శ్రీకాకుళం

భక్తులకు తప్పని పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిత్యా.. మన్నించు.. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం భక్తుల పాలిట శాపంగా మారి పిల్లలు, వృద్ధులు, వికలాంగులు పాపం ఇబ్బందులకు గురయ్యారు. పైన ఎండవేడిమి, తాగుదామంటే నీటిచుక్క లేదు. నీరు అందించే నాధుడు కింద కానరావడం లేదు. వెనక్కు వెల్దామంటే కిలోమీటర్ల నిడివి క్యూలైన్లు నిండుకున్నాయి. దైవ దర్శనానికి గంటల కొలది సమయం పట్టడంతో సొమ్మశిల్లి పోతున్నా కనీసం ఆదరించే వారే కరువైనారు. ఇంతటి దారుణం చరిత్రలో చూడలేదు. అయినా యంత్రాంగాన్ని కరుణించు..్భవిష్యత్‌లోనైనా ఇటువంటివి జరగకుండా దీవించు.. ఇవీ ఆరోగ్య ప్రధాత ఆదినారాయణుడు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలకు విచ్చేసిన భక్తుల ఉవాచ. ఆదివారం నాడు రథసప్తమి వేడుకల్లో ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడింది. రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహంలు ఎవరికి వారు వేర్వేరుగా గత కొద్దిరోజులుగా రథసప్తమి వేడుకల పట్ల యంత్రాంగంతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కానరానీయకూడదని పదే పదే చెప్పడం మినహా ఆచరణలో మాత్రం కిందిస్థాయి నుండి పై స్థాయి వరకు యంత్రాంగం మొత్తం ఘోర వైఫల్యం చెందింది. దీంతో ఆదిత్యుని తనివితీరా దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులు ఆలయ ఆవరణలోనే యంత్రాంగం తీరుపట్ల దారుణాతి దారుణంగా తిట్లు, దీవెనలతో దుమ్మెత్తి పోసారు. శనివారం అర్థరాత్రి నుంచి క్యూ లైన్లలో నిల్చున్న భక్తులు ఆదివారం ఉదయం ఆరు గంటలైనా ఆదిత్యుని దర్శనం కానరాక సొమ్మశిల్లారు. పగటి పూట అయితే మరీ దారుణం, చెప్పనలవి కానిరీతిలో పోలీసు అయితే చాలు వివిఐపి అన్న రీతిలో వ్యవహరించిన తీరు ఎమర్జెన్సీని తలపించింది. ఓ పక్క ప్రజాప్రతినిదులు వారివెంట వందల మందిని వెంటేసుకురావడం, మరోపక్క పోలీసులు హోంగార్డు నుంచి సిఐ స్థాయి వరకు ఎవరికి వారు తమ కుటుంబ సభ్యులను, బంధువులను డజన్ల కొద్దీ వివిఐపిలుగా సాగనంపడంతో క్యూ లైన్లలో వేచివున్న భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. ఒక్కో క్యూ లైను సుమారు మూడు, నాలుగు కిలోమీటర్ల మీర ఉందంటే వారి పరిస్థితి చెప్పనలవి కాదు. ఇదిలావుంటే పిల్లలకు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసామని చెప్పిన జిల్లా కలెక్టర్ మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయి. కనీసం మంచినీటి ప్యాకెట్లు సైతం అందించలేకపోయారంటే యంత్రాంగం పనితీరు ఏపాటిదో బేరీజు వేసుకోవచ్చు. దీనిపై ఆలయ ఈవో శ్యామలాదేవిని కొంతమంది వ్యక్తులు నిలదీస్తే 500 బస్తాలు తెచ్చామని చెప్పారు. అయితే ఆ బస్తాలను భక్తుల చెంతకు మాత్రం చేరవేసేందుకు పోలీసులు మోకాలడ్డారు. ఇదీ అధికారుల మద్య సమన్వయం. దీనిపై ఇదేనా యంత్రాంగం భక్తులకు కల్పించిన సదుపాయాలు అంటూ క్యూలైన్లలో వేచివున్న వృద్ధులు, పిల్లల కుటుంబ సభ్యులు జిల్లా యంత్రాంగం మొత్తాన్ని తిట్లు, దీవెనలతో దుమ్మెత్తిపోసారు. ఒకానొక సమయంలో భక్తుల ఆగ్రహాన్ని అదుపుచేయడం పోలీసులకు సాధ్యం కాదనిపించింది. ఈ పరిస్థితిలో జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్ స్వయంగా రంగంలోకి దిగి కొంతమేర వివిఐపిలను రానీయకుండా చేయగలిగారు. అయినప్పటికీ ఇటువంటి సమయంలో సైతం పోలీసు, రెవెన్యూ, జుడీషియల్ సిబ్బంది తమతమ కుటుంబ సభ్యులను, బంధువులను ప్రత్యేక క్యూ లైన్లలో దర్శనం కోసం తీసుకువెల్లడం విశేషం. కాగా విధులు నిర్వర్తించాలనుకునే మీడియాను భక్తులు అధికంగా ఉండే క్యూ లైన్లలో పంపించేందుకు అక్కడి యంత్రాంగం ప్రయత్నించడం ఒకింత ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీనిపై పోలీసులను మీడియా నిలదీయగా, కసురుకోవడం మినహా పరిస్థితిలో మార్పుకానరాలేదు. దేశంలోనే కోణార్క్ తరువాత ఏకైక సూర్యనారాయణ స్వామి దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం చరిత్రలో, ఇంతటి దారుణంగా యంత్రాంగం వైఫల్యం చెందడం కానరాలేదని భక్తులు అనేక మంది విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా పసగాడ సూర్యనారాయణ మిల్లు కూడలి నుంచి ట్రాపిక్ ఆంక్షలు విధించిన పోలీసులు వారి సిబ్బందికి మాత్రం దేవాలయ ముఖద్వారం వరకు ఎటువంటి ఆంక్షలు లేకపోవడం విశేషం. ఆఖరుకు పోలీసుల తీరు ఎంతలా ఉందంటే విధులు నిర్వహించాలనుకునే సిబ్బందిని సైతం లోపలికి పోనీకుండా అడ్డుకున్నారంటే ఇక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనిపై అధికారులు చెబుతున్న వాదన మరోలా ఉంది. అంచనాకు మించి భక్తులు వచ్చారన్నది వారి వాదన. ఇదే నిజమనుకుందాం. అయినప్పటికీ, గోదావరి పుష్కరాలు, మహోదయంలో బాగంగా కళింగపట్నం ఘటనలపై వారు అనుభవ పాఠాలు నేర్చుకోపోవడం వారి వైఫల్యం కాదా అన్నది ప్రశ్న. అంచనాలకు మించి భక్తులు దర్శనాలకు విచ్చేస్తారని ముందుగా అందరూ ఊహించిందే, ఈ మేరకు భక్తులకు ఎటువంటి సదుపాయాలు కల్పించకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ యంత్రాంగం తప్పిదమే. దీనిపై ఎవరు ఏమనుకున్నా దేవాదాయ శాఖ, పోలీసు, రెవెన్యూ అధికారుల మద్య సమన్వయం లేకపోవడం కూడా యంత్రాంగం వైఫల్యానికి కారణం. ఎవరికి వారు పొరపొచ్చాలకు పోకుండా భక్తులకు ఆధిత్యుని దర్శన భాగ్యం సజావుగా కలిగించే రీతిలో భవిష్యత్‌లోనైనా ఇటువంటి అనుభవాలనుండి గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంది.

ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఫిబ్రవరి 14: ఆరోగ్య ప్రధాత ఆదిత్యుడని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రధసప్తమి పర్వదినాన్ని పురష్కరించుకొన అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామిని సతీసమేతంగా ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈసందర్భంగా గవర్నర్ దంపతులకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆలయ ముఖద్వారం నుండి ఆలయ గర్భగుడి వరకు వేదమంత్రాలు, ఆలయ మర్యాదలతో, పూర్ణకలశంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనివెట్టి మండపం వద్ద గవర్నర్ దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వామివారి విశిష్టతను తెలియజేయగా జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.శ్యామలాదేవి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని గవర్నర్ దంపతులకు అందజేశారు. ఈసందర్భంగా గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ మీడియాతో మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే ఏకైక దైవం శ్రీసూర్యభగవానుడని పేర్కొన్నారు. అరసవల్లిలోగల శ్రీసూర్యనారయణస్వామి క్షేత్రం మహాపుణ్యక్షేత్రమని కొనియాడారు. స్వామివారిని పూజించడం ద్వారా సర్వరోగాలు నివారణ అవుతాయని అటువంటి మహిమగల దైవమైన శ్రీసూర్యనారాయణస్వామివారిని దర్శించుకోవడం ద్వారా చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయనతోపాటు ముఖ్యకార్యదర్శి ఎస్ రమేష్ దంపతులు, హెచ్ ఆర్డి డైరెక్టర్ జనరల్ చక్రపాణి సతీమణి, ఎస్పీ ఎఎస్‌ఖాన్, డిఎస్పీ భార్గవరావునాయుడు, ఆర్డివో దయానిధి తదితరులు పాల్గొన్నారు.

ఆటో-బస్సు ఢీ : ఇద్దరు మృతి
పాలకొండ(టౌన్), ఫిబ్రవరి 14: మండలం వెలగవాడ పంచాయతీ సిరికొండ గ్రామ సమీపంలోని మలుపు వద్ద ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు గిరిజనులు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు గిరిజనులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఏరియా ఆసుపత్రి వైద్యులు శ్రీనివాసరావు ప్రథమ చికిత్స చేసి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సీతంపేట మండలం బుడ్డుగూడ, తొత్తడి గ్రామాలకు చెందిన గిరిజనులు బూర్జ మండలం లక్కుపురంలో ఒక బంధువు ఇంటికి శుభ కార్యాయానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సీతంపేట- పాలకొండ రహదారిలో సీతంపేట నుంచి పాలకొండ వస్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జుకాగా బుడ్డుడు గూడ గ్రామానికి చెందిన సవర జమ్మయ్య (25), గొయిది గ్రామానికి చెందిన సవర సన్నాయి (42) అక్కడికక్కడే ప్రాణాలు విడిచి పెట్టారు. వీరితోపాటు ప్రయాణిస్తున్న సవర చంద్రరావు, గంగయ్య, సవర తుంబలి, నర్సమ్మ, వసంతరావు ( అనేబాలుడు), ఇప్పమానుగూడకు చెందిన సవర శిమ్మయ్యలు గాయపాలకాగా, వీరిలో తుంబలి, గంగయ్యలు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. ప్రమాదం జరిగిన విషయంపై స్థానికులు గుర్తించి 108 వాహానానికి సమాచారమివ్వడంతో క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందించారు. ఆటో డ్రైవరు సవర రామారావుకు కూడా గాయాలు కావడంతో ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు డ్రైవరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
* ఏజెన్సీలో విషాధం
సీతంపేట మండలం మండ పంచాయతీ సరిహద్దు గూడ గ్రామానికి ముగ్గురు గిరిజనులు రెండ్రోజుల కిందట జరిగిన ట్రాక్టరు బోల్తా ప్రమాదంలో మృతి చెందారు. ఇంకా ఆ ఘటన మరువక ముందు సిరి కొండ మలుపు వద్ద జరిగిన ప్రమాదంలో మరో ఇద్దరు గిరిజనులు మృతి చెందటం ఏజెన్సీలో విషాధ అలముకుంది. ఈ ప్రమాదానికి రెండు వివాహనాలు అతి వేగం కారణమని, అలాగే మలుపు వద్ద పలు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఆర్ అండ్‌బి అధికారులు ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సంఘటన వద్ద ఆటో నుజ్జుకావడం, మృతి చెందిన వారి దేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో చూసిన వారికి ప్రమాద తీవ్రత అర్థవౌతుంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

భక్తులతో కిటకిటలాడిన అరసవల్లి
పాతశ్రీకాకుళం, ఫిబ్రవరి 14: శ్రీ ఉషా పద్మినీ ఛాయాసమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి జయంత్యుత్సవం (రథసప్తమి)ను సూర్యనారాయణా...వేదపారాయణా అంటూ భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు. భానుడికి అత్యంత ప్రీతికరమైన ఆదివారం రథసప్తమీ కావడంతో లక్షలాదిగా భక్తులు స్వామి నిజరూపదర్శనం కొరకు తరలివచ్చారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి సూర్యనారాయణస్వామివారి మహాక్షీరాభిషేకం సేవను ప్రారంభించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పానకం వంటి పంచామృతాలే కాకుండా వివిధ రకాల ఓషధులు,పళ్ళ రసాలు, సముద్రజలాలతో అత్యంత వైభవంగా క్షీరాభిషేకం కొనసాగింది. స్వామివారి నిజరూపాన్ని కన్నులారా వీక్షించి భక్తజనం భక్తిపారవశ్యం చెందారు. అనంతరం స్వరూపానందేంద్రస్వామి మాట్లాడుతూ రధసప్తమి నాడు స్వామి వారిని దర్శించుకొన్నవారికి పునర్జన్మ ఉండదన్నారు. ఈ ఏడాదిలో ఉన్న సర్పదోషాల కారణంగా రాష్ట్రంలో ఒడిదుడుకులు ఏర్పడతాయన్నారు. ప్రత్యక్షనారాయణుని దర్శించుకొనేందుకు మంత్రితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సాంప్రదాయ దుస్తులతో తరలివచ్చారు. రాష్టక్రార్మికశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సూర్యభగవానిని దర్శించుకొని భక్తులు పునీతులు కావాలన్నారు. రాష్టమ్రంతటా ఆరోగ్యంగా ఉండాలంటే అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి అనుగ్రహం కావాలన్నారు. అందుకు అందరూ ఆయన నిజరూపం దర్శించుకోవాలన్నారు. ఆలయాన్ని మరింతగా అభివృధ్ది చెందేలా కృషి చేస్తామన్నారు. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ఎక్కడాలేని సూర్యదేవాలయం మనజిల్లాలోనే ఉందని, అంతటి ఆలయ విశిష్టతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గతంలో జిల్లా చుట్టుపక్కలవారు మాత్రమే వచ్చేవారని, కానీ ఇప్పుడు వివిధ జిల్లాలనుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి భక్తులు స్వామిని దర్శించుకొనేందుకు వస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ రధసప్తమీ నాడు సూర్యభగవానుని దర్శనం మహద్భాగ్యమన్నారు. శ్రీకాకుళం శాసనసభ సభ్యురాలు గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని చెప్పారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.అప్పారావు మాట్లాడుతూ దేవాదాయశాఖతో పాటు పోలీసుశాఖ చక్కటి ఏర్పాట్లు చేసిందన్నారు. జిల్లా కలెక్టర్ డా.పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ భక్తులు ప్రశాంత మనస్సుతో స్వామి దర్శించుకోవాలని సూచించారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి మాట్లాడుతూ ఎన్నో పురాణాలలో ఆలయ విశిష్టతను తెలియచేశారని అంతటి పురాతన ఆలయం మన జిల్లాకు చెందడం అదృష్టమన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రోజు ప్రారంభంలోనే కాకుండా చివరివరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్, అరసవల్లి దేవస్థానం ఇ.ఒ శ్యామలాదేవి మాట్లాడుతూ రూ. 216 క్షీరాభిషేకం టిక్కెట్లను రెండేవేల పైగానే విక్రయించామని తెలిపారు.
న్యాయమూర్తులు పద్మావతి, సాయిసుధ, శ్రీనివాసరావు, నాగమణి, సోంపేట సీనియర్ సివిల్ జడ్జి బబిత, ఏలూరు మెజిస్ట్రేట్ ఉషాసింగ్, డి. ఐ.జి రవిచంద్ర, విజయనగరం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్సీ, గొర్లె హరిబాబు, శాసనసభ సభ్యురాలు కళావతి, బగ్గు రమణమూర్తి తదితరులు స్వామి వారిని దర్శించుకొన్నారు. ఇక అర్ధరాత్రి నుంచే ఇంద్రపుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కనిపించింది. వేకువఝూమున ముందు గంటల నుంచే భక్తులు పుష్కరిణిలో స్నానాలను ఆచరించి భానుడికి అర్ఘ్యలను వదిలి నమస్కరించారు. పిడకలతో మట్టికుండల్లో పాలు పొంగించి పరమాన్నం చేసి సూర్యనారాయణుడికి నివేదన చేసి జంగమదేవరుల దీవెనలు పొందారు.
శ్రీముఖలింగానికి పోటెత్తిన భక్తులు
జలుమూరు, ఫిబ్రవరి 14: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం మండలం శ్రీముఖలింగం మధుకేశ్వర పంచాయతన దేవుళ్లను భక్తులు ఆదివారం దర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం నుండి పలు ప్రాంతాలనుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగాణ కిటకిటలాడించి. ప్రధానాలయం గర్భగుడిలో కొలువైయున్న సూర్యనారాయణస్వామిని భక్తులు క్షీరాభిషేకాన్ని చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగాణంలో ఉన్న వారాహి అమ్మవారిని, నారాయణస్వామి(వెంకటేశ్వర)కి పూజలు నిర్వహించారు. అర్చకులు రామ్మూర్తి, శ్రీకృష్ణలు భక్తులకు దాని ప్రాధాన్యతను వివరించారు.

ఇంద్ర పుష్కరణి వద్ద పూజలు
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 14: రధసప్తమి వేడుకను పురస్కరించుకొని శ్రీ సూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు ఇంద్రపుస్కరిణి వద్ద పూజలు నిర్వహించేందుకు పోటీ పడ్డారు. ఆదిత్యునికి అతి ప్రీతికరమైన రోజు ఆదివారం కావడంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ జిల్లాలు, ఒడిస్సా రాష్ట్రాల నుండి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునే ముందు పూజలు నిర్వహించారు. పితృదేవతలను సంతృప్తిపరిచేలా ఆవుపేడ పిడకలతో మట్టికుండలో పొంగలి తయారుచేసి ఆముదం ఆకులలో నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లిచేందుకు మహిళా భక్తులు పోటీపడ్డారు. అలాగే జంగమ దేవరులకు కానుకలు ఇచ్చి పొగిడించుకునేందుకు కూడా భక్తులు క్యూకట్టారు. ఈ పూజలతో ఇంద్రపుష్కరిణీ పరిసరాలు కిటకిటటలాడాయి. భక్తులుపూజాసామాగ్రికి ధరను పెంచి చిరువ్యాపారులు సొమ్ముచేసుకోవడం కనిపించింది.

టిటిడి ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు
బలగ, ఫిబ్రవరి 14: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక టిటిడి కళ్యాణ మండపంలో సూర్య నమస్కారాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాస్కరబట్ల శ్రీరాంమూర్తి పర్యవేక్షణలో ఆధిత్య హృదయం, సూర్య నమస్కారా ప్రాసస్త్యం గూర్చి ప్రసంగించారు. అనంతరం యోగా గురువు రామారావు వారిచే సూర్యనమస్కారాలు చేయించారు. ఈ కార్యక్రమంలో 150 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనగా, సాయికృష్ణ కళాశాల ప్రిన్సిపాల్ నిక్కు అప్పన్న, ధర్మ ప్రచార పరిషత్ మండలి ఉపాధ్యక్షులు బరాటం కామేశ్వరరావు, టిటిడి మాజీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ అధికారి రుంకు అప్పారావు, అంబేద్కర్ యూనివర్శిటీ అద్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
సాహిత్యం పట్ల మక్కువకు తార్కాణం కథానిలయం
* రచయిత రామతీర్ధ
పాతశ్రీకాకుళం, ఫిబ్రవరి, 14: సాహిత్యం పట్ల మక్కువకు కథానిలయం తార్కాణంగా నిలుస్తుందని రచయిత రామతీర్ధ అన్నారు. నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆదివారం కథానిలయ 19వ వార్షికోత్సవ ముగింపుకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎక్కడెక్కడి కథలనో సేకరించి వాటికి ఒక నిలయాన్ని కల్పించిన ఘనత కాళీపట్నం రామారావుకే దక్కిందన్నారు. సాహిత్యం పట్ల ఆయనకున్న మక్కువకు తార్కాణంగా కథానిలయం నిలుస్తుందని ఆయన చెప్పారు. అనంతరం రచయిత కాళీపట్నం రామారావు మాట్లాడుతూ ఎందరో రచయితల కధల కారణంగానే కథానిలయ స్థాపన జరిగిందన్నారు.దీనిని మరింతగా అభివృద్ధి చెయ్యాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రచయితలు బి.వి. ఎ.రామారావు నాయుడు,దాసరి అమరేంద్ర, దాసరి రామచంద్రరావు, చింతాడ రామారావు, జి.వి.నాయుడు,జి.గౌరీనాయుడు పాల్గొన్నారు.

అనాథలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఫిబ్రవరి 14: అనురాగ నిలయాల్లో ఉన్న చిన్నారులు అనాథలు కాదన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ స్పష్టంచేశారు. ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం పట్టణంలోగల శాంతా అనురాగ నిలయాన్ని గవర్నర్ సందర్శించారు. ఇక్కడ చిన్నారులతో భగవద్గీత చదివించి ఎంతో ఆనందించారు. ఈ చిన్నారులను ఎవ్వరూ అనాదులు అని అనవద్దని హితవుపలికారు. తల్లిదండ్రులు లేని లోటును తీర్చేవిధంగా చిన్నారులను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఆనురాగనిలయం నిర్వాహకులు కృషి చేయాలన్నారు. పిల్లలనుద్దేశించి ఆయన మాట్లాడుతై చక్కగా చదువుకొని జీవితంలో పైకిరావాలన్నారు. తల్లిదండ్రులు లేరన్న భయం మీకు అక్కర్లేదని మేమంతా మీకు అండగా ఉంటామని గవర్నర్ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఈ అనురాగ నిలయం మరింత ఉన్నతంగా నిర్వహించేందుకు మూలధనం సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కమిటీ ప్రతినిధులు దాతల నుంచి సమీకరించాలన్నారు. ఇటువంటి ఆనురాగ నిలయాలు మరిన్ని ఏర్పాటు చేసి తల్లిదండ్రులులేని చిన్నారులకు సామాజిక బాధ్యతగా ఉజ్వల భవిష్యత్ అందించే దిశగా ముందుకు సాగాలన్నారు. రూ.2లక్షల విరాళాన్ని ప్రకటించి మరింత స్ఫూర్తిగా నిలిచారు. అలాగే అనురాగ నిలయం సందర్శించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని గవర్నర్ నిర్వాహకులను మరింత ఉత్సాహపరిచారు. ఈయనతోపాటు విచ్చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్‌కుమార్ ఈ అనురాగనిలయంలోగల ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వీరికి ఏడాదికి రూ.30వేలు చొప్పున చెల్లించేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ ముందుకు రావడం అభినందనీయం. జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, గీతా శ్రీకాంత్, నిక్కు హరిసత్యన్నారాయణ, జామి భీమశంకర్, బలివాడ మల్లేశ్వరరావులు ఉన్నారు. అనంతరం రిమ్స్ ఆసుపత్రిని గవర్నర్ తనిఖీ చేసి వైద్యసేవలందుతున్న తీరుపై ఆరాతీశారు. ఇక్కడి నుండి ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేరుకొని గవర్నర్ దంపతులు బస చేశారు.
* రెండవ రోజు సీతంపేట పర్యటన:
సోమవారం కూడా జిల్లాలోని సీతంపేట మండలంలో మల్లిగురుకులం విద్యార్థులతో గవర్నర్ ముకాముఖి నిర్వహించనున్నారు. పి ఎం ఆర్సీలో నర్శింగ్ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడనున్నారు. యూత్ ట్రైనింగ్ సెంటర్‌ను కూడా పరిశీలించి ఐ టి డి ఏవో భోజనం ముగించుకొని తిరిగి ప్రయాణం కానున్నారని అధికారులు షెడ్యూల్లో స్పష్టంచేశారు.