రాజకీయ చిత్రాలకి అంతం ఎక్కడ?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమకాలీన వ్యక్తులపై రచనలు చేసినా బయోపిక్ నిర్మాణం జరిగినా చాలా సంయమనం కావాలి. పారదర్శకంగానూ నిష్పాక్షికంగానూ ఉండాలి. పరిశోధనాత్మకంగా లోతుగా అనే్వషించి నిర్మించాలి.

కె.జగదీశ్వర్‌రెడ్డి ‘లక్ష్మీ వీరగ్రంథ’ అనే సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. ఇందులో పాటలు, భజనలతోపాటు ఒక హరికథ కూడా వుంది. ఇతివృత్తం అందరికీ తెలిసిందే! నందమూరి లక్ష్మీపార్వతి జీవితంలోని ప్రథమ భాగం.
శ్రీమతి లక్ష్మీ పార్వతి మొదటి భర్త పేరు వీరగంధం వెంకట సుబ్బారావు. ఈయన హరికథా భాగవతార్. కాళిదాసు, గజేంద్రమోక్షం వంటి కథలు రమణీయంగా చెప్పి రక్తి కట్టించగలడు. వీరగంధం వెంకట సుబ్బారావుగారి రెండవ భార్య లక్ష్మీ పార్వతి. వీరిది నరసరావుపేట, గుంటూరు జిల్లా. పొన్నూరులో సంస్కృతాంధ్రములు అభ్యసించింది. వివాహం తరువాత భర్తకు చేదోడు వాదోడుగా ఉండి ‘వాదోడు’ అంటే వాక్కుతో సహాయం అంటే హరికథల సందర్భంగా సాయం చేయటం. లక్ష్మీపార్వతి ఒక హరికథా కాలక్షేపంలో హార్మోనియం వాయిస్తున్న సన్నివేశంలో ఈ చిత్రం ప్రారంభమవుతున్నది. దీని నిర్మాణం, విడుదల అంతా శరవేగంగా సాగుతున్నది. ఇప్పటికే ఎన్‌టిఆర్‌మీద రెండు సినిమాలు రాబోతున్నాయి. ఇది మూడవది. 2018 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ హడావుడి మొదలయింది.
శ్రీమతి లక్ష్మీపార్వతి ఎన్‌టిర్ జీవిత చరిత్ర వ్రాయాలని సంకల్పించింది. ఆ విధంగా రామారావుగారికి సన్నిహితురాలయింది. ఆమె తెలుగు విశ్వవిద్యాలయంలో డా.గంగిశెట్టి లక్ష్మీనారాయణ సూపర్‌విజన్‌లో పిహెచ్‌డి చేసింది. ఆ తరువాత శ్రమణకం వంటి చారిత్రక నవలలు వ్రాసి పేరు తెచ్చుకున్నది. ఈ మూడు సినిమాల్లోనూ ఏదో రూపంలో ఎన్‌టిఆర్, లక్ష్మీపార్వతి, చంద్రబాబు నాయుడు పాత్రలు ఉంటాయి. రామారావు అధికారంలోకి రావటం- ఆయనను అక్రమ మార్గాలలో ఇందిరాగాంధీ గద్దెదించటం, తిరిగి అధికారానికి రావటం ఆ తరువాత చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేయటం, ఇలా చాలా రాజకీయ ఘటనలు జరిగాయి. ఆనాటి గవర్నర్ రాంలాల్, రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు వంటి వారి పాత్ర కూడా ఈ రాజకీయ చరిత్రలో ఉంది.
ఇప్పుడు మనం గమనింపవలసిన అంశం ఏమిటంటే ఇలా రాజకీయ చిత్రాలు మొదలుపెడితే వీటికి అంతం ఎక్కడ?? జయలలితమీద, కెసిఆర్‌మీద, నరేంద్ర మోదీ మీద చిత్రాలు రావచ్చు. అవి నకారాత్మకమా? సకారాత్మకమా? అనే అంశం తీసేవారి దృక్కోణాలమీద చిత్తశుద్ధిమీద ఆధారపడి ఉంటుంది. రావణాసురుణ్ణి హీరోగా చిత్రించే సినిమాలు తెలుగులో వచ్చాయి. లంకేశ్, ఇంద్రజిత్తువంటి పేర్లు పెట్టుకుంటున్నారు. మైకేల్ మదుసూద దత్తు అనే బెంగాలీ రచయిత ‘మేఘనాధ వధ’ అనే కావ్యం రాశాడు. ఇందులో ఇంద్రజిత్తు హీరో. అంటే ఈ తెలుగు సినిమాలల్లో చంద్రబాబు నాయుడును విలన్‌గా చిత్రించే ప్రయత్నాలు కొందరు చేస్తే లక్ష్మీ పార్వతిని వాంప్‌గా చిత్రించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఒక స్ర్తిని ఇంతగా అవమానించటం తగునా?
ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌పై మండలాధీశుడు, గండిపేట రహస్యం అనే వ్యంగ్య చిత్రాలు లోగడ రాగా, ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్‌టిఆర్, లక్ష్మీస్ వీరగ్రంధ అనే మూడు చిత్రాలు వస్తున్నాయి.
లక్ష్మీస్ వీరగ్రంధ చిత్రం కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, సి.విజయకుమార్ గౌడ్‌ల సారథ్యంలో రాబోతుండగా, లక్ష్మీపార్వతి పాత్రను వాణీ విశ్వనాధ్ పోషించనున్నట్లు తెలుస్తున్నది.

ఇక ‘ఎన్‌టిఆర్’ (బ్రహ్మతేజ నిర్మాణ) చిత్రంలో ప్రధాన భూమిక నందమూరి బాలకృష్ణ పోషించబోతున్నారు. వర్మ చిత్రంలో పాత్ర గణంపై ఊహాగానాలు సాగుగుతున్నాయి. 26 అక్టోబర్ 2017నాడు శ్రీమతి లక్ష్మీ పార్వతి మనస్తాపంతో ఎన్‌టిఆర్ ఘాట్‌వద్ద వౌనదీక్ష చేశారు. తనను సంప్రదించకుండా తన జీవితాన్ని ఎవరైనా వక్రీకరించి తెరకెక్కిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించారు.
సమకాలీన వ్యక్తులపై రచనలు చేసినా బయోపిక్ నిర్మాణం జరిగినా చాలా సంయమనం కావాలి. పారదర్శకంగానూ నిష్పాక్షికంగానూ ఉండాలి. పరిశోధనాత్మకంగా లోతుగా అనే్వషించి నిర్మించాలి. ఉదాహరణకు ఎన్‌టిఆర్ జీవితంలో అతి ముఖ్యమైన సంఘటన పాఠకుల దృష్టికి తీసుకువస్తున్నాను. నెల్లూరులో రామారావుగారికి సన్మానం ఏర్పాటుచేశారు. మద్రాసు నుండి ఆయన కారులో నెల్లూరు చేరారు. అక్కడ గెస్ట్‌హౌస్‌లో బస ఇచ్చారు. అక్కడే నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిగారు కూడా ఉన్నారు. రామారావుగారు ముఖం కడుక్కునే నిమిత్తం బాత్‌రూంకు వెళ్ళారు. అది చూచి నేదురుమల్లి కోపగించుకున్నాడు. ‘‘ఈ సినిమా వాడికి నాకు ఇచ్చిన గెస్ట్‌హౌస్‌లోకి, బాత్‌రూంలోకి వెళ్ళేందుకు ఎంత ధైర్యం’’ అంటూ తిట్టాడు. ఈ మాటలు రామారావుగారి చెవిన పడ్డాయి. ఆయన మనస్తాపానికి లోనైనారు. ఏమీ తినలేదు. సన్మానం జరిగింది. యాంత్రికంగా కార్యక్రమం ముగించుకొని కారెక్కి మద్రాసు చేరారు. మరునాడు ఆంతరంగికులను పిలిచి మంతనాలు జరిపారు. ఇదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ఒక మలుపు. ఆ పార్టీ యాంటీ కాంగ్రెస్ దృక్పథంలోను తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతోను అవతరించింది. ఇలాంటి సంఘటనలు రామారావుగారి జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నింటినీ ఈ ‘మూడు’ సినిమాలల్లో చూపుతారా?

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్