అదిలాబాద్

బుద్ధుని బోధనలతో మానవ జీవితం చరితార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 21: సమాజంలో ప్రతిఒక్కరూ సుఖసంతోషాలతో ప్రశాంత జీవనం గడిపేందుకు గౌతమి బుద్ధుని బోధనలు అనుసరణీయమని, ఆయన ఆశయాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్‌లోని రిక్షాకాలనీలో గల లుంబిని బుద్దవిహార మందిర్‌లో ఏర్పాటు చేసిన బుద్ధుని 2560వ జయంతి వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పంచశీల జెండా ఎగరవేసి బుద్ధుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ బుద్దుని బోధనలు అనుసరిస్తే జీవితం చరితార్థం అవుతుందని, సర్వమత సారాంశాలకు బుద్దుడు స్పూర్తిప్రదాతగా నిలుస్తాడన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి వైపు అడుగులు వేయాలని, మానవుని జీవితంలో ప్రశాంతతకు మించినది ఏమిలేదని బోధించిన గొప్ప మహానీయుడు గౌతమ బుద్ధుడన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద గల డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, డిసిసిబి చైర్మన్ దామోదర్ రెడ్డి, జడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్, విఠ్ఠల్‌రావ్ బోర్కర్, అల్లారి మాధవ్‌రావు, అల్లారి విజయ్, మావల సర్పంచ్ ఉష్కం రఘుపతి, ఆదిలాబాద్ మండల ఉపాధ్యక్షులు గంగారెడ్డి, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను పరిశీలించిన మంత్రి రామన్న
ఆదిలాబాద్ టౌన్, మే 21: జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను శనివారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఔషదాల నిల్వలు, అక్కడి వసతులపై ఆరా తీశారు. అనంతరం మంత్రి రామన్న మాట్లాడుతూ జిల్లాలో పేదరికంతో బాధపడుతున్న రోగులకు అవసరమైన అన్నిరకాల మందుల నిల్వలు ఉంచి, రిమ్స్‌తో పాటు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేయాలని అన్నారు. పేద రోగులకు ఇబ్బందులు కల్గకుండా సహకరించాలని మంత్రి అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర వౌలిక అభివృద్ధి సంస్థ మందులను పరిశీలించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న భవనాల పనులను వేగవంతం చేయాలని, టీచింగ్, నాన్‌టీచింగ్ వారికోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి, ప్రాంగణమంతటా మొక్కలు నాటాలని అన్నారు. ప్రహారీగోడ నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్, ఆర్డీవో సుధాకర్ రెడ్డి, రిమ్స్ డైరెక్టర్ కె.అశోక్, టిఎస్ ఎంఎస్‌ఐడిసి ఎస్‌ఈ దేవేందర్ కుమార్, ఈఈ జి.కుమార్, డిప్యూటీ ఈఈ రామకృష్ణరావుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

పక్కా ప్రణాళికతోనే హత్యలు
* చంపింది ఇద్దరు.. సహకరించింది ఏడుగురు
* భైంసా ఘటనలో 9 మంది అరెస్ట్
* వివరాలను వెల్లడించిన ఎస్పీ తరుణ్‌జోషి
నిర్మల్, మే 21: ఈనెల 10న భైంసా పట్టణంలో జరిగిన ఐదుగురు హత్యోదంతం వెనుక ఉన్న 9 మంది నింధితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిర్మల్ డిఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి నింధితుల వివరాలను వెల్లడించారు. ఈ హత్యలు పక్కా ప్రణాళికతో ఇద్దరు వ్యక్తులు మరో ఏడుగురి సహకారంతో చేశారని ఎస్పీ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం భైంసా పట్టణానికి చెందిన నియమతుల్లాఖాన్, యూనిస్‌ఖాన్, వహీదాఖాన్, అక్రమ్‌బి, ఆయేషా ఖానంలు ఈ నెల 10న దారుణ హత్యకు గురయ్యారు. కేవలం అరగంటలో జరిగిన ఈ మారణకాండలో ఐదుగురు దుర్మరణం చెందడంతో భైంసా పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేశారు. ఈ విచారణలో హత్యలు చేసింది మృతుల రక్తసంబంధీకులేనని తేలింది. భైంసా పట్టణానికి చెందిన మహ్మద్ జావిద్‌ఖాన్, సయ్యద్ మాజిద్ అలిలు తల్వార్‌లతో ఐదుగురిని హత్యచేయగా వీరికి సయ్యద్ సాదక్, మహ్మద్ నీరుల్లాఖాన్, సయ్యద్ సాజిద్, అసదుల్లాఖాన్, అత్తుఖాన్, సయ్యద్ సుల్తానాబేగం, సయ్యద్ వాజిద్‌లు సహకరించారు.
పక్కా ప్రణాళికతోనే...
ఐదుగురిని ఒకేసారి పొట్టనబెట్టుకున్న 9 మంది నిందితులు పక్కా ప్రణాళికతో హత్యలకు పాల్పడ్డారు. భైంసాలోని ఓ ఇంటి స్థలానికి సంబంధించి గతంలో జరిగిన గొడవల కారణంగా జెలు శిక్ష పడ్డ మహ్మద్ జావీద్‌ఖాన్, సయ్యద్ మాజిద్ అలిలు తమను జైలుపాలుచేసిన కుటుంబాలను ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ముందుగానే నిజామాబాద్‌లోని అసద్‌బాబా నగర్‌లో ఓ ప్లాటును కొనుగోలుచేసి వారి కుటుంబ సభ్యులను, ఇంటి సామాగ్రిని అక్కడికి చేర్చారు. అనంతరం ఈ నెల 10న మహ్మద్ జావిద్, మాజిద్ అలిలు ఓ స్కూటర్‌పై భైంసా పట్టణంలోని నిర్మల్ చౌరస్తాలో గల పాత ఇనుప సామాగ్రి దుకాణానికి వెళ్లి అక్కడ ఉన్న నియమతుల్లాఖాన్‌పై దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించగా, దీనిని అడ్డుకునేందుకు యత్నించిన యూనిస్‌ఖాన్‌ను కూడా చంపేశారు. ఇక్కడ హంతకులకు సయ్యద్ సాదక్, మహ్మద్ నీరుల్లాఖాన్‌లు జతకలిశారు. ఈ నలుగురు కలిసి వహిదాఖాన్ ఇంటికి వెళ్లగా సయ్యద్ సాజిద్, అత్తుఖాన్‌లు ఎవరూ రాకుండా ఇంటికి కాపలాగా ఉన్నారు. వహిదాఖాన్ ఇంటికి వెళ్లిన జావిద్‌ఖాన్, మాజిద్ అలిలు వహిదాఖాన్‌ను దారుణంగా హత్యచేశారు. అంతేకాకుండా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును, చెవి కమ్మలను ఎత్తుకెళ్లారు. అనంతరం జావిద్‌ఖాన్, మాజిద్ అలిలు అక్రమ్‌బి ఇంటికి వెళ్లారు. ఆమెను కూడా హత్యచేయడమే కాకుండా తోడుగా ఉన్న 14 ఏళ్ల ఆయేషాఖానంపై కూడా దాడికి తెగబడడంతో ఆమె కొన ఊపిరితో భైంసా ఆసుపత్రిలో చేరింది. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమద్యంలో మరణించింది. అక్రమ్‌బి ఇంటి వద్ద నింధితులు దాడికి పాల్పడుతున్న సమయంలో అసదుల్లాఖాన్, సయ్యద్ సుల్తానా బేగంలు నింధితులకు సహకరించారు. బాధితులు, నింధితులంతా రక్తసంబంధీకులే కావడం గమనార్హం. కాగా ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన పోలీసులు నింధితులను గుర్తించి ఈ నెల 20న బాసర సమీపంలో గోదావరి బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకున్నారు. కేవలం చిన్న ఆస్థి విషయంలో పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని ఇంత దారుణానికి ఒడిగట్టడాన్ని ఎస్పీ తీవ్రంగా తప్పుబట్టారు. మానవీయ విలువలు రోజు రోజుకు దిగజారుతున్నాయనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. రక్త సంబంధీకులు అయినప్పటికి పదునైన ఆయుధాలతో దారుణంగా హతమార్చిన నింధితులకు కఠిన శిక్షలు పడే విధంగా చూస్తామని తెలిపారు. సమావేశంలో నిర్మల్, బైంసా డిఎస్పీలు మనోహర్‌రెడ్డి, అందె రాములు, సిఐలు జీవన్‌రెడ్డి, రఘు, పురుషోత్తమచారి, ఎస్సైలు పాల్గొన్నారు.

ఖరీఫ్‌కు అంతా సిద్ధం
* వ్యవసాయ శాఖ ఉప సంచాలకుడు కోటేశ్వర్ రావు
ఉట్నూరు, మే 21: రాబోయే ఖరీఫ్ సీజన్‌కు వ్యవసాయ శాఖ అధ్వర్యంలో రైతులను ఆదుకోవడానికి అన్ని సిద్దం చేశామని వ్యవసాయ శాఖ జెడిఎ కోటేశ్వర్ రావు తెలిపారు. శనివారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన వివిధ రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. గతంలో రూ.3లక్షల 60వేల హెక్టార్లలో పత్తి పంటను సాగుచేయనుండగా ప్రస్తుతం లక్ష హెక్టార్లలో పత్తి పంటను తగ్గించి, పప్పుదినుసు, వివిధ రకాల పంటలు వేసేందుకు రైతులు సిద్దమవుతున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా లక్షా 25వేల టన్నుల యూరియ అవసరం ఉండగా, ఇప్పటికే 43వేల టన్నులు సిద్దంగా ఉన్నాయన్నారు. డిఏపి, కాంప్లెక్స్ ఎరువులతో పాటు వివిధ రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు సైతం ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదే విధంగా సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యతనిచ్చినట్లయితే పంటలు మరింత దిగుబడి వస్తాయన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రాథోడ్ గణేష్‌తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

రేపు మంచిర్యాలలో జాబ్ మేళా
ఆసిఫాబాద్, మే 21: నిరుద్యోగ యువతీ, యువకులకు ఇందిరాక్రాంతిపథం అధ్వర్యంలో ఈనెల 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ సహాయ సంచాలకులు తెలిపారు. మంచిర్యాలలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించే ఈ జాబ్ మేళాకు 10వ తరగతి ఉత్తీర్ణులైన 18 నుండి 35 సంవత్సరాల లోపు విద్యార్థులు అన్ని ధృవపత్రాల జిరాక్స్ కాపీలతో జాబ్‌మేళాకు హాజరుకావాలని సహాయ సంచాలకులు సూచించారు. ఈ జాబ్ మేళాలో ఐటి, సేల్స్ మార్కెటింగ్, కన్సట్రక్షన్స్, ఫార్మసీ, సెక్యూరిటీ, ఫర్టిలైజర్, మొబైల్స్, హాస్పెటాలిటీ, సేల్స్ ఎగ్స్‌క్యూటివ్స్, సేల్స్ ఆఫీసర్స్, మార్కెటింగ్ ఎగ్స్‌క్యూటివ్స్, డెంటింగ్, పేంటింగ్, కస్టమర్ సపోర్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్, క్యాషియర్, హౌస్‌కీపింగ్ తదితర రంగాల్లో ఉపాధి పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకోసం ఫోన్ నంబరు 8187896012కు సంప్రదించాలని సంచాలకులు సూచించారు.

ప్రాజెక్టులను అడ్డుకుంటే ఊరుకోం..!
మందమర్రి, మే 21: తెలంగాణా ప్రాజెక్టులను అడ్డుకుంటే ఊరుకొనేది లేదని ప్రభుత్వ విప్ నల్లాల ఒదెలు అన్నారు. శనివారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణాలో నిర్మించనున్న ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అతనికి వత్తాసు పలుకుతూ తెలంగాణా తెలుగుదేశం నాయకులు అవకులు చవాకులు పలకడం సరైనదికాదన్నారు. ఇప్పటికే తెలంగాణాలో డిటిపి పార్టీ కనుమరుగు అయ్యిందని మహానాడు , మినిమహానాడుపేరుతో ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలు టిడిపిని ఎప్పడో మర్చిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్షలు చేయడం హాస్యస్పదమని ఇప్పటికైనా ఆయన తన పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణను ముందుకుతీసుకువెళుతుంది ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. టిఆర్‌ఎస్ నాయకులు ఎస్ ప్రభాకర్, జె రవీందర్, తిరుపతి రెడ్డి, ఎర్ర రాజు, కృష్ణ, వేణు, బండారు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

నేటి టెట్‌కు ఏర్పాట్లు పూర్తి
* అభ్యర్థులు గంటముందే చేరుకోవాలి
దివ్యనగర్, మే 21: ఉపాధ్యాయ ఉద్యోగాల అర్హత కోసం నిర్వహించే టెట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు. నిర్మల్ పట్టణంలో పేపర్-1కు ఒక సెంటర్, పేపర్-2కు 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. పట్టణంలోని ప్రభుత్వ జుమ్మెరాత్‌పేట్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కస్భా ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆయా పరీక్ష కేంద్రాలకు సి ఎస్, డివొలతోపాటు సుమారు 120 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అభ్యర్థులు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన పరీక్షకు అనుమతించేది లేదని నిబంధనల్లో స్పష్టంచేశారు. గంటముందే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలని సూచించారు. పరీక్ష వ్రాసే వారు ఒక ఫోటోతోపాటు బ్లాక్ పాయింట్‌పెన్‌ను, ప్యాడ్ తీసుకురావాలని, క్యాలిక్‌లేటర్లను, సెల్‌ఫోన్‌లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని తెలిపారు.

ఆవిర్భావోత్సవంలో భాగస్వాములుకండి
ఉట్నూరు, మే 21: తెలంగాణ ఆవిర్భవోత్సవం సందర్భంగా జూన్ 2న జరిగే సంబరాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఉట్నూరు ఆర్డీవో ఐలయ్య పిలుపునిచ్చారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో వివిధ రంగాలకు సంబంధించి డివిజన్ స్థాయి ఉత్తమ సేవలందించిన వారిని గుర్తించేందుకు దరఖాస్తు చేసుకునే వారికోసం ప్రత్యేక పెట్టెను ఏర్పాటు చేశారు. ఈ పెట్టెలో వివిధ రంగాల నుండి ఉత్తమ సేవలందించిన వారు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే వారు దరఖాస్తు ఫారాన్ని పెట్టెలో వేసినట్లయితే ఒకొక్క రంగం నుండి ఒకొక్కరిని ఎంపిక చేసి ప్రశంసా, నగదు బహుమతిని అందజేస్తామని అన్నారు. ముఖ్యంగా విశిష్ట సేవలందించిన ఉత్తమ అధికారి, రైతు, సామాజికవేత్త, జర్నలిస్టులు, అంగన్వాడీ కార్యకర్తలు, కళాకారులతో పాటు మరికొన్ని రంగాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏవో దేవానందం తదితరులు పాల్గొన్నారు.

అంతర్ జిల్లాల దొంగ పట్టివేత
* కిలో బంగారం, రెండు కేజీల వెండి, నగదు స్వాధీనం
మంచిర్యాల అర్బన్, మే 21: మంచిర్యాల ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడిన సయ్యద్ అహ్మద్ అనే దొంగను పట్టుకుని కిలో బంగారం, రెండు కిలోల వెండి, ఎల్ ఈడీ టీవీతో పాటు రూ.25వేల నగదును స్వాదీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తరుణ్ జోషి తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ తరుణ్‌జోషి మాట్లాడుతూ వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలోని పోచమ్మమైదానం బస్తీకి చెందిన సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. చెడు అలవాట్లకు లోనై చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండేవాడు. 2015 జనవరిలో హైదరాబాద్‌లోని పలు దొంగతనాల కేసులో పట్టుబడి చర్లపల్లి జైలులో ఆరునెలలుగా జైలు శిక్ష అనుభవించి జైలు నుంచి బయటికి వచ్చి మంచిర్యాల పట్టణంలోని చున్నబట్టి వాడలో నివసిస్తున్నాడు. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. మంచిర్యాల పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఇంటికి తాళాలు వేసిన ఇంట్లో చొరబడి దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. నాలుగు జిల్లాల్లో 25 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడి కేజీ బంగారం, రెండు కిలోల వెండితో పాటు ఒక ఎల్ ఈడీ టీవీలను దొంగిలించడంతో పలు పోలీసు స్టేషన్‌లలో సయ్యద్ అహ్మద్‌పై కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. క్రైంపార్టీ ఎస్సై బన్సీలాల్ రాత్రి వేళల్లో విధులు నిర్వహిస్తుండగా, జన్మభూమి నగర్‌లో రాత్రి వేళలో తిరుగుతున్న సయ్యద్ అహ్మద్‌ను పట్టుకొని విచారించగా కిలో బంగారంతో పాటు రెండు కిలోల వెండి ఆభరణాలను, ఎల్ ఇడీ టీవీని దొంగిలించినట్లు నిందితుడు అంగీకరించాడు. సయ్యద్ అహ్మద్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. పలు దొంగతనం కేసులను చాకచక్యంగా నిందితులను పట్టుకున్న క్రైం పార్టీ సిబ్బందిని అభినందించడంతో పాటు రివార్డు అందజేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల ఏ ఎస్పీ విజయ్‌కుమార్, చెన్నూర్ ఏ ఎస్పీ సునీల్, సి ఐ సుదాకర్, క్రైం పార్టీ సి ఐ మదన్‌మోహన్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

డిఎస్సీతోనే టీచర్ల నియామకాలు చేపట్టాలి
ముధోల్, మే 21: డిఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని నిరుద్యోగ సంఘం అధ్యక్షులు రాజ్‌కకుమార్ అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలో అయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభ్వుతం డిఎస్సీని రద్దుచేస్తూ జారీచేసిన జీవోను ఉపసంహరించుకోవాలన్నారు. ముఖ్యంగా టిఎస్‌పిఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించడం నిరుద్యోగులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఉపాధ్యాయ నియామకాలను డిఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కొరకు రెండు సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ పట్టణంలో వేల రూపాయలు ఖర్చుచేసి కోచింగ్‌లను సహితం తీసుకున్నారని వెల్లడించారు. టెట్ అనంతరం టీచర్ల నియామకాలు చేపడతామన్నారన్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టవద్దని కోరారు. కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులు ఆర్థికంగా నష్ట పొవడంతో పాటు సమయం వృదా అవుతుందన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డిఎస్సీ ద్వారా భర్తీ చేయాలని కొరారు. లేనియేడల నిరుద్యోగులు తీవ్రంగా నష్ట పొతారని అన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ నియామకాల కొరకు సత్వరమే నోటిఫికేషన్‌ను జారీ చేయాలని ప్రభుత్వంను కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో సబ్ కలెక్టర్ తనిఖీ
* హాజరు శాతం పెంచాలని సూచన
ఆసిఫాబాద్, మే 21: మండలంలోలని పలు ప్రభుత్వ పాఠశాలలను సబ్‌కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, మధ్యాహ్న భోజనం అమలు తీరును ఆరా తీసేందుకు ఈదుల వాడ, కొమ్ముగుడ, బూర్గుడ ప్రభుత్వ పాఠశాలలకు చెప్పా పెట్టకుండా వెల్లారు. కొమ్ముగుడ పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని భుజించారు. కొమ్ముగుడతోపాటు ఈదులవాడ, బూర్గుడ పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించిన సబ్ కలెక్టర్, విద్యార్థుల హాజరు పట్టికపై ఆరా తీశారు. పాఠశాలల్లో తిరిగి వసతులు, స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. ఈవిద్యాసంవత్సరంలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేలా కృషి చేయాలని, డ్రాప్ అవుట్ విద్యార్థులు తిరగి పాఠశాలల్లో చేర్పించేలా తల్లి తండృలకు నచ్చచెప్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజనం అమలులో ఏమాత్రం రాజీ పడవద్దన్నారు. ఈయన వెంటన ఎంపిడిఓ శ్రీనివాస్ ఉన్నారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
ముధోల్, మే 21: రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ముధోల్ ఎమ్మెల్యే జి విఠల్‌రెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలోని మండల అభివృద్ధి కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా విత్తన పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైయ్యారు. రైతులకు సబ్సిడీపై సోయా విత్తనాలను పంపిణీ చేశారు. రైతులను ఉద్దేశించి మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవరసరమయ్యే విత్తనాలు సకాలంలోనే ఉందించేందుకుసిద్ధంగా ఉందన్నారు. ముఖ్యం గా విత్తన కొరత లేకుండా ముందస్తు చర్యలు ప్రభుత్వం చేపడతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపతని తెలిపారు. తక్కువ ధరలకు రైతులకు విత్తనాలు, ఎరువులు అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించేందుకు విశేషంగా కృషి చేస్తుందని వివరించారు. అదేవిధంగా రైతులకు సకాలంలో వ్యవసాయ రుణాలు అందించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వం దీర్ఘకాలికంగా రైతులకు ప్రయోజనాలు కలిగేవిధంగా ముందుకు వెళ్తూంది స్పష్టం చేశారు. వ్యవసాయ భూములకు నీళ్లు అందించడంలో భాగంగా మిషన్ కాకతీయ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలోని చేరువుల పునరుద్దరణకు నిధులు విడుదల చేసిందని తెలిపారు. అదేవిధంగా సాగు తాగు నీళ్లను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు నిధులు వెచ్చించి ప్రాజెక్టులను నిర్మిస్తుందన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పొవడంతో పంటల దిగుబడి తగ్గిందన్నారు. రైతులకు వ్యవసాయశాఖ, సోసైటీల ద్వారా అధునిక యంత్ర పరికరాలను అందిస్తున్నామని వివరించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అదుకునేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వేళ్తుందని వెల్లడించారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు గ్రామాల్లోనే ఐకెపి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి బహిరంగ మార్కెట్ ధరను అందిస్తున్నామని తెలిపారు. విత్తనాలు, ఎరువుల ధరలు సహితం అదుపులోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఇతర రాష్టల్రకు అదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. గత రెండు సంవత్సరాలుగా రైతులకు విత్తన కొరత లేకుండా తగు విధంగా స్పందించడం జరిగిందన్నారు. రైతుల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిందని తెలిపారు. రైతుల సౌకర్యర్థం నియోజకవర్గ కేంద్రంలో ముధోల్, తానూర్, లోకేశ్వరం మండలంకు ఒక వ్యవసాయ డివిజన్‌గా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సత్వరమే రైతులకు ప్రభుత్వ సేవలు అందించేందుకు డివిజన్ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు. సోయా 30 కీలోల బస్తా రూ. 1320కు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్, తానూర్, లోకేశ్వరం జడ్పీటిసి సభ్యులు బి. లక్ష్మీనర్సాగౌడ్, పోతాజీ పటేల్, సురేష్ బాబు, ముధోల్, లోకేశ్వరం మండల అధ్యక్షులు అనూషాసాయిబాబా, సాగర్ లక్ష్మీ, ముధోల్, తానూర్ మండలల పి ఎ సి ఎస్ చైర్మన్‌లు సురేందర్‌రెడ్డి, నారాయణ్‌రావ్ పటేల్, ముధోల్ ఎడి ఎ అంజిప్రసాద్, ముధోల్ ఎంపిడివో నూర్‌మోహ్మద్, మండల వ్యవసాయ అధికారి ఇబ్రహిం హనీఫ్, ముధోల్ మండల టి అర్ ఎస్ అధ్యక్షులు ఆఫ్రోజ్‌ఖాన్, టి అర్ ఎస్ మండల నాయకులు అర్. రమేష్, ఆత్మచైర్మన్ రవిందర్‌రావ్, వివిధ మండలాలకు చేందిన పి ఎసి ఎస్ డైరెక్టర్‌లు, ఆత్మడైరెక్టర్‌లు, స్థానిక నాయకులు సంజయ్ సిందే, ఎస్. డి. ఖలీద్, కీషన్ పతంగే, ముధోల్-3 ఎంపిటిసి సభ్యురాలు వరగంటి విజయభారతి, ముధోల్, తానూర్ లోకేశ్వరం ఎ ఇ ఓలు, వివిధ గ్రామాలకు చేందిన సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.