అదిలాబాద్

బాసర వద్ద అడుగంటిన గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, ఏప్రిల్ 21: బాసర పుణ్యక్షేత్రం వద్ద గోదావరి నది అడుగంటుతోంది. వేసవి ప్రారంభానికి ముందే ఏప్రిల్ మాసంలో గోదావరి నది అడుగంటుతుండడంతో రాబోయే రోజుల్లో పుణ్యస్నానాలకు భక్తులకు ఇక్కట్లు తప్పేలా లేవు. గత సంవత్సరం సైతం ఇదేమాసంలో గోదావరి నది ఏడారిగా మారింది. దీంతో ఆలయ అధికారులు భక్తుల పుణ్యస్నానాలకు నీటిషవర్లను ఏర్పాటుచేశారు. గోదావరి నదిపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలు సైతం జీవనోపాధికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బాసర పరివాహక ప్రాంతంతోపాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చే మత్స్యకార కుటుంబాలు వందకుపైగా కుటుంబాలు గోదావరి నదిని నమ్ముకుని జీవనోపాధిని సాగిస్తున్నారు. ప్రత్యేకంగా బోయవారు నదిలో చేపలవేట, పడవల ద్వారా ప్రయాణీకులను విహరింపచేయడం, గంగతెప్పల అమ్మకం, తదితర వాటి ద్వారా ఉపాధిని పొందుతున్నారు. మరో వారం రోజులోపల ఎండలు అధికమయ్యే సూచనలు ఉండడంతోగోదావరి నది పూర్తిగా ఎడారిగా మారే అవకాశం ఉంది. దీంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.

మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం
* గోదావరి, కృష్ణా జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్
మామడ, ఏప్రిల్ 21: వెనుకబడిన తరగతుల వారికి భవిష్యత్తులో వారికి అన్యాయం జరుగుతుందని గోదావరి, కృష్ణాజలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ అన్నారు. మండల కేంద్రంలో స్తానిక గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నాచేసిన అనంతరం తహసిల్దార్ రామస్వామికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించడం సబబుకాదన్నారు. కేసి ఆర్ ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లను ప్రవేశపెట్టి ఒకేవర్గం వారి మెప్పు పొందేందుకు రిజర్వేషన్లు పెంచారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మతపరమైన రిజర్వేషన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షుడు లింగన్న, నాయకులు రవి, సత్యనారాయణ, రమేష్ తదితరులు ఉన్నారు.

సమ్మెలో టిబిజికెఎస్ కలిసి రావాలి
శ్రీరాంపూర్ రూరల్, ఏప్రిల్ 21: సింగరేణి వారసత్వ ఉద్యోగాలను సాదించడంలో టిబిజికే ఎస్ పూర్తిగా విఫలం అయిందని సమ్మె ఒక్కటే ఏకైక మార్గమని జాతీయ సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపులో టిబిజికే ఎస్ కలిసి రావాలని ఎ ఐ టియూసి వర్కింగ్ ప్రెసిండెంట్ వై గట్టయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ ఆర్ పి 3 గని ద్వారా సమావేశంలో మాట్లాడారు. కోర్టు తీర్పును వీ ఆర్ ఎస్‌కు వ్యతిరేకంగా వచ్చిన మళ్లీ కోర్టుకు వెళ్తామని కార్మికులను మోసం చేయడం టిబిజికే ఎస్ అవివేకం అన్నారు. వారసత్వ ఉద్యోగాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన దానిని విధి విధానాలను పని చేయించలేకపోవడంతో హై కోర్టు, సుప్రీం కోర్టులలో కేసు వీగిపోయిందని అయిన టిబిజికే ఎస్ నివారణ చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపులో టిబిజికే ఎస్ కలిసి వచ్చి కార్మిక వర్గంపై వారికి ఉన్న చిత్తశుద్దిని చాటుకోవాలన్నారు. సింగరేణిలో జనవరి నుంచి మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకున్న కార్మికులకు వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసారు. ఈ నెల 27 ఆర్ అండ్ బీ వద్ద వీ ఆర్ ఎస్ పై జరిగే చర్చలు విఫలమైతే కార్మికులు సమ్మెకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా సింగరేణి, ప్రైవేటీకరణ పేరుతో తాడిచెర్ల వన్, టూ బ్లాక్‌లను ప్రైవేట్ పరం చేయడానికి యజమాన్యం కుట్ర పన్నుతుందని కొత్తగూడెం, యూకే 5, శాంతిఖని, కేటికే 3, బ్లాక్ ల ప్రైవేటికరణపై టిబిజికే ఎస్ నోరు మెదపకపోవడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ఏ ఐ టియూసి ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అందోళనలు ఉదృత్తం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, జిల్లా నాయకులు దాస్, వీరమల్లు, కాంపల్లి నర్సయ్య, సారేందర్, మురళీ చౌదరి, నాగభూషణం, జోగుల మల్లయ్య, సదానందం, తదితరులు పాల్గొన్నారు.

ప్రచారం కోసమే రిజర్వేషన్ల పెంపు
* డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, ఏప్రిల్ 21: ముఖ్యమంత్రి కేసి ఆర్ ప్రచారం కోసమే మైనార్టీలకు రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు చెబుతున్నారని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కోసం కల్లిబొల్లి మాటలు చెబుతూ తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. జీవోను సవరించకుండా రిజర్వేషన్లు కల్పించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. చట్టప్రకారం ఇది చెల్లదన్నారు. మైనార్టీల ఓట్లకోసం ఇప్పటి నుండే ప్రయత్నిస్తున్నారని వాపోయారు. రుణమాఫీ ఓ పార్స్‌గా మారిందన్నారు. విడతల వారీగా రైతుల అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు జమచేస్తామని చెప్పినప్పటికి ఇప్పటికి పూర్తిస్థాయిలో రైతు అకౌంట్లకు చేరలేవన్నారు. ఓవైపు రుణమాఫీని పూర్తిచేశామని చెప్పుకుంటూ మరోవైపు రైతులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రైతులకు ఎరువుల కోసం వారి అకౌంట్లలో ఎకరానికి రూ.4 వేలు జమచేస్తామని చెబుతూ వారి మద్దతును పొందే ప్రయత్నం చేస్తున్నారని, ఇది రైతులు నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ సంవత్సరం నుండే రైతుల అకౌంట్లలో డబ్బులు జమచేయకుండా ఏడాది తర్వాత జమచేస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. టిఆర్‌ఎస్ నాయకులు, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సరికెల గంగన్న, సిద్దముత్యం, అయ్యన్నగారి పోశెట్టి, అజర్, తదితరులు పాల్గొన్నారు.

పోలీసులు ప్రజల నమ్మకాన్ని చూరగొనాలి
* ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్
ఆసిఫాబాద్, ఏప్రిల్ 21: పోలీసు పట్ల ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా జవాబుదారీ తనంతో పని చేయాలని కుమ్రం భీం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ఎస్పీ సూచించారు. జిల్లాలోని మారుమూల ప్రజల అభివృధ్దికి తమ వంతు సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నేరాల కు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. నేర పరిశోధన వీలైనంత త్వరగా పూర్తి చేసిన నిందితులకు శిక్షపడేలా చూడాలని ఎస్పీ కోరారు. జిల్లాలో నేరాలు జరకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల దారులతో హుందాగా ప్రవర్తించాలని ఎస్పీ పేర్కొన్నారు. గ్రామాల్లో నిర్వహించిన పల్లెనిద్ర ఉత్తమ ఫలితాలనిచ్చిందన్నారు. పోలీసులను ప్రజలకు మరింత దగ్గర చేసిందని ఆయన పేర్కొన్నారు. గ్రామాలను సందర్శించినప్పుడు ప్రజల సమస్యలను నోట్ చేసుకొని తన దృష్టికి తేవాలన్నారు. నేరాలకు సంభందించిన సమాచారం మరింత వేగంగా వచ్చేందుకు సమాచార సాధనాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ఉపయోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రద్దీ ఉండే ప్రదేశాల్లో సిసి కెమరాల ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి ఆయా శాఖల సమన్వయంతో ఈసంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన ఆదేశించారు. కేవలం మానవ తప్పిదం, మితిమీరిన వేగం వల్లే చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఉందని ఎస్పీ అన్నారు. ఓవర్‌లోడ్ నియంత్రణకు తరచు వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఈసమావేశంలో సిఐటియు ఎస్పీ శ్రీనివాస్, ఎస్‌బి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌బి ఎస్‌ఐ శివకుమార్, డిసిబి ఎస్‌ఐ రామారావు, ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు.

జిల్లా అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం
* కలెక్టర్ చంపాలాల్
ఆసిఫాబాద్, ఏప్రిల్ 21: నూతనంగా ఏర్పడ్డ కుమ్రం భీం జిల్లా అభివృధ్దిలో అధికారుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ చంపాలాల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో 11హెచ్‌కె సివిల్ సర్వీసెస్ దినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా అభివృధ్ది చెందాలంటే విద్య, వైద్య రంగాల్లో పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1111 హాబిటేషన్లలో రోడ్డు పనులు పూర్తి కావాల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంపొందించేందుకు అధికారులు కృషి చేయాలని, ఈమేరకు సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించి, అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సాహం అందించాలని చంపాలాల్ పేర్కొన్నారు. పేదల కోసం ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ, అభివృధ్ది పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వంపై మరింత నమ్మకాన్ని పెంచేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అంకితభావంతో పని చేసినప్పుడే అధికారులకు సరైన గుర్తింపులభిస్తుందని కలెక్టర్ అన్నారు. కాగా సివిల్ సర్వీసెస్ డేను పురస్కరించుకొని అధికారులు కలెక్టర్ చంపాలాల్‌ను శాలువాతో సన్మానించారు. ఈకార్యక్రమలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, సిపిఓ కృష్ణయ్య, మైనారిటీ అధికారి మహమూదుల్లాఖాన్ పాల్గొన్నారు.

భగ్గుమన్న సూరీడు
* ఆసిఫాబాద్‌లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత
* వడగాలులతో జనం విల విల

ఆదిలాబాద్, ఏప్రిల్ 21: భగ భగ మండుతున్న ఎండలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నిప్పులకుంపటిని రాజేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలోనే రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా వడగాలుల తాకిడికి జనం బేజారవుతున్నారు. ఆసిఫాబాద్‌లో శుక్రవారం 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా జైనూర్, కెరమెరి, ఉట్నూరు కేంద్రాల్లో 44.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఎండల తాకిడికి ఇంటి నుండి బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొనగా చిన్నారులు, వృద్దులు, యాచకుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. వేసవిలో ఉపాధి హామీ పథకం కింద కూలీకి వెళ్లే సామాన్యులు ఎండల తాకిడితో వడదెబ్బ సోకి ఆస్పత్రి పాలవుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉట్నూరు కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో విష జ్వరాలు, వడదెబ్బతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగి ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోయాయి. ఉదయం 9 గంటలు దాటిదంటే చాలు ప్రధాన రోడ్లన్నీ నిర్మానుషంగా మారి కర్ప్యూవాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఆదిలాబాద్‌లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా జాతీయ రహదారిలోని కలెక్టరేట్ చౌక్, తెలంగాణ చౌక్‌లో మిట్టమధ్యాహ్నం జన సంచారం లేక రోడ్లన్నీ వెల వెలబోయాయి. ప్రధాన వీదుల్లో సైతం జనం లేక మార్కెట్‌లో వ్యాపారం స్థంభించిపోయింది. ఇక ప్రభుత్వ కార్యాలయాలోనూ మొక్కుబడిగానే విధులకు హాజరవుతున్నారు. గాలిలో తేమ శాతం పూర్తిగా తగ్గిపోయి జిల్లా వ్యాప్తంగా వేడి గాలులు వీస్తుండడంతో ఎండల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. ఇక పెళ్ళీళ్ళ సీజన్ కావడంతో ఆర్టీసి బస్సులో సుదూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలోని బేల, తాంసి, బోథ్, నిర్మల్, భైంసా మండలాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతుండడంతో భూగర్బజలాలు అడుగంటిపోయి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వేడిగాలులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతుండగా నెల రోజుల్లోనే ఇప్పటి వరకు 14 మంది వడదెబ్బ సోకి మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోనూ వడదెబ్బ బాధితుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. తీక్షణంగా ఎండలు మండుతున్న నేపథ్యంలో బయటకు వెళ్ళే ప్రతి ఒక్కరు రక్షణగా తలకు రుమాలు కట్టుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, ముఖ్యంగా కూలీలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తేనే వడదెబ్బ సోకే ప్రమాదం ఉండదని పేర్కొంటున్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లా నుండి టీఆర్‌ఎస్ ప్లీనరికి వెళ్ళిన కార్యకర్తలు ఉదయం పూటనే హైదరాబాద్ వెళ్ళగా సిర్పూర్‌టి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ట్రస్టు అధ్వర్యంలో సుమారు 20వేల మందికి ఒకే రోజు అంబలి పంపిణీ చేసి వేసవి ఎండల నుండి ఉపశమనం కల్గించారు.