బిజినెస్

నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 21: నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సాధ్యమేనా? చేతిలో డబ్బు లేకున్నా ఈజీగా బ్రతికేయొచ్చా? డిజిటల్ లావాదేవీలు నిజంగా పుంజుకుంటున్నాయా?.. అంటే కాదు, కుదరదు, లేదు అన్న సమాధానాలే చెప్పాల్సి వస్తోంది. అవును.. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎలక్ట్రానిక్ లావాదేవీలకు అలవాటు పడుతున్నారని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయిమరి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం గత నెల పాత పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినది తెలిసిందే. 500, 1,000 రూపాయల నోట్ల చలామణిని నిలిపివేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రకటించారు. కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లనూ పరిచయం చేశారు. అయితే 500 రూపాయల నోట్లు అందుబాటులోకి రాకపోవడం, కేవలం 2,000 రూపాయల నోట్లే రావడం, అదికూడా అరకొరగా లభించడంతో నగదు కొరత సమస్య వచ్చిపడింది. ముఖ్యంగా 100 రూపాయల నోట్లు లేక చిల్లర కష్టాలు తలెత్తాయి. దీంతో అన్ని వ్యాపార లావాదేవీలు ఒక్కసారిగా పడిపోగా, డిజిటల్ ఎకానమీని తలకెత్తుకుంది మోదీ సర్కారు. ఇందుకు ప్రోత్సాహకాలనూ కల్పించింది. అయినప్పటికీ ప్రభుత్వ ఆశయం మాత్రం నెరవేరడం లేదు. గతంతో పోల్చితే పాత పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎలక్ట్రానిక్ లావాదేవీలు తగ్గాయని చెబుతున్న గణాంకాలే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. పెట్రోల్/డీజిల్ బంకులు, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు, షాపింగ్ మాల్స్ ఇలా అన్నిచోట్లా క్రెడిట్/డెబిట్ కార్డుల వినియోగం నవంబర్ 10 నుంచి తగ్గిపోయింది. పాయింట్స్ ఆఫ్ సేల్ (పిఒఎస్) వద్ద డెబిట్/క్రెడిట్ కార్డుల లావాదేవీల విలువ నవంబర్‌లో 352.4 బిలియన్ రూపాయలుగా ఉంది. డిసెంబర్ 13 వరకు ఇది 181.3 బిలియన్ రూపాయలుగా నమోదైంది. అయితే అక్టోబర్‌లో పిఒఎస్‌ల ద్వారా జరిగిన లావాదేవీల విలువ 511.2 బిలియన్ రూపాయలుగా ఉండటం గమనార్హం. నవంబర్‌లో పిఒఎస్ సగటు లావాదేవీ 1,714 రూపాయలుగా ఉంటే, డిసెంబర్‌లో 1,643 రూపాయలుగా ఉంది. కానీ అక్టోబర్‌లో ఇది 2,229 రూపాయలుగా ఉందని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బిఐ అనుబంధ విభాగమైన ఎస్‌బిఐ పరిశోధనా నివేదిక ఒకటి చెబుతోంది. కాగా, డిమాండ్‌కు తగ్గట్లుగా పిఒఎస్ మెషీన్లు అందుబాటులో లేకపోవడం కూడా పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎలక్ట్రానిక్ లావాదేవీలు పెరగకపోవడానికి ఓ కారణం కావచ్చని ఎస్‌బిఐ నివేదిక అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో కేవలం 15.1 లక్షల పిఒఎస్ మెషీన్లు మాత్రమే ఉన్నాయని, డిజిటలైజేషన్ ఊపందుకోవాలంటే కనీసం మరో 20 లక్షల పిఒఎస్ మెషీన్లయినా అవసరమని చెప్పింది. ముఖ్యంగా డెబిట్ కార్డు లావాదేవీలు పుంజుకోవాల్సిన అవసరం ఉందన్న ఎస్‌బిఐ రిసెర్చ్.. వాడకంలో 74 కోట్ల డెబిట్ కార్డులున్నా అక్టోబర్ నాటికి ఒక డెబిట్ కార్డు సగటు లావాదేవీ 1,500 రూపాయలుగానే ఉందంది. వినియోగం రేటు కూడా 1.3 శాతంగానే ఉందని తెలిపింది. కాబట్టి డెబిట్ కార్డుల వినియోగాన్ని ప్రభుత్వం తప్పక ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, అది జరిగితేనే నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కల సాకరమవుతుందని అభిప్రాయపడింది. సెక్షన్ 80సి వంటి పన్ను మినహాయింపులను డెబిట్ కార్డుల వినియోగానికీ ఇస్తే బాగుంటుందని సూచించింది. ఎలక్ట్రానిక్ లావాదేవీలను మరింత సరళతరం చేయాల్సిన అవసరాన్నీ గుర్తుచేసింది. ప్రధానంగా చిరు వ్యాపారుల వద్దకూ పిఒఎస్ మెషీన్లు చేరితే నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున తగ్గుతాయంది. మరోవైపు ఎలక్ట్రానిక్ లావాదేవీలు పెరగకపోవడానికి భద్రతాపరమైన సమస్యలూ ఓ కారణమేనని నిపుణులు అంటున్నారు. క్లోనింగ్ ద్వారా కార్డు సమాచారాన్ని హ్యాకింగ్ చేసే వీలుండటంతో కస్టమర్లు నగదు లావాదేవీలకే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. ఈ రకమైన చౌర్యానికి అవకాశం లేకుండా చేసినట్లయితే డిజిటల్ లావాదేవీలు ఊపందుకోవచ్చని, ఆ దిశగా ప్రభుత్వం, బ్యాం కులు అడుగులేయాల్సిన అవసరముందని సూచిస్తున్నారు. ఇక ఎమ్-వాలెట్ తదితర ప్రీ- పెయిడ్ ఇన్‌స్ట్రూమెంట్స్ (పిపిఐ) లావాదేవీలూ పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత తగ్గిపోయాయి. భద్రతాపరమైన ఇబ్బందులు, విశ్వసనీయంగా ఉండకపోవడం, అవగాహన లేకపోవడం కూడా ఇందుకు కారణమని ఎస్‌బిఐ రిసెర్చ్ తన నివేదికలో చెప్పింది. అయితే మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు మాత్రం పెరిగాయని, అంతకుముందుతో పోల్చితే గత నెల నవంబర్‌లో 9.7 శాతం వృద్ధిచెంది 1,245 బిలియన్ రూపాయలుగా ఉన్నాయంది. ఒక్కో లావాదేవీ విలువ కూడా 17,207 రూపాయలుగా ఉందంది. అక్టోబర్‌లో ఇది 14,536 రూపాయలుగా ఉందని చెప్పింది. కాగా, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పిఒఎస్ టెర్మినళ్ల వద్ద జరిగే లావాదేవీలు, ఎమ్-వాలెట్, పిపిఐ కార్డుల వంటి పిపిఐ లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల విలువ ప్రస్తుతం 1.7 ట్రిలియన్ రూపాయలుగా ఉంది. ఇది 3.5 ట్రిలియన్ రూపాయలకు చేరినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడినట్లవుతుందని ఎస్‌బిఐ రిసెర్చ్ వివరించింది. మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల సగటు నెలకు ఇప్పుడు 14,500 రూపాయలుగా ఉందని, ఇది 25,000 రూపాయలకు పెరగాల్సిన అవసరాన్ని కూడా ఎస్‌బిఐ రిసెర్చ్ తన నివేదికలో ఈ సందర్భంగా గుర్తుచేసింది. అలాగే మొబైల్ వాలెట్స్ లావాదేవీల విలువా 34 బిలియన్ రూపాయల నుంచి 100 బిలియన్ రూపాయలకు పెరగాలంది. దీనివల్ల ప్రస్తుతం 475 రూపాయలుగా ఉన్న సగటు లావాదేవీ 1,000 రూపాయలకు చేరుతుందని, ఫలితంగా కొనుగోళ్ల సామర్థ్యం పెరుగుతుందంది. వ్యాపార, పారిశ్రామిక రంగాలూ కళకళలాడుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.