కృష్ణ

రోజుకో మలుపు తిరుగుతున్న దాసం సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 10: రాష్ట్ర విభజన చట్టం సమయంలోను ఆపై ఎన్నికల ప్రచారంలోను ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా జపం చేసి ఆ విషయంలో ఘోర వైఫల్యం చెందారంటూ విపక్షాల దాడులను ఏదో విధంగా తిప్పికొడుతూ నెట్టుకువస్తోన్న కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడుకు ప్రస్తుతం రాష్ట్ర రాజధాని విజయవాడ నగరంలో రగులుతున్న ఇంటిపోరు అంతకుమించి శిరోభారంగా మారుతోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు సస్పెండ్ కావటం ఆపై చోటు చేసుకుంటున్న పరిణామాలు బిజెపిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆశ్చర్యకరమేమిటంటే నగర కార్యవర్గంతో పాటు పార్టీ అనుబంధ సంస్థలన్నీ డాక్టర్ దాసం వెనుక నిలబడటం పార్టీ అధిష్టానాన్ని అయోమయానికి గురిచేస్తోంది. తొలుత నగర కార్యవర్గం సమావేశమై ఆ సస్పెన్షన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంటనే ఉపసంహరించుకోవాలని తీర్మానం చేయటమే గాక ఆ తీర్మానం కాపీని నేరుగా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకి పంపించడం జరిగింది. ఆ తర్వాత యువమోర్చా అధ్యక్షుడు చిన్నపరెడ్డి రవీంద్రరెడ్డి, ఎస్‌సి మోర్చా అధ్యక్షుడు వై.శ్రీనివాస్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఇంతియాజ్ తాజాగా సోమవారం ఒబిసి విభాగం ప్రధాన కార్యదర్శి గురునాయుడు, గిరిజన మోర్చా అధ్యక్షుడు కావడి వెంకట కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆయా కమిటీల కార్యవర్గాలు అత్యవసర సమావేశమై డాక్టర్ దాసం సస్పెన్షన్‌ను మూకుమ్మడిగా ముక్తకంఠంతో ఖండించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం విజయవాడ నగరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఈ నెల 15న విశాఖపట్టణంలో జరిగే కీలకమైన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చకు రానున్నట్టు తెలిసింది. ఈ కమిటీలో రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుతో పాటు మరో ఎంపి గంగరాజు, ఇద్దరు మంత్రులతో సహా నల్గురు శాసనసభ్యులు, ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మాజీ మంత్రులు దగ్గుబాటి పురంధ్రీశ్వరి, కావూరి సాంబశివరావు, రాష్ట్ర మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హాజరుకాబోతున్నారు. ఇదిలా ఉంటే డాక్టర్ దాసం తాజాగా పార్టీ బైలాను తెరపైకి తెచ్చారు. నిబంధనల ప్రకారం జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు మినహా ఏ ఒక్కరితో తమ ఇష్టానుసారం వ్యవహరించే వీలు లేదంటున్నారు. ముందుగా షోకాజ్ నోటీస్ జారీచేయకుండా ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ తనకు సస్పెన్షన్ నోటీస్‌ను జారీ చేశారంటున్నారు. దీన్ని తాను ప్రశ్నించటంతో క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఆర్.లక్ష్మీపతి షోకాజ్ నోటీస్ జారీ చేశారన్నారు.

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ శిక్షణ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 10: స్థానిక బావాజీపేటలోని నవజీవన్ బాలభవన్‌లో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గత రెండు రోజులుగా నవజీవన్ బాలభవన్ బాలుర వసతి గృహ విద్యార్థులకు నవజీవన్ బాలభవన్ ఎడ్యుకేషన్ డైరక్టర్ రెవరెండ్ ఫాదర్ వై.ప్రదీప్ ఆధ్వర్యంలో ‘వ్యక్తిత్వ వికాసం-వ్యక్తిత్వ సామర్ధ్యం’ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా నవజీవన్ బాలభవన్ ఎడ్యుకేషన్ డైరక్టర్ రెవరెండ్ ఫాదర్ వై.ప్రదీప్ మాట్లాడుతూ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గత రెండు రోజులుగా బాలుర వసతి గృహ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం-వ్యక్తిత్వ సామర్ధ్యం అనే శిక్షణా కార్యక్రమంలో నిర్ణయాలను తీసుకోవడం, బంధుత్వాలు, విలువలు, పిల్లల ప్రవర్తనలో మార్పులు, సమాజంలో మంచి వ్యక్తిగా ఎదగటం, ఇలా వివిధ అంశాలతో కూడిన శిక్షణని పాటలు, ఆఠలు మరియు నాటక రూపంలో ఏర్పాటుచేయటం జరిగిందన్నారు. ఈ రెండురోజుల శిక్షణా కార్యక్రమంలో పిల్లలు చాలా చురుకుగా పాల్గొన్నారని పిల్లల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందించటం జరిగిందన్నారు. వ్యక్తిత్వ వికాసం-వ్యక్తిత్వ సామర్ధ్యం శిక్షణా కార్యక్రమాన్ని సిహెచ్ ప్రసన్న, ఎం.అన్నమణి, జ్యోతి అంజలి వారు చాలా బాగా పిల్లలకు అర్ధమయ్యే విధంగా నిర్వహించారని ఈ చిన్న వయసు నుండే వారికి అందించడం ద్వారా మానసికంగా శక్తివంతులుగా తయారవుతారని అన్నారు. ఈ రోజుల్లో చాలా చిన్న చిన్న సమస్యలకే తట్టుకోలేకపోతున్నారని మనిషి చూడటానికి బలంగా వున్నా మానసికంగా దృఢంగా వుండలేకపోవటం మనం నిత్యం వింటున్నామని అన్నారు. ఆలోచనలు, ఆచరణలూ అన్నీ మెదడుపైనే ఆధారపడి వుంటాయి. ఈ కార్యక్రమంలో నవజీవన్ కో ఆర్డినేటర్ జి.శేఖర్‌బాబు, కేర్ మదర్స్ మేరీ, రోజ్‌లీన్, వాణి, రాజకుమారి, బాలలు, సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారం
అంబాశాంభవి చంద్రవౌళి రబాల పర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ, కాత్యాయనీ, భైరవీ,
సావిత్రీ నవయవ్వనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీ ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 10: శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అలంకరిస్తారు. రాజరాజేశ్వరీదేవి సింహావాహనంపై అసీనురాలై ఉంటుంది. షోడశ మహామంత్ర స్వరూపిణీ, మహాత్రిపుర సుందరీదేవి, శ్రీ చక్ర అధిష్ఠానదేవత శ్రీ రాజరాజేశ్వరీదేవి. విజయదశమి అపరాజితాదేవి పేరుమీద ఏర్పడింది. విజయాన్ని సాధించింది. కాబట్టి విజయ అని అంటారు. శ్రీ చక్ర అధిష్ఠాన దేవత శ్రీలలితాదేవి రాజరాజేశ్వరీదేవి. పరమశాంతి స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరకుగడ చేతిలో పట్టుకొని దర్శనమిస్తుంది. మణి ద్వీపంలో శ్రీపురంలోని చింతామణి గృహమద్యస్థం ఆమె నివాసం సువర్ణ సింహాసనంమీద ఉంటుందని ప్రతీతి. విజయాదేవి చెడుపై సాధించిన విజయమే విజయదశమి అయింది.

ఎఆర్ పోలీసు కార్యాలయంలో ఆయుధపూజ
విజయవాడ (క్రైం), అక్టోబర్ 10: దేవీ నవరాత్రుల్లో భాగంగా సోమవారం మహార్నవమి సందర్భంగా బందరురోడ్డులోని ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు కార్యాలయంలో ఆయుధపూజ జరిగింది. పోలీసుశాఖకు సెంటిమెంటు ఆనవాయితీగా వస్తున్నందున ఈ ఏడాది దసరా ఉత్సవాలు కమిషనరేట్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు ముగింపు సందర్భంగా నిర్వహించే ఆయుధపూజ నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ ఏఆర్ ఆఫీసులో ఘనంగా చేశారు. అత్యంత భక్తి భావంతో పూజలు నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో సీపితోపాటు డిసిపి అడ్మిన్ జివిజి అశోక్‌కుమార్, ఆర్మ్‌డ్ రిజర్వు ఏసిపి కోటేశ్వరరావు, రిజర్వు ఆర్‌ఐలు అజ్మతుల్లా, రామకృష్ణ, విజయవాడ పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు సోమయ్య, అసోసియేషన్ సభ్యులు వి గోపి ఇతర అధికారులు పాల్గొన్నారు.

‘మిషన్ 45 ప్రాజెక్ట్’ వేగవంతం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 10: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటుగా రాబోతున్న పర్యాటక సీజన్‌కు రాష్ట్రం సిద్ధంగా వుండేటట్లు చేయడానికి ఆంధ్రప్రదేశ్ టూరిజం మూడు రోజుల సమావేశాన్ని టూరిజంకు చెందిన రీజనల్ డైరక్టర్లు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులతో విజయవాడలో నిర్వహించింది. ఈ సమావేశానికి టూరిజం అండ్ కల్చర్ డాక్టర్ శ్రీకాంత్ నాగులపల్లి అధ్యక్షత వహించగా డాక్టర్ ఆర్‌పి ఖజూరియా, కమిషనర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం ఎం.గిరిజాశంకర్, ఐఎఎస్, మేనేజింగ్ డైరక్టర్, ఏపి టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ పాల్గొన్నారు.
రాబోతున్న పర్యాటక సీజన్ డిమాండ్‌కు తగినట్టుగా పూర్తిస్థాయిలో సిద్ధం కావాల్సిన ఆవశ్యకతను గుర్తించడంతో పాటుగా ఏపిటిడిసి ప్రోపర్టీలు, వాటర్ స్పోర్ట్స్ సదుపాయాలు, హౌస్ బోట్లు మొదలైనవి పూర్తి స్థాయిలో పనిచేసేలా సిద్ధం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.