బిజినెస్

స్పైస్‌జెట్-బోయింగ్ డీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: విమానయాన విస్తరణలో భాగంగా దేశీయ ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. ప్రముఖ విదేశీ విమానాల తయారీ సంస్థ బోయింగ్ నుంచి భారీ ఎత్తున విమానాలను కొనుగోలు చేస్తోంది. 1,50,000 కోట్ల రూపాయలతో 205 కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను స్పైస్‌జెట్ అందుకుంటోంది. భారతీయ విమానయాన రంగంలో అతిపెద్ద లావాదేవీల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. గతంలో కొనాలనుకున్న 50 విమానాలకుతోడు అదనంగా 100 737-8 మ్యాక్స్ విమానాలను తీసుకోవాలని నిర్ణయించుకున్న స్పైస్‌జెట్.. మరో 50 బి737-8 మ్యాక్స్ విమానాలనూ పొందేందుకు సిద్ధమైంది.
దీనికి సంబంధించిన ఒప్పందం శుక్రవారం ఇక్కడ జరగగా, ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా స్పైస్‌జెట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ మాట్లాడుతూ 1,50,000 కోట్ల రూపాయల (22 బిలియన్ డాలర్లు)తో మొత్తం 205 ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనేందుకు బోయింగ్ సంస్థకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. ‘్భరతీయ విమానయాన రంగంలో అతిపెద్ద లావాదేవీల్లో ఇది ఒకటి. స్పైస్‌జెట్‌కు మాత్రం అతిపెద్ద డీల్ ఇదే.’ అన్నారు. ప్రస్తుతం స్పైస్‌జెట్‌కు 32 బి737 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 17 బాంబార్డియర్ క్యు400 విమానాలున్నట్లు ఆయన తెలిపారు. ఇక బోయింగ్ సంస్థ వైస్ చైర్మన్ రేమండ్ ఎల్ కాన్నర్ మాట్లాడుతూ ‘స్పైస్‌జెట్‌తో దశాబ్దకాలానికిపైగా భాగస్వామ్యం బోయింగ్‌కు ఉంది. తాజాగా కుదిరిన 205 విమానాల కొనుగోలు ఒప్పందం సంతోషకరం.’ అన్నారు. తొలుత 155 విమానాలను అందిస్తామని 2018 మూడో త్రైమాసికంలో మొదలై 2024 చివరిదాకా పంపిణీ కొనసాగుతుందని తెలిపారు.
ఇదిలావుంటే ఈ డీల్ నేపథ్యంలో నిధుల సమీకరణపై దృష్టిపెట్టామని, వివిధ మార్గాలను అనే్వషిస్తున్నామని అజయ్ సింగ్ చెప్పారు. కాగా, కొత్తగా కొనే విమానాలు 20 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తాయని, దీనివల్ల సంస్థ వ్యయం తగ్గిపోతుందన్నారు. ఇక నిరుడు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో స్పైస్‌జెట్ లాభం 59 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే వ్యవధిలో 29 కోట్ల రూపాయల లాభంతోనే సరిపెట్టుకుంది. ఈ క్రమంలో విమానాల పెంపు సంస్థకు దోహదం చేయగలదని స్పైస్‌జెట్ భావిస్తోంది.
మరోవైపు బోయింగ్ డీల్‌తో స్పైస్‌జెట్ షేర్ల విలువ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం ట్రేడింగ్‌లో స్పైస్‌జెట్ షేర్ విలువ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో 4 శాతానికిపైగా ఎగిసింది. 66.55 రూపాయల వద్ద స్థిరపడింది. మొత్తానికి ప్రపంచ విమానయాన రంగంలో భారతీయ విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దేశీయ ప్రైవేట్‌రంగ సంస్థలు విమానయాన కార్యకలాపాల విస్తరణపై దృష్టిపెట్టాయ. ఇటీవలే గోఎయిర్.. ఎయిర్‌బస్ నుంచి 72 విమానాలను 52,000 కోట్ల రూపాయలకుపైగా చెల్లించి కొనేందుకు సిద్ధమైంది. ఈ లావాదేవీలు జరిగి నెల గడవకముందే ఇప్పుడు బోయంగ్ దగ్గర ఏకంగా 205 విమానాలను కొనేందుకు స్పైస్‌జెట్ సన్నద్ధమైంది.

చిత్రం..న్యూఢిల్లీలో విలేఖరుల సమావేశం సందర్భంగా ఒప్పంద పత్రాలను చూపుతున్న స్పైస్‌జెట్ సిఎండి అజయ్ సింగ్, బోయంగ్ వైస్ చైర్మన్ కాన్నర్