ఆంధ్రప్రదేశ్‌

చత్తీస్‌గఢ్‌లో ఆర్‌కె?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 28: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్‌కె జీవించి ఉన్నాడా? మరణించాడా? గాయాలతో తప్పించుకున్నాడా? ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానం లేదు. పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రజా సంఘాల నాయకులు, తమ వద్ద లేడని పోలీసు ఉన్నతాధికారులు చెపుతున్నారు. అయితే, ఆర్‌కె మరణించాడంటూ మావోయిస్టు పార్టీ నాయకుడు ఒకరు శుక్రవారం ధ్రువీకరించాడు. ఈ వార్త పోలీసు సృష్టి అని ఏపిసిఎల్‌సి నాయకులు అంటున్నారు. మావోయిస్టుల పేరిట బుధవారం విడుదలైన లేఖ కూడా ప్రభుత్వ సృష్టేనని వారు ఆరోపించారు. ఇవన్నీ పక్కన పెడితే, ఆర్‌కె ఉనికే ఇప్పుడు చర్చనీయాంశమైంది. బెజ్జంగి ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు ఆర్‌కె అక్కడ లేడని కొంతమంది చెపుతుంటే, వ్యూహాత్మకంగా తప్పించుకున్నాడని ఇంకో కథనం వినిపిస్తోంది. ఆయన ఖాయంగా తప్పించుకుని సురక్షితంగా ఉన్నాడని ప్రజా సంఘాల నాయకులు చెపుతున్నారు. ఆర్‌కె ఏదైనా సమావేశానికి హాజరైతే మూడంచెల భద్రత ఉంటుంది. అదే ఆయన అటవీ ప్రాంతాల్లో సంచరించినప్పుడు, ఒక దగ్గర నుంచి మరో దగ్గరకు వెళ్లినప్పుడు సాయుధ బలగాలు ఆయనను కంటికి రెప్పలా కాపాడుతుంటాయి. ముందు ఆరుగురు సాయుధ సిబ్బంది సాగుతారు. ఆ తరువాత ఆర్‌కె ఉంటారు. ఆయన చుట్టూ నలుగురు, లేదా ఆరుగురు గన్‌మెన్‌లు ఉంటారు. ఆయన వెనుక కొంత దూరంలో సాయుధ సిబ్బంది రక్షణగా ఉంటారు. బెజ్జంగి ఎన్‌కౌంటర్ నుంచి ఆ సాయుధ సిబ్బందే ఆర్‌కెను సురక్షితంగా తప్పించారని వారు భావిస్తున్నారు.
ఆర్‌కె చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికి వెళ్లిపోయి ఉంటారని చెపుతున్నారు. ఈ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం నడుస్తోంది. సాధారణ పౌరులు, పోలీసులు ఈ ప్రదేశంలోకి ప్రవేశించలేరని చెపుతున్నారు. మిలటరీ బలగాలు కూడా లోనికి వెళ్లలేనంత దట్టమైన దండకారణ్య ప్రదేశమని చెపుతున్నారు. పూర్తిగా గిరిజన బలంతో మావోయిస్టులు ఇక్కడ సురక్షితంగా ఉంటారని తెలుస్తోంది. ఇప్పుడు ఆర్‌కె ఈ ప్రదేశంలో ఉంటారని అంతా భావిస్తున్నారు.
ఏఓబిలోకి కొత్త బలగాలు!
ఏఓబినుంచి పోలీసు బలగాలను వెనక్కి రప్పిస్తున్నామని డిజిపి తెలిపారు. అయితే, గత కొన్ని నెలలుగా ఏఓబిలో కూంబింగ్ నిర్వహించిన గ్రేహౌండ్స్ బలగాలు ఇప్పుడు వెనుదిరుగుతున్నట్టు తెలుస్తోంది. వీరి స్థానే మరికొన్ని గ్రేహౌండ్స్ బలగాలను ఏఓబిలోకి పంపుతున్నట్టు తెలిసింది.

ఆర్‌కెనూ హతమార్చారు
లొంగిపోతామని చెప్పిన ఆరుగురినీ కాల్చి చంపారు
మావోయిస్టు మల్కన్‌గిరి డివిజన్ కార్యదర్శి వేణు వెల్లడి

పాడేరు, అక్టోబర్ 28: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్‌కె) మృతి చెందారని మావోయిస్టు పార్టీ మల్కన్‌గిరి డివిజన్ కార్యదర్శి ప్రతాప్ (వేణు) శుక్రవారం ఇక్కడ ప్రకటించారు. ఎఒబి ప్రాంతమైన బెజ్జంగి అటవీ ప్రాంతంలో ఈ నెల 24న పోలీసులు సాగించిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో ఆర్‌కె, తనయుడు మున్నాతో పాటు మరణించారని ప్రతాప్ వెల్లడించారు. ముంచంగిపుట్టులోని కొంతమంది విలేఖరులతో శుక్రవారం ఆయన టెలిఫోన్‌లో మాట్లాడుతూ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో తాను కూడా ఉన్నానని, అయితే అదృష్టవశాత్తు తప్పించుకుని బయటపడినట్టు చెప్పారు. పోలీసులు ఆకస్మికంగా, విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో తమ పార్టీకి చెందిన అనేక మంది మృతి చెందారని, ఇందులో ఆర్‌కె కూడా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. అయితే పోలీసులు ఆర్‌కె మృతదేహాన్ని దాచిపెట్టి ఆయన కుమారుడు మున్నా మృతదేహాన్ని మాత్రం చూపించారని ప్రతాప్ చెప్పారు. ఆర్‌కె కుటుంబ సభ్యులను, ప్రజా సంఘాల వారిని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసులు వ్యవహరిస్తూ ఆర్‌కె మృతి చెందిన విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో గాయపడిన ఆరుగురు మావోయిస్టులు తాము లొంగిపోతామని ఎంతగా ప్రాధేయపడినా పోలీసులు పట్టించుకోకుండా కాల్చి చంపారని ఆయన చెప్పారు. గాయాలతో తప్పించుకునేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు పట్టుకుని హత్య చేశారని ఆయన ఆరోపించారు. మిలీషియా సభ్యురాలైన రుప్తి అనే యువతిని పోలీసులు కాల్చి చంపి మావోయిస్టుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామానికి చెందిన గాసిరాం అనే మావోయిస్టు సభ్యుడిని హత్య చేసిన పోలీసులు ఆయనను తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సునీల్‌గా చెబుతున్నారని ఆరోపించారు. అటవీ ప్రాంతానికి కట్టెల కోసం వచ్చిన సాధారణ పౌరులపై కూడా పోలీసులు కాల్పులు జరిపి వారిని కూడా బలితీసుకున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు సాగించిన అమానుష మారణకాండకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వేణు పేర్కొన్నారు.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ
సభ్యుడు అక్కిరాజు హరగోపాల్
అలియాస్ ఆర్‌కె (ఫైల్‌ఫొటో)

ప్రతీకారం తీర్చుకుంటాం!

ఎన్‌కౌంటర్ కారకులను శిక్షిస్తాం

ఏకపక్ష కాల్పులతో హతమార్చారు
అటవీ సంపదను దోచుకునే కుట్ర
ఆడియో టేప్‌లో మావోయిస్టు
ఈస్ట్ డివిజన్ కార్యదర్శి చలపతి

పాడేరు, అక్టోబర్ 28: ఎఒబిలోని రామగుండం అటవీ ప్రాంతంలో ఈ నెల 24న జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి చలపతి (కైలాసం) హెచ్చరించారు. శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ఆడియో టేప్‌లో ఆయన మాట్లాడుతూ విద్రోహుల మూలంగా ఈ సంఘటన చోటుచేసుకుందని, పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపి హత్యలు చేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌కు కారకులైన వారిని శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. పోలీసులు సాగించిన బూటకపు ఎన్‌కౌంటర్‌ను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, నవీన్ పట్నాయక్ బూటకపు ఎన్‌కౌంటర్‌కు కారకులని ఆయన ఆరోపించారు. ఆదివాసీ ప్రాంతంలో ఉన్న బాక్సైట్, అటవీ సంపదను దోచుకునే చర్యల్లో భాగంగా ప్రజలకు నాయకత్వం వహిస్తున్న తమ పార్టీని నిర్మూలించి సామాజ్య్రవాదులకు సంపదను అప్పగించేందుకే మావోయిస్టు పార్టీని లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు.
అయితే ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. బూటకపు ఎన్‌కౌంటర్‌లో తమ పార్టీకి చెందిన 30 మందిని హత్య చేసినంత మాత్రాన విప్లవం ఆగదని, సమస్య ఉన్నంత వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. తమ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తుండగా ఎదురుకాల్పుల సంఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు చెప్పడం అవాస్తవమని, ప్లీనరీ అనేది వారు సృష్టించిందేనని ఆయన చెప్పారు.
ఎదురు కాల్పులే జరిగితే అంతమంది మావోయిస్టులు మృతి చెందే అవకాశం లేదని, ఎంతమంది పోలీసులు వచ్చినా వారిని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా తమ పార్టీ నాయకత్వానికి ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ (ఆర్‌కె) ఎన్‌కౌంటర్‌లో అమరులు కాలేదని, అయితే పోలీసులు ఆయనను పట్టుకుని తమ ఆధీనంలో ఉంచుకున్నారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన మరో అగ్ర నేత గాజర్ల రవి (ఉదయ్) కూడా అమరులు కాలేదని, అయితే ఘటన జరిగిన సమయంలో తాను లేనని ఆయన తెలిపారు.