అంతర్జాతీయం

సరిహద్దు మరింత అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, జూన్ 6: జమ్మూలోని భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో ఏమాత్రం అజాగ్రత్త వహించకుండా పూర్తిస్థాయిలో జవాన్లను మోహరించి అప్రమత్తంగా ఉండాలని బిఎస్‌ఎఫ్ నిర్ణయించింది. ఇటీవల జమ్మూ, సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో సెక్టార్ కమాండర్ స్థాయి సమావేశం అనంతరం ఒక సీనియర్ అధికారి బుధవారం వివరాలను వెల్లడించారు. ఈనెల మూడో తేదీన ఆకునూర్ సెక్టార్‌లో పాక్ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో సరిహద్దును ఆనుకుని ఉన్న గ్రామాల్లోని 30 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారని చెప్పారు. ఈ దాడుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, 16 మంది పౌరులు గాయపడ్డారని తెలిపారు. అయితే గత రెండు రోజులుగా పాక్ నుంచి ఎలాంటి దాడులు లేకపోవడంతో గ్రామస్తులు ఇప్పుడిప్పుడే గ్రామాలకు చేరుకుంటున్నారని చెప్పారు. ఇక నుంచి సరిహద్దు ప్రాంతంలో తాము నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించినట్టు ఆ అధికారి చెప్పారు. ఇప్పుడిప్పుడే తమ గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు సాధారణ జీవితంలో పడ్డారని, పొలం, ఇతర పనులకు సైతం వెళ్తున్నారని ఆయన తెలిపారు. కాగా గత సోమవారం సరిహద్దు భద్రతా దళాలు, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన చర్చల్లో జమ్మూ, కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో ఇరు దేశాలు కాల్పుల విరమణ పాటించి శాంతిని స్థాపించాలని నిర్ణయించాయి. ఆ ఒప్పందం జరిగిన మర్నాడే పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు బిఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఇలా ఒప్పందాలు ఉల్లంఘించడం పాకిస్తాన్‌కు పరిపాటిగా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ 1252 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడినట్టు రికార్డులు చెబుతున్నాయి. దీంతో భారత్ దళాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించాయి.
కశ్మీర్‌లో నేటి నుంచి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గురువారం నుంచి రెండు రోజుపాటు జమ్ము-కశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించనున్నారు. ఇదే సమయంలో ఆయన సరిహద్దు జిల్లాలో పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొనే అవకాశముంది. ఇటీవలి కాలంలో కశ్మీర్ లోయలో అనేక హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తంమీద పరిస్థితిని ఆయన సమీక్షించే అవకాశముంది. రంజాన్ పర్వదినం సందర్భంగా గత మే 16 నుంచి కేంద్రం తాత్కాలికంగా ఏకపక్ష కాల్పుల విరమణను ప్రకటించిన దగ్గరినుంచి జరిగిన సంఘటనలపై హోంమంత్రి సవివరమైన సమీక్ష జరిపే అవకాశముంది. ఉగ్రవాద వ్యతిరేక చర్యలను నిలిపిపేయడం వల్ల సాధారణ జనజీవనానికి ఇబ్బందులు తలెత్తాయా, అన్న అంశంపై ముఖ్యంగా దృష్టి కేంద్రీకరిస్తారు. సమీక్షలో తేలినదాన్ని బట్టి ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలా వద్దా అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. జూన్ 28 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను నిలిపి వేయడమా లేక కొనసాగించడమా అనేదానిపై హోమ్ మంత్రి ప్రకటన చేస్తారని కూడా వారు తెలిపారు.
ఇటీవలి కాలంలో రాళ్లురువ్వే సంఘటనలు, సరిహద్దుల్లో చొరబాటు యత్నాలు పెరిగిన అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. హురియత్ కాన్ఫరెన్స్‌తో చర్చలు జరపడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో హోంమంత్రి పర్యటన చోటుచేసుకోవడం గమనార్హం. చర్చలకు వేర్పాటు వాదులు జమ్ము-కశ్మీర్‌ను ‘వివాదాస్పద ప్రాంతం’గా గుర్తించడంతో పాటు మరికొన్ని షరతులు పెట్టారు. సరిహద్దు ఆవలినుంచి పాక్ దళాలు జరుపుతున్న కాల్పుల్లో 20 మంది సాధారణ పౌరులు మరణించడం, వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అంశాలను కూడా హోంమంత్రి సమీక్షిస్తారు. ఇదేసమయంలో ప్రధాని ప్రకటించిన రూ.80,000 కోట్ల ప్యాకేజీ కింద రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై కూడా రాజ్‌నాథ్ సింగ్ సమీక్షిస్తారు.