మాటలు సూటిగా, సులువుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- శాతకర్ణి రచయిత సాయిమాధవ్
‘సినిమాలో నటీనటులు పలికే ప్రతి డైలాగ్ తేలికగా, సూటిగా ఉండాలి. అదే సమయంలో ప్రేక్షకుడికి అర్థం కావాలి. తక్కువ పదాలతో ఎక్కువ భావం అందించేలా మాటలు రాయడానికి ఇష్టపడతా. సంక్షిప్తత అంటే చాలా ఇష్టం. సన్నివేశాలలో బలం వుంటేనే మంచి సంభాషణలు పుట్టుకొస్తాయి..’ అంటున్నారు ఖైదీ నెం.150, గౌతమిపుత్ర శాతకర్ణి మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా. ఈ రెండు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా విడుదలైన నేపథ్యంలో ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పలు విశేషాలను తెలిపారు.
ఈ చిత్రాలే ఉదాహరణ
కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంతో మాటల రచయితగా ప్రయాణాన్ని ప్రారంభించాను. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, కంచె, గోపాల గోపాల, రాజుగారి గది, సర్దార్ గబ్బర్‌సింగ్, ఖైదీ నెం.150, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలతో ప్రేక్షకులలో గుర్తింపు వచ్చింది. రచయితగా గుర్తింపు వస్తోందనడానికి ఈ చిత్ర విజయాలే సాక్ష్యం.
కళారంగమే స్ఫూర్తి
నా తల్లిదండ్రులిద్దరూ రంగస్థల కళాకారులు. తెనాలిలో పుట్టి పెరిగిన నేను అక్కడే బి.ఎ చదువుకున్నా. చిన్నప్పటి నుంచి నాటకాలలో వాయిద్యాలు, పద్యాలు వింటూ అనేక నాటికలు, నాటకాలు ప్రదర్శించే వాతావరణంలో పెరిగిన నాకు, కళారంగంపై ఆసక్తి కలిగింది. చిన్నప్పటి నుండే నాటకాలు కూడా వేయటం ప్రారంభించా.
సాంఘికాలే ఇష్టం
అమ్మానాన్నలు పౌరాణిక నాటకాల్లోనే నటించేవారు. నాకేమో సాంఘిక నాటకాలంటే చాలా ఇష్టం. స్కూల్లోనూ, కాలేజీల్లోనూ, అనేక ఉత్సవాలలో నాటకాలు వేసేవాడిని. అనేక బహుమతులు కూడా వచ్చాయి. బ్రోచేవారెవరురా అన్న తొలినాటకం నుండి అనేక నాటికలు, నాటకాలు రాశాను. అద్దంలో ‘చందమామ’ బాగా పేరుతెచ్చిన నాటకం.
క్రిష్ అండతో..
గతంలో అనేక టీవీ సీరియల్స్‌కు మాటలు రాసినప్పటికీ, నా కెరీర్‌కు దర్శకుడు క్రిష్ వేగాన్ని ఇచ్చి ఎన్నో చిత్రాలకు పనిచేసే అవకాశాన్ని కల్పించారు. తిలక్, చలం, గోపీచంద్, రావిశాస్ర్తీ, రాజారాం లాంటి గొప్ప రచయితల గూర్చి చదివాను. గురువులు జి.శివరామకృష్ణ, ఎం.సత్యనారాయణరావు ప్రోత్సాహంతో అనేక ధారావాహికలకు మాటలు రాశాను.
తీయని అనుభవం
గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం కోసం బాలకృష్ణకు మాటలు రాయడం ఓ తీయని అనుభవం. మొదట ఆయనకు మాటలు రాయగలనా? అని భయం కలిగింది. ఓ సవాలుగా తీసుకొని మాటలు రాశాను. ఆయన నా మాటలు విని ప్రోత్సహించారు.
చరిత్ర తెలుసుకొనే..
దర్శకుడు క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి ఎన్నో చరిత్ర గ్రంథాలను సేకరించారు. పలు విశ్వవిద్యాలయాలలో శాసనాలు, లేఖలు, పరిశోధనలో లభ్యమైన పుస్తకాలను నాకు ఇచ్చారు. ఆ చరిత్రను తెలుసుకొనే సినిమాకు మాటలు రాశాను. చరిత్రను సినిమాగా మార్చి తీశామే కానీ, ఎక్కడా చరిత్రను సినిమాటిక్‌గా మార్చలేదు.
మాతృమూర్తి గొప్పదనం
ఎవరికైనా మాతృమూర్తి గొప్ప వరం. మాతృమూర్తి ఔన్నత్యాన్ని చాటిన మహారాజు శాతకర్ణి గూర్చి ఈ చిత్రంలో చక్కగా చెప్పారు. అమ్మతనం ఎంత విలువైనదో వివరించారు.
వారే ప్రేరణ
సినిమాలకు మాటలు రాయడానికి నాకు మొదటి ప్రేరణ ఆచార్య ఆత్రేయ. పరుచూరి బ్రదర్స్, ముళ్ళపూడి వెంకటరమణ, డి.వి.నరసరాజు, జంధ్యాల, త్రివిక్రమ్‌ల మాటలతోపాటు శైలి ఇష్టపడతాను. ఓ రకంగా నా మాటలపై వారి ప్రభావం పడుతుందేమో అన్న భావన వుంటుంది. అయినా నాదైన ముద్ర ఉండేలా ప్రయత్నిస్తాను.
దర్శకత్వం వైపు..
ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదు. మాటల రచయితగానే ఆనందాన్ని పొందుతున్నా. నా ధర్మాన్ని నేను నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తా.
కొత్త సినిమా
సందీప్‌కిషన్ హీరోగా ఓ ప్రేమకథా చిత్రం, సావిత్రి జీవిత చరిత్రపై రానున్న మహానటి సినిమా ఒకటి, వీటితోపాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి.

-యు