ఆంధ్రప్రదేశ్‌

సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.56,999కోట్లతో బడ్జెట్ ప్రతిపాదన

గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం విద్యారంగానికి పెద్దపీట తొలిసారి జండర్ బడ్జెట్ మహిళల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
నిరుద్యోగులకు ఆర్థిక సహాయం రాజధాని నిర్మాణానికి వంద కోట్లు గత ఏడాది కన్నా 15.7 శాతం పెరుగుదల
రెవెన్యూ లోటు రూ. 416 కోట్లు ఆర్థిక లోటు రూ. 23,054 కోట్లు రుణాల చెల్లింపులకు రూ.8009 కోట్లు

అమరావతి, మార్చి 15: రాష్ట్రంలో గ్రామీణ వికాసానికి మరింత ఊతాన్నివ్వటంతో పాటు విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం 2017-18 సంవత్సరానికి గాను కొత్త బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తొలిసారిగా స్ర్తిపురుషుల మధ్య సమానత్వాన్ని తీసుకొచ్చే రీతిలో సమన్యాయ ప్రాతిపదికన మహిళలకు ప్రత్యేక కేటాయింపులు చేసింది. ఈ వార్షిక బడ్జెట్‌తో పాటు 34జెండర్22బడ్జెట్‌ను కూడా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. అన్నిరకాలుగానూ వివక్షాయుత విధానాలకు తెరదించి మహిళల సామాజిక ఆర్థిక పురోగతిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదన చేసినట్లు ఆయన తన ప్రసంగంలో వెల్లడించారు. మొత్తం లక్షా యాభై ఆరువేల 999 కోట్ల రూపాయల కొత్త పద్దును ఆర్థికమంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నిరుడు బడ్జెట్ వ్యయంతో పోలిస్తే ఈ ప్రతిపాదనల మొత్తం 15.70శాతం ఎక్కువ. నిరుద్యోగ యువతకు ఆసరాగా రూ.500 కోట్లను కేటాయించామని పేర్కొన్న ఆయన దీన్ని నిరుద్యోగ భృతిగా పరిగణించాలా అన్న విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సాధారణ విద్యకు 20,384 కోట్లు, సాంకేతిక విద్యకు 765 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత అభివృద్ధి వెలుగులను సాధించేందుకు వీలుగా 19,565 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించారు. అలాగే వ్యవసాయ అవసరాలను మరింత తీర్చటంతో పాటు, వరదల నియంత్రణ అవసరం కూడా దృష్టిలో ఉంచుకుని నీటిపారుదల రంగానికి 12,770 కోట్ల రూపాయలను కేటాయించారు. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరంలో ఇందుకు గాను 11361 కోట్ల రూపాయలను కేటాయించింది. అలాగే రాష్ట్రంలో వైద్య అవసరాలను తీర్చటంతో పాటు, వైద్య సేవలను విస్తరించే లక్ష్యంతో 7020కోట్ల రూపాయలను కేటాయించారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు 9090 కోట్ల రూపాయలను అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి నిర్మించుకోవలసి రావటం, అదే విధంగా పెద్ద నోట్ల రద్దు కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్రస్థాయిలో పెనుభారమే పడిందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ ఏడాది జూలై నుంచి అమలు కానున్న జిఎస్టీ వల్ల కూడా రాష్ట్ర వనరుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం అన్న సంప్రదాయ బడ్జెట్ రూపకల్పనకు స్వస్తి పలికిన ఆర్థికమంత్రి వాటి స్థానే రెవిన్యూ, మూలధన వ్యయాలను తెరపైకి తెచ్చారు. ఈ మార్పును అత్యంత కీలకమైన సంస్థాగత సంస్కరణలుగా ఆయన అభివర్ణించారు. ఈ రకమైన మార్పు రాజ్యాంగ అవసరమే కాకుండా విధాన రూపకల్పన, వనరుల పూర్తిస్థాయి సద్వినియోగానికి అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఉత్తమ విధానమని రామకృష్ణుడు పేర్కొన్నారు. రెవిన్యూ వ్యయానికి గానూ 1,25,911కోట్ల రూపాయలను కేటాయించామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రుణాలపై చెల్లింపుల కోసం 8009 కోట్ల రూపాయలు సహా మూల ధన వ్యయం కింద 31, 087కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవిన్యూ లోటు 416 కోట్ల రూపాయల మేర ఉండే అవకాశం ఉందని, ఇది స్థూల రాష్ట్రీయ ఉత్పత్తిలో 0.05శాతమని ఆయన తెలిపారు. అలాగే విత్త లోటు 23, 054 కోట్ల రూపాయల మేర ఉండవచ్చునని ఇది స్థూల రాష్ట్రీయ ఉత్పత్తిలో 3శాతమని తెలిపారు. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం జండర్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందని, దీనివల్ల మహిళలు, బాలికల అభివృద్ధి, ప్రగతి, భద్రత మరింత బలోపేతం అవుతాయన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు కూడా ఈ జండర్ బడ్జెట్ ఉపకరిస్తుందని తెలిపారు. బడ్జెట్ ప్రక్రియలోని అన్ని స్థాయిల్లోనూ మహిళల పట్ల వివక్షను తొలగించే రీతిలో చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. అన్ని విధాలుగా మహిళల ప్రగతిని, అభివృద్ధిని కాంక్షిస్తూ వారి సమగ్ర వికాసానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని యనమల వివరించారు.
ఆదాయం వివరాలు ఇలా..
కేంద్రం నుంచి పన్నుల్లో వాటాగా 29,139 కోట్ల రూపాయలు, గ్రాంట్ల రూపంలో 37,548 కోట్లు లభిస్తుందని అంచనా వేశారు. రాష్ట్రానికి సొంతంగా వాణిజ్య పన్నుల పద్దు కింద 39,321 కోట్ల రూపాయలు, ఆబ్కారీ శాఖ నుంచి 5,886 కోట్లు, మోటారు వాహనాల పన్ను కింద 4000 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 5,092 కోట్ల రూపాయలు లభిస్తుందని అంచనా వేశారు. మైన్స్ అండ్ మినరల్స్ ద్వారా 2200 కోట్ల రూపాయలు, అటవీ శాఖ ద్వారా 920 కోట్లు వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేశారు.
చిత్రం... యనమల ప్రసంగాన్ని వింటున్న చంద్రబాబు