అంతర్జాతీయం

అమెరికాలో వీడియోల హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 17: అమెరికా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు 2018లో తమ రాజకీయాలను ప్రచారం చేసుకోవడానికి భారీగా 4.5 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేస్తారని అంచనా. అయితే, ఇప్పటికే మొదలయిన ఈ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో కొంత మంది తక్కువ వ్యయంతో ఎనలేని ప్రాచుర్యాన్ని, ఫలితాన్ని పొందిన సంఘటనలూ ఉన్నాయి. న్యూయార్క్‌కు చెందిన కార్మిక వర్గానికి చెందిన అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. సోషలిస్టు భావాలు గల ఇద్దరు వీడియోగ్రాఫర్లు ఆమె వద్దకు వచ్చి, పది వేల డాలర్లకు లోపు వ్యయంతోనే ప్రచారం నిమిత్తం ఆమెను పరిచయం చేస్తూ వీడియో రూపొందిస్తామని చెప్పారు. అసలే ప్రచారానికి డబ్బు లేని ఆమెకు ఇదో అవకాశంగా కనిపించింది. ఈ ప్రతిపాదనకు ఆమె సరేనంది. రెండు నిమిషాల నిడివి గల ఈ ఆన్‌లైన్ వీడియోలో అప్పుడు 28 సంవత్సరాల వయసు గల ఒకాసియో కోర్టెజ్ సబ్‌వే ప్లాట్‌ఫామ్‌పై నడుస్తూ తనను తాను ఆకట్టుకునే రీతిలో ఓటర్లకు పరిచయం చేసుకుంది. ‘ఇది ప్రజలకు, ధనానికి మధ్య జరుగుతున్న పోటీ’ అని ఆమె మే నెలలో విడుదలయిన ఈ వీడియోలో వాయిస్‌ఓవర్‌లో పేర్కొంది. ఆకట్టుకునే రీతిలో ఉన్న ఈ వీడియోకు 5.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నాలుగు వారాల తరువాత రాజకీయంగా తాను నిలదొక్కుకున్న తీరును చూసి ఆమె ఆశ్చర్యపోయారు. న్యూయార్క్ ప్రైమరీ ఎన్నికల్లో ఆమె డెమొక్రటిక్ టైటాన్‌ను ఓడించారు. నవంబర్ 6వ తేదీన మధ్యంతర ఎన్నికలు జరుగనున్న తరుణంలో ప్రైమరీ ఎన్నికల్లో ఒకాసియో కోర్టెజ్ సాధించిన విజయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్మార్ట్ పొలిటికల్ అడ్వర్టయిజ్‌మెంట్ ఎలా పనిచేయగలుగుతుందో, శక్తివంతమయిన డిజిటల్ ప్రచారం ఎలా ముందుకొచ్చిందో ఈ ఉదంతం ప్రస్ఫుటం చేస్తోంది. అనేక మంది తొలిసారి పోటీ చేస్తున్న అభ్యర్థులు, వీరిలో చాలా మంది డెమొక్రాట్లు ఆన్‌లైన్‌లో ఓటర్లకు తమను తాము పరిచయం చేసుకుంటున్నారు. 2018వ సంవత్సరం వైరల్ క్యాంపెయిన్ వీడియో సంవత్సరంగా నిలిచిపోతోంది. ఒకాసియో కోర్టెజ్ అడ్వర్టయిజ్‌మెంట్‌ను తయారు చేసిన డెట్రాయిట్ కేంద్రంగా పనిచేస్తున్న ‘మీన్స్ అండ్ ప్రొడక్షన్’ సహ-వ్యవస్థాపకుడు నిక్ హాయెస్ మాట్లాడుతూ కొత్త అభ్యర్థులకు ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్ వరంలాంటిదని అన్నారు. ‘నాలుగు మిలియన్ డాలర్లు లేని అభ్యర్థులు కూడా ఇప్పుడు ఓటర్లకు తమను తాము పరిచయం చేసుకోగల శక్తిని సామాజిక మాధ్యమాలు, డిజిటల్ క్యాంపెయిన్ అందించాయి. గతంలో ఇలా సాధ్యం కాకపోతుండేది’ అని 21 ఏళ్ల హాయెస్ ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.