శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

చరమాంకంలో అవినీతి మరక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 17: జిల్లా వాసులకు ఎంతో సుపరిచితమైన పేరు జడ్పి రామిరెడ్డి. ఉద్యోగ ప్రస్థానం మొదలైనప్పట్నుంచి సర్వీసులో అత్యధిక కాలం ఆయన పనిచేసిన ప్రాంతం నెల్లూరు జిల్లానే. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన బొబ్బా రామిరెడ్డి.. 1985లో తడ డిప్యూటీ తహశీల్దార్‌గా తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం సూళ్లూరుపేట, వెంకటగిరి, ఇందుకూరుపేట మండలాల్లో తహశీల్దార్‌గానూ, నెల్లూరు కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారిగానూ పనిచేశారు. తదనంతరం పదోన్నతిపై చిత్తూరు జిల్లాలో ఆర్‌డిఓగానూ, టిటిడిలో ఆర్‌డిఓ స్థాయి అధికారిగానూ పనిచేసి తిరిగి నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారిగా వచ్చారు. అనంతరం జడ్పి సిఇఓగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం జడ్పి సిఇఓతో పాటు నెల్లూరు నగర కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారిగా ఇన్‌చార్జ్ హోదాలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. రామిరెడ్డి జిల్లాకు చెందిన వారే అని ప్రజలు భావించేలా ఆయన పలు బాధ్యతలు చేపట్టారు. అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ, జిల్లాలో పరిపాలనను శాసించే రాజకీయనాయకులు ఎవరైనప్పటికీ రామిరెడ్డి వారికి నమ్మిన బంటుగా పేరొందారు. పరిపాలనలో వివాదరహితుడిగా ఆయనకు పేరుంది. జిల్లాలో జిల్లాస్థాయి అధికారి పదవి ఖాళీ అయితే కొత్త అధికారి వచ్చే వరకు జిల్లా కలెక్టర్ మొదలు మంత్రుల వరకు మదిలో మెదిలే తొలి పేరు రామిరెడ్డిదే ఉంటుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఎంతో కాలంగా జిల్లా పంచాయతీ అధికారిగానూ, తాజాగా నగర కమిషనర్‌గాను ఆయన ఇన్‌చార్జ్ బాధ్యతలు చేపట్టారు. అయితే అంతటి మృదు మనస్తత్వం కలిగిన రామిరెడ్డి కోట్ల రూపాయలు కూడబెట్టడం, ఏసిబి అధికారుల దాడుల్లో అవన్నీ బహిర్గతం కావడం అధికారులతో పాటు జిల్లా ప్రజల్లోనూ సంచలనమైంది. మార్చి నెల 31వ తేదీకి రామిరెడ్డి ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అంతలోనే ఏసిబి అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించాడనే కేసులో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించడం, కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించడం ఉద్యోగ వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినప్పటికీ ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించేనాటికి ఆయన అద్దె ఇంట్లో ఉంటుండటం కొసమెరుపు.

అనతికాలంలో అగ్రగామిగా కృష్ణపట్నం పోర్టు
* సిఇఒ అనిల్ యండ్లూరి స్పష్టం
ముత్తుకూరు, ఫిబ్రవరి 17: కృష్ణపట్నం పోర్టు అనతికాలంలో అగ్రపథాన నిలుస్తోందని పోర్టు సిఇఓ యుండ్లూరి అనిల్‌కుమార్ అన్నారు. శుక్రవారం కృష్ణపట్నం పోర్టు నుంచి నేరుగా సింగపూర్, మలేషియా, సౌత్‌కొరియా ఈస్ట్‌పాస్ట్, సౌత్ ఈస్ట్‌కు హుండాయ్, ప్రెస్టేజ్- 039 అనే నౌకద్వారా వారాంతపుకంటైనర్ సేవలను హెచ్‌ఎంఎం మేనేజింగ్ డైరెక్టర్ వైబి మార్క్‌తో కలసి ఓడరేవు సిఇఒ అనిల్ యండ్లూరి ప్రారంభించారు. ఈనేపథ్యంలో హుండాయ్ ప్రిస్టేజ్ -039 కంటైనర్ల నౌక ఓడరేవులో లంగరు వేసుకుంది. ఈసందర్భంగా సిఇఒ విలేఖర్లతో మాట్లాడుతూ దేశంకన్నా రాష్ట్రం అభివృద్ధిపథంలో ముందుకు దూసుకుపోతోందన్నారు. ఇందులో భాగంగా కృష్ణపట్నం ఓడరేవు నుంచి చైనా, సౌత్ కొరియా, మలేషియా, సింగపూర్‌కు నేరుగా కంటైనర్ సేవలను ప్రారంభించామన్నారు. మున్ముందు ఎగుమతులు, దిగుమతులు విస్తృతం కానున్నాయన్నారు. ఎగుమతి, దిగుమతి దారులతోపాటు వ్యాపార వేత్తలకు ఎంతో అనుకూలంగా ఉండటమే కాకుండా తక్కువ సమయంతోపాటు చాలా వరకు వ్యయం కూడా తగ్గుతుందన్నారు. సాగర్‌మేళా ప్రాజెక్ట్ మేళాలో భాగంగా ఈ ప్రాంతం మున్ముందు మరింత అభివృద్ధి జరుగుతుందని, చెనె్న - బెంగళూరు కారిడార్‌తో తీరప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు రానున్నట్లు ఆయన తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు టెర్మినల్ కంటైనర్ కార్గో రవాణా ఎంతో అవసరమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కర్నాటక, తెలంగాణా, తమిళనాడు ప్రాంత వ్యాపార వేత్తలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయని సిఇఒ తెలిపారు. కెపిసిటి ప్రారంభించిన అనతికాలంలోనే దేశంలోనే అత్యుత్తమ కంటైనర్ పోర్టుగా కృష్ణపట్నం పోర్టు అభివృద్ధివైపు పరుగులు తీస్తోందన్నారు. పోర్టు అభివృద్ధితో పరిశ్రమల ఏర్పాట్లలో భాగంగా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు. పదేళ్లలో సాధించే లక్ష్యాన్ని కృష్ణపట్నం పోర్టు నాలుగేళ్లలో సాధించడం జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన ధీమావ్యక్తం చేశారు. కంటైనర్ల రవాణాలో హెచ్‌ఎంఎం కీలకపాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. హెచ్‌ఎంఎం మేనేజింగ్ డైరెక్టర్ వైబి మార్క్ మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టు నుంచి నేరుగా సింగపూర్, మలేషియా, సౌత్‌కొరియా ఈస్ట్ ఫాస్ట్ లాంటి ప్రముఖ దేశాలకు నేరుగా కంటైనర్ల రవాణా సాగించడం హర్షణీయమని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు నుంచి నిరంతరం కంటైనర్ సేవలను కొనసాగిస్తామని, కృష్ణపట్నం పోర్టులో వౌలిక వసతులు చాలా బాగున్నాయని ఆయన కితాబిచ్చారు. అనుకున్నదానికన్నా ఎక్కువ ఎగుమతులు, దిగుమతులు చేయవచ్చని ఆయన తెలిపారు. ముఖ్య అతిథులు ఈసందర్భంగా బ్రోచర్‌ను ఆవిష్కరించారు. తదుపరి పోర్టు సిఇఒ అనిల్ యండ్లూరి జ్ఞాపికను బహూకరించారు. ఈకార్యక్రమంలో టోపి సిటి సిఒఒ జితేంద్ర, చాయిస్ మేనేజింగ్ డైరెక్టర్ జోస్‌థామస్, కెప్టెన్ మస్తీస్‌లాన్, హెచ్‌ఎంఎం ఇండియా జనరల్ మేనేజర్ జాన్సన్, కస్టమ్స్ జాయింట్ కమిషర్ రామ్మోహనరావు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులు, మీడియా మేనేజర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ కస్టడీకి ఉగ్రవాదులు
* అనుమతించిన న్యాయస్థానం
నెల్లూరు, ఫిబ్రవరి 17: నెల్లూరు కోర్టు ఆవరణలో బాంబు పేలుడు ఘటనలో రిమాండులో ఉన్న ఐదుగురు ఉగ్రవాదులను 7 రోజుల పోలీస్‌కస్టడీకి అనుమతిస్తూ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు వారిని శనివారం జిల్లా కేంద్ర కారాగారం నుండి అదుపులోకి తీసుకోనున్నారు. ఉగ్రవాదులైన ఎ.అబ్బాస్‌అలీ, షంషూన్‌కరీం రాజా, ఎం.అయూబ్, దావూద్ సులేమాన్, షంషుద్దీన్‌లు గత ఏడాది నెల్లూరుతో పాటు చిత్తూరు, కొల్లాం, మలపురం, మైసూర్ ప్రాంతాల్లోని కోర్టుల్లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. దీంతో మధురై, తిరువాన్మియార్‌లలో ఎన్‌ఐఏ, ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక పోలీసులు సంయుక్తంగా వారిని గత ఏడాది నవంబర్‌లో అదుపులోకి తీసుకొని విచారించగా కీలక సమాచారం బయటకొచ్చింది. దీంతో వారిని అరెస్ట్ చేశారు. కర్నాటక పోలీసులతో పాటు చిత్తూరు పోలీస్‌లు ఇప్పటికే వారిని విచారించారు. తాజాగా చిత్తూరు జిల్లా జైలులో ఉన్న నిందితులను ఈనెల 15న జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా మార్చి 1 వరకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పూర్తి విచారణ నిమిత్తం కస్టడీకి అనుమతించాలని కోరుతూ 4వ నగర పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించింది.

ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లపై సస్పెన్షన్ వేటు
* విధులు సక్రమంగా నిర్వహించాలని మంత్రి కామినేని ఆదేశం
నెల్లూరుసిటీ, ఫిబ్రవరి 17: నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పొరుగు సేవల డాక్టర్లను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే గురువారం నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో కొంతమంది వైద్యులు బయట ప్రైవేటు క్లినిక్‌లో పనిచేస్తున్న వైనాన్ని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు బయటపెట్టిన విషయం తెలిసిందే. కొంతమంది వైద్యులు ఉదయం ఆసుపత్రికి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం పెట్టి తరువాత బయటకు వెళ్లి ఇతర హాస్పిటల్‌లో పనిచేస్తుండగా కలెక్టర్ వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని వారిపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్స్ చేశారు. దీంతో స్పందించిన మంత్రి కామినేని శ్రీనివాస్ హుటాహుటిన నెల్లూరుకు చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో వైద్యాధికారులు, వైద్యులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ డ్యూటీ టైంలో ప్రైవేటు వైద్యశాలల్లో పనిచేస్తున్న ఆరుగురు వైద్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంతమంది విధులకు డుమ్మా కొడుతున్నారో తన వద్ద సమాచారం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ డాక్టర్లకు ఎవరికైనా ప్రైవేటు ఆసుపత్రులు ఉంటే వారు రాజీనామా చేస్తే కొత్తవారిని తీసుకుంటామని సూచించారు. రైల్వేకోడూరులో ఫుడ్ కంట్రోల్ అధికారులకు పట్టుబడిన ఆపిల్ పండ్ల విక్రేత ఖాదర్ బాషా కార్బైడ్ రసాయనాలను కలిపినందుకు గాను 3నెలలు కారాగారం, 20వేలు జరిమానా విధించినట్లు మంత్రి వివరించారు. అదే విధంగా ఆహారపదార్థాలను కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆస్తులు.. అంతస్తులు
* రామిరెడ్డి ఆస్తుల చిట్టా విప్పిన అధికారులు
* రూ.40కోట్లకు పైచిలుకు
నెల్లూరు, ఫిబ్రవరి 17: జడ్పి సిఇఓ బి.రామిరెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసిబి అధికారులు శుక్రవారం స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఆయన ఇంటిపై దాడులు జరిపి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వెలుగుచూసిన ఆస్తులను చూసి ఏసిబి అధికారులు సైతం విస్తుబోయారు. ఎంతో వివాదరహితుడిగా పేరొందిన అధికారి ఇంతస్థాయిలో అవినీతి సంపాదన కూడబెట్టడం వారిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. అధికారుల సోదాలో వెలుగుచూసిన రామిరెడ్డి ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. చిల్డ్రన్స్ పార్కు సమీపంలోని ఇంట్లో 2 లక్షల నగదు, 300 గ్రాముల బంగారం, తిరుపతి నగర సమీపంలో 4, నెల్లూరులో 4, గుంటూరులో 4, కావలి, హైదరాబాద్‌లలో ఒక్కొక్క ఇంటి నివేశన స్థలాలను అధికారులు గుర్తించారు. అదే విధంగా చిల్డ్రన్స్‌పార్క్ సమీపంలో ఇటీవల నిర్మించి నాలుగంతస్తుల భవనం, గుంటూరులో 1,689 చదరపు అడుగుల ఫ్లాటు, రామిరెడ్డి స్వగ్రామం గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో 9 ఎకరాల వ్యవసాయ భూమి అధికారుల సోదాల్లో బహిర్గతమైంది. వాటితో పాటు అధికారులు ఆంధ్రప్రగతి బ్యాంక్‌లో గుర్తించిన రెండు లాకర్లను శుక్రవారం సాయంత్రం రామిరెడ్డి కుటుంబసభ్యుల సమక్షంలో తెరవగా అందులో 1.30 కేజి బంగారు ఆభరణాలు వెలుగుచూశాయి. వాటన్నింటితో పాటు కావలికి చెందిన ఓ హాస్టల్ వార్డెన్ ద్వారా రూ.50లక్షలను ఇతరులకు రుణం కింద ఇచ్చినట్లు కాగితాల్లో రాసి ఉండగా అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో జిల్లా స్థాయి అధికారి ఇంట్లో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించడం గత ఏడాది కాలంలో ఇదే తొలిసారి కావడం, అందులోనూ మరో నెలరోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్న అధికారి కావడంతో ఏసిబి దాడుల్లో రాజకీయకోణం ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమాచారమివ్వండి
- ఏసిబి డిఎస్పీ తోట ప్రభాకర్
జడ్పీ సిఇఓ అవినీతిపై బాధితులు కానీ, ఇతరులు ఎవరైనా తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉంటే తమను సంప్రదించాలని నెల్లూరు ఏసిబి డిఎస్పీ తోట ప్రభాకర్ కోరారు. కొందరు ఇచ్చిన స్పష్టమైన సమాచారం మేరకే తాము ఈ దాడులు నిర్వహించామని, ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు రూ.2కోట్లపైబడి ఆస్తులు గుర్తించామని, బహిరంగ మార్కెట్‌లో ఈ విలువ అంతకు పదింతలు ఉంటుందన్నారు. ఈ దాడుల్లో ఏసిబి సిఐ శివకుమార్‌రెడ్డి, ఎస్సై శ్రీహరిబాబు, మధు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
* రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదేశం
నెల్లూరు, ఫిబ్రవరి 17: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికలు, స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎన్నికలను భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సజావుగా జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల లిస్టుపై హైకోర్టులో ఫిర్యాదులు దాఖలయ్యాయని, ఫిర్యాదులు అన్నీ విచారించి లిస్టును తయారు చేయాలన్నారు. ఎన్నికల బూత్‌ల మార్పుల జాబితాను పంపించాలన్నారు. ఎగ్జిలరి పోలింగ్ స్టేషన్ల జాబితాను పంపించాలన్నారు. బందోబస్తు కోసం పోలీస్ అధికారులను ఏర్పాటుచేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, జిల్లా రెవెన్యూ అధికారి కృష్ణ్భారతి, జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని, రెవెన్యూ డివిజనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల మెరుగు
* భారీగా పెరిగిన రోగుల సంఖ్య
* మంత్రి కామినేని వెల్లడి
గూడూరు, ఫిబ్రవరి 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులకు అన్ని రకాలైన సదుపాయాలు కల్పిస్తున్నందున గతంలోకంటే రోగుల సంఖ్య పెరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం బిజెపి కార్యకర్తలు, నాయకుల సమావేశం స్థానిక బజారువీధిలోని జిఎస్ రాయలు కల్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను, వైద్యులను నియమించడంతో పాటు ఆధునిక సాంకేతిక సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చిందని చెప్పారు. కార్పొరేట్ వైద్యం కన్నా మిన్నగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు ప్రజలకు అందుతున్నాయని, ఇది ఈ ప్రభుత్వ ఘనతగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాల ఆదుకొంటున్నదని, ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నందున రాష్ట్రానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తున్నారన్నారు. రాష్ట్రానికి అవసరమైన ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయని, పరిశ్రమలు వస్తున్నాయని, దీని వలన నిరుద్యోగ సమస్య ఉండదని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు చర్య ప్రధాని నరేంద్రమోదీ తీసుకొన్న సాహసోపేతమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో దొంగనోట్లు అరికట్టేందుకు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల వద్ద ఉన్న నగదును అరికట్టేందుకు దోహదపడిందన్నారు. విదేశాల్లో దాచుకొన్న నల్లధనం వెలికి తీసుకువచ్చేందుకు ఇది ఎంతగానో దోహదపడిందన్నారు. తొలుత సామాన్యులు పెద్ద నోట్ల రద్దు వలన కొంత ఇబ్బందులు పడ్డా ఇప్పుడు చాలా సంతోషిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ట్యాక్స్ రూపేణా రావాల్సిన బకాయిలు వసూలైనట్టు ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ఆయన స్వర్ణ్భారత్ ట్రస్టీ దీపా వెంకట్‌తో కలసి బజారువీధిలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి సమక్షంలో పలువురు బిజెపి తీర్థం పుచ్చుకోగా, వారిని కండువాలు కప్పి బిజెపిలోకి మంత్రి ఆహ్వానించారు. అనంతరం దీపా వెంకట్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందన్నారు. అంతకు ముందుకు వారికి బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి, కర్నాటి ఆంజనేయ రెడ్డి, నర్రా సంజీవ నాయుడు, చెంచురెడ్డి, రాజేష్‌కుమార్, కెవి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాధికార సాధనే అంతిమలక్ష్యం
* సిపిఐ సీనియర్ నేత రామకృష్ణ స్పష్టం
నెల్లూరు, ఫిబ్రవరి 17: బడుగులకు రాజ్యాధికారం సాధించడమే అంతిమ లక్ష్యంగా సామాజిక హక్కుల వేదిక ఉద్యమిస్తోందని వేదిక కన్వీనర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల హక్కుల సాధనకై సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో నగరంలోని టౌన్‌హాల్‌లో శుక్రవారం జరిగిన న్యాయ శంఖారావం సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 80 శాతం పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా దోపిడీకి, వివక్షతకు గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వర్గాలను ఐక్యం చేసి రాజ్యాంగం రూపొందించిన హక్కుల సాధనకై పోరాడేందుకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో న్యాయ శంఖారావం సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ రంగంలో కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని, అన్ని స్థాయిలో ప్రజా ప్రాతినిధ్యానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలన్నారు. అంతక్రితం హరనాథపురం నుండి టౌన్‌హాల్ వరకు మోటార్ సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభావేదికపై అంబేద్కర్ జీవిత చరిత్ర నాటకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వేదిక జిల్లా కన్వీనర్ వి.రామరాజు, అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షులు ఆర్.వెంకయ్య, కెవివి ప్రసాద్, కె.సుబ్బారావు, వెంకటసుబ్బయ్య, యామాల మధు, కరీముల్లా, మునీర్ తదితరులు పాల్గొన్నారు.

రైల్వేపరంగా బిట్రగుంటను అభివృద్ధి చేయండి
* రైల్వే జిఎంకు రాష్ట్ర రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీద వినతి
బిట్రగుంట, ఫిబ్రవరి 17: రైల్వేపరంగా బిట్రగుంటను అభివృద్ధి చేయాలని రాష్ట్ర రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీద మస్తాన్‌రావు, బిజెపి కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి కందుకూరి సత్యనారాయణ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం బిట్రగుంటకు విచ్చేసిన రైల్వే జనరల్ మేనేజర్‌కు రాష్ట్ర రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీద మస్తాన్‌రావు, బిజెపి కావలి నియోజకవర్గం ఇన్‌చార్జి కందుకూరి సత్యనారాయణ, యువ కాపునాడు మహిళా అధ్యక్షురాలు మెతుకు రాజేశ్వరి, స్థానిక టిడిపి, బిజెపి నేతలు, రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా బీద మస్తాన్‌రావు రైల్వే జిఎం వినోద్ కుమార్ యాదవ్‌కు రైల్వేపరంగా అభివృద్ధికి తోడ్పుటునివ్వాలని, అలాగే ప్రయాణికుల వౌలిక వసతుల గురించి వివరించారు. రైల్ అండ్ రోడ్డు ప్యాసింజర్స్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ కె తాతిరెడ్డి కావలి స్టేషన్‌లోని పాదచారుల వంతెన పొడిగింపు చేయాలని, పడమర వైపు టిక్కెట్ బుకింగ్ కార్యాలయం ఏర్పాటు, శబరి, యశ్వంత్‌పూర్ రైళ్ల నిలుపుదల, నెల్లూరు- ఒంగోలు మధ్య మెమో రైళ్లు నడపాలని కోరారు. వినియోగదారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గోవిందరాజులు స్టేషన్‌లో దక్షిణం వైపుమరుగుదొడ్లు, ప్రయాణికుల విశ్రాంతి గది ఏర్పాటు చేయాలని కోరారు. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్‌కు వినతి పత్రాలు అందచేశారు. అనంతరం జిఎం మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా వచ్చామని, ప్రయాణికులు, కార్మికుల భద్రత అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రైళ్ల సంఖ్య పెరగటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని, అందుకోసం విజయవాడ నుంచి గుడూరు వరకు మూడవ లైను నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మూడు సంవత్సరాలలో పూర్తిచేస్తామన్నారు. నడికుడి-కాళహస్తి లైను త్వరగా పూర్తిచేస్తామన్నారు. ఈమేరకు పలువురి విన్నపాలను పరిశీలించి తన పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మిగిలినవి రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అనంతరం బుకింగ్ కార్యాలయం వద్ద చిన్నపిల్లల పార్కును ప్రారంభించారు.