మంచి పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున.. తెలుగు ప్రేక్షకులను భిన్నమైన సినిమాలతో ఆకట్టుకుంటూనే మరోవైపు కమర్షియల్ హీరోగా స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. ‘సోగ్గాడే చిన్నినాయన’ లాంటి గ్లామర్ పాత్రలు చేయాలన్నా, నమో వెంకటేశాయ లాంటి భక్తిరస సినిమాలు చేయాలన్నా ఆయనకే చెల్లింది. అటు నిర్మాతగా కూడా అభిరుచిగల చిత్రాలను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘రాజుగారి గది-2’. మొదటిసారి హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో నాగార్జున నటిస్తున్న ఈ చిత్రాన్ని ఓంకార్ తెరకెక్కించారు. సమంత ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం ఈనెల 13న విడుదలకు సిద్ధమైన సందర్భంగా నాగార్జునతో ఇంటర్వ్యూ...
* లుక్ మార్చారు, కారణం?
- ఇది ఏ సినిమా కోసం చేసింది కాదు. సరదాకే.
* చైతూ-సమంతల పెళ్లి కార్యక్రమాలు ఎందాకా వచ్చాయి?
- 6న గోవాలో పెళ్లి జరుగుతుండడంతో చాలా ఎగ్జైటింగ్‌గా వుంది. రెండు సాంప్రదాయాలను గౌరవించి రెండు పద్ధతుల్లో పెళ్లి చేస్తున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పాల్గొంటారు. ఆ తరువాత హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటుచేస్తాం. అదెప్పుడనేది త్వరలో తెలియజేస్తాం.
* రాజుగారి గది-2 ఆలస్యానికి కారణం?
- సినిమా పూర్తయింది. కానీ నిర్మాణానంతర కార్యక్రమాలవల్ల ఆలస్యం అయింది. సినిమా ఈనెల 13న విడుదల చేస్తున్నాం. నినే్న ఆ సినిమా చూశాను. సినిమా ఔట్‌పుట్ చూసిన తరువాతే డబ్బింగ్ చెబుతానని వాళ్లకు కండిషన్ పెట్టడంతో జాగ్రత్తగా పనులన్నీ చక్కబెట్టారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ బాగా వచ్చాయి. దానివల్లే ఆలస్యమైంది.
* మీ పాత్ర ఎలా ఉంటుంది?
- ఇందులో నేను మెంటలిస్ట్‌గా కనిపిస్తాను. అంటే ఎదుటివాళ్లు లోపల ఏమనుకుంటున్నారో కనిపెట్టే వ్యక్తిగా ‘రుద్ర’ అనే పాత్రలో కన్పిస్తాను. నిజంగా నాకిది చాలా కొత్త పాత్ర. ఆత్మకు, నాకు మధ్య మంచి హ్యూమన్ రిలేషన్ ఉంటుంది.
* ఆత్మలను నమ్ముతారా?
- చెప్పలేం. మనం వున్నట్టే అవి కూడా ఉండచ్చేమో!
* ఈ పాత్ర కోసం ఏదైనా హోమ్‌వర్క్ చేశారా?
- ఈ పాత్రకోసం స్టడీ చేశాను. దాంతోపాటు కేరళలో ఓ వ్యక్తిని కలిశాను. తను మనతో రెండు నిమిషాలు మాట్లాడితే, మనసులో ఏమనుకుంటున్నామో ఖచ్చితంగా చెప్పేస్తాడు. మొదట్లో అది తెలిసి చాలా షాక్ అయ్యా.
* ఇది మలయాళ సినిమాకు రీమేకా?
- కాదండి. మలయాళ సినిమా నుండి ఇన్పిరేషన్‌గా చేసుకొని తయారుచేసుకున్న కథ. ఓంకార్ చక్కగా తెరకెక్కించాడు. రెగ్యులర్ హర్రర్ సినిమాల తరహాలో కాకుండా కొత్తగా వుంటుంది.
* సమంత పాత్ర గురించి?
- ఇందులో సమంత ఆత్మగా కనిపిస్తుంది. మా ఇద్దరిమధ్య సాగే సన్నివేశాలు ఆసక్తికరంగా వుంటాయి. తను చాలా చక్కగా చేసింది.
* వరుసగా భిన్నమైన సినిమాలు చేస్తున్నారు?
- మంచి మంచి పాత్రలు వెతుక్కుంటూ మరీ వస్తున్నాయి. ఊపిరి, సోగ్గాడే చిన్నినాయన, ఇప్పుడు రాజుగారి గది. ఈ సినిమాలతో నటుడిగా చాలా సంతృప్తికరంగా వుంది.
* మరి హిందీలో ప్రయత్నాలు చేయడంలేదు?
- ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు మంచి పాత్రలు ఎవరిస్తారు? అయినా ఇక్కడే హ్యాపీగా ఉంది కదా.
* అఖిల్ సినిమా ఎంతవరకు వచ్చింది?
- సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు విక్రమ్. ఈనెల 15తో షూటింగ్ పూర్తిచేస్తానని మాట ఇచ్చాడు. ఇక డిసెంబర్ 22న సినిమా విడుదల చేస్తాం.
అందమైన ప్రేమకథగా అఖిల్‌కు సరైన కథ ఇది. నేను, అమల నటించిన
‘నిర్ణయం’ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కూతురు హీరోయిన్‌గా పరిచయం అవుతుంది.
* మరి చైతూ సినిమా గురించి?
- చైతూ ‘సవ్యసాచి’ చిత్రంలో నటిస్తున్నాడు. కథ బాగా ఎగ్జైటింగ్‌గా వుంది. దాని గురించి అంతే తెలుసు.
* అన్నపూర్ణ ఫిలిం స్కూల్‌నుండి సినిమాలు వస్తాయన్నారు?
- అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో స్క్రిప్ట్ విభాగాన్ని చేశాం. దానికంటూ కొంత ఫండ్ కేటాయించి స్టూడెంట్స్‌తో స్క్రిప్ట్‌లు తయారుచేయిస్తాం. మా స్టూడియోనుండి చిత్రాలను నిర్మిస్తాం. వచ్చే ఏడాదినుంచి ఈ కార్యక్రమాలు మొదలవుతాయి.
* తదుపరి చిత్రాలు?
- నానితో కలిసి ఓ సినిమా చేయాలి. దానికి మంచి కథ కుదిరింది. నా పాత్ర చాలా అద్భుతంగా వుంటుంది. దాంతోపాటు చందూ మొండేటితో మరో సినిమా వుంటుంది.

- శ్రీ