అదిలాబాద్

కౌలు రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్ రూరల్, డిసెంబర్ 8: నిర్మల్ మండలం న్యూముజ్గికి చెందిన కౌలు రైతు పెద్దోళ్ల గంగాధర్ (48) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం గంగాధర్ 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకోని పత్తి , మొక్కజొన్న సాగు చేస్తున్నాడు.దిగుబడి సరిగా రాదని దిగాలు చెందాడని పేర్కోన్నారు. దీనికి తోడు రూ. 2.5 లక్షలు అప్పు వుండడంతో దిక్కుతోచని స్ధితిలో గురువారం పత్తి చేలుకు విద్యుత్ సరఫరా చేయడానికి వెళ్లి అక్కడే ఉరి వేసుకోని ఆత్మహత్యకు చేసుకన్నట్లు తెలిపారు. ఆయనకు భార్య గంగవ్వతో పాటు ముగ్గురు కుమారులున్నట్లు వివరించారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పొలాలకు విద్యుత్ వైర్లను అమర్చడం నేరం
* జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 8: వ్యవసాయదారులు తమ పంటలను వన్య ప్రాణుల నుండి కాపాడుకునేందుకు కరెంట్‌తీగలను కంచెచుట్టూ అమర్చడం చట్టరిత్య నేరమని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంట పొలాలను అడవి జంతువుల బారినుండి కాపాడుకొనుటకు రైతులు తరచూ కరెంట్ తీగలను అమర్చడంతో మూగజీవాలతో పాటు సాధారణ ప్రజలు మృత్యువాత పడుతున్నాయని అన్నారు. కొందరు వేటగాళ్ళు సైతం అడవి జంతువులను వేటాడేందుకు కరెంటు తీగలను అమర్చడంతో పశువులు, వన్యప్రాణులు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందుతున్నాయని అన్నారు. వన్య ప్రాణులను వేటాడితే చట్టరిత్య కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ దారులు తమ పంటలను కాపాడుకోవడానికి ప్రమాదకరమైన చర్యలు తీసుకోరాదని, ఈ సంవత్సరం ఇలాంటి చర్యలతో 7 మంది రైతులు మరణించడం జరిగిందన్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రాత్రి సమయంలో వ్యవసాయదారులు పనుల నిమిత్తం పంట పొలాలకు వెళ్తుంటారని, కరెంట్ తీగలతో ప్రాణాలకే ముప్పువాటిల్లే అవకాశం ఉన్నందున కరెంట్ తీగలు అమర్చిన రైతుతో పాటు సహకరించిన వ్యక్తులపై సైతం కేసులు నమోదు చేసి చట్టరిత్య కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి
* జిల్లా వైద్యాధికారి తొడసం చందు
ఉట్నూరు, డిసెంబర్ 8: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు అంకితభావంతో మెరుగైన వైద్యసేవలందించాలని జిల్లా వైద్యాధికారి తొడసం చందు అన్నారు. గురువారం స్థానిక అదనపు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పునర్విభజన నేపథ్యంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయా జిల్లాలకు తగ్గట్లుగా విభజిస్తున్నామని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన వైద్యులు వైద్యంపై దృష్టిసారించి, అన్ని రకాల సౌకర్యాలతో రోగులకు వైద్యం అందించాలని అన్నారు. అదే విధంగా కావాల్సిన పరికరాలు, మందులపై నివేదికలు అందించినట్లయితే విభజనలో భాగంగా అన్నింటికి సమానంగా పంపిణీ చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఎజెన్సీ వ్యాప్తంగా జ్వరాలు ప్రబలుతున్నట్లు తనకు సమాచారం ఉన్నందునా ముందస్తు చర్యలో భాగంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్యాధికారి అల్హాం రవితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
* జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్
తిర్యాణి, డిసెంబర్ 8: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కొమురం భీం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ పేర్కొన్నారు. గురువారం ఎస్పీ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం భీమారం ప్రాథమిక పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు బ్యాగులను పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి ముడిపడి ఉందని, ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్య సాధనకు ప్రణాళికబద్ధంగా నిరంతరం కృషి చేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని బడి ఈడు పిల్లలందరని బడిలోనే ఉంచాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజలకు ఏసమస్యలున్నా నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తెలపాలని వెంటనే పోలీసులు ఆసమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈవోఎన్ శంకర్, బుద్దె స్వామి, భీమారం పాఠశాల హెచ్‌ఎం దేవ్‌షా, విద్యార్థులు పాల్గొన్నారు.

రబీ పంటకు మొదటి వారం నుండి నీరందిస్తాం
* కలెక్టర్ కర్ణన్
లక్సెటిపేట, డిసెంబర్ 8: లక్సెటిపేట మండంలోని రైతులకు మొదటి వారం నుండి సాగు నీరందిస్తామని జిల్లా కలెక్టర్ అర్వీ కర్ణన్ అన్నారు. మండలంలోని 35,42 వ డిస్టిబ్యూటరీ కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల అవసరం మేరకు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందజేయడం జరుగుతుందన్నారు. కాలువల మరమ్మత్తులు ఎప్పటికప్పుడు జరిపి రైతుల పంటలకు నీరందించడమే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగాలన్నారు. అనంతరం పలు గ్రామాల రైతులు వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకవేళ్ళారు. అడవి పందుల దాడులతో తీవ్రంగా పంటలు నష్టపోయామని దృష్టికి తీసుకువెళ్ళారు. స్పందించిన కలేక్టర్ అటవీ శాఖ అధికారులతో సంప్రదించి రైతులకు న్యాయం చేస్తామన్నారు. రైతులు ఏవరి పంటలను వారే కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపిడివో రాంప్రసాద్, ఎఓ ప్రభాకర్, ఎఇ అశ్వీన్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

కార్మికులకు కార్పొరేట్ వైద్యం అందిస్తాం
* టిబిజికెఎస్ అధ్యక్షుడు వెంకట్రావు
శ్రీరాంపూర్ రూరల్, డిసెంబర్ 8: సింగరేణి ప్రతి కార్మికునికి కార్పోరేట్ వైద్యం అందించేందుకు కృషి చేస్తామని టిబిజికెఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు గని ద్వార సమావేశంలో మాట్లాడారు. కార్మికులతోపాటు కార్మిక కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందేలా యాజమాన్యంతోచర్చిస్తున్నామన్నారు. ప్రాజెక్టు కార్మికులకు క్యాడర్ స్కీం,మెరుగైనా ఉత్పత్తి బోనస్, అందించాలన్నారు. అతి త్వరలోనే వారసత్వంపై విదివిధానాలనే యాజమన్యంతో చర్చించి గనుల డిపార్ట్ మెంట్లుకు అందిస్తామన్నారు.కార్మికుని నిర్ణయమే తుది నిర్ణయంగా ఉండేలా సర్కులర్ ఉంటుందని హామీ ఇచ్చారు. సకల జనుల సమ్మె వేతనం, లీవులు పొందని కార్మికులకు త్వరలోనే అందిస్తామన్నారు. రిటైర్డ్ కార్మికులకు లాబాల్లో వాటా సకల వేతనం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఓసిపి ప్రాజెక్టు కార్మికుల ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బేరా సత్యనారాయణ, టిఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల రవీందర్, టిబిజికెఎస్ ఎన్నికల సభ్యులు బుంటు సారయ్య, ఏనుగు రవీందర్ రెడ్డి, కాశీరావు,మంద మల్లారెడ్డి, పి.సత్యయ్య, కోటిలింగం, సిహెచ్ అశోక్, బ్రాంచి నాయకులు గంగయ్య, రాఘవరెడ్డి, ఖలింధర్ ఖాన్, వెంకట సత్యనారాయణ, జక్కుల రాజేశం, జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.

మారుమూల ప్రజల అవసరాలు తీర్చడమే పోలీసుల లక్ష్యం
* దొత్తివాగుకు తాత్కాలిక బ్రిడ్జిని ఏర్పాటుచేసిన ఎస్పీ
ఖానాపూర్ రూరల్, డిసెంబర్ 9: మారుమూల గిరిజన ప్రాంతాలలో నివసించే ప్రజల అవసరాలను తీర్చడమే పోలీసుల లక్ష్యమని నిర్మల్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. పెంబి మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో నివసించే ప్రజలు రహదారులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని దొత్తివాగుపై గురువారం తాత్కాలిక వంతెన నిర్మాణం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల క్రితం నుండి దోందరి, వత్పెల్లి, యాపల్‌గూడ, గుమ్మెన, నాయకప్‌గూడ, ఒడ్డెవాడ దాదాపు 10 గ్రామాలకు వెళ్లాలంటే వాగులు, వంకలు దాటి వెళ్లాల్సి వస్తుందన్నారు. మారుమూల గ్రామాలకు ప్రధానంగా దొత్తివాగు అడ్డంగా ఉండడం వల్ల గిరిజనులు పండించిన పంట మార్కెట్‌కు తరలించాలన్న అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రధానంగా దొత్తివాగుపై తాత్కాలిక వంతెనను పోలీసుల ఆద్వర్యంలో ఏర్పాటుచేశారు. గురువారం స్వయంగా ఎస్పీ వంతెనపై మొరాన్ని పోయించి తానే బ్లేడ్ ట్రాక్టర్‌పై కూర్చుండి వంతెనపై మట్టిని నేర్పడానికి డ్రైవర్ సూచనలిచ్చాడు. అనంతరం మారుమూల గిరిజనులతో మాట్లాడుతూ ప్రజలకు మూఢనమ్మకాలను నమ్మకూడదని, ఏదైన ఆరోగ్య పరమైన సమస్యలు గురైనప్పుడు నేరుగా సుపత్రికి వెళ్లి చూయించుకోవాలన్నారు. చిన్నపాటి సమస్యలు ఉంటే నేరుగా వచ్చి దగ్గరలో ఉన్న పెంబి పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని, పెద్ద సమస్యలైతే తానే స్వయంగా వచ్చి సంప్రదింపులు చేస్తామని అన్నారు. అనంతరం గిరిజనులతో సామూహిక భోజనాలు చేశారు. దగ్గరలో ఉన్న కొసగుట్ట గిరిజన ఆశ్రమ పాఠశాలలోకి వెళ్లి విద్యార్థులకు దుప్పట్ల పంపిని, పుస్తకాలు, కాపీలు, పెన్నులను విద్యార్థులకు అందజేశారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని, అలాంటి వారు ఉన్నట్లయితే తమకుతెలియజేయాలని, వారిని వెంటనే అన్ని వసతులు కల్పించి విద్యాబోధనలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నిర్మల్ డిఎస్పీ మనోహర్‌రెడ్డి, సిఐ నరేష్‌కుమార్, పెంబి ఎస్సై సంజీవ్‌కుమార్, ఖానాపూర్ ఎస్సైలతోపాటు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు వౌళిక సదుపాయాలు
* అందించాలే ప్రణాళికలు రూపొందించాలి
* కుమ్రం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్
ఆసిఫాబాద్, డిసెంబర్ 8: కొత్తగా ఏర్పడ్డ కుమ్రం భీం జిల్లా ప్రజలకు సత్వరమే వౌళిక సదుపాయాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ చంపాలాల్ సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల అభివృద్ధిపై ఈనెల 14న అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు చంపాలాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలకు కావాల్సిన సదుపాయాలు, కార్యాలయాల విస్తీర్ణం తదితర అంశాలతో కూడిన సమగ్ర వివరాలను వెంటనే అందచేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం క్రింద కెరమెరి మండలంలోని 86 గ్రామాలకు ఈనెల 13లోగా మంచినీరు అందించేందుకు ఎంతవరకు అవకాశాలున్నాయని సంభందిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఉన్న పరిశ్రమల వివరాలను నివేదికలో పొందుపరచాలని సూచించారు. మూత పడ్డ సిర్పూర్ పేపరు మిల్లుపై ప్రత్యేక రిపోర్టును తయారు చేయాలన్నారు. పరిశ్రమలు,కార్మిక శాఖ అధ్వర్యంలో పనిలో నైపుణ్యత ఉన్నవారిని గుర్తించి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఐటిఐ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. జిల్లావ్యాప్తంగా రోడ్డు సౌకర్యం లేని 449 గ్రామాలున్నాయని, వీటి పూర్తికి తగిన ప్రతిపాదనలు సిధ్దం చేయాలన్నారు. పశు సంవర్ధక శాఖ ద్వారా గొర్రెలు, మేకలు, పశువుల పెంపకంతోపాటు గ్రామాల్లోని పాల ద్వారా డైరీ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా విత్తనోత్పత్తి కేంద్రాలు, భూసార పరీక్షా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. సెరికల్చర్, ఉద్యాన వనాలు, పండ్లు కూరగాయల పెంపకానికి అనువుగా ఉన్న గ్రామాలను గుర్తించాలన్నారు. మత్స్య శాఖ అధ్వర్యంలో చెరువులు, ప్రాజెక్టుల్లో చేపకల పెంపకం కోసం సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రుల్లో వౌళిక సదుపాయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల పనితీరు, సిబ్బంది వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని అందచేయాలని ఆదేశించారు. ఈసమావేశంలో జెసి అశోక్ కుమార్, జిల్లాలోని ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

చివరి భూములకు సాగు నీరు
* జిల్లా కలెక్టర్ అర్‌వి కర్ణన్
దండేపల్లి, డిసెంబర్ 8: చివరి భూములకు సాగు నీరందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంచిర్యాల కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు. దండేపల్లి మండలం తానిమడుగువద్ద గల 30వ డిస్టిబ్యూటరీ కాలువలు, గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ఇన్‌టేక్ వెల్‌ను కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీలో కడెం ప్రాజెక్ట్ 43వ డిస్టిబ్యూటరీ చివరి భూములకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో కాలువల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు వచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా 293 క్యూసెక్కుల సాగునీటికి 43వ డిస్టిబ్యూటరీ వరకు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామనిపైన ఉన్న రైతులు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కాలువలకు తూములు లేకపోవడాన్ని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అందుకు కలెక్టర్ స్పందించి రైతులు సమన్వయ కమిటి వేసుకోని సాగు నీరును సద్వీనియోగం చేసుకోవాలని తెలిపారు.
సన్నరకం ధాన్యం కోనుగోలు చేయాలని రైతుల వినతి
కాలువలు పరిశీలించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ అర్ కర్ణణ్‌కు జడ్పీటిసి సభ్యుడు భూక్య యశ్వంత్ నాయక్ అధ్వర్యంలో రైతులు సన్నరకం వరి దాన్యం కోనుగోలును ప్రభుత్వం చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటిసి, రైతులు సన్నరకం దాన్యం ఎవరు కోనుగోలు చేయకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురైతున్నట్లు కలెక్టర్‌కు తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ జిల్లా సంయుక్త కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. త్వరలోనే సన్నరకం ధాన్యంపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్ రావు, డిఇ నూరోద్దిన్, జెఇ శ్రీదర్, తహశీల్దార్ శ్యామాలదేవి, ఎంపిడివో టి.శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మద్దతు ధర లేక టమోటా రైతు కుదేలు
* హోల్ సెల్ ధర కిలో రూ, 1, 2
* పారేయలేక విక్రయిస్తున్న రైతులు
నిర్మల్ రూరల్, డిసెంబర్ 8: వండడానికి సులువు, నోరుకు రుచి అందించే టమాట అది పండించే రైతులకు మాత్రం దిగాలునే మిగిలిస్తుంది.టమాట ధర రోజు రోజుకు పడిపోతుండడంతో దిక్కుతోచక అయోమయానికి గురవుతున్నారు.టమాటను పండించే రైతుకు హోల్ సెల్ విక్రయంలో అతితక్కువ ధరనే లభిస్తుంది. ఒక్క పెట్టె అంటే దాదాపు 20 కిలోల టమాటను గురువారం మార్కెట్‌లో రూ. 20 కే విక్రయించారు. పెట్టుబడి పెట్టి , వ్యయప్రయాసలతో పంట పండించిన రైతుకు ఈ ధర ఏ మాత్రం కడుపు నింపదు. జిల్లాతో పాటు పొరుగు జిల్లాలో ఒకే సారి ఎక్కువ మొత్తంలో పంట చేతికందడంతో ధర పడి పొయినట్లుగా తెలుస్తుంది.ఏలాంటి కాయ కష్టం లేని రిటైల్ కూరకాయల విక్రయదారులకు తాము పెట్టిన పెట్టుబడి అనుసరించి విక్రయధరను నిర్ణయిస్తున్నారు.దీంతో అమ్మకం ధర తక్కువ అనిపించినా ఎంతోకొంత విక్రయదారులకు లాభసాటినే కల్గిస్తుంది. నిర్మల్ జిల్లాలోని దిలవార్‌పూర్, గుండంపల్లి, చించోలి, పెంబి,సిద్దిలకుంట ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ, గుడిహత్నుర్‌లతో పాటు నిజామాబాద్ జిల్లా, మహరాష్ట్ర నుంచి టమాటను విక్రయించడానికి నిర్మల్ మార్కెట్‌కు విరివిగా తరలిస్తారు. ఒక్కోసారి రైతుల ట్రాన్స్‌పోర్టు ఖర్చులు కూడా వెళ్లడం లేదంటే అతిశయోక్తి కాదు.నిర్మల్ మార్కెట్‌లో గురువారం కొందరు రైతులు టమాటను పారేయలేక విక్రయిస్తున్నామన్నారు.వినియోగదాలు తక్కువ ధరకు టమాటను కొనుగోలు చేస్తునే కష్టపడి సాగు చేసిన రైతులకు నష్టమేననని బాధను వ్యక్తం చేస్తూ మానవతను చాటుతున్నారు.

ఉపాధి కూలీలకు తప్పనిసరిగా వందరోజుల పని
* ఈజిఎస్‌లో బాధ్యతలు విస్మరిస్తే కఠిన చర్యలు
* సమీక్ష సమావేశంలో కలెక్టర్ బుద్దప్రకాష్

ఆదిలాబాద్, డిసెంబర్ 8: జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పనిదినాలు కల్పించి, వారి ఉపాధికి బాటలు వేయాలని, ఈ పథకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది, అధికారులను ఉపేక్షించేది లేదని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం, స్వచ్చ్భారత్, ఇందిరాక్రాంతి పథకాల ప్రగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ఇప్పటి వరకు సాధించిన పురోగతిని సమీక్షించారు. జిల్లాలో ఉపాధి హామీ పనితీరు నత్తనడకన సాగుతోందని, ఇప్పటి వరకు 50 శాతం పనిదినాలు మాత్రమే కల్పించడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిపిఎంలు, ఏపి ఎంలు, టెక్నిషియన్లు, మండల అభివృద్ది అధికారులు ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలోనే ముందంజలో ఉండేలా జిల్లాలో పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఉపాది హామీ కోసం కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చుచేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్యంగా బేల ఏపిఎం, డిపిఎంల వ్యవహారశైలి, నిర్లక్ష్యంపై కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను క్షేత్రస్థాయిలో అదిగమించకపోవడం బాధ్యతరహిత్యానికి నిదర్శనమని కలెక్టర్ అన్నారు. అంతేగాకుండా ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఉపాధి హామీ పథకం అనుసంధానంతో రైతులకు మేలుచేకూర్చాలని సూచించారు. ఈ పథకం ద్వారా చేపట్టాల్సిన పనుల వివరాలపై సర్పంచ్‌లు, ఏపి ఎంలు, ఫిల్డ్ అసిస్టెంట్లు అవగాహన కలిగి ఉండాలని గ్రామపంచాయతీల వారీగా కూలీలకు అవసరమైన పనులు చూపించి, జిల్లాలో పారదర్శకంగా పనులు కల్పించాలని అన్నారు. ముఖ్యంగా వర్మీకంపోస్టు తయారిలో గ్రామప్రజలను చైతన్యపర్చి రసాయానిక ఎరువుల వాడకాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆసరా పింఛన్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేసి ప్రతి నెల గడవులోగా పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ఇందిరాక్రాంతి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించాలన్నారు. నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి కృష్ణారెడ్డి, జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి రాజేశ్వర్ రాథోడ్, ఉద్యాన శాఖ డిడి నర్సింగ్‌దాస్, జిల్లా నీటి పారుదల శాఖ ఈఈ సుశీల్, జిల్లా పశు సంవర్దకశాఖ అధికారి రామరావు, ఎంపిడీవోలు రవీందర్ రాథోడ్, పుష్పలత, సునిత, భూమన్న, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.