అమృత వర్షిణి

యశోధనులు.. కీర్తిశరీరులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కారేరాజులు రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం బొందరే, వారేరీ, సిరిమూట గట్టుకుని పోవం జాలిరే, భూమిపై బేరేన గలదే, శిబి ప్రముఖులుం బ్రీతిక్ యశః కాములై రుూరే కోర్కులు వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా?’’
‘పద్యం పాడాలి. ఏ రాగంలో పాడాలన్నది కాదు, సమభావంతో ఎలా పాడాలన్నదే ప్రధానం. అందులోనే ఉంది, రహస్య మనసు ద్రవించేలా దయారసముప్పొంగే విధంగా కనిపించే కానడ’ రాగంలో నా తండ్రి గారు ఈ పద్యం ఎప్పుడో చిన్నతనంలో పాడించే వారు. రాళ్లను కరిగించే శక్తి రాగాలకుంటుందంటారు. అబద్ధం కాదు. దర్బారుల్లో పాడే రాగంగా ప్రసిద్ధమై దర్బారీ. కానడగా సంగీత రసికులు పిలిచే రాగమిది.
ఒకోసారి కీర్తన కంటే, రాగం కంటే అత్యంత సులువై వేగంగా హృదయాలకు చేరిపొతూ పరవశింపచేసేది పద్యం. ఇందులో తాళం కంటికి కనిపించకపోవచ్చు. కానీ ఛందస్సుతో అల్లబడి ‘లయ’ అంతర్లీనంగా ఉంటుంది. కీర్తనలో ప్రతిమాట, పదం నిక్కచ్చిగా తాళానికి సరిపోతూ, వినిపిస్తేనే అందం.
పద్యంలో లయ అటూయిటూ కాస్త అసియాడుతూంటేనే అందం, ఆకర్షణ.
పద్యం పాడే కవులైనా, గాయకులైనా ఈ సూక్ష్మం తెలిస్తే, వినే వారికదే పరమానందం. పద్యాలకు అంతటి శక్తి ఉంది కాబట్టే మన పౌరాణిక నాటకాలు ఒకప్పుడు ఒక ఊపు ఊపేశాయి.
మా ఊళ్లో అక్షరజ్ఞానం లేనివారు సైతం పద్యానికి ఫిదా అయిపోయి ‘‘ఆపవయ్యా నీ పాట! విను నా పద్యం’’ అని స్పష్టంగా జబర్దస్తుగా వినిపించే ఔత్సాహిక గాయక చక్రవర్తులుండేవారు. పౌరాణిక నాటకాల నటులకు ఏమాత్రం తీసిపోరు.
పద్యంలోని మాటలు పాడిస్తాయి. భావద్వేగాన్ని కలిగిస్తాయి. ఏడిపిస్తాయి. నవ్విస్తాయి. ‘‘అన్నం తినకుండా మారాం చేసే చంటివాడికి బ్రతిమాలుతూ ప్రేమగా గోరుముద్దలు తినిపించే తల్లిలా’’ ఉంటాయి.
‘సంగీత కళానిధి’ నా పరమగురువైన డాక్టర్ పినాకపాణిగారి చిన్నతనంలో తెలుగు మాస్టారు రామాయణం ఘట్టమైనా, భారతంలోని సన్నివేశాలైనా అందులోని పద్యాలు కమ్మగా పాడుతూ అర్థం తెలిసేలా మాటలను విరిచి పాఠం చెప్పేవారని అంటూండేవారు.
చిన్నతనంలో నేర్పినది మనసులో కుదురుగా కూర్చుని జీవితాంతం అలాగే చెక్కుచెదరకుండా నిలిచిపోతుందనటానికి సాక్ష్యం మన కవులు.
అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు చేసే కవులకు పట్టిన అదృష్టమిది. అసలా దృష్టే మనకు లేకపోతే పిల్లలకు తెలివితేటలు ఎక్కడి నుండి సృష్టిస్తాం? అంతా పెద్దవారి చేతిలోనే ఉంది.
భావం మూడు చోట్ల ఉంటుంది.
1. సాహిత్యంలో 2. రాగంలో 3. తాళంలో.
తాళంలో విశేషం కంటే, రాగమే హృదయానికి దగ్గరవుతుంది. సుస్వరంతో పలికే మాటలు ఎంతటి వారి హృదయాలనైనా ఇట్టే కరిగిస్తాయి.
ఇంటికి పెద్దలు తల్లిదండ్రులు. అలాగే ఊళ్లో కొందరు పెద్దలుంటారు. హోదాను బట్టి రాష్ట్రానికీ, దేశానికి పెద్దరికం చలాయించే వారుంటారు. వారి మాటకు చేతలకూ అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దేశానికి రాజే పెద్ద. ఆయన ఆలోచనలను బట్టి చేసే నిర్ణయాలను బట్టీ దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. మొండి ప్రభువులనూ, మూర్ఖపురాజులను కూడా చూసిన చరిత్ర మనకుంది. ప్రభువుల పొడగిట్టని వారినీ అసలు రాజులతో సంబంధం లేకుండా, వారి ఆశ్రయంలో మహనీయుల నిమిత్తం లేకుండా జీవితాలను సాగించి, ధన్యులైన కొందరు ఈ భుమీద నిక్షేపంగా బ్రతికారు.
వారిలో పోతన మొదటివరుసలో కనిపిస్తాడు. ‘‘ఏదో విధంగా బ్రతకటమే లక్ష్యమైతే ఊరా? పేరా? నదీనాం సాగరో గతిః’’ ఎలా వచ్చారో, అలాగే నిష్క్రమిస్తారు.
ఒక వ్యక్తి పదిమందికీ ఆదర్శవంతుడై నిలవడం చిన్న విషయం కాదు. జన్మ సంస్కారం ఉండాలి. యోగ్యతతో బాటు యోగముండాలి.
రాక్షస వంశంలో పుట్టిన బలిచక్రవర్తి అటు గురువైన శుక్రాచార్యుడు వద్దని వారిస్తున్నా పక్కన బెట్టి వామనుడికి దానమివ్వడానికి సిద్ధపడిన ఘట్టంలోనిది ఈ పద్యం. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఏ సందర్భంలోనైనా ఎవరికైనా అన్వయించుకోదగ్గ ఆణిముత్యం.
చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలలో చరిత్ర పాఠాలుండేవి. అశోకచక్రవర్తి చెట్లు నాటించెను. చెరువులు తవ్వించెను. రోడ్లకిరుపక్కలా బాటసారులకు చలివేంద్రాలు ఏర్పాటు చేశాను అని చదువుతూంటే అదేమంత భాగ్యమనుకునే వాళ్లం. పాలకులకూ, ప్రజలకూ ఉండే బంధం. ఊపిరిలే శరీరానికీ ఉన్నంత సంబంధం.
ఏ పాలకుడికైనా ఉండవలసినది లోకోపకార బుద్ధి. పదికాలాల పాటు ప్రజలకు గుర్తుండిపోయేలా చేసే మంచి పనులు ప్రభువులను చిరంజీవులను చేస్తాయి.
మగధ రాజ్యాన్ని ఏలిన శౌర్యవంశంలోని సామ్రాట్ అశోకచక్రవర్తి దీనికి మంచి ఉదాహరణ. కళింగ యుద్ధంలో లక్షలాది సైనికలు మరణిస్తే హృదయం కరిగి నీరైంది. ప్రాణ నష్టానికి చింతించాడు. అందరూ స్థిరమనుకునే ఈ తనువు అస్థిరమని భావించాడు.
లోకం నుంచి నిష్క్రమించేలోగా మంచి పనులు చేసి కీర్తిని మూటగట్టుకుని వెళ్లిపోయినా అశోకుని పేరు ఎలా చరిత్రలో నిలబడిపోయిందో చూడండి.
భారత ఉపఖండంలో ఎక్కువ భూభాగాన్ని స్వాధీనం చేసుకుని పరిపాలించిన చక్రవర్తి అశోకుడు.
సారనాథ్‌లో నెలకొల్పిన అశోక స్థూపమే నేటి మన జాతీయ చిహ్నం.
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు.
ఈ భావనే అశోకుణ్ని చరిత్రకారులు గుర్తుపెట్టుకునేలా చేసింది.
మానవతను దుర్లభమనుచు నెంచి పరమానంద మొందలేక మదమత్సర కామలోభ మోహాలకు దాసుడై మోసబోతిగాక అంటారు త్యాగయ్య.
సతులకై కొన్నాళ్లాస్తికై సుతులకై కొన్నాళ్లు, ధన తతులకి కొన్నాళ్లు తిరిగితినయ్యా త్యాగరాజాప్త ఇటువంటి దుడుకు గల ననే్న దొర కొడుకుబ్రోచురా అని చింతిస్తాడు.
రాక్షస వంశంలో పుట్టిన చక్రవర్తియైన బలికి దానగుణం పుట్టటటం ఆశ్చర్యం కలిగించే విషయం.
సుఖాలు రెండు విధాలు. ఒకటి క్షణికం, రెండోది శాశ్వతం. స్పర్శ సుఖాల వల్ల దేహాన్ని, అంటిపెట్టుకునే ఉంటాయి.
పుట్టిన మరుక్షణం నుంచి ప్రారంభమై చచ్చేదాకా ఆ శరీరానికి భోగాలను అందిస్తాయి. రోగాలను కూడా అందిస్తుంటాయి. శాశ్వతమైన రెండో సుఖాన్ని వెతుక్కున్న అశోకుడికి బౌద్ధమార్గం దొరికింది. మరొక దుఃఖానికీ ఉన్న తేడా గమనించాడు. అదంతా ఆత్మ విచారం వల్ల కలిగిన మార్పు. సాధారణంగా రాజైన వాడెవ్వడికీ ఈ ఆలోచన రాదు. అది అనంతమైన జ్యోతి. దీనికి తిరుగు లేదు.
సామ్రాట్ అశోకునిగా సకల భోగాలూ అనుభవించి ఆకాశమే హద్దుగా రాజ్య విస్తరణ చేసి, బుద్ధం శరణం గచ్ఛామి అంటూ ప్రశాంతమైన శాంతిమార్గంలో నిష్క్రమించాడు. ఇటువంటి రాజులు మళ్లీ మళ్లీ పుట్టరు. మొదటికి వద్దాం.
‘‘కారే రాజున్’’ బలిచక్రవర్తి నోట వెంట వచ్చిన మాట, పద్యమైంది.
చివరిలో శిబి చక్రవర్తిని అపహరించి పద్యాన్ని ముగించాడు పోతన.
‘ఎంచగ భూమి యొక్కటే ఏలిన రాజులెందరో’ అంటాడు అన్నమయ్య.
ఈ భూమిని పరిపాలించిన రాజులలో ఏ ఒక్కడి పేరైనా గుర్తుందా మనకు. జైత్రయాత్రలు చేసి, ధన మాన ప్రాణాలు హరించి, మూటగట్టుకున్న ఒక్క చిల్లిగవ్వైనా సంపదలో కూడా తీసుకెళ్లగలిగారా?
మాయా మోహం కాకపోతే, సంపాదించి దాచినదంతా శాశ్వతమనీ, తాను కూడా శాశ్వతమని భావించి అడ్డమైన దారుల్లో గొడ్డులా తిరిగి తిన్నంత తిని మళ్లీ కొన్ని తరాలకు సరిపోయేలా కూడబెట్టిన దానిలో రవ్వంతైనా చచ్చేప్పుడు వెంట తీసుకెళ్లిన వాడెవడైనా ఉన్నాడా?
ఆ సంపాదించినదంతా దొరలపాలవుతుందో దొంగలపాలవుతుందో ఎవడికెరుక? పరువు మర్యాదలు పోయినా, పైసామే పరమాత్మా హై అని భావించి సమాజ సేవను అడ్డం పెట్టుకున్న రాజకీయ నాయకుల్ని మనం చూడటం లేదా?
పాప పుణ్యాలున్నాయని భావించిన మహానుభావుల జీవితాలు సన్మార్గంలోనే నడుస్తాయి. లేని వారు ఊరూ పేరూ లేకుండా కాలగర్భంలో కలిసిపోతారు. ఈ జగత్తునకు అధికారి అంటూ ఎవడూ లేడు. ఉన్నన్నాళ్లూ అద్దె కొంపలో బ్రతకటం. సమయం ముగిసిన తర్వాత ఖాళీ చేసి పోవటం. స్ర్తి పురుష సంయోగంతో ఏర్పడ్డ సృష్టికి ఎవడు కర్త?
ఇదిగో! ఇదంతా నా ఆస్తి. నా భూమి ఇంకా సంపాదించాలనే కండ కావరంతో చిత్తం భ్రమించి తిరిగి చివరకూ హరీమంటే అంతా శూన్యమేగా? దాతృత్వం అనగానే గుర్తుకొచ్చే పేరు, శిబి చక్రవర్తి. మాట కోసం ప్రాణాలు వదలటానికి సిద్ధపడిన ఇటువంటి వారి పేరు మాత్రమే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. చెప్పిన మాటలకూ చేతలకూ పొంతన లేని అతుకుల బొంత లాంటి జీవితాలు గడిపే వారున్నా ఒకటే లేకపోయినా ఒకటే.
*

- మల్లాది సూరిబాబు 90527 65490, 91827 18656