ప్రకాశం

మున్సిపల్ ఎన్నికలకు పార్టీల కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 23:రాష్టవ్య్రాప్తంగా పాలకవర్గాలు లేని నగర, మునిసిపాలిటీలకు డిసెంబర్ లేదా జనవరి నెలలో ఎన్నికలు జరుగుతాయని తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు ఎన్ లోకేష్ పార్టీశ్రేణులకు సూచించటంతో జిల్లాలో పాలకవర్గాలు లేని ఒంగోలు నగర కార్పొరేషన్, కందుకూరు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈపాటికే పార్టీశ్రేణులకు రాష్టప్రార్టీ నుండి ఆదేశాలు రావటంతో ఒంగోలు నగరం, కందుకూరు మునిసిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కనుంది. డిసెంబర్ లేదా జనవరి నెలలో ఎన్నికలు జరిగితే ముందుగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ నేపధ్యంలో ఒంగోలు నగరం, కందుకూరు మునిసిపాలిటీల పరిధిలోని అధికార పక్షానికి చెందిన నేతలందరు ఇప్పటి నుండే ఆ పనిలో నిమగ్నం కానున్నారు. ఈపాటికే ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దామచర్ల మాత్రం నగరంలోని అన్ని డివిజన్లను పర్యటిస్తు ఎప్పటికప్పుడు అధికార గణాన్ని అప్రమత్తం చేస్తూ పనులు చేపడుతున్నారు. ప్రధానంగా మురికివాడలపై ఆయన ప్రత్యేక దృష్టిసారించారు. నగరంలోని అన్ని మురికివాడల్లోనూ పర్యటిస్తున్నారు. ఈపాటికే కోట్లాది రూపాయల వ్యయంతో డ్రైన్లు,రోడ్ల అభివృద్ధితోపాటు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించారు. ఇదిలా ఉండగా ఒంగోలు నగర మేయర్‌గా ఎస్‌సి మహిళా అభ్యర్థిని పోటీలోకి దించాల్సి ఉంది. ఇప్పటివరకు తెలుగుదేశంపార్టీ మేయర్ అభ్యర్థి పేరు తెరపైకి రాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మేయర్ అభ్యర్థి పేరును దామచర్ల ముఖ్యమంత్రి సూచనల మేరకు తెరపైకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అప్పటివరకు మేయర్ అభ్యర్థి పేరును గోప్యంగా ఉంచుతారా లేక ముందుగానే పార్టీ ప్రకటిస్తుందా అనే విషయం వేచిచూడాల్సి ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్న నేపధ్యంలో ఆ ప్రభావం నగర ఎన్నికలపై పడే అవకాశాలు ఉన్నాయి. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో 50డివిజన్లు ఉండగా తెలుగుదేశంపార్టీ తరపున 50డివిజన్లకు ప్రత్యేకంగా తెలుగుతమ్ముళ్లు రాష్ట్రంనుండి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఒంగోలు నగర కార్పొరేషన్‌పై తెలుగుదేశంపార్టీ జెండా బావుటా ఎగురవేయాలనే తలంపుతో దామచర్ల సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిఇలా ఉండగా వైకాపా తరపున కూడా మేయర్ అభ్యర్థి పేరు ఇంకా తెరపైకి రాలేదు. ఆర్థికంగా, సామాజికపరంగా బలోపేతమైన మహిళా నాయకురాలును బాలినేని రంగంలోకి దించే అవకాశాలున్నాయి. మొత్తంమీద ఒంగోలు నగర కార్పొరేషన్ ఎన్నికలను దామచర్ల, బాలినేని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగానే ఇద్దరు సుడిగాలి పర్యటన చేస్తున్నారు.
ఇదిలా ఉండగా కందుకూరు మునిసిపల్ ఎన్నికలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి పెద్దసవాల్‌గానే మారనున్నాయి. వైకాపా కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డిని రాష్టప్రార్టీ రంగంలోకి దించి ఉన్నట్లయితే పరిస్థితులు మెరుగ్గా ఉండేవన్న వాదన ఆ పార్టీ నేతల నుండి వినిపిస్తోంది. మానుగుంట అయితే గత కొన్ని సంవత్సరాలుగా శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న దృష్ట్యా అధికార తెలుగుదేశంపార్టీ నేతలకు ఎత్తులు పైఎత్తులు వేసే అవకాశాలున్నాయి. కానీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా తూమాటి మాధవరావును రాష్టప్రార్టీ నియమించటంతో ఈ ఎన్నికలను ఆయన ఏ మేరకు నెట్టుకువస్తారో ఆ దేవుడికే తెలియాల్సింది. ఇప్పటికైనా మానుగుంటను కందుకూరు బరిలోకి దించితేనే మునిసిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉండగా కందుకూరు మునిసిపల్ ఎన్నికలను శాసనసభ్యుడు పోతుల రామారావు, నియోజకవర్గ ఇన్‌చార్జి దివి శివరాం ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. ఈ ఎన్నికలు వారిద్దరికి ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. కాగా కందుకూరు మునిసిపల్ ఎన్నికలో ఎవరి గ్రూపు చేయకపోయినా పార్టీనష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. అందువలన ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తేనే అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్న వాదన పార్టీశ్రేణుల నుండి వినిపిస్తోంది. మొత్తంమీద త్వరలోనే ఒంగోలు నగరం, కందుకూరు మునిసిపాలిటీలకు ఎన్నికల నగరా మోగనుంది.

మనస్తాపంతో వివాహిత
బలవన్మరణం
పంగులూరు, సెప్టెంబర్ 23: మనస్తాపంతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జాగర్లమూడివారిపాలెంకె చెందిన ఆటోడ్రైవర్ టి నాగార్జునకు ఇంకొల్లు మండలం భీమవరానికి చెందిన విజయ అలియాస్ రిబ్కా(19)తో 9 నెలల క్రితం వివాహమైంది. నాగార్జున శుక్రవారం ఆటో బాడుగకు వెళ్లి ఇంటికి వచ్చాడు. భోజనం పెట్టమని అడగ్గా వండలేదని చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అతను బంధువుల ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చాడు. దీంతో భర్త తనను నిర్లక్ష్యం చేశాడనే బాధతో భర్త బయటకు వెళ్లిన తరువాత సాయంత్రం 3.30 గంటల సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 4 గంటల ప్రాంతంలో భర్త ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ భార్య కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రేణంగివరం ఎస్సై షమీముల్లా అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అక్కడ వరదలు... ఇక్కడ వెతలు
మార్కాపురంపై వరుణుడి చిన్నచూపు
మార్కాపురం, సెప్టెంబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని 13 జిల్లాలు అతలాకుతలం అవుతుంటే మార్కాపురం ప్రాంతంలో మాత్రం ప్రజలు భానుడి ప్రతాపానికి తల్లడిల్లిపోతున్నారు. జిల్లాకు తూర్పుగా ఉన్న గుంటూరు, పశ్చిమంగా ఉన్న కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటే మార్కాపురం డివిజన్‌లో మాత్రం వర్ష ప్రభావం లేకపోవడం విశేషం. ఉన్నప్పటికీ ఏదో తుంపర జల్లులు పడి ఈ ప్రాంతంలో కూడా వర్షం కురిసిందనిపించడం ఆనవాయితీగా మారింది. మిగిలిన జిల్లాల్లో వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జల కళతో ఉంటే మార్కాపురం ప్రాంతంలో మాత్రం ఒక్క చెరువులో కూడా నీరు లేదు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కాపురం పట్టణంలో కూడా ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరాను కొనసాగిస్తున్నారు. గిద్దలూరు ప్రాంతంలో నల్లమల అటవీప్రాంతంలో వర్షాలు పడటంతో గుండ్లకమ్మ, సగిలేరు లాంటి నదుల ద్వారా కంభం చెరువుకు నీరు చేరాయే తప్పా ఈ వర్షప్రభావంతో కంభం చెరువుకు నీరు రాలేదు. ఆ ప్రాంతంలో వర్షాలతో జనం అతలాకుతలం అవుతుంటే ఇక్కడ మాత్రం సూర్యభగవానుడి ప్రతాపంతో ప్రజలు తల్లడిల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రాణం తీసిన గురక
బావను హతమార్చిన బావమరిది
పామూరు, సెప్టెంబర్ 23: గురక పెడుతున్నాడన్న కోపంతో సొంత బావను బావమరిది హతమార్చిన సంఘటన మండలంలోని దూబగుంట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వరికుంటపాడు మండలం కృష్ణంరాజుపల్లి గ్రామానికి చెందిన రాచపూడి ప్రసాద్(40) గత 8 సంవత్సరాలుగా బావమరిది ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గురువారం అర్ధరాత్రి ప్రసాద్ ఇంటి బయట నిద్రిస్తుండగా గురక పెడుతున్నాడనే కోపంతో ప్రసాద్ బావమరిది మతిస్థిమితం లేని సూరిపోగు సుధాకర్ కర్రతో బావ తలపై గట్టిగా కొట్టడంతో ప్రసాద్ అక్కడక్కడే మరణించాడు. మృతుడు ప్రసాద్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య నాగమ్మ ఫిర్యాదు మేరకు సిఐ రాజేశ్వరరావు, ఎస్సై సాంబశివయ్య సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

పసికందును వదిలేసిన తల్లి
పొదిలి, సెప్టెంబర్ 23 : మాతృత్వానికి మచ్చ తెచ్చింది ఓ కసాయి తల్లి. సభ్య సమాజానికి తాను చేసిన పాపం తెలుసిపోతుందనో లేదో కాని తాను ఆ బిడ్డను సంరక్షించుకోలేనేమో అని అనుకుందోమో కాని కన్న పేగు బంధాన్ని దారుణంగా తెంచుకుని కళ్లు కూడా తెరవని పసికందును వదిలి వెళ్లింది. సభ్య సమాజానికి మచ్చ తెచ్చే విధంగా ఉన్న ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం పొదిలి పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక శివాలయం వద్ద పసికందు ఏడ్పు వినిపిస్తుండటంతో గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికివెళ్ళి చూడటంతో 20 రోజుల్లోపు పుట్టిన పసికందు కనిపించింది. పసికందును అక్కున చేర్చుకున్న చుట్టుపక్కల వారు స్ర్తి శిశు సంక్షేమ శాఖ వారికి సమాచారాన్ని అందించారు. దీంతో సిడిపివో ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కార్యకర్త సత్యనాగమణి అక్కడికి వచ్చి పసికందును తీసుకెళ్లారు. శనివారం ఒంగోలులోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి ఆ పసికందును అప్పగిస్తున్నట్లు సిడిపివో తెలిపారు. ఏది ఏమైనా ఈ సంఘటన పొదిలి పట్టణంలోని పలువురి హృదయాలను కలిచి వేసింది.
హుండీ పగలగొట్టి నగదు చోరీ
మేదరమెట్ల,సెప్టెంబర్ 23:దేవుని హుండీని దొంగిలించి ఎత్తుకెళ్లి ఆపై పగలకొట్టి అందులో భక్తుల కానుకలు దొంగిలించిన సంఘటన మేదరమెట్ల పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే బొడ్డువానిపాలెం గ్రామంలోని పురాతన కోదండరామస్వామి ఆలయాన్ని గత ఏప్రిల్ నెలలో పునరుద్ధరించి గ్రామస్థులు విగ్రహప్రతిష్ఠ చేశారు. ఇటీవలే ఆనాటి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న పక్కగ్రామానికి చెందిన ఒక భక్తుడు తాను అనుకున్న కార్యం జరగటంతో 10వేల 116రూపాయల నగదును హుండీలో కానుకగా సమర్పించాడు. ఆ నగదుతోపాటు కొద్ది నెలలుగా భక్తులు సమర్పించిన కానుకలు కూడా హుండిలో ఉన్నాయి. ఈ పరిస్థితిని గమనించిన దుండగలు గురువారం అర్థరాత్రి దాటిన సమయంలో గడ్డపలుగుతో గుడికి అమర్పిన గ్రిల్స్‌తాళాలను నైపుణ్యంగా తొలగించి ఆలయంలోకి ప్రవేశించి హుండీని దొంగిలించారు. ఆ హుండీని సమీపంలోని చెరువుకట్టపై ఉన్న అంకమ్మ తల్లి వేపచెట్టు సమీపంలో ఆ హుండీ తాళాలను తొలగించి అందులో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదును దొంగిలించారు. తెల్లవారిన తరువాత గ్రామస్థులు గుడిలో దొంగతనం జరిగిన విషయాన్ని గమనించి మేదరమెట్ల ఎస్‌ఐ పాండురంగారావుకు సమాచారాన్ని అందించగా ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని ఒంగోలు క్లూస్‌టీంకు సమాచారం అందించారు. క్లూస్ టీం బాధ్యుడు జడ్‌రాజు తన సిబ్బందితో గ్రామానికి వచ్చి పగలకొట్టిన హుండిపైన,దేవాలయాల వద్ద ఉన్న వేలుముద్రాలను సేకరించి దర్యాప్తుచేస్తున్నారు.
కొత్తపట్నం తహశీల్దార్ సస్పెండ్

ఒంగోలు,సెప్టెంబర్ 23:కొత్తపట్నం తహశీల్దార్ కె రవిబాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు ఒంగోలు ఆర్‌డిఒ కె శ్రీనివాసరావు ఆంధ్రభూమిప్రతినిధికి శుక్రవారం తెలిపారు. కొత్తపట్నం తహశీల్దార్ రవిబాబు నిబంధనలకు విరుద్ధంగా భూములను ఆన్‌లైన్ చేసిన ఆరోపణలపై కొంతకాలంగా విధులకు దూరంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో కలెక్టర్ సుజాతశర్మ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. దీంతో రెవిన్యూవర్గాల్లో కలకలం మొదలైంది.