మహాక్రిమి.. ముంచేస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన టాలీవుడ్‌కు -ముగింపులో మాత్రం అనూహ్య పరిణామమే ఎదురైంది. అదే -కరోనా. వైరస్ నిరోధక చర్యల్లో భాగంగా వినోదానికీ ప్రభుత్వం బ్రేకులేయడంతో -బాక్సాఫీస్‌కు అనారోగ్యం తప్పేలా కనిపించటం లేదు. ప్రభుత్వం తీసుకున్న ఆరోగ్య జాగ్రత్త చర్యలు అవసరమే అయినా.. టాలీవుడ్‌పై మాత్రం తీవ్ర ప్రభావం చూపించేలానే ఉంది. ప్రజారోగ్యం దృష్ట్యా ముందస్తు చర్యలు మంచిదే అయినా -కోట్లలో సంభవించే నష్టాలను తలచుకుని టాలీవుడ్ బెంబేలెత్తుతోంది. వ్యాపారాత్మకంగా మారిన వినోదానికి అవాంతరాలు ఎదురవ్వడంతో -ఇప్పటికే పూరె్తైన, సెట్స్‌మీదున్న సినిమాల పరిస్థితిని తలచుకుని మేకర్లు హడలెత్తుతున్నారు. ‘ఆచార్య షూటింగ్‌ను వాయిదా వేశాం. భయానక వైరస్ నిరోధానికి ప్రభుత్వాలకు సహకరించటం మన బాధ్యత. సినీజనమంతా సహకరిస్తారని ఆశిస్తున్నా’ -అంటూ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి చేసిన అప్పీల్ ఆహ్వానించతగ్గదే. చిరు అప్పీల్‌కు రెస్పాన్స్ మాటెలావున్నా -గత్యంతరం లేని పరిస్థితుల్లో మేకర్లూ ఇదే నిర్ణయంవైపు మొగ్గు చూపుతున్నారు. షూటింగ్‌ల వాయిదాకే దర్శక నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క తాత్కాలికంగా థియేటర్లు మూసేసి సహకరించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో -బాక్సాఫీస్‌వద్ద వౌనం రాజ్యమేలుతోంది. థియేటర్ల మూతతో సినిమాల విడుదల ఎలానూ ఉండదు కనుక -ఆయా సినిమాల ప్రమోషన్లకూ తెర తప్పదు. సిద్ధమైన సినిమాను జనం దగ్గరకు తీసుకెళ్లే ఏకైక మార్గం ప్రమోషన్స్. ఈ ప్రమోషన్స్‌తోనే ఇండస్ట్రీలో ఒకింత హడావుడి కనిపిస్తుంది. ఇప్పుడిక ప్రచారాలూ ఆగిపోవడంతో -ఇండస్ట్రీ మొత్తం స్తబ్దుగా మారింది. పరిస్థితిని చూసి -చిన్న నిర్మాతలు బెంబేలెతుతున్నారు. థియేటర్లులేక -విడుదల వాయిదా పడుతోన్న సినిమాలకు భారీ నష్టాలు తప్పవన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై ఫ్యాషన్‌తో ఎక్కడెక్కడో డబ్బు సమకూర్చుకుని చిత్రాలు పూర్తిచేసిన వాళ్లంతా -సంభవించే నష్టాలను లెక్కలేసుకుంటున్నారు. కరోనా ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని చాలా సినిమాలు ఇప్పటికే విడుదల తేదీలు ఫిక్స్ చేసుకుని ప్రకటించేశాయి. అలాంటి చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు వాయిదాలను ప్రకటిస్తున్నాయి. వైష్టవ్‌తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెన చిత్రం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ధైర్యంగా ప్రమోషన్స్ సైతం నిర్వహించేసిన కారణంగా -వాయిదాతో కోటి వరకూ నష్టం సంభవించొచ్చని నిర్మాత యలమంచిలి రవిశంకర్ అంటున్నారు. ఇలాంటి సందర్భంలో నిర్మాతల మండలి, గిల్డ్ తగు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాత కెకె రాధామోహన్ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రూషియల్ టైంలో అందరికీ న్యాయం జరిగేలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆగిపోయిన సినిమాల విడుదల విషయంలో ఇబ్బందులు తప్పేలా లేదు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి విషయం కనుక -పరిస్థితిని కాదనలేం. సినిమా పరిస్థితి, నిర్మాత స్టామినాను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మంచిది. మార్చి 25న రావాల్సిన ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదలయ్యేలా అవకాశం కల్పించమని కోరనున్నట్టు చెప్పారు. ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ చిత్రం తీసిన నిర్మాత ఎంఎన్‌ఆర్ చౌదరి సైతం ఈ పరిస్థితిపై కామెంట్ చేస్తూ -ఇదంతా నిర్మాతల ఖర్మ అన్న బాధ వ్యక్తం చేశారు. థియేటర్ల మూతతో సినిమాలు ఆగిపోయి డిస్ట్రిబ్యూటర్లకూ డబ్బులు చెల్లించలేదు. కొద్దిరోజుల్లోనే పరిస్థితి మారి సినిమాలను విడుదల చేసినా -్థయేటర్లకు జనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోవడం ఖాయం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా విడుదల విషయంలోనే కాదు, పరిణామాలతో తీవ్రంగా నష్టపోయిన నిర్మాతలకు కొంతైనా లబ్ది జరిగేలా ప్రభుత్వాలతో గిల్డ్ మాట్లాడాల్సిన అవసరం ఉందని కొందరు చిన్న నిర్మాతలు అంటున్నారు.
గిల్డ్‌కు తలనొప్పే
వేసవి సీజన్‌ను టార్గెట్ చేస్తూ పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో -మీడియం రేంజ్ హీరోలు నిన్నటి వరకూ ఉత్సాహంగానే కనిపించారు. థియేటర్ల మూత కారణంగా -విడుదల షెడ్యూల్స్ మొత్తం తలకిందులవుతుండటంతో ఆందోళన మొదలైంది. పరిస్థితి సద్దుమణిగి థియేటర్లు తెరుచుకుంటూ -్ఫలానా డేట్‌లో మా సినిమా వచ్చేలా చూడంటంటూ గిల్డ్ ముందుకు అనేక విజ్ఞప్తులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మార్చి నెలాఖరుకు పరిస్థితి సద్దుమణిగితే, వేసవికి టార్గెట్ చేసుకున్న చిత్రాలకు ఏప్రిల్, మే నెలలు మాత్రం చాన్స్ ఉంటుంది. పెద్ద హీరోల చిత్రాల్లో ఈసారి పవన్ కల్యాణ్ రీఎంట్రీ సినిమా ‘వకీల్‌సాబ్’ ఒక్కటే రావాల్సి ఉంది. దీనికంటే ముందు మార్చి 25న రావాల్సిన -నాని, సుధీర్‌బాబుల ‘వి’ చిత్రం ఇప్పటికే వాయిదా పడింది. అదేరోజు రావాల్సిన ఒరేయ్ బుజ్జిగా సైతం వాయిదా పడటం తెలిసిందే. వైష్టవ్‌తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెన ఏప్రిల్ 2నుంచి వెనక్కి జరిగింది. నాగచైతన్య- సాయిపల్లవి జోడీగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్‌స్టోరీ సైతం విడుదలను వాయిదా వేసుకుంది. అనుష్క ‘నిశ్శబ్దం’, రానా త్రిభాషా చిత్రం ‘అరణ్య’, రామ్ ‘రెడ్’, కీర్తిసురేష్ ‘మిస్ ఇండియా’, తమిళ హీరో విజయ్ ‘మాస్టర్’, శర్వానంద్ ‘శ్రీకారం’, సాయితేజ్ ‘సోలో బతుకే సో బెటర్’, రవితేజ ‘క్రాక్’, అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాలన్నీ వేసవిని టార్గెట్ చేసుకున్నవే. కరోనా కొట్టిన దెబ్బతో ఈ చిత్రాలన్నీ విడదల తేదీలు మార్చుకోవాల్సిన పరిస్థితి లేకపోలేదు. నిర్మాతలు కోరుకున్న విధంగా వీటన్నింటి విడుదల తేదీలను సెట్ చేసి ఒప్పించటం నిర్మాతల మండలి, గిల్డ్‌కు తలనొప్పి వ్యవహారమే.
ఇదిలావుంటే, ఆదివారం సాయంత్రం తెలుగు మూవీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమావేశమై పరిస్థితిపై చర్చించాయి. అనంతరం షూటిగ్స్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. సమావేశంలో దామోదర ప్రసాద్, నారాయణదాస్ నారంగ్, సి కల్యాణ్, బెనర్జీ, జీవితా రాజశేఖర్, ప్రసన్నకుమార్, నట్టికుమార్ తదుతరులు హాజరయ్యారు.