అదిలాబాద్

నకిలీ విత్తనాలతో అమాయక గిరిజనులు బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 30: ఈసారి ముందస్తు నైరుతి రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో విత్తనాల మాయాజాలంలో పడి ఆమాయక రైతులు దగా పడుతున్నారు. ప్రతి ఏటా జూన్‌కు ముందే నకిలీ విత్తనాల బెడద రైతుల పుట్టిముంచుతున్న దీని కట్టడి కోసం పటిష్టమైన యంత్రాంగం పనిచేయకపోవడంతో రైతులు నకిలీ విత్తనాలు సాగుచేసి నిలువున మోసపోవాల్సి వస్తోంది. జిల్లాలో గత ఏడాది 3.36 లక్షల హెక్టార్లలో పత్తిపంట సాగుచేయగా ఈసారి పత్తికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నప్పటికీ అనుమతి లేని నకిలీ విత్తనాల చెలామణి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. ముందుగా తలమడుగు, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లో నకిలీ విత్తనాలు బయటపడగా తాజాగా ఉట్నూరు మండలంలోని గోర్సిపటార్ గ్రామంలో నకిలీ విత్తనాలను గిరిజన రైతులకు విక్రయిస్తుండగా పోలీసులకు సమాచారం అందడంతో పట్టుకున్నారు. వీటిలో పత్తి, జొన్న, గోదమ, రబీ పంటలకు సంబంధించిన విత్తనాలు కూడా బయటపడడం గమనార్హం. గత ఏడాది బేయర్ కంపెనీ ఫస్ట్‌క్లాస్ బీటి విత్తనాలను నమ్మి రైతులు తమ జీవనాధారమైన పత్తిపంటను కోల్పోయి దిగుబడి లేక అప్పుల ఊబీలో కూరుకుపోయారు. ఈ వ్యవహారంపై రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అందోళన చేయడంతో బేయర్ కంపెనీ ప్రతినిధులు దిగివచ్చి గత్యంతరం లేక 35లక్షల రూపాయల పరిహారాన్ని రైతులకు అందజేశారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉండగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు కూడా తావిచ్చింది. ఈ ఏడాది జిల్లాలో 3.76 లక్షల హెక్టార్లలో పత్తి పంటను సాగుచేస్తారని అంచనా వేస్తుండగా వర్షాలకు ముందే ఏజెన్సీలోని ఉట్నూరు, నార్నూర్, జైనూర్, సిర్పూర్‌యు, ఇంద్రవెల్లి, తిర్యాణి, ఆసిఫాబాద్, కెరమెరి మండలాల్లో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో తయారైన అక్రమ నిషేదిత విత్తనాలు రైల్వే మార్గం గుండా ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటున్నాయి. గిరిజనుల్లో అక్షరాస్యత లేకపోవడం, దళారుల బెడద కారణంగా అమాయక గిరిజనులు తక్కువ ధరకు విత్తన ప్యాకెట్లను కొనుగోలు చేసి మోసపోతున్నారు. విత్తన బ్యాగుపై ఎలాంటి ఎమ్మార్పి ధర లేకపోవడం, మరోవైపు లాట్, బ్యాచ్ నెంబర్ లేకపోవడం, అసలు సిసలైన వాటిని పోలి ఉండడంతో గిరిజనులు అమాయకంగా వీటిని కొనుగోలు చేసి పంట సాగుచేసి నష్టపోతున్నారు. రైతుల జీవనాధారమైన పంటపైనే మధ్యదళారులు టార్గెట్‌గా చేసుకొని దెబ్బతీస్తుండడంతో అమాయక గిరిజన రైతులు తీవ్రంగా మోసపోవాల్సి వస్తోంది. నకిలీ విత్తనాలను అరికట్టి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు జిల్లాలో ప్రత్యేకంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా నిఘా బృందాలను ఏర్పాటు చేస్తేనే ఏజెన్సీలో నకిలీ విత్తనాల దందాను అరికట్టే అవకాశం ఉంది.