ఆంధ్రప్రదేశ్‌

బాబు సర్కారుతో కాంట్రాక్టర్లకే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 7: ‘చూస్తూ చూస్తూనే మూడేళ్లు పూర్తవుతున్నాయి. కళ్లు మూసుకుంటే మరో రెండేళ్లు గడిచిపోతాయి.. అప్పుడు అధికారం మనదే.. ఓపిక పట్టండి.. చంద్రబాబు చేయని పనులన్నీ మనం అధికారంలోకొచ్చిన తర్వాత పూర్తి చేసుకోవచ్చు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన వారికి ఎకరానికి సగటున రూ.19 లక్షల వంతున పరిహారం చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జగన్ బుధవారం పర్యటించారు. ఈసందర్భంగా రంపచోడవరంలో పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన దేవీపట్నం మండలానికి చెందిన బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటానని, చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని ఈసందర్భంగా జగన్ వారికి హామీయిచ్చారు. పోలవరం నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాల్సిందేనని డిమాండ్‌చేశారు.
అవార్డు ఎంక్వైరీ జరిగేటపుడే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని, కొత్త ఆర్ అండ్ ఆర్ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ కొత్త చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, పట్టిసీమ మాదిరిగానే పోలవరం బాధితులకూ నష్టపరిహారం ఇవ్వాలని బాధితుల తరపున డిమాండ్ చేస్తున్నామని స్పష్టంచేశారు. మూడేళ్లుగా చందబ్రాబునాయుడు పరిపాలనలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి వచ్చానన్నారు. పోలవరం ప్రాజెక్టును స్వాగతిస్తున్నామని, అయితే ప్రాజెక్టు కోసం త్యాగాలు చేస్తున్న గిరిజనులకు కచ్చితంగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు నత్తనడకన నడుస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్టర్లకు మేలుచేయాలనే ధ్యాస తప్ప గిరిజనులకు న్యాయం చేయాలనే ఆలోచనే ముఖ్యమంత్రికి లేదన్నారు. ఈసందర్భంగా పలువురు నిర్వాసితులు జగన్‌తో మాట్లాడుతూ భూమికి భూమి ఇవ్వలేదని, ఇచ్చిన పరిహారంతో ఎక్కడా పది సెంట్ల భూమి కూడా కొనుక్కోలేని దుస్థితి ఉందని వాపోయారు. తన అత్తారి భూముల్లా ప్రజల నుండి లాక్కుంటున్నారని జగన్ ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. పోలవరం నిర్వాసితుల్లో నవ్వు వెల్లి విరిసేంత వరకు అండగావుండి పోరాటం సాగిస్తానన్నారు.
ఆదివాసీల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది చాలా అమానుషమని జగన్ వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవలి కాలంలో పౌష్టికాహర లోపంతో చోటుచేసుకున్న మృతిచెందిన 15 మంది నవజాత శిశువుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం మానవీయంగా ఆలోచించాలని డిమాండ్‌చేశారు. ఏజెన్సీలో ఎక్కడా పూర్తి స్థాయిలో వైద్యం అందడంలేదన్నారు.
ఆదివాసీల వైద్య సదుపాయాల కోసం నిధులను సక్రమంగా విడుదల చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని, ఇప్పటి వరకు రూ.13 వందల కోట్లు విడుదల కావాల్సి వుండగా ఇటీవల రూ.565 కోట్లు మాత్రమే విడుదలయ్యాయన్నారు. కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద ధర్నా చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల నిరసన శిబిరాన్ని సందర్శించిన జగన్ వారికి సంఘీభావం తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో కాంట్రాక్టు లెక్చరర్లందరినీ పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ వెంట వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి దేవి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, జడ్పీ మాజీ ఛైర్మన్ వేణు, నాయకులు చెలమలశెట్టి సునీల్, మిండుగుదిటి మోహన్, అనంత ఉదయభాస్కర్ తదితరులున్నారు.