ఆంధ్రప్రదేశ్‌

కమలంలో ‘పీఛేముడ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 13: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కేంద్ర నాయకత్వం ఆశిస్తుంటే కొత్తవారిని విజయవంతంగా బయటకు పంపించడంలో రాష్ట్ర పార్టీ సీనియర్లు బిజీగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తవారు చేరకుండా, చేరిన వారిని వారంతట వారే వెళ్లిపోయేలా చక్రం తిప్పుతున్న తమ నేతల వైఖరితో పార్టీ తిరోగమిస్తోందని బిజెపి శ్రేణులు ఆవేదన చెందుతున్నారు. గత ఎన్నికల్లో విజయవాడనుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీలో చేరడం రాష్ట్ర బిజెపి నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కొద్ది తేడాతో వైసీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ చేతిలో ఓడిన వెల్లంపల్లికి బిజెపిలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. తన చేతిలో ఓడిన జలీల్ తాజాగా తెదేపాలో చేరడంతో వచ్చే ఎన్నికల్లో బిజెపి టికెట్ తనకు ఇవ్వదన్న అనుమానం ఉంది. ఈ అనుమానంతోనే వెల్లంపల్లి వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు గత నెలలోనే మీడియాలో షికార్లు చేసినా, రాష్ట్ర నాయకత్వం ఆయనను పిలిచి చర్చించి భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించలేదు. సామాజికవర్గమే కాకుండా, ఆర్ధికంగా కూడా బలంగా ఉన్న వెల్లంపల్లిని తామే చేతులారా వేరే పార్టీకి పంపించామని బిజెపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన పురంధ్రీశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి ప్రముఖులు కూడా ప్రస్తుతం అనామకుల్లానే మిగిలిపోవడం వారితోపాటు పార్టీలో చేరిన కార్యకర్తలకు కూడా మింగుడుపడటం లేదు. వీరిలో కన్నా కాంగ్రెస్‌లో 20 ఏళ్లు మంత్రిగా పనిచేసి, పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన స్థాయి నేత. పురంధ్రీశ్వరి కూడా పదేళ్లు కేంద్రమంత్రిగా పనిచేసి, ఒకానొక దశలో సీఎం పదవికి పోటీ పడిన నేత. వీరిద్దరి హోదా, స్థాయి, అనుభవంతో పోలిస్తే బిజెపిలో ఆ స్థాయి ఉన్న నేతలు కనిపించరు. అలాంటి నేతలకు పార్టీలో ఆదరణ లేని పరిస్థితి ఉందంటున్నారు.
నిజానికి, బిజెపిలో చేరాలనుకున్న చాలామంది ఇతర పార్టీల నేతలు రాష్ట్ర నాయకత్వ వైఖరిని చూసి వెనక్కివెళ్లిపోతే, మరికొందరు ఉత్సాహవంతులైన నేతల పేర్లను తెదేపా మేలుకోరే కొందరు బిజెపి నేతలు తెదేపాకు ఉప్పందించటంతో, వారిని తెదేపా నాయకత్వం తమ పార్టీలో చేర్చుకుందని పార్టీ నేతలు వివరిస్తున్నారు. ఇటీవల తెదేపాలో చేరిన మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్, అంతకుముందు మాజీ ఎమ్మెల్యే మురుగుడు హన్మంతరావు తొలుత బిజెపి అగ్రనేతలతో చర్చించారని, ఆ విషయాన్ని తెదేపాకు సామాజికపరంగా మానసిక మద్దతుదారులయిన తమ పార్టీ సీనియర్లే ఉప్పందించటంతో, తెదేపా వారిని తనవైపు మళ్లించుకుందని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. తమ పార్టీలో తెదేపా కోవర్టులు చాలామంది ఉన్నారని, పార్టీ ఈ దుస్థితికి చేరడానికి వారి పుణ్యమే కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
జాతీయ అధ్యక్షుడి ఆదేశంతో జాయినింగ్ కమిటీ వేసినా దానినీ నిర్వీర్యం చేశారని, కొత్తగా చేరాలనుకుంటున్న వారికి సమయం ఇవ్వకపోవడం, వారి పేర్లు ముందుగా తెదేపాకు లీకయిన ఫలితంగా వారంతా ఆ పార్టీలో చేరుతున్న ఫలితమే, బిజెపిలో ఎవరూ కొత్తగా చేరకపోవడానికి కారణమని సీనియర్లు విశే్లషిస్తున్నారు. తాజాగా అమిత్ షా తాడేపల్లిగూడెం సభకు ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో వచ్చేందుకు సిద్ధమవగా, వారిని ఓ సీనియర్ నేత వారించారని, సభకు పదిరోజుల ముందు పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సభ పెడితే సక్సెస్ అవుతుందా?అని నేతల ముందే అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే నేతలు మరో కేంద్రమంత్రికి రాష్ట్రంలో ఎక్కడ సన్మానాలు జరిగినా తామే స్వయంగా ఫోన్లు చేసిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రానికి ఏ ఇతర నాయకులు వచ్చినా ఒక వర్గానికి చెందిన నేతలు ఇష్టపడటం లేదని, రేపు జనవరిలో మోదీ వస్తున్నా ఇదే పరిస్థితి ఉందంటున్నారు. తాడేపల్లిగూడెంలో అమిత్‌షా సభకు రాష్ట్ర నాయకత్వం నయాపైసా ఇవ్వకపోయినా, నిధుల సమీకరణకు సహకరించకపోయినా జిల్లా నేతలే సమకూర్చుకున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు.
ఢిల్లీ నేతలను కూడా మేనేజ్ చేస్తున్నారని, వారికి తెదేపాకు చెందిన ఓ కేంద్రమంత్రి ఈ విషయంలో మార్గదర్శిగా ఉన్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఇన్చార్జి వ్యవహారశైలి రాష్ట్రంలో పార్టీ విస్తరణకు అనుకూలంగా లేదని, ఆయన కూడా ఒక వర్గం చట్రంలో ఇరుక్కున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విజయవాడకు వచ్చిన ప్రభుత్వ-పార్టీ ప్రముఖులను పార్టీ ఆఫీసుకు రానీయకుండా హోటళ్లకు, అటునుంచి అటు తెదేపా నేతల వద్దకు తీసుకువెళుతున్నారని, ఈ విషయంలో తమ పార్టీకి చెందిన ఒక రాష్ట్ర మంత్రే అత్యుత్సాహం చూపుతుంటే పార్టీ ఇక ఏం పురోగమిస్తుందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.