అమృత వర్షిణి
గత కాల వైభవమే.. వైభవం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సాధారణంగా ఏ వ్యాపారంలో దిగాలన్నా దిగేవారికి అందులో కొంత మక్కువ ఉండాలి. అనుభవముండాలి. అభిరుచి కూడా తోడవ్వాలి. అన్నీ కలిసిరావాలి. ఇష్టం లేని వ్యాపారం ఎవ్వరూ చేయరు. చేయలేరు కూడా. తలకుమించిన అప్పు, తెలిసీ తెలియని వ్యాపారం కొంపముంచుతాయి.
కిరాణా షాపులు, వస్త్ర దుకాణాలు, మిఠాయి దుకాణాలు, సైకిల్ షాపులు, ఆటోమొబైల్ మొదలగు రకరకాల వ్యాపారాలన్నీ ఇలా వ్యక్తిగతమైన అభిరుచిని బట్టే వృద్ధి చెందుతుంటాయి. కొత్త కొత్త ఆలోచనలతో ఒక పద్ధతిలో వ్యాపారం అంచెలంచెలుగా పెరుగుతూ వృద్ధిలోకి వచ్చేస్తుంది. లాభ నష్టాలు దైవాధీనమే. పౌరాణిక నాటకాలు బాగా ఆడే రోజులవి. ‘నటీ నటులెందరో’ బిజీబిజీగా ఉండేవారు. ఏలూరులో పవరుపేట వీధిలో ‘విజయ డ్రస్ పేరుతో’ పౌరాణిక నాటకాలకు కావల్సిన దుస్తులు, ఆభరణాలు, చిత్రవిచిత్రమైన అలంకార సామగ్రి అద్దెకు ఇచ్చే షాపుండేది. చాలా చిన్నగదిలో ఆ షాపులను నార్ని కేదారేశ్వరుడనే వ్యక్తి నిర్వహించేవాడు. కళాత్మక హృదయమున్న వాడిగా పేరు. ఆ వ్యాపారం మొక్కుబడిగా చేసేవాడు కాదు. ఏయే పాత్రలకు ఏయే దుస్తులు బాగుంటాయో, ఎటువంటి ఆభరణాలు నప్పుతాయో, అన్నీ వివరంగా ఆలోచించి మరీ ఇచ్చేవాడు. నటీనటులు, నాటకానికి ముందురోజు అద్దెకు అడిగి తీసుకుని, ఒకటి రెండు రోజులు వ్యవధిలో తిరిగి ఇచ్చేసేవారు. రోజుకు రెండు రూపాయలు అద్దె. ఆ రోజుల్లో నాట్యాచార్యులు, కోరాడ నరసింహారావు, వేదాంతం ప్రహ్లాదశర్మ, రామాచార్యులు బందా కనకలింగేశ్వరరావు, కొచ్చెర్లకోట సత్యనారాయణ, షణ్ముఖి ఆంజనేయరాజు, పువ్వుల సూరిబాబు మొదలైన హేమాహేమీలైన నటులెందరితోనో ఆ కేదారేశ్వరునికి ప్రత్యక్ష పరిచయాలుండేవి. కేదారేశ్వరుడికి ఆ ఊళ్లో మా సంగీత కుటుంబం పట్ల ఎంతో గౌరవముండేది. మా నాన్నగారు నా చేత, నా తమ్ముడు నారాయణశర్మతో కలిపి కృష్ణార్జున సంవాదమనే చిన్న నిడివి గల సంభాషణలు తయారుచేసి స్టేజీ ఎక్కించి నాలుగు పద్యాలు, శ్లోకాలు, రక్తిగా రెండు మూడు పాటలు కలిపి సాధన చేయించి పాడించే వారు. గంటన్నరసేపు చిన్నతనంలోనే అలా వేషాలు వేసుకుని పదిమందిలో స్టేజీ మీద నిలబడితే ఏదో దర్జాగా అనిపించేది. అన్నీ కంఠస్థం చేయటం వల్ల నదురూ బెదురూ లేక పాడేవాళ్లం. భయం లేకుండా హార్మోనియం శృతిలో పాడుతుంటే వన్స్మోర్లు వినిపించేవి. చాలా సరదాగా ఉండేది. సరే, ఆ సంగతి అలా ఉంచండి.
ఈ నార్ని కేదారేశ్వరుడు ‘‘యింతింతై వటుడింతై అన్నట్లుగా ఆర్థికంగా బాగా లాభపడే ఉండవచ్చు. అందులో పెద్ద విశేషమేమీ లేదు. కానీ సంపాదించిన దానిలో గుప్త దానాలు, భూరి విరాళాలూ చేసి ప్రసిద్ధుడయ్యాడు. అదీ విశేషం. చిన్న గదిలో ప్రారంభించిన ఆ డ్రస్ కంపెనీ నెమ్మదిగా రాజమండ్రికి మార్చాడు. అక్కడ మరింత పేరు తెచ్చుకున్నాడు. తన పేరున రంగస్థల వేదికలు నిర్మించే స్థాయికి ఎదిగిపోయాడు. మేకప్ అందుబాటులో లేకపోతే ఆయనే మాతో వచ్చి, చక్కగా ఆహార్యాన్ని సమకూర్చేవాడు. బాగా నిలదొక్కుకుని స్థిరపడిన తర్వాత థార్మిక దృష్టి పెరిగింది. రంగస్థల నటులంటే ఇష్టం. ‘‘బాగా పేరుండి, ఆర్థికంగా చితికిపోయిన కళాకారులను ఆదుకునేవాడు. చేతనైనంత సహాయం చేసి ఆత్మన్యూనతాభావం వారిలో రాకుండా వీలైనప్పుడల్లా సన్మానాలు, సత్కారాలు చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు.
‘‘కళాకారులూ, విద్వాంసులూ నమ్ముకున్న కళకు అంకితమై బ్రతికిన రోజులవి. నిజం చెప్పాలంటే విద్వాంసులు, పండితులూ ఒకప్పుడు రాజాశ్రయంతోనే హాయిగా బ్రతికారు. కాబట్టే మహాకవుల రచనలన్నీ వెలుగులోకి వచ్చి భావితరాలు గుర్తుండిపోయేలా వారి పేరు నిలిచిపోయాయి.
కవులనూ కళాకారులనూ పోషించటం రాజుల ధర్మం, గౌరవం కూడా. క్రీడాకారులను నెత్తికెక్కించుకుంటారు. ఆమాత్రం గౌరవం, గుర్తింపు కళాకారులూ కోరుకోవడం నేరమా? అందుకే మన ఆంధ్రదేశంలో పుట్టి ప్రఖ్యాతులైన ఎందరో విద్వాంసులు, ఎక్కడ రసికులున్నారో, వెళ్లి వాళ్లను వెతుక్కుంటూ తమిళ దేశం చేరారు. అలా స్థిరపడ్డవారిలో కాకర్లవారి కుటుంబం ఒకటి. త్యాగయ్య గారిది నాలుగో తరం.
శ్రీకృష్ణలీలా తరంగిణి కర్త సాక్షాత్తూ మన తెలుగువాడు. నారాయణ తీర్థులై, వెళ్లితిరుప్పొందుర్తిలో స్థిరపడ్డాడు. అక్కడే సమాధి పొందాడు. ఇంక క్షేత్రయ్య జన్మస్థానం ఇక్కడే కృష్ణాజిల్లా మొవ్వ. కూచిపూడి సిద్ధేంద్రుడు ఆ పక్కవాడే. క్షేత్రయ్య మేనమామది మచిలీపట్నం. కానీ వీరందరికీ కీర్తి ప్రతిష్టలు లభించినది దక్షిణాదిలో.
క్షేత్రయ్య పదాలన్నీ దక్షిణాది విద్వాంసుల వల్లనే ప్రచారమయ్యాయి. మనవారి గొప్పతనం కాదు. రసజ్ఞులను వెతుక్కుంటూ దక్షిణాదిలోని సంస్థానాలు తిరిగి అక్కడి ప్రభువుల చేత సత్కారాలు పొంది చివరిదశలో క్షేత్రయ్య ఇక్కడకు చేరుకుంటారు.
కేరళలో స్వాతి తిరునాళ్ కేవలం మహారాజు మాత్రమే కాదు. గొప్ప వాగ్గేయకారుడు, సంగీత సాహిత్యాలలో ముఖ్యంగా సంస్కృతంలో పండితుడు. త్రిమూర్తుల వరుసలో ఉన్న వాగ్గేయకారుడు. తిరువనంతపురం దర్బారులో వడివేలు, తంజావూరు చిన్నయ్య, పొన్నయ్య మొదలైన వారంతా ఆస్థాన విద్వాంసులు. విద్వాంసుల్ని ఆదరించి అన్నం పెట్టాడు. వారి వద్ద నేర్చుకోవలసినవన్నీ నేర్చుకున్నాడు. కర్ణాటక సంగీతంలోనూ, హిందూస్థానీ శైలలోనూ వందలాది కృతులు రాశాడు.
ఆయన కులదైవం పద్మనాభస్వామి. ఎంతసేపూ 6వ నెంబర్ గదిలో పడి ఉన్న ధనరాశులు, ఆభరణాలను గురించే మాట్లాడతారే తప్ప ఆయన సంగీత వైభవం సాహిత్య ప్రతిభను గురించి మాట్లాడుకోరు. అదీ విశేషం. ఇంక కర్ణాటక సంగీతాన్ని పెంచి పోషించిన వారిలో కన్నడిగలు తక్కువేమీ కాదు. అక్కడ కూడా సంగీత సభలున్నాయి. విద్వాంసులున్నారు.
వైణిక శిఖామణి వీణ శేషణ్న, వీణ సుబ్బన్న అక్కడి వారే. ‘్భలే’ శహబాష్ అనే వాడంటూ లేకపోతే ఆ సంగీతానికి అర్థం, పరమార్థం వేరు. అలా అనగలిగిన సంగీతమై యుండాలి. వినగలిగిన సంస్కారముండాలి. మెహర్బానీ కోసం మొహమాటంగా తలూపటం కాదు.
వందలాది రసికుల మధ్య మహారాజు ఆశీనుడై సంగీత కచేరీ వింటూ ఆహా! ఎంత గొప్పగా పాడావయ్యా! ఎంత గొప్పగా వాయించావయ్యా! అంటూ ఆనందాతిశయంతో మైమరచిపోయి దగ్గరే నిలబడ్డ భటుణ్ని పిలిచి తెప్పించిన దుశ్శాలువతో ఆ విద్వాంసుణ్ని గౌరవిస్తే, ఏనుగు అంబారీ మీద కూర్చున్న అనుభూతితో ఆ విద్వాంసుడు సంబరంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. జన్మ ధన్యమైనదనుకుంటాడు.
విద్వాంసుల్ని పెంచి పోషించిన ఘనత మైసూర్ మహారాజులది. భగవంతుడు ఈ ప్రాణులను పుట్టించి అనుగ్రహించిన వెలకట్టలేని వస్తువులతో నాదం, మొదటిది. బ్రహ్మానందాన్ని కొంతవరకూ చెప్పగల విచిత్రమైన అనుభూతినివ్వగలదీ నాదమే. ఆ సంస్కారమున్న మహారాజులుంటే అంతకంటే ఆ విద్వాంసుడికి కావల్సినదేముంది?
మైసూర్ వాసుదేవాచారి, వెంకటగిరియప్ప టైగర్ వరదాచారి మొదలైన విద్వాంసులను పోషించి, వారి సాన్నిహిత్యంలో వాగ్గేయకారుడైన మైసూర్ మహారాజు జయచామ రాజేంద్ర వొడయార్. వందలాది కృతులు రచించి ప్రసిద్ధుడయ్యాడు ‘హరికథా పితామహుడు’ ఆదిభట్ల వారిని ప్రప్రథమంగా గుర్తించినది కన్నడిగులే. ఎక్కడెక్కడో సంస్థానాలు తిరిగి కథలు చెప్పి ఇంటికి రాగానే, ఇక్కడి ప్రభువులకు ఆయన గొప్పతనం తెలిసింది.
మనతో బాటు పవిత్రమైన దివ్యమైన కర్ణాటక 6/6 సంగీత బాణీని, తమిళులు, కన్నడిగులు, కేరళీయులు, త్రికరణ శుద్ధిగా ప్రేమించి శాఖోపశాఖలుగా ఈ సంగీత వటవృక్షాన్ని పెంచి వృద్ధి చేసి వెళ్లిపోయారు. దీని విలువ తెలిసిన రాజులు, సంస్థానాలు విద్వాంసులను నెత్తిన పెట్టుకుని గౌరవించాయి. వారి బ్రతుకు తెరువుకు లోటు లేకుండా ఆత్మతృప్తిగా బ్రతికారు. కర్ణాటక సంగీతంలోని ఆథ్యాత్మికమైన గాంభీర్యం, వైవిద్యం, లావణ్యం, భావసంపద, అనంతరం అద్వితీయమని నమ్మిన ప్రభువుల కాలం వెళ్లిపోయింది.
సామంతరాజులూ, రాజులు పోయి తరాజులు మిగిలారు. ప్రపంచంలోనే అత్యున్నతమైనది, దివ్యమైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఆ కలియుగ ప్రత్యక్షదైవం ఎదురుగా వినబడవలసిన సంగీతం ఎలా ఉండాలో ఒకరు చెప్పే పని లేదు. గోవింద నామాలతోనే సరిపెట్టుకుంటున్నారు భక్తులు. అంతకంటే ఎత్తుకు ఎదగలేని స్థితి. నిండిన చెరువును చూస్తే కనువిందే. ఆనందమే. కానీ ఒక్కసారైనా సముద్రస్నానం చేయాలనిపించకపోతే బుద్ధికి రుచి లేనట్లే. సంగీతం కూడా అంతే. పారితోషికాల కంటే ప్రశంసలే పరమావధిగా బ్రతికి, జీవితాలను వారు నమ్మిన విద్యకే అంకితం చేసుకున్న విద్వాంసులను అందలమెక్కించిన ప్రభువులేలిన గడచిపోయిన కాలం. గతవైభవానికి నిదర్శనం..
*చిత్రం... రాజా జయ చామరాజేంద్ర వడయార్
(మహారాజా -25)