తెలంగాణ

మార్కెట్ యార్డుల్లో పెద్ద నోట్ల రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 18: పెద్దనోట్ల రద్దు వ్యవహారం రైతులకు, వ్యాపారులకు పెద్ద సమస్యగా మారింది. సుమారు 10రోజులుగా రైతులు తీసుకువచ్చిన వివిధ ఉత్పత్తులకు డబ్బులు చెల్లించలేక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ మార్కెట్ యార్డులలో లావాదేవీలు నిర్వహించే వ్యాపారుల చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో సకాలంలో డబ్బులు అందక రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు రెండులక్షల హెక్టార్లలో పత్తిపంట, 1.30 లక్షల హెక్టార్లలో వరిపంట సాగవుతుండగా 50వేల హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగవుతోంది. ప్రస్తుతం వరిపంట ఇప్పుడిపుడే నూర్పిళ్లు జరుగుతుండగా పత్తి, మొక్కజొన్న ఉత్పత్తులు భారీగా మార్కెట్లకు అమ్మకాలకు వస్తున్నాయి. అర్బన్ జిల్లాలోని ఎనుమాముల, మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మార్కెట్ యార్డులకు రైతులు పత్తి, మొక్కజొన్న పంటను భారీగా తీసుకువస్తున్నారు. వరంగల్ అర్బన్, రూరల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలలోని ఇతర మార్కెట్లకు కూడా ఈ పంటల కొనుగోళ్లు బాగానే జరుగుతాయి. ఈ సీజన్‌లో పత్తిపంట మద్దతుధర బాగానే ఉందంటూ, మొక్కజొన్నకు కూడా మంచిధర లభిస్తుందని రైతులు బావిస్తున్న తరుణంలోనే 500, వేయినోట్ల రద్దు కావటం రైతుల పాలిట శాపంగా మారింది. వాస్తవానికి రైతుల నుంచి పంట కొనుగోలు చేసిన రెండురోజుల్లో డబ్బు చెల్లింపులు జరపాలని ఇటు జిల్లాయంత్రాంగం, అటు మార్కెట్ కమిటీ పాలకవర్గం వ్యాపారులకు గతంలోనే ఆదేశాలు జారీ చేసారు. కానీ డబ్బు అందుబాటును దృష్టిలో పెట్టుకుని వారం నుంచి నెలరోజుల్లో రైతులకు డబ్బు చెల్లింపులు జరపటం వివిధ మార్కెట్లలో ఆనవాయతీగా కొనసాగుతోంది. కానీ తాజాగా పెద్దనోట్ల రద్దు కారణంగా నెలరోజులకు కూడా రైతులకు వ్యాపారులు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
అప్పులు చేసి పంటలు పండిస్తే సకాలంలో డబ్బులు చేతికి అందకపోవటాన్ని రైతులు జీర్ణించుకోలేకపోయారు. ఏనుమాముల మార్కెట్‌తోపాటు మరికొన్ని మార్కెట్లలో డబ్బుల చెల్లింపుల కోసం రైతులు ఆందోళనలు కూడా చేపట్టారు. దాంతో వ్యాపారులు ఏమీ చేయలేని స్థితిలో పండుగలు, పబ్బాలు అంటూ ఈ మధ్యకాలంలో రెండుపర్యాయాలు మార్కెట్లకు అధికారిక సెలవులు ప్రకటింపచేసి కొనుగోళ్లు నిలిపివేసారు. పెద్దనోట్ల మార్పిడి, ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసేందుకు కేంద్రప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల కారణంగా పెద్దమొత్తంలో డబ్బులు డ్రా చేసేందుకు అవకాశం లేకపోవటంతో రైతులకు డబ్బు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. గడచిన పదిరోజుల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు కోట్లాది రూపాయలు చెల్లించవలసి ఉందని, కానీ బ్యాంకుల నుంచి వేల రూపాయలు కూడా అందని పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. తమ సమస్యను జిల్లా యంత్రాంగాల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో విడతల వారీగా డబ్బులు తీసుకునేందుకు ఇష్టపడితేనే పత్తి, మొక్కజొన్న తదితర ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని వ్యాపారులు రైతులకు ఖచ్చితంగా చెబుతున్నారు. ఆ డబ్బు కూడా రైతుల ఖాతాల్లో చెక్కుల రూపేణా జమ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా ఆరుగాలం కష్టించి పండించిన పంటలను మార్కెట్లలో విక్రయించినా సకాలంలో డబ్బులు అందని పరిస్థితి ఏర్పడటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అప్పులు తెచ్చి పంటలు పండించామని, మార్కెట్‌లో తమ పంటలు విక్రయించామని తెలిసి అప్పులు ఇచ్చిన వ్యక్తులు డబ్బు తిరిగి చెల్లింపుల కోసం తమపై ఒత్తిడి తెస్తున్నారని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు చెక్కులు ఇచ్చేది ఎన్నడు.. వాటిని తమ ఖాతాల్లో నుంచి తీసుకునేది ఎన్నడని రైతులు ప్రశ్నిస్తున్నారు.

చిత్రం.. ఎనుమాముల మార్కెట్‌లో అమ్మకానికి వచ్చిన మొక్కజొన్న పంట