద్ధృతి తగ్గలేదు. శుక్రవారం సైతం వరద నీరు ప్రవహించటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ అత్యధికంగా 25 సెం.మీ వర్షపాతం నమోదయింది. హకీంపేట ఎయిర్‌పోర్టు నుండి వస్తున్న వరద నీరు తుర్కపల్లి, బందం, బటన్‌గూడ, బొల్లారం, కంటోనె్మంట్ ప్రాంతం నుండి మోదుగుల చెరువులోకి చేరుకుని అక్కడి నుంచి నీటి ప్రవాహం కింది భాగంలోని మచ్చబొల్లారం ద్వారా అల్వాల్‌లోని కొత్తచెరువు, చెన్నరాయని చెరువు నిండి పొంగిపొర్లడంతో టెంపుల్ అల్వాల్‌లోని రెడ్డి ఎన్‌క్లేవ్, శ్రీనివాసనగర్, జానకినగర్ కాలనీలు పూర్తిగా నీటమునిగాయి. చెన్నరాయిని చెరువు కింద భాగంలోని వెస్టువెంకటాపురం, దినకర్‌నగర్, కిరణ్ ఎన్‌క్లేవ్, ప్రాంతాలతోపాటు భూదేవినగర్, బృందావన్ కాలనీ, టెలికాంకాలనీ, శివానగర్, బ్యాంకు కాలనీ, సుభాష్‌నగర్ జలమయమయ్యాయి. వెంకటాపురం, వెస్టు వెంకటాపురం మధ్యన వాహనాలు నిలిచిపోయాయి. అల్వాల్, టెంపుల్ అల్వాల్, ఓల్డు అల్వాల్ మధ్యన వాహనాలు నడవలేదు. అల్వాల్‌లో వరద ధాటికి సుమారు 50 కాలనీల వరకు జలమయమయ్యాయి. టెంపుల్ అల్వాల్, వెస్టువెంకటాపురం, బృందావన్ కాలనీ మూడుచోట్ల రహదారిలో ప్రయాణానికి ఇబ్బందులు ఉన్నాయి.
48 భవనాల కూల్చివేత
శుక్రవారం ఒక్కరోజే జిహెచ్‌ఎంసి అధికారులు 48 శిథిల భవనాలను కూల్చివేశారు. దీంతో ఈ సీజనల్ అధికారులు కూల్చివేసిన భవనాల సంఖ్య 416కు చేరింది. సహాయక చర్యల కోసం సైన్యాన్ని రప్పించేందుకు శుక్రవారం మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో జిహెచ్‌ఎంసి అధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపారు.
నగరానికి మరో రెండురోజుల పాటు భారీ వర్ష సూచనలుండటంతో ఎలాంటి విపత్కరమైన పరిస్థితులనయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. జిహెచ్‌ఎంసిలోని కంట్రోల్ రూం ద్వారా వర్షాల పరిస్థితులను పర్యవేక్షించిన మంత్రి విలేఖర్లతో మాట్లాడుతూ ఇప్పటికే ననీట మునిగిన ప్రాంతాల్లో మోటార్లతో నీటిని తోడేసేందుకు పోలీసు, అగ్నిమాపక సిబ్బంది క్షేత్ర స్థాయి విధుల్లో నిమగ్నమైనట్లు వివరించారు. సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో హుస్సేన్‌సాగర్ అలుగుల ద్వారా హోటల్ వైస్రాయ్ వద్ద విడుదల చేస్తున్న ఔట్‌ఫ్లోను పరిశీలించి, వివరాలు అడిగి తెల్సుకున్నారు.
నాలాలపై ఆక్రమణల తొలగింపుకు చేపట్టాల్సిన చర్యల విషయమై మంత్రి కెటిఆర్ శుక్రవారం టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమీక్షించారు. ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు వైద్యారోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

చిత్రం.. మడుగులా మారిన బేగంపేట హోలీ ట్రినిటీ చర్చ్