శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

విద్యార్థుల్ని రెచ్చగొట్టడం మానుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 23: ప్రత్యేక హోదా పేరుతో అభం శుభం తెలియని విద్యార్థుల్ని రెచ్చగొట్టే చర్యలను ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి వెంటనే మానుకోవాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డితో పాటు ఇతర నేతలు హితవు పలికారు. శుక్రవారం సాయంత్రం జిల్లా టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తొలుత సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వం ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదని, కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజి ఎంతో ఉన్నతంగా ఉండటంతో తామంతా స్వాగతించామని తెలిపారు. ఓటుకు నోటు కేసులో తాము జోక్యం చేసుకోమంటూ సుప్రీంకోర్టు తెలపడంతో జగన్మోహన్‌రెడ్డికి చెంపదెబ్బ తగిలిందని, దీంతో ప్రస్తుతం ప్రత్యేక హోదా పేరుతో ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్మోహన్‌రెడ్డి తండ్రి రాజశేఖర్‌రెడ్డే తమ నేత చంద్రబాబునాయుడ్ని ఏమి చేయలేకపోయారని, ఇక ఈయనెంతని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో భ్రష్టుపట్టిందని, దీనికి కారణం వైఎస్ కుటుంబమని, గతంలో పేరుగాంచిన సీనియర్ ఐఏఎస్ అధికారులంతా ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరగటానికి కారణం జగన్మోహన్‌రెడ్డి అవినీతే కారణమని దుయ్యబట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి ఓ వైపు విన్నవిస్తూనే ప్రత్యేక ప్యాకేజిని ప్రభుత్వం అందుకునేందుకు సిద్ధమైందని, ప్రత్యేక హోదా నుంచి తాము వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి అభివృద్ధిని ఏదో ఒక విధంగా అడ్డుకోవడమే తన విధిగా జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్‌కు తనపై ఉన్న కేసుల భయం పట్టుకుందని, దీంతో కేంద్రం కాళ్లు పట్టుకుంటూ రాష్ట్రంలో మాత్రం ప్రత్యేక హోదా పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా అవసరమే కాని, ప్రత్యేక ప్యాకేజి కూడా ఎంతో స్వాగతించాల్సిన విషయమన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా సహాయాన్ని అడగాల్సింది పోయి, కేంద్రం ఇస్తామన్న ప్యాకేజి తీసుకోవడాన్ని జగన్ తప్పుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 2021లో తాను ముఖ్యమంత్రి అవుతానంటూ చిలక జోస్యాలు పలుకుతున్న జగన్ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేరని ఎద్దేవా చేశారు. రోజుకు 18 గంటల పాటు కష్టపడుతున్న ముఖ్యమంత్రిని విమర్శించటం సిగ్గుచేటన్నారు. విభజన సమయంలో కనీసం నిరసనలు కూడా చేపట్టని జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు ప్రజల్ని మభ్యపెడుతుండటం విచారకరమన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, టిడిపి జడ్పి ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలి
స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలి
* జడ్పి సమావేశంలో పట్టుపట్టిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పిటిసిలు
* అధికారులు ప్రోటోకాల్ పాటించాలి
* జడ్పి ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆదేశం
నెల్లూరుటౌన్, సెప్టెంబర్ 23: జిల్లాలో ఉన్న ఇఫ్కో, మేనకూరు సెజ్‌లలో, కోట, వాకాడు, ముత్తుకూరు, కృష్ణపట్నంలలో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జడ్పిటిసిలు పట్టుపట్టారు. శుక్రవారం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పి ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తుకూరు జడ్పిటిసి మాట్లాడుతూ ముత్తుకూరు మండలంలో ఏర్పాటు చేసిన థర్మల్‌ప్లాంట్ల కోసం ఆ చుట్టుపక్కల గ్రామాల రైతుల వద్ద నుంచి అనేక వేల ఎకరాల భూములు తీసుకున్నారని, అప్పుడు ప్రభుత్వం, అధికారులు భూములు ఇచ్చిన రైతుల కుటుంబంలోని వారికి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చి ఇప్పటి వరకు వారికి ఉద్యోగాలు కల్పించకపోవడం దారుణమని, దీనిపై తక్షణం అధికారులు చర్యలు తీసుకోవాలని జడ్పి ఛైర్మన్‌ను కోరారు. కొడవలూరు జడ్పిటిసి శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ ఇఫ్కో సెజ్‌కోసం తమ మండలంలో దాదాపు 3,900 ఎకరాలను 800 మంది రైతులు అందచేశారని, దాని విలువ సుమారు రూ.1700 కోట్లు అని, ఇప్పటి వరకు కనీస నష్టపరిహారం అందలేదన్నారు. భూములు ఇచ్చిన రైతులు ఆ సెజ్‌లోకి పశువులు మేపుకునేందుకు వెళితే వారిపైనే కేసులు బనాయించి జైలులో పెట్టిస్తున్నారని, దీనిపై తక్షణం కలెక్టర్, ఛైర్మన్, రాజకీయ నాయకులు స్పందించి వారికి న్యాయం చేసి ఉద్యోగాలు ఇప్పించాలని సమావేశాన్ని అడ్డుకున్నారు. అదే సమయంలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కలుగచేసుకొని దీనికోసం నిర్ణీత సమయాన్ని కేటాయించి కలెక్టర్‌తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని శ్రీ్ధర్‌రెడ్డికి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, వాకాటి నారాయణరెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ సెజ్‌ల పేరుతో ప్రభుత్వం సెజ్‌లకు కావాల్సిన స్థలాల పరిమితికి మించి రైతుల వద్ద భూములు సేకరించారని, ప్రస్తుతం ఆ సెజ్‌లలో వారికి కావాల్సిన భూమి రెండు, మూడు వందల ఎకరాల కంటే అవసరం లేదని ఆ రెండు, మూడు వందల ఎకరాలే ఆ పరిశ్రమలకు సరిపోతాయన్నారు. అప్పట్లో రైతులు ఇచ్చిన భూములకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామి ఇచ్చిన ప్రభుత్వం ఆయా ప్రాంతాలకు చెందిన వారికి ఉద్యోగాలను కల్పించకుండా పక్క రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. లోకల్ రైతులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పులివెందులకు చెందిన 40 మందికి ఏపి జెన్‌కోలో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతుల పిల్లలకు ఆ పరిశ్రమల యజమానులు కనీసం ఇప్పటి వరకు సిఎస్‌ఆర్ గ్రాంటును కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవని, ఆయా కంపెనీలు అమాంతం కాజేశారని, ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణను ఆ రైతుల పిల్లలకు ఇప్పించి వారికే ఉద్యోగాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. దీనిపై కలెక్టర్ స్పందించి ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి ఉద్యోగాలను, నష్టపరిహారాన్ని సకాలంలో ఇప్పిస్తామని తెలియజేశారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పరిశ్రమల్లో పని చేస్తున్నావారిని తొలగించి అయినా రైతుల కుటుంబంలోని వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని, దీనికి తమవంతు సహాయం చేస్తామని వారు కలెక్టర్‌కు సూచించారు. అందుకు ఆయా ప్రాంతాల జడ్పిటిసిలు, ఛైర్మన్ ఆమోదం తెలిపారు. ఆర్టీసీ ఆర్‌ఎం రవివర్మ మాట్లాడుతుండగా బుచ్చి, కలిగిరి ఆర్టీసీ బస్టాండులలో బస్సులను బజార్లలో నిలపడం వల్ల వాహన రద్దీ పెరిగి ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల జడ్పిటిసిలు తమ సొంత నిధులతో బస్టాండుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కొంత మండి జడ్పిటిసిలు సొంత నిధులను బస్టాండు నిర్మాణాలకు అందచేసినా వాటి నిర్మాణాలు చేపట్టకపోవడం ఆర్టీసీ నిర్లక్ష్యధోరణి అర్థమవుతుందన్నారు. ఇరిగేషన్ ద్వారా జిల్లాలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం రూ.700కోట్లు నిధులను మంజూరు చేసిందని, ఇప్పటి వరకు జిల్లాలో ఒక్కచోట చెక్‌డ్యామ్ నిర్మించకపోవడం దారుణమని సోమిరెడ్డి ఇరిగేషన్ ఎస్‌ఇని నిలదీశారు. త్వరలో తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గత వర్షాలకు తెగిపోయి ఉన్న చెరువులను ఇప్పటి వరకు పనులు పూర్తి చేసేందుకు టెండర్లు ఎందుకు పిలవలేదని సూటిగా పిలవగా ఈ నెలలో టెండర్లు పిలుస్తామని విడ్దూరంగా ఉందని జడ్పి ఛైర్మన్ బొమ్మిరెడ్డి అన్నారు. తక్షణం చెరువు గండ్లను రాబోవు వర్షాకాంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. బోగోలు మండలంలో చెక్ డ్యామ్‌లపై రూ.5కోట్ల అవినీతి జరిగిందని జడ్పిటిసి సభ్యురాలు చెప్పగా తక్షణం వాటిపై తగు చర్యలు తీసుకోవాలని బీద రవిచంద్ర కలెక్టర్‌ను కోరారు. వైద్యశాలల్లో డాక్టర్లు సెలవు చీటీలు పెట్టి వెళ్లి మరలా తిరిగి విధులకు వచ్చిన తరువాత ఆ సెలవు చీటీలను చింపి పారేస్తున్నారని, వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని జడ్పి ఛైర్మన్ కలెక్టర్‌ను కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పిటిసిలు, ఎంపిపిలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పిన్నతల్లి ఆత్మహత్యకు కారణమైన కేసులో ఆరుగురికి పదేళ్లు జైలు
నెల్లూరు లీగల్, సెప్టెంబర్ 23: ఆస్తిని తమకు ఇవ్వకుండా తన కన్నబిడ్డలకు రాసి ఇస్తుందేమోననే అనుమానంతో పిన్నతల్లిని కొట్టి దుర్భాషలాడి ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయిన కేసులో నిందితులైన తానంగారి వీరరాఘవులు, తానంగారి చినవీరరాఘవులు, తానంగారి బాబు, తానంగారి కిరణ్, తానంగిరి ఉయ్యాలమ్మ, తానంగారి మంగమ్మలపై ఆరోపణలు సాక్ష్యాధారాలతో రుజువైనందున వారికి ఒక్కొక్కరికి పది సంవత్సరాలు జైలు శిక్ష, ఐదు వందలు రూపాయలు జరిమానా విధిస్తూ నెల్లూరు అరవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బిఆర్ మధుసూదనరావు శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. కావలి రూరల్ పోలీసుల పరిధిలోని తుమ్మలపెంట పట్టపుపాలెంకు చెందిన తానంగారి గోవిందు హతురాలు సీతమ్మ అక్కను వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు కుమారులు కలిగారు. అనారోగ్యరీత్యా మొదటి భార్య మరణించగా, ఆమె చెల్లెలు సీతమ్మను గోవిందు వివాహం చేసుకున్నాడు. అమెకు ఇద్దరు ఆడ పిల్లలు. మొదటి భార్యకు కలిగిన నలుగురు మగ పిల్లలను, ఈమెకు కలిగిన ఇద్దరు ఆడ పిల్లలను పక్షపాతం లేకుండా పెంచి వారికి వివాహాలు చేసింది. చివరకు ఆమె తన కూతురు ఫకీరమ్మ ఇంటిలో స్థిరపడింది. కాగా, నిందితులైన మొదటి భార్య కుమారులు వీరరాఘవులు, చిన్నవీరరాఘవులు, బాబు, కిరణ్ ఆమె కోడళ్లు అయిన ఉయ్యాలమ్మ, మంగమ్మ, హతురాలు సీతమ్మ తమకు ఆస్తి రాసి ఇవ్వకుండా మొత్తం ఆస్తిని తన కన్న కుమార్తె అయిన పకీరమ్మకు ఇచ్చేస్తుందనే అనుమానం నిందితులకు కలిగింది. దీంతో 2012 జూన్ 13 సాయంత్రం నిందితులు ఆరుమంది కలిసి హతురాలు సీతమ్మను కాళ్లతో చేతులతో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. అసభ్యంగా మాట్లాడారు. ఈ సంఘటన తీవ్ర అవమానంగా భావించిన ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా తన ఆత్మహత్యకు నిందితులే కారణమని మరణ వాంగ్మూలం ఇచ్చి ఆమె మరణించింది. ఈ మేర ఆమె భర్త గోవిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కావలి రూరల్ పోలీసులు ఆరుమంది నిందితులపై కేసు నమోదు చేసి ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి పైమేర తీర్పు ఇచ్చారు.

మూడు రాష్ట్రాల్లో అంతరిక్ష వారోత్సవాలు
* షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ వెల్లడి
సూళ్లూరుపేట, సెప్టెంబర్ 23: ఈ ఏడాది మూడు రాష్ట్రాల్లో అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ వెల్లడించారు. అంతరిక్ష వారోత్సవాల నిర్వహణ శుక్రవారం షార్ అధికారులతో డైరెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 4నుండి 10వ తేదీ వరకు జరిగే ఈ వారోత్సవాలు ఈసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నిర్వహిస్తామన్నారు. మూడు రాష్ట్రాల్లో మొత్తం 14 సెంటర్లలో వారోత్సవాలు నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ వారోత్సవాల్లో 2015-16 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలచిన విద్యార్థులు పాల్గొంటారు. వీరికి వ్యాసరచన, క్విజ్ తదితర పోటీలు నిర్వహించి విజేతలకు జిఎస్‌ఎల్‌వి అవార్డులను ప్రదానం చేస్తారు. ఇంతకు ముందు మన ఆంధ్రాకు చెందిన విద్యార్థులు మాత్రమే పాల్గొనే వారు. ఆంధ్ర నుండి తెలంగాణ విడిపోవడం, షార్‌కు పక్కనే తమిళనాడు ఉండటంతో ఈసారి మూడు రాష్ట్రాల్లో నిర్వహించేందుకు ఇస్రో ప్రత్యేక చొరవ తీసుకొంది.

పోలేరమ్మ హుండీ ఆదాయం రూ. 21.5 లక్షలు
వెంకటగిరి, సెప్టెంబర్ 23: వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన హుండీ, 100 రూపాయలు, 200 రూపాయల టికెట్ల ద్వారా 21,50,741 రూపాయల ఆదాయం వచ్చిందని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయంలో జాతర సందర్భంగా వచ్చిన హుండీలను, ప్రత్యేక టికెట్ల ద్వారా వచ్చిన డబ్బును లెక్కపెట్టారు. 200 రూపాయలు టికెట్ల ద్వారా 6,41,000 రూపాయలు, 100 రూపాయల టికెట్ల ద్వారా 5,67,900 రూపాయలు రాగా, హుండీ ద్వారా 9,44,841 రూపాయలు వచ్చినట్లు అధికారులు చెప్పారు. గత ఏడాది 11,81,699 రూపాయలు ఆదాయం వచ్చింది. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం 9,69,041 రూపాయలు అదనంగా రావడం విశేషం. ఈ హుండీ లెక్కింపులో మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతు శారద, ఆలయ చైర్మన్ తాండవ చంద్రారెడ్డి, నాయకులు కెవికె ప్రసాద్, దొంతు బాలకృష్ణ, కమిటీ సభ్యులు, సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఆంజనేయరెడ్డి, దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

మేయర్‌కు హైకోర్టు మొట్టికాయ
నెల్లూరుసిటీ, సెప్టెంబర్ 23: నగరపాలక సంస్థ పరిధిలో తనకు తెలియకుండా పనులు చేసిన, ఎస్టిమేషన్లు వేసిన, టెండర్లు పిలిచిన అధికారులను బెదిరిస్తూ మేయర్ పంపిన అర్జంట్ నోటీసుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, కార్పొరేటర్ బొబ్బలి శ్రీనివాసులు యాదవ్ అర్జంట్ నోటీసును వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మేయర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. అందుకు సంబంధించిన నకళ్లను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీమేయర్, కార్పొరేటర్లు శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ అందచేశారు. ఈసందర్భంగా డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్ మాట్లాడుతూ మేయర్‌కు ఎగ్జిక్యూటీవ్ అథారిటీలో జోక్యం చేసుకునే హక్కు లేదని చెప్పారు. అధికారులను భయభ్రాంతులకు గురి చేసేందుకు మేయర్ ఇలాంటి అర్జంట్ నోటీసులు పంపుతున్నారని తెలిపారు. పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు మేయర్‌కు తెలియకపోతే సీనియర్ అధికారులను అడిగి తెలుసుకుని నడుచుకుంటే మంచిదన్నారు. మేయర్, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. కార్పొరేషన్‌లో ఇక నుంచి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఏసిబి, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన డివిజన్‌లపై మేయర్ చిన్నచూపు చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రూప్‌కుమార్ యాదవ్, బొబ్బలి శ్రీనివాసులు యాదవ్, అశోక్, గోగుల నాగరాజు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగయ్య, వేలూరు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

కక్షిదారుల కేసుల పరిష్కారానికి కలిసి పనిచేద్దాం
* న్యాయవాదులకు జిల్లా జడ్జి పిలుపు
నెల్లూరు లీగల్, సెప్టెంబర్ 23: బయట ఏర్పడిన వివాదాల పరిష్కారానికి కోర్టులకు వస్తున్న కక్షిదారులకు సంబంధించిన కేసుల పరిష్కారానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి పనిచేసినప్పుడే వారికి సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా జడ్జి వౌలానా జునైద్ అహ్మద్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో నూతన బార్ కార్యవర్గ ప్రమాణస్వీకారణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమూర్తులు, న్యాయవాదులు పరస్పర సహకారంతో బాధిత కక్షిదారుల సమస్యల పరిష్కరించటానికి కృషి చేస్తామని చెప్పారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కూడా తనవంతు సహకారం అందిస్తానని ఆయన చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించి నూతన బార్ కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ పి ఫణిరత్నం, జనరల్ సెక్రటరీ రోజారెడ్డి, జాయింట్ సెక్రటరీ రమణారెడ్డి, ట్రెజరర్ సుభాని, లైబ్రెరి సెక్రటరీ ఆర్ శివశంకర్, మహిళా న్యాయవాద ప్రతినిధి రామలక్ష్మి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు చీరాల మస్తానయ్య, శంకరయ్యలతోపాటు తదితర జూనియర్ ఇసి మెంబర్లతో సీనియర్ న్యాయవాది జిల్లా న్యాయవాద ఫెడరేషన్ అధ్యక్షులు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన బార్ కార్యవర్గం అందరినీ కలుపుకొని ఆవేశాలు తగ్గించుకొని సామరస్యంగా న్యాయవాదుల పరిష్కారానికి కృషిచేయాలని బార్ కార్గవర్గానికి కోరారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి వౌలానా జునైద్ అహ్మద్‌ను బార్ కార్యవర్గ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే బార్ కార్యవర్గం సాధించిన ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ న్యాయవాది వేనాటి చంద్రశేఖర్‌రెడ్డిని కూడా బార్ కార్యవర్గం సన్మానించింది. తొలుత మహిళా న్యాయవాది వినయ ఆలపించిన శాస్ర్తియ సంగీతం న్యాయమూర్తులను, న్యాయవాదులను అలరించింది. ఈ కార్యక్రమాన్ని మాజీ సెక్రటరీ నావూరి శ్రీ్ధర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

అధికారుల ముందే వ్యక్తి ఆత్మహత్యా యత్నం
చిల్లకూరు, సెప్టెంబర్ 23: మండల కేంద్రమైన చిల్లకూరు పంచాయతీలో ఓ వ్యక్తి శుక్రవారం పొలం వివాదం విషయంలో రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిల్లకూరు పంచాయతీకి చెందిన చల్లా రవీంద్ర, కనయ్యలు మరో వర్గానికి చెందిన శిరీషారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిల మధ్య పొలం వివాదం చోటు చేసుకొంది. రాజకీయ ప్రాబల్యం కలిగిన శిరీషారెడ్డి అధికారులను లోబరుచుకొని ఇరిగేషన్ ప్లాన్ సైతం మార్చివేశాడని, ఆయనకు అధికారులు మమద్దతు తెలుపుతున్నారంటూ ఆగ్రహం చెందిన రవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అధికారులు చికిత్స నిమిత్తం అతడిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రామాయపట్నం పోర్టు మంజూరు చేయాలి
* ఆర్‌డిఓకు వామపక్షాల వినతి

కావలి, సెప్టెంబర్ 23: నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు రామాయపట్నం పోర్టు కావాలని డిమాండ్ చేస్తున్నారని, కాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణు విద్యుత్ ప్రాజెక్ట్ అంటూ సంకేతాలు ఇస్తున్నాయని తమ ప్రాంతంలో పోర్టును కచ్చితంగా మంజూరు చేయాలని వామపక్షాల నేతలు శుక్రవారం ఆర్‌డివో ఎంఎల్ నరసింహంకు విన్నవించారు. ఈ విషయమై సిపిఎం నాయకులు తాళ్లూరి మాల్యాద్రి, పెంచలయ్య, సిపిఐ నాయకులు డేగా సత్యనారాయణ, సిఐటియు మల్లికార్జునరావు, ఎస్‌ఎఫ్‌ఐ వెంకటేష్, పిడిఎస్‌యు భాస్కర్, కోటిరెడ్డి, ఎంకె రెడ్డి, చేవూరిచిన్నతో పాటు పలువురు ట్రంకురోడ్డుపై ప్రదర్శన నిర్వహించారు. ఆర్‌డివో కార్యాలయం వద్ద కొద్దిసేపు నినాదాలు చేశారు. అనంతరం చాంబర్‌లో ఆర్‌డిఓను కలిసి వినతి పత్రం అందించారు. పోర్టుకు అవసరమైన భూములు సేకరించకుండానే ప్రభుత్వానికి చెందినవి వేల ఎకరాలు రామాయపట్నం వద్ద వున్నాయని పోర్టు ఏర్పాటుకు అన్ని అనుకూలతలు వున్నాయని వివరించారు. ఏర్పాటు చేస్తే లక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. అయితే దీనిని పక్కనపెట్టి అణు విద్యుత్ ప్రాజెక్ట్ అంటూ ప్రకటలు చేస్తున్నాయని, దీనిని రెండు జిల్లాల ప్రజలు ఏమాత్రం అంగీకరించబోరని చెప్పారు. ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా పోర్టును మంజూరు చేయాలని ఒక్క క్షణంలో రెండు జిల్లాలను వల్లకాడు చేయగల అణువిద్యుత్ వద్దని కోరారు. స్పందించిన ఆర్‌డివో ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

శ్రీసిటిని సందర్శించిన ఆగ్రాట్రేడ్ సభ్యుల బృందం
తడ, సెప్టెంబరు 23: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో అంతర్జాతీయ ప్రమాణాలతో వెలసిన శ్రీసిటి సెజ్‌ను చెన్నైలోని ఆగ్రాట్రేడ్ సభ్యుల బృందం శుక్రవారం సందర్శించింది. ఆ సంస్థ అధ్యక్షుడు రాజేష్ అధ్యక్షతన విచ్చేసిన 34మంది సభ్యుల బృందానికి శ్రీసిటి ఎండి రవీంద్ర సన్నారెడ్డి, కార్పొరేట్ ఉపాధ్యక్షుడు రమేష్ ముందుగా స్వాగతం పలికి వ్యాపార అనుకూలంశాలను క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ తాము ఇప్పుడు శ్రీసిటిలో గృహసముదాయాలు, షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ సినిమాహాల్లు, ఆటవిడుపు కేంద్రాలు వివిధ సామాజిక వసతులకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సంబంధిత వ్యాపార రంగాల్లో ప్రముఖులైన ఆగ్రాట్రేడ్ వారు ఇక్కడ వసతులను చూచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగ్రాట్రేడ్ అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ ఇక్కడ వ్యాపార అనుకూలతను చూసేందుకు తమ బృందం వచ్చిందని, ఇక్కడ పర్యటించినంతరం తమకు అన్ని అనుకూలంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా శ్రీసిటిలో వ్యాపారానికి అన్ని హంగులు కలిగి ఉందన్నారు. అనంతరం వారు శ్రీసిటిలో ఉన్న పలు పరిశ్రమలను తిలకించారు. వారికి ఇక్కడ పరిశ్రమల అభివృద్ధి తదితర వాటిని ఎండి సన్నారెడ్డి క్షుణ్ణంగా వివరించారు.