అదిలాబాద్

నేటి నుండి శారదీయ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం * ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, సెప్టెంబర్ 20: సుప్రసిద్దపుణ క్షేత్రం చదువులతల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతుంది. హేమలంబినామ సంవత్సరం అశ్వాయుజ శుద్దప్రతిపద నుండి విజయదశమి వరకు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈనెల 21 గురువారం నుండి 30-9-2017 శనివారం వరకు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రత్యేకాధికారి, డిప్యూటీ కలెక్టర్ ఎ.సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. దక్షిణభారతదేశంలోని ముగ్గురమ్మలు కొలువుదీరిన బాసర క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండేకాక మహారాష్ట్ర నుండి సైతం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శారదీయ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి గర్భాలయంతోపాటు ఉప ఆలయాలను సైతం విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబుచేశారు. అమ్మవారి సన్నిధిలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తమిళనాడు నుండి ప్రత్యేకంగా తయారుచేసిన అమ్మవారి మూర్తులను ఒక్కోరోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిచ్చేలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల రద్దీకి అనుగుణంగా సాధారణ, ప్రత్యేక క్యూలైన్‌లతోపాటు ఆలయ ప్రాంగణంలో తాగునీటి సౌకర్యాలు, షామియానాలను ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు. నాందేడ్ జరీపురకు చెందిన బాబా జగదీష్ మహరాజ్, దేవస్థానం వారి ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరితోపాటు ప్రతీరోజు సాయంత్రం కాలక్షేప మండపంనందు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు దేవాదాయశాఖ అధికారులు పేర్కొన్నారు.
బాసర గ్రామస్తుల తరపున అమ్మవార్లకు పట్టువస్త్రాలు
శారదీయ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మొదటిసారిగా బాసర గ్రామస్తుల తరపున ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించేందుకు ముందుకు వచ్చారు. బుధవారం ఉదయం మంగళవాయిద్యాలు, భాజా భజంత్రీల మద్య పట్టువస్త్రాలను గ్రామంలోని పురవీధులగుండా ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలోని గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ స్థానాచార్యుడు ప్రవీన్‌పాఠక్, ఆలయ ప్రత్యేకాధికారి, డిప్యూటి కలెక్టర్ ఎ.సుధాకర్‌రెడ్డిలకు పట్టువస్త్రాలను అందజేశారు. గురువారం వేకువజామున అభిషేక సేవల అనంతరం గ్రామస్తులు అందజేసిన పట్టువస్త్రాలనే అమ్మవార్లకు ప్రధానం చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ శైలజా సతీశ్వర్‌రావు, గ్రామపెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆలయంలో నేటి పూజా వివరాలు.......
వేకువజామున 4 గంటలకు మంగళవాయిద్య సుప్రబాత సేవలతో ఉత్సవాలను ప్రారంభించి 4.30 గంటల నుండి అమ్మవార్లకు మహాభిషేకం, అలంకరణ, మంగళహారతి, మంత్రపుష్పం పూజలను నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు యాగమండపం నందు క్షేత్రపూజ, గణపతిపూజ, స్వస్తి పుణ్యహవచనం, ఘటస్థాపనతో ఉత్సవాలకు అంకురార్పన చేస్తారు.

కూతురికి ఉరి వేసి తల్లి ఆత్మహత్య
కాగజ్‌నగర్, సెప్టెంబర్ 20; కాగజ్‌నగర్ మండలం సీతానగర్‌కు చెందిన జయ బిస్వాస్ (32) కుటుంబ కలహాలతో తన కూతురు ఖుషీ బిస్వాస్‌కు ఉరి వేసి తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇజుగాం పోలీసుల కథనం ప్రకారం మృతురాళికి ప్రదీప్ బిస్వాస్ అనే వ్యక్తితో 10యేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రదీప్ కొంత కాలంగా వేరే మహిళతోకలిసి ఉంటున్నాడు. దీంతో కుటుంబంలో గొడవలు మొదులు కాగా వారం క్రితం మృతురాళి వద్దకు వచ్చిన భర్త తన ఇద్దరి కుమారులను తీసుకుని వెల్లిపోయాడు దీంతో మనస్తాపానికిగురై జయ బిస్వాస్ మంగళవారం రాత్రి తన ఇంట్లో మొదట తన పాపకు ఉరి వేసి అనంతరం తను ఆరు వేసుకుని మృతి చెందింది ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని కాగజ్ నగర్ రూరల్ సి ఐ ప్రసాద్ రావు, ఇజుగాం ఎస్ ఐ సుధాకర్, కాగజ్ నగర్ రూరల్ ఎస్ ఐ రాజేష్‌లు పరిశీలించారు.

అదృష్టంపైనే ఆశలు
* 26 మద్యం దుకాణాలకు 557 దరఖాస్తులు
* జిల్లాకు రూ.5.57 కోట్ల ఆదాయం
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 20: మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో వ్యాపారులు ఇక అదృష్టంపైనే ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ఎక్సైజ్ సబ్‌డివిజన్ పరిధిలోని 26 మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్లు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు దరఖాస్తులు వెల్లువెత్తడంతో ఈప్రక్రియ అర్థరాత్రి వరకు సాగింది. రెండు డివిజన్లలో కలిసి ఏకంగా 557 దరఖాస్తులు దాఖలైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ ఎక్సైజ్ డివిజన్‌లోని 14 దుకాణాలకు 188 అప్లికేషన్లు, కాగజ్‌నగర్ సర్కిల్ పరిధిలోని 12దుకాణాలకు 369 దరఖాస్తులు అందాయి. అత్యిధికంగా బెజ్జూర్ మ్యదం దుకాణానికి ఏకంగా 80, కౌటాల మండలంలోని దుకాణం 1కి 40, దుకాణం 2కు 45 అప్లికేషన్లు వచ్చాయి. ఆసిఫాబాద్ డివిజన్ పరిథిలోని వాంకిడి మద్యం దుకాణాలను కైవసం చేసుకునేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. ఇదిలా ఉండగా శుక్రవారం లక్కీ డ్రా ద్వారా దుకాణాల విజేతలను ఎంపిక చేస్తారు. దీంతో దుకాణాలను ఎలాగైనా దక్కించుకునేందుకు రూ.లక్ష సైతం లెక్క చేయకుండా టెండర్లలో పాల్గొన్న వ్యాపారుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏ మండలానికి వెల్లినా దుకాణం దక్కించుకునేది ఎవరో అనే చర్చ వినిపిస్తోంది. మరోవైపు దుకాణాలు దక్కుతాయా లేదా అనే దానిపై కొంత మంది వ్యాపారులు ప్రత్యేక పూజలు చేయడమేకాకుండా, జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్నారు.

సందడిగా పూల పండగ జాతర షురూ
* వాడవాడలా బతుకమ్మ సంబరాలు

ఆదిలాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండగ ఉత్సవాలు బుధవారం జిల్లా వ్యాప్తంగా సంబరంతో సందడిగా మొదలయ్యాయి. ఆడపడుచులంతా ఆనందంగా కలిసి జరుపునే రంగు రంగుల పూల పండగలతో ఊరువాడా కదిలిరాగా ఆట పాటలతో యువతులు, మహిళలు సంబరాల్లో పాల్గొన్నారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మలను పేర్చి యువతులు ఉత్సవాలను ప్రారంభించగా ఆదిలాబాద్‌లోని గౌతమి డిగ్రీ కళాశాలలో తెలంగాణ జాగృతి అధ్వర్యంలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. పది రోజుల పాటు సాగే పూల జాతర ఉత్సవాలకు పల్లె పట్నం తేడాలేకుండా మహిళలు హుషారుగా జరుపుకునేందుకు సిద్దమవుతున్నారు. ముందుగా బతుకమ్మలను పేర్చి గౌరి దేవిని పూజించి బతుకమ్మ ప్రాశస్తాన్ని వివరిస్తూ పాడే పాటలు అందరికి ఆకట్టుకున్నాయి. ఈనెల 24న హైదరాబాద్‌లో జరిగే మహా బతుకమ్మ పండగకు తరలివెళ్తున్నట్లు ఆదిలాబాద్ విద్యార్థినిలు పేర్కొన్నారు.

ప్రజాఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
* జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్
నిర్మల్, సెప్టెంబర్ 20: ప్రజాఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పోలీసు గస్తీ, నిఘా వ్యవస్తను పటిష్టంచేయాలని సూచించారు. ప్రజారక్షణలో పోలీసు వ్యవస్థ ముందుండాలన్నారు. ప్రజలకు పోలీసులపైన విశ్వాసం పెరిగిందన్నారు. పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసులే కీలకమని, ప్రజలమద్య ఉంటూ సమస్యలు పరిష్కరించాలన్నారు. విధి నిర్వహణలో పోటీపడుతూ నేరాలను తగ్గించేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించాలన్నారు. పోలీస్‌స్టేషన్ రికార్డులను అప్‌డేట్‌చేస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. నేరాలను నియంత్రించడంతోపాటు దర్యాప్తుకు దోహదపడే సిసి కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలన్నారు. దసరా నవరాత్రుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీలు మనోహర్‌రెడ్డి, అందె రాములు, ఇన్స్‌పెక్టర్లు జాన్ దివాకర్, జీవన్‌రెడ్డి, రఘు, పెద్దన్నకుమార్, రఘుపతి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

రాబందుల గుట్ట ఆవాస ప్రాంతాన్ని సందర్శించిన కుంమ్రం జిల్లా కలెక్టర్ చంపాలాల్
బెజ్జూర్, సెప్టెంబర్ 20 ; రాబందుల గుట్ట ఆవాస ప్రాంతాన్ని కుంమ్రం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ సందర్శించారు.బుధవారం కుంమ్రం జిల్లా జిల్లా పెంచికల్ పేట అటవీ ప్రాంతంలోని నందిగామ గుట్ట వద్ద రాబందుల నివాస ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. రాబందుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రాబందుల సంతతి వాటి జీవన విధానం తదితర అంశాలను సంబందిత జిల్లా అటవీ సంరక్షణ అధికారి రంజిత్ లక్ష్మణ్ నాయక్ లను అడిగి తెలుసుకున్నారు. రాబందువులు ఎన్ని ఉన్నాయి వాటి వివరాలను, రాబందువులు ఉండే ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. రాబందువుల మనుగడకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం బెజ్జూర్ మండలంలోని సమ్మర్ గాం, పెంచికల్ పేట మండలంలోని నందిగాం గ్రామాలను సందర్శించారు. గ్రామల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంటన జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, జిల్లా అటవీ అధికారి లక్ష్మణ్ రంజిత్ నాయక్, కాగజ్ నగర్ ఆర్డీవో రమేష్ బాబు, పెంచికల్ పేట తహసిల్దార్, రియాజ్ అలీ, ఎఫ్ ఆర్‌వోలు రాం మోమన్, స్వామి, ఫారెస్ట్ సెక్షన్ అధికారి ప్రభాకర్, రాబందుల పరిశోదకుడు రవికాంత్, సర్పంచ్ శ్రీనివాస్‌లు ఉన్నారు.అనంతరం బెజ్జూర్ రేంజ్‌లోని తాపన్ పేట అటవీ ప్రాంతంలోని వాట్ టవర్‌ను పరిశీలించారు.

అంబులెన్స్‌తో పశువైద్యసేవలు వేగవంతం
* జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి

ఆదిలాబాద్, సెప్టెంబర్ 20: మారుమూల గ్రామాల్లో గొర్రెలతోపాటు పశువైద్య సేవలు సకాలంలో అందించేందుకు ఆధునాతన అంబులెన్స్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని, దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పశువైద్యం కోసం కొత్తగా ప్రవేశపెట్టిన సంచార అంబులెన్స్‌లు బుధవారం జిల్లా కేంద్రానికి రాగా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి పరిశీలించారు. ప్రభుత్వం గొల్ల కుర్మలకు పెద్ద ఎత్తున గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిందని, వీటికి అత్యవసర వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే అంబులెన్స్‌లను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అంతేగాక గ్రామాల్లో పశువులకు అత్యవసర వైద్యం అందుబాటులో లేకపోవడంతో అవి మృత్యువాత పడుతున్నాయని, డాక్టర్లకు కూడా చేతినిండా పనికల్పించాలన్న లక్ష్యంతో సంచార వైద్యసేవలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 1962 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌చేస్తే అంబులెన్స్‌తో పాటు డాక్టర్లు, పశువైద్య సిబ్బంది గ్రామాలకు తరలివచ్చి చికిత్సలు అందిస్తారని కలెక్టర్ తెలిపారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రస్తుతం ఆధునాతన అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. అనంతరం సంచార వైద్యం, అంబులెన్స్‌ల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు.

వారసత్వం సాధించపోతే నా ముఖం చూపించా
* దసరా కానుకగా టిబిజికెఎస్ గెలిపించండి
* దీపావళి కానుకగా వారసత్వం
* పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సమన్
శ్రీరాంపూర్ రూరల్, సెప్టెంబర్ 20: సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా వారసత్వం ఉద్యోగాలను ఇవ్వకపోతే ముఖం చూపించనని పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్ ఉద్వేగబరితంగా ప్రసంగించారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరరియాలోని ఆర్కె న్యూటెక్ గని ద్వార సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావులతోకలసి మాట్లాడారు. సింగరేణిలో కెసిఆర్ ద్వారనే వారసత్వం సాధ్యమని, జాతీయ సంఘాలు ఎన్ని కుట్రలు పన్నినా వారసత్వం సాధించలేరని అన్నారు.తెలంగాణ సాధించుకున్నకార్మికులకు వారసత్వం ఇవ్వాలనే తపనతోనే ముఖ్య మంత్రి కెసిఆర్ ప్రకటిస్తే ఐటియుసి నాయకులు కేసులు వేసి అడ్డుకున్నారు. అంతేకాకుండా త్వరలోనే కార్మికులకు స్వంతింటి పథకం కింద వడ్డిలేని రూ.10లక్షల రుణాన్ని సీ ఎం కెసిఆర్ కార్మికులకు ప్రకటించనున్నారని పేర్కొన్నారు.దసరా అడ్వాన్సు 20వేలకు పెంచి ప్రకటిస్తారని,లాభాల్లో వాటా మూడేళ్ళలోనే 23శాతం పెంచుకున్నామని,ముఖ్య మంత్రి కెసిఆర్ 25శాతం పెంచేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. అనంతరం ఇతర యూనియన్ చెందిన కార్మికులు టిబిజికె ఎస్ లో చేరారు, వారికి ఎంపి బాల్క సుమన్ యూనియన్ కడువాకప్పి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపెల్లికోటిలింగం, ఎన్నికల సమిటి సభ్యులు బంటు సారయ్య, బండి రమేష్, ఎనుగు రవిందర్ రెడ్డి, సిహెచ్ ఆశోక్, మల్లారెడ్డి, వీరబద్రయ్య, కానుగంటి చంద్రయ్య, కుమారస్వామి, రాఘవరెడ్డి, ప్రభాకర్ తదితరలు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమానికే భూ ప్రక్షాళన
* గ్రామసభలో పాల్గోన్న రాష్ట్ర మంత్రి అల్లోల
దిలావర్‌పూర్, సెప్టెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టకంగా నిర్వహిస్తున్న భూ రికార్డుల ప్రక్షాళనతో రైతులకు ఎంతో లబ్ది చెందుతారని రాష్ట్ర గృహ న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.మండలంలోని బన్సపెల్లి గ్రామంతో పాటు నర్సాపూర్ జి మండలకేంద్రంలో బుదవారం భూ రికార్డుల ప్రక్షాళన గ్రామ సభలో మంత్రి పాల్గోన్నారు. ఈ సందర్బంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతుల బాదలు తెలుసుకొని రైతుల ప్రయోజనాలకొసం పాటు పడుతున్నారన్నారు. రాబోయో ఖరీప్ సీజన్ వరకు రైతులకు వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం ఎకరానికి రూ.4వేలు ఇవ్వడానికి ఎర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రైతులకు వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఇవ్వడం వలన రైతుల ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. అనంతరం ఇటివల మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామస్తులకు చెక్కుల రూపంలో డబ్బులు అందించారు.నిర్మల్ మార్కెట్ చైర్మన్ దేవేందర్ రెడ్డి,మండల సమన్వయ సమితి కన్వీనర్ పి.రమణ రెడ్డి,తాహసిల్దార్ నర్సయ్య, ఎంపిడివో సాయిరాం, డి ఈ తుకరాం నాయకులు పాల్డె శ్రీనివాస్,మేకల నరేష్,శ్యాం సుందర్ రెడ్డి,తుకరాం,గంగారెడ్డి తదితరులు కలరు.

సామాజిక ఐక్యతకు బతుకమ్మ ప్రతీక

* మంత్రి అల్లోల, జడ్పీ చైర్‌పర్సన్ శోభా సత్యనారాయణగౌడ్
నిర్మల్, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో సామాజిక ఐక్యతకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలిచిందని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జడ్పి ఛైర్‌పర్సన్ శోభా సత్యనారాయణగౌడ్‌లు తెలిపారు. బుధవారం రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో వారు బతుకమ్మ ఆడుతూ కోలాటాలు వేస్తూ సందడిచేశారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఈ బతుకమ్మ పండుగ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటుండడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలోనే కాకుండా ఫ్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు పలు దేశాల్లో జరుపుకుంటుండడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. బతుకమ్మ పండుగ మహిళలందరిని ఐక్యం చేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ పండుగకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెణ్ అప్పాల గణేష్ చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ శివలింగయ్య, ఆర్డీవో ప్రసూనాంభ, డి ఆర్‌వో నగేష్, మున్సిపల్ కమీషనర్ త్రయంబకేశ్వర్‌రావు, కుంటాల జడ్పిటిసి, కౌన్సిలర్లు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల మహిళలు పాల్గొన్నారు.