మెయిన్ ఫీచర్

అక్షరపతికి సలక్షణ నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాటల కూర్పు, సంగీతకర్త ఒక్కరే అయివుంటే వారిని వాగ్గేయకారులంటారు. అన్నమయ్య గొప్ప వాగ్గేయకారుడు. పండితులు పద కవితలను నిరసించే కాలంలో పద కవితారచనకు పూనుకుని పదకవితకు ఒక నిర్ణీత స్థితిని, గౌరవాన్ని కల్పించాడు అన్నమయ్య. అందుకే పదకవితాపితామహుడిగా పిలువబడుతున్నాడు. అన్నమయ్య 1408 సం.లో వైశాఖ పూర్ణిమ నాడు తాళ్లపాకలో జన్మించాడు. తల్లిదండ్రులు లక్కమాంబ, నారాయణ సూరి. స్వామివారి నందకమే అన్నమయ్యగా అవతరించినట్లు చెబుతారు. అన్నమయ్య మాట్లాడితే కావ్యంలా, పాడితే గొప్ప గానంలా ఉండేదట. దైవానుగ్రహంతో అన్ని విద్యలూ అలవడినప్పటికీ లోక మర్యాదను అనుసరించి ఐదో ఏట గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారు. సంగీతము, భక్తి, సాహిత్యాల మేళవింపుతో సంకీర్తనల రూపంలో స్వామిని స్తుతించాడు. సంకీర్తనలతోపాటు శృంగార మంజరి, పనె్నండు శతకాలు, సంస్కృత వేంకటాచల మహాత్మ్యం, సంకీర్తన లక్షణాలు, ద్విపద రామాయణం అనే గ్రంథాలు రచించి స్వామివారి చరణాలకు అంకితమిచ్చాడు. ఇపుడు పనె్నండు వేల సంకీర్తనలు, శృంగారమంజరి, వేంకటేశ్వరా మకుటంతో అలమేలు మంగపై రచించిన శతకం మాత్రమే లభ్యమవుతున్నాయి. సాళువ నరసింహరాయలు అన్నమయ్యను తన ఆస్థానానికి పిలిచి పాటను పాడమని కోరాడు. ‘ఏమొకొ చిగురుటధరమున’.. పాటను పాడగా మెచ్చుకొని ఘనంగా సత్కరించి, అలాంటి పాటను తనపై వ్రాయమని కోరాడు. వెంటనే అన్నమయ్య ‘హరి ముకుందుని కొనియాడు నా జిహ్వ నిను కొనియాడనేరదెంతైనా’ అని ప్రభువు కోరికను తిరస్కరించాడు. రాజు కోపించి ‘మూరురాయరగండ’ అనే సంకెలలను వేయించి చెరసాలలో పెట్టించాడు. అన్నమయ్య ‘‘ఆకటి వేళల...’’ అని స్వామిని వేదనతో ప్రార్థించాడు. సంకెల వీడి క్రింద పడిపోయింది. రాజు తన పొరపాటును గ్రహించి పశ్చాత్తాపపడి అన్నమయ్య పాదాలపై పడి శరణు కోరుకున్నాడు. చివరిదశలో తిరుపతిలో వున్నప్పుడు మరో వాగ్గేయకారుడైన పురందరదాసు అన్నమయ్యను దర్శించి సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావించి కీర్తించాడు. అలాగే అన్నమయ్య కూడా పురందరదాసును విఠ్ఠలునిగా భావించి ఆదరించాడు. అన్నమయ్య ఆయా క్షేత్రాలలోని దైవాలను కీర్తిస్తూ ద్రావిడాగమ సార్వభౌముడు, సంకీర్తనాచార్యుడు అనే బిరుదులతో కీర్తిని పొందాడు. తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, అక్కలమ్మ అన్నయ్య భార్యలు. 1503 సం.లో ఫాల్గుణ బహుళ ద్వాదశినాడు శ్రీ వేంకటేశ్వరునిలో ఐక్యమైనాడు.
అన్నమయ్య సంకీర్తనాస్రవంతి నేటికీ నిరాఘాటంగా ప్రవహిస్తూ వున్నదంటే ఆ సంకీర్తనల్లోని అద్భుతమైన సాహిత్యం, శబ్ద సౌందర్యం, అర్థవైచిత్రి అందుకు కారణాలు. అన్నమయ్య సంకీర్తనల్లో నాట్యానికి అనుగుణమైనవి, సంగీత ప్రధానమైనవి, సాహిత్య ప్రధానమైనవి, భక్తిబోధకమైనవి వున్నాయి. ఇది గొప్ప విశేషం. పెళ్లి సమయంలో ‘పిడికిటి తలంబ్రాల పెళ్లికూతురు’ పాట, పసిపిల్లవాడికి ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’, ‘ఉయ్యాలా బాలునూచెదరు’లను పాడడం పరిపాటి. అన్నమయ్య సంకీర్తనల్లో మేలుకొలుపులు, ఉగ్గు, కూగూగ, దోబూచి, ఏల, జోల, లాలి, ఉయ్యల, కోలాట, సువ్వి, అల్లో నేరెళ్ళో, జాజర, సంవాదగీతాలు, మంగళహారతి మొదలైన పదాలు వున్నాయి. నెయ్యములల్లో నేరెళ్ళో, క్షీరాబ్ధి కన్యకకు, ఉగ్గువెట్టరే ఓయమ్మ వంటి పాటలు ప్రాచుర్యాన్ని పొందినాయి. సఖి జానామితత్, నారాయణతే నమో నమో, డోలాయాంచల ఆదిపురుషా అఖిలాంతరంగా, భూదేవతారమణ భుజగేంద్రశయనా వంటి సంస్కృత పదాలతో నిండిన పాటలు పండితుల ఆదరణకు పాత్రమైనాయి. ఈ విధంగా పండిత పామరుల మనోరంజక కీర్తనలు వున్నాయి. ‘‘అలరులు కురియగనాడెనదే అలకల కులుకుల అలమేలుమంగ, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు’’ వంటి పాటలు నాట్యానికి అనుకూలంగావున్నాయి. ‘నానాటి బ్రతుకు నాటకము, దిబ్బలు పెట్టుచు తేలినదిదిగో’ అనే పాటలు వేదాంతాన్ని నూరిపోస్తాయి. అనయము దుర్బలునికి అన్నమిడవలెగాక- తనిసిన వానికి తానేలా? అప్పులేని సంసారమైన పాటి చాలు అనేవి నీతిని బోధిస్తాయి. ‘‘ఇందరికీ అభయంబులిచ్చు చేయి’’, ‘‘డోలాయాంచల’’లలో దశావతార వర్ణన వుంది. ఉయ్యాల పాటైన డోలాయాంచల పాట ఊపులకు అనుగుణంగా సాగుతుంది. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే సమానత్వాన్ని చాటుతుంది. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, ఇప్పుడిటు కలగంటి ఎల్ల లోకములకు అప్పడుగు తిరువేంకటాధీ(ధ్రీ)శుగంటి, కట్టెదుట వైకుంఠము కాణాచైన కొండ, అదిగో అల్లదిగో శ్రీహరివాసము మొదలైన సంకీర్తనలు ఏడుకొండల వైభవాన్ని, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మహాత్మ్యాన్ని వర్ణించిన విధం అద్భుతమైనది. కళ్ళకు కట్టినట్లుండిన ఆ వర్ణన మనస్సును ఆకట్టుకుంటుంది. భార్యాభర్తల ప్రేమ బంధాన్ని వర్ణించేవి, అత్తాకోడళ్ళ పాటలు కూడా వున్నాయి. ఇన్ని రాశులయునికి సంకీర్తన ఆ రాశులను స్ర్తితో సమన్వయిస్తూ చెప్పినది, కృష్ణునికి సంబంధించినవి, రామునికి సంబంధించినవి, అమ్మవారిని స్తుతించినవి, వేంకటేశ్వరస్వామిని కీర్తించినవి ఇంకా రకరకాలుగా సంకీర్తనలను కూర్చారు. సువీ సువీ సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియె అనే పాట శ్రీకృష్ణుని జననాన్ని తెలిపింది. ముద్దుగారే యశోద పాట బాలకృష్ణుని వర్ణిస్తుంది. రాముడు రాఘవుడు రవికులుడితడు పాట రామతత్త్వాన్ని ఆవిష్కరిస్తుంది. జయ జయ రామా సమర విజయ రామా పాట మార్దవంతో నిండి రాముని హృదయ సౌకుమార్యాన్ని వెల్లడిస్తుంది. చల్లని తల్లికి ఛాంగుభలా, పలుకు తేనెల తల్లి మనోహరంగా సాగుతాయి. సకల పతికి సరసపు కొమ్మగా అభివర్ణించబడిన అలమేలు మంగను స్తుతిస్తూ అలమేలు మంగా నీ అభినవ రూపము జలజాక్షు కన్నులకు చవులిచ్చేనమ్మా అని చెప్పి కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని అని అమ్మతోపాటు వేంకటేశ్వరస్వామిని కూడా కీర్తించాడు. ఆ తల్లి సౌందర్యం ఒకపరి కొకపరి ఒయ్యారమై వున్నదట. శ్రీ మహాలక్ష్మీదేవికి హారతినిచ్చేపాట క్షీరాబ్ది కన్యకకు శ్రీమహాలక్ష్మికిని, నీరజాలయకును నీరాజనం అనే పాట నేటి హారతి పాటల్లో ఒకటిగా పాడబడుతూ వున్నది. అమ్మవారికి హారతినిస్తూ జనులు పడుతున్న నీరాజనం మన తెలుగువారు అన్నమయ్యకు పడుతున్న నీరాజనమే.

-లక్ష్మీ అన్నపూర్ణ