విడిపోతున్నాం! సినీనటి గౌతమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్, బహుభాషా నటి గౌతమిల బంధానికి తెరపడింది. పదమూడేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట ఇప్పుడు విడిపోతోంది. ఈ విషయాన్ని స్వయంగా గౌతమి ప్రకటించింది. తన బ్లాగ్‌లో ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. పదమూడేళ్లుగా కమల్‌తో సాగించిన బంధం నుంచి విడిపోతున్నట్లు ఆమె పేర్కొంది. హృదయాన్ని చిదిమేసే ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైందని, ఒకటి రెండేళ్లుగా ఆలోచించి చివరికి ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని తెలిపింది. సినిమాల్లోకి రాకముందు నుంచే కమల్ అంటే ఇష్టమని, తన జీవితంలో ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నానని చెప్పిన గౌతమి విడిపోవడానికి కారణాలను మాత్రం వివరించలేదు. పరుల సానుభూతి కోసమో, ఎవరిపైనే నిందమోపేందుకో తాను ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. తన కుమార్తె భవిష్యత్ కోసం నిజమైన తల్లిగా బాధ్యతలు నిర్వహించడం తన ధ్యేయమని తెలిపింది.
కాగా, కమల్ తాజాగా నిర్మిస్తున్న ‘శభాష్‌నాయుడు’లో నటిస్తున్న గౌతమి, శ్రుతిహాసన్‌ల మధ్య తలెత్తిన విభేదాలే ఈ పరిణామాలకు కారణమని భావిస్తున్నారు. ఆ సినిమాలో శ్రుతి ఆహార్యం విషయంలో గౌతమి జోక్యంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమైనట్లు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గౌతమి విశాఖ గీతం కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతూ సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1987లో తొలిసారిగా ‘దయామయుడు’ చిత్రంలో నటించిన గౌతమి ఆ తరువాత చాలా సినిమాల్లో అవకాశాలు పొందింది. 1998లో వ్యాపారవేత్త సందీప్ భాటియాను వివాహం చేసుకుంది. వారి కుమార్తె సుబ్బులక్ష్మి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. పెళ్లైన ఏడాది తరువాత విడాకులు తీసుకున్న గౌతమి కమల్‌తో కలసి ‘అపూర్వ సహోదరగళ్’ (విచిత్ర సోదరులు), ‘తీవార్‌మగన్’, ‘పాపనాశం’ చిత్రాల్లో నటించింది. విచిత్ర సోదరుల చిత్రంలో నటిస్తున్నప్పుడు వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
2003 నుంచి వారిద్దరూ కలసి జీవించడం మొదలైంది. 35 ఏళ్ల వయసులో ఆమె రొమ్ముకాన్సర్‌కు గురైంది. అచంచల విశ్వాసం, కమల్ ఇచ్చిన ధైర్యం, స్ఫూర్తితో ఆమె వ్యాధి నుంచి బయటపడింది. వివాహబంధంపై విశ్వాసం లేదని, సహజీవనమే మేలని భావించిన కమల్-గౌతమిల బంధం ఇప్పుడు తెగిపోయినట్లైంది. ఇక ఎక్కువకాలం కలసి ఉండలేమని, విడిపోతున్నామని గౌతమి మంగళవారం చేసిన ప్రకటన సినీవర్గాల్లో సంచలనం కలిగించింది. కొద్దిరోజుల క్రితం గౌతమి మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. మలయాళ నటుడు మోహన్‌లాల్ నటించిన ‘మనమంతా’ అనే సందేశాత్మక చిత్రంలో గౌతమి అద్భుత నటన ప్రదర్శించారు. ‘జీవితంలో కలలు నిజం చేసుకోవాలా? రాజీపడి జీవించాలా’ అన్న విషయంలో కొట్టుమిట్టాడి ఇప్పటికి తీవ్రమైన బాధతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతమి పేర్కొంది.