వివాదాల ఐటెం సాంగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాకేటైపోతున్నాదిరో.. ఎంకయ్య మామ నీ ఆటుపోటు ఓపలేను సందామామ..’ అంటూ వినిపించే పాటకు మనస్సులో డాన్సు చేయని ప్రేక్షకుడు ఎవరు? సినిమా అన్నాక మంచి కథ కథనంతోపాటుగా పాటలు, సంగీతం ఎంత ముఖ్యమో ఐటెం పాట కూడా అంత ముఖ్యమై కూర్చుంది ఇప్పుడు. ఒకప్పుడు చిత్రాలలో క్లబ్ డాన్సులని చేర్చేవారు. జ్యోతిలక్ష్మి, విజయలలిత, హలం, జయకుమారి, రీటా లాంటి వాళ్లు అప్పట్లో క్లబ్ డాన్సులకు పెట్టింది పేరు. కథ ప్రకారం ఎక్కడైనా హీరోయిన్ విలన్ ముందు నృత్యం చేయాల్సి వస్తే (ఉదా.లక్షాధికారి చిత్రంలో కృష్ణకుమారి చేసిన పాట) ఆమెతోపాటు హీరో కూడా ఉండి డాన్సులు చేసి విలన్‌ని చిత్తుచేసే కథనం వుండేది. అదంతా కథ ప్రకారమే సాగేది చిత్రంలో. కానీ ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో క్లబ్ డాన్సులు కాస్తా ఐటెం పాటలుగా మారాయి. గత ఏడెనిమిదేళ్లుగా ఈ ఐటెం పాటల వ్యవహారం బాగానే వర్కవుట్ అవుతోంది. ఐటెం పాటలో నృత్యం చేసే హీరోయిన్ లేక నర్తకి ఎవరు అన్నదాని మీద కూడా వాద వివాదాలు సాగుతాయి. ఫలాన సినిమాలో పలాని హీరోయిన్ ఐటెం పాటలో నటిస్తోందట అని ప్రత్యేకంగా చెప్పుకునే ప్రేక్షకులు ఉన్నారు. దానికితోడు దర్శక, నిర్మాతలు కూడా తమ చిత్రంలో పెద్ద హీరోయిన్ అయిన ఓ నటి ఐటెం పాటలో నటిస్తోందని చెప్పుకోవడం ఓ బిజినెస్ మంత్రంగా మారిపోయిన రోజులివి. హీరోయిన్‌గా పరిచయమైన ఆమె ఐటెం పాటలో ఎలా నృత్యం చేస్తుందో చూద్దామన్న ఉత్సాహం ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఇదే ఐటెం పాటలకి ప్రాణంగా నిలుస్తోంది. ఇటీవలి చిత్రాలలో ఐటెం గాళ్స్ అంటూ కొంతమంది ప్రత్యేకంగా వచ్చారు. పూరి జగన్నాథ్ చిత్రాల్లో ముమైత్‌ఖాన్ ఎక్కువగా ఐటెం పాటల్లో నటించింది. ఆ తర్వాత ఆయన విదేశాలనుండి కూడా కొంతమంది సుందరీమణులను తీసుకువచ్చి మరీ ఐటెంలు చేయించారు. వాటికి మంచి ఆదరణ లభించింది. బాలీవుడ్‌లో కూడా ఈ ఐటెంల వ్యవహారం బాగానే ఉంది. కత్రినాకైఫ్, కరీనాకపూర్ లాంటి వాళ్లు కూడా ఐటెం పాటల్లో మెరుస్తున్నారు.
ఒక సినిమాలో నటించిన దొరికిన పారితోషికం కన్నా రెండు మూడురోజుల్లో డాన్సు చేసినందుకు అంతే పారితోషికం లభిస్తుండడం ఇందులో ప్లస్ పాయింట్ అయింది. అందుకే హీరోయిన్లు కూడా మేము సైతం అంటూ ఐటెంల్లో ఆడిపాడేస్తున్నారు. ఏదైనా హద్దుదాటనంతవరకే ఐటెం. అలా హద్దుదాటిందా అది హంగామా అయిపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ ఐటెం పాటపైనే చర్చ జరుగుతోంది. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రంలో ఐటెం పాట పైనే వివాదం రేగుతోంది. మొదట ఈ పాటలో గతంలో హీరోయిన్‌గా నటించిన కేథరిన్ థ్రెస్సాను తీసుకున్నారు. ఈమె ఐటెం పాటలో ఇరగదీసేస్తుందని ఆశించినా అందుకు భిన్నంగా సెట్స్‌లో జరిగింది. దీనిపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. నృత్య దర్శకుడు లారెన్స్ దర్శకత్వంలో కొన్ని భంగిమలు పెట్టడానికి కేథరిన్ అభ్యంతరం తెలిపిందట. తాము చెప్పినట్టు నృత్యం చేయకపోతే ఐటెం పాట ఎలా అవుతుందని అవతలివారు వాదిస్తున్నారు.
ప్రేక్షకులకు నచ్చే విధంగా నృత్యం చేయగలం కానీ మరీ అసభ్యంగా చేయమంటే చేయలేమని కొందరు నటీమణులు బాహాటంగానే చెబుతున్నారు. కేథరిన్ థ్రెస్సాకు నిర్దేశించిన కాస్ట్యూమ్స్ ఆమెకు నచ్చలేదని మరో కథనం వినిపిస్తోంది. ఆ ఐటెం పాటలో కాస్ట్యూమ్స్ చూసి కేథరిన్ కోపం తెచ్చుకుందట. ఎవరు ఇది డిజైన్ చేశారంటూ అని బాహాటంగానే తిట్టిపోసిందట. తీరా చూస్తే అవి డిజైన్ చేసింది హీరోకి చాలా దగ్గరి సంబంధం ఉన్నవాళ్లేనట. దాంతో నిర్మాత రామ్‌చరణ్ కలుగజేసుకుని, ఆమెను ఐటెం పాటనుంచి తప్పించి వెంటనే రాయ్‌లక్ష్మిని తీసుకున్నారట. ఇదొక కథనం. కాస్ట్యూమ్స్ నచ్చలేదని ఒక కథనం, నృత్య భంగిమలు అశ్లీలంగా ఉన్నాయని మరొక కథనం ఇలా వినిపిస్తున్నాయి.
ఐటెం పాటైనా ఆహ్లాదకరమైన పాటైనా ప్రేక్షకులు ఆనందిస్తారు. వారికి నచ్చినట్లుగా అసభ్యత, అశ్లీలం లేకుండా చిత్రీకరిస్తే కుటుంబ ప్రేక్షకులు కూడా వస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐటెం పాటల చిత్రీకరణ ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు చెబుతున్నారు.
గత చిత్రాల్లో వచ్చిన ఐటెం పాటలు బాగా గమనిస్తే, అసభ్యత, అశ్లీలం ఉన్న పాటలను ప్రేక్షకులు తిప్పికొట్టారు. హద్దుల్లో ఉన్న ఐటెం పాటలను చూసి ఆనందించారు. సదరు ఆ చిత్రాలకు విజయాన్ని కట్టబెట్టారు. ఈ విషయాన్ని టాలీవుడ్ గుర్తుంచుకుని మంచి పాటలను చిత్రీకరిస్తే అందరికీ ఆనందమే!

- యు