అమృత వర్షిణి
సుస్వర వినోదులు..’ నిలయ కళాకారులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పదిమందీ మెచ్చే సంగీతానికి ఎలాంటి ప్రమాణాలుండాలి? లక్షలాది మంది వినే భాష ఎలా ఉండాలి? దృశ్య ప్రధానమైన నాటకాలు ప్రసారం చేసే శ్రవ్య మాధ్యమానికి అనువుగా సంభాషణలు ఎలా ఉండాలనే విషయాలను నిర్ధారించే కలిగే సాధికారమైన వేదిక, ఆకాశవాణి. ప్రసారం చేసే కార్యక్రమాలు బాగున్నాయంటే శ్రోతల అభినందనలతో పాటు ఏమాత్రం స్థాయి తగ్గినా అడిగే హక్కూ, విమర్శించే హక్కూ శ్రోతలకు ఉంది.
ఒకప్పుడు ఒక సంగీత కార్యక్రమమైనా, నాటకమైనా, నాటికయినా ప్రసారానికి వారం రోజులకు ముందు కొందరు రసజ్ఞులైన మేధావులకు, శ్రోతలకు పలానా కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తున్నామనీ, అభిప్రాయాలు తెలియపరచమంటూ ఆకాశవాణి వారు ఉత్తరాలు రాసేవారు. సరిగ్గా ప్రసారమయ్యే రోజున సిద్ధంగా కూర్చుని శ్రద్ధగా ఆ కార్యక్రమాలు విని వారి ప్రతిస్పందన తెలియజేసేవారు. ‘ఉభయ కుశలోపరి’ అనే ప్రత్యేక కార్యక్రమంలో ఆ శ్రోతలను పలకరించేవారు.
అప్పట్లో రేడియోకూ శ్రోతలకూ ఏర్పడ్డ విదడీయలేని బంధం, అనుబంధం ఇదే కర్ణాటక సంగీత కచేరీలు, లలితగీతాలు, యక్షగానాలు, సంగీత రూపకాలు, వాటిలో పాల్గొన్న గాయనీ గాయకులు, నటులు, కళాకారులూ అలా ప్రసిద్ధమైన వారే.
బాగా ఆరితేరి సంగీత సాహిత్యాల్లో విశేషమైన కృషి చేసి ఆయా రంగాల్లో ప్రత్యేకంగా అభిరుచి కలిగిన అధికారులుండేవారు. ప్రొడ్యూసర్‌లు సూచించి రూపొందించే కార్యక్రమాలన్నీ నిరాటంకంగా, ఎలాంటి అభ్యంతరాలూ లేకుండా ప్రసారమైపోతూండేవి.
మాకు బాగా తెలుసునన్న అహంకారం ఏ ఒక్కరికీ ఉండేది కాదు. పైగా కళాకారులతోనూ, ప్రొడ్యూసర్లతోనూ ముఖ్యంగా స్టేషన్ డైరెక్టర్లు వారి పరిధిలోనే గౌరవాన్నిచ్చి పుచ్చుకునే వారు.
అలా అప్పట్లో రూపొందించి ప్రసారం చేసినవన్నీ నేటికీ చిరస్థాయిగా శ్రోతల హృదయాల్లో నిల్చిపోయినవే.
క్రమంగా అధికారమే పరమావధిగా వచ్చి చేరిన వారి వల్ల కార్యక్రమాల నాణ్యత తగ్గటం ప్రారంభమైంది. పైగా రేడియో కార్యక్రమాల రూపకల్పనలో అజమాయిషీ చేయటం గానీ, నిఘా గానీ సాధారణంగా కనిపించదు.
రేడియో అనేది ప్రజా సంబంధంతో ముడిపడిన మాధ్యమమే అయినా హితవుగా లేని కార్యక్రమాలు బలవంతంగా నెత్తిన రుద్దిన సందర్భాలున్నా అడిగే వీలుండదు. వ్యవస్థ ప్రభుత్వాధీనంలో ఉండటమే ప్రధాన కారణం. ప్రైవేటు ఛానెళ్లు పుట్టగొడుగుల్లా బయలుదేరటానికిదే కారణం. కానీ సంగీత ప్రధానంగా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమాలలో నాణ్యతా ప్రమాణాలు చాలా ఉన్నతంగా ఉండేవి.
1970 ప్రాంతంలో నేను లలిత గీతాలు కంపోజ్ చేసే రోజుల్లో జరిగిన సంఘటన ఒకటి మీకు గుర్తు చేస్తాను.
కొన్నికొన్ని లలితగీతాలు, దేశభక్తి గీతాలు ప్రత్యేక సందర్భాల్లో బయట నుండి గాయనీ గాయకులను కాంట్రాక్ట్‌పై పిలిచి, ఒకటి రెండు రోజులు రిహార్సల్స్ చేయించి, రికార్డ్ చేసేవారు. పాట చెప్పేసి, బాగా మనసుకు పట్టేలా పాడించి మరునాడు రికార్డు చేయటానికి సిద్ధమవుతున్న వేళ ఓ సాయంత్రం డైరెక్టర్‌గారు కంపోజర్లను అందరినీ పిలిచి పాటలు ఎలా కంపోజ్ చేశారో వినిపించమని కోరారు. ఆ రోజు కంపోజ్ చేసిన వాళ్లలో నేనూ, ఎన్.సి.వి. జగన్నాథాచార్యులు, సుందరపల్లి సూర్యనారాయణమూర్తి, వి.ఎస్. నారాయణమూర్తి మొదలైన వారం ఉన్నాం.
పాపం! నిజానికి సదరు డైరెక్టర్‌కు సంగీత సాహిత్యాలలో అభినివేశమున్న దాఖలాలు లేవు. కానీ తన అధికార దర్పాన్ని ప్రదర్శించాలన్న అత్యుత్సాహం. అదే మాకు విసుగు తెప్పించింది. ఆయన గదిలోకి వెళ్లి పాట వినిపించగానే ‘‘చూడండి? బాగా పరిచయమున్న కల్యాణి కాపీ, మోహన, మాల్‌కాస్ లాంటి రాగాల్లో చేయరాదా? అవి చాలా ఆకర్షణగా ఉంటాయి కదా? అని ప్రతి కంపోజర్‌కూ ఈ రాగాలనే చెప్పి పాటలను మార్చేయమని సలహా పారేశాడు. కింకర్తవ్యమని అందరం చెట్టు కింద కూర్చుని పాలుపోక.... ఏం చేయాలో ఆలోచించాం. మార్గాంతరం లేక మళ్లీ పాటలు మార్చి పాడించాం.
‘ఆశలన్నీ చుక్కలౌచు ఆకాశమునంటు రీతి
మోసులెత్తు యెదలోపల
రాకాశశియే భాతి’ అనే పాట.....
గుంటూరులో పనిచేసే ఆ జిల్లా విద్యాధికారి (డి.ఇ.ఓ) యిస్కా వసంతకుమార్ రాసిన ఈ పాట ఎన్.సి.వి. జగన్నాథాచార్యుల కంపోజ్ చేసి రికార్డు చేశారు. రాత్రికి రాత్రే ఆ డైరెక్టర్ మార్చేయమన్న రాగంలోనే (పీలూ) ఆయనే ఎంతో అద్భుతంగా పాడారు.
రికార్డింగ్ అయి ఇవతలకు రాగానే జగన్నాథాచార్యుల్ని మనసారా అభినందించాను.
ఆయన రేడియోలో ఒక తంబూరా వాద్య కళాకారుడిగానే కాకుండా శాస్ర్తియ సంగీతంలోనూ, లలిత సంగీతంలోనూ అద్వితీయమైన ప్రతిభాపాటవాలున్న వ్యక్తి. ఎంతో తూకంగా నాలుగు తీగల శృతివాద్యమైన తంబూరాను నిక్కచ్చిగా శుద్ధమైన నాదం వచ్చేలా శృతి చేయటంలో ఎన్.సి.వి.యే నాకు స్ఫూర్తి. ఆయనే నాకు ఆదర్శం కూడా. రేడియోకు వచ్చిపోయే విద్వాంసులకు కేవలం శృతి సహకారం అందించే ఉద్యోగం తంబూరా కళాకారుడిది.
చిన్నతనంగానూ నామోషీగాను భావించి అన్యమనస్కంగా పనిచేసే వారినెందరినో చూశాను. కానీ ఎన్.సి.వి. దీనికి భిన్నం. తంబూరా వాద్యానికే గౌరవాన్ని తెచ్చిన అరుదైన విద్వాంసుడాయన.
సంగీతం పట్ల ఆయనకెంత గౌరవ ప్రపత్తులున్నాయో తంబూరా మీటినప్పుడే గ్రహించే వాణ్ని. బయటి నుంచి వచ్చే గాయకులలో కొందరికి ఏకాస్త అపశృతి దోషమున్నా, వారి వెనక కూర్చున్న తంబూరా శృతి మాత్రం శృంగారాన్ని తూచే మధ్యస్థ తూకంలా నిశ్చలంగా మీటినంత సేపూ నిలకడగానే పాడేది. ఈ లక్షణం తంబూరా సహకారం అందించే కళాకారులలో చాలా తక్కువ.
1957వ సంవత్సరంలో ఆకాశవాణి జాతీయ స్థాయిలో నిర్వహించిన కర్ణాటక సంగీత పోటీల విభాగంలో ప్రథమ బహుమతి పొందారు. తదాదిగా విజయవాడ రేడియో కేంద్రంలో నిలయ కళాకారుడై అంచెలంచెలుగా ఎదిగి, దేశంలోని అనేక సంగీత సభలలో పాల్గొన్న విద్వాంసుడు.
మ్యూజిక్ కంపోజర్‌గా ఆయన చేసిన లలితగీతాలు, దేశభక్తి గీతాలనేకం ఆ రోజుల్లో కుమారి శ్రీరంగం గోపాలరత్నం, వి.బి. కనకదుర్గ, మల్లిక్, వోలేటి వంటి వారితో పాల్గొన్న సంగీత రూపకాలు, యక్షగానాలు ఎంతో పేరు తెచ్చుకున్నాయి.
ముఖ్యగా విజయవాడ రేడియో కేంద్రానికే మకుటాయమైన కార్యక్రమం, భక్తిరంజనిలో ఆయన పాడని అంశం లేదు. వోలేటి గారు నిర్వహించే ప్రతిష్టాత్మకమైన ఎందరికో సంగీత శిక్షణలో శిష్యుడై కీర్తిని సొంతం చేసుకున్న విద్వాంసుడు. డైరెక్టర్‌గా డా.బాలాంతపు రజనీకాంతారావు ఉన్న రోజుల్లో వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ‘సిరికాకొలను చిన్నది’ సంగీత రూపకంతో వేటూరి గోపాలరత్నం, ఎన్.సి.వి. పాడిన పాటల వల్ల సినీరంగ ప్రవేశానికి దోవ దొరికిందనటం ఆశ్చర్యం కాదు. అతిశయోక్తి లేదు. నిరాడంబరంగా జీవించి సంగీతోపాసనే లక్ష్యంగా జీవితాన్ని సాగించిన ఎన్.సి.వి. జగన్నాథాచార్యులతో నేను పనిచేయటం నా భాగ్యంగా భావిస్తాను. సమర్పణ భావం.
నాదోపాసన లక్ష్యం కలిగిన అరుదైన విద్వాంసుడు ఎన్.సి.వి.