అనుభవం ఆవిరైపోతున్నవేళ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలన చిత్ర కళామతల్లి తనను నమ్ముకున్న వారిని ఎప్పుడు తలపై ఎత్తుకుంటుందో? ఎప్పుడు తన పాదాల కింద తొక్కిపట్టి వుంటుందో? ఆ విధాతకుకూడా అర్ధం కాదు! కానీ, ఎందరో చిత్ర పరిశ్రమకు వస్తునే వుంటారు. కొందరు వచ్చిరాగానే, అవకాశాలు చేజిక్కించుకుని పైస్థాయికి చేరుకుని సుఖమయ జీవితాన్ని గడుపుతుంటారు. మరికొందరు ఎన్నో ఏళ్ల తరబడి వారి జీవితాన్ని పరిశ్రమకు ధారపోస్తూ అవకాశాల కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తునే వుంటారు.
నేడు చలన చిత్ర పరిశ్రమలో 24 శాఖలలో గల తలలు పండిన సాంకేతిక నిపుణులు అపారమైన అనుభవంతో, సరియైన పనులు లేక ఏం చేయాలో అర్ధంకాక, తలలు పట్టుకుని కూర్చుని వున్నారు. వేరే ఏ రంగంలో పని చేయలేక కుమిలిపోతున్నారు. ఇంట్లో భార్యపిల్లల చేత చీత్కారాలు ఎదుర్కొంటూ కొందరు కాలం గడుపుతుంటే, మరికొందరు భార్య పిల్లల సంపాదనతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. అనుభవజ్ఞులు కొందరు మాత్రం ఏదో ఒక ఛాన్సు రాకపోతుందా అప్పుడు మనమేంటో నిరూపించుకోలేమా? అని సినీ కళామతల్లి కాళ్లు పట్టుకుని వేళాడుతునే వున్నారు.
సినిమా కళామతల్లి నేడు స్వతంత్రురాలు కాదుకదా? అనుభవజ్ఞులను గుర్తించి ప్రోత్సహించడానికి! ఆ తల్లి ఎప్పుడో నేటి తరం కుర్రకారు చేతుల్లో చిక్కుకుని పోయి వుంది! నేటి తరానికి కావల్సింది ఆణిముత్యాల్లాంటి సినిమాలు కావు. కుర్రకారును కిర్రెక్కించి, గంతులేసే విలువలు లేని వలువలు వూడిన సినిమాలు!
రోడ్‌పైన ఓ పిచ్చివాడు కానీ, ఓ పిచ్చి ఆమె కాని వెడుతుంది అంటే, వాళ్లను ఎగబడి చూసే మంచి వాళ్లు ఎందరో? కొందరు కుర్రవాళ్లైతే ఆ పిచ్చి వాళ్లపై రాళ్లు రువ్వుతూ ఆనందిస్తారు. కానీ అయ్యో వాళ్లు పిచ్చి వాళ్లు, వాళ్లని చేరదీసి నయం చేసే చోటుకి పంపిస్తే బాగుండు అని ఎవ్వరూ భావించరు. ఆలోచించరు. అది మనుషుల నైజం కావచ్చు. పిచ్చివాళ్ల పరిస్థితిలాగే నేటి సినిమాల పరిస్థితి వుంది! మంచి, చెడు అనే విచక్షణ ఎప్పుడో ఎగిరిపోయింది. కాని మనిషి ఆశాజీవి! అనుభవం ఎప్పుడైనా ఆణిముత్యంలా మెరువకపోదా? అనే పట్టుదల, దృఢ సంకల్పంతో ఎందరో పరిశ్రమలో కొనసాగుతునే వున్నారు.
కాని ఆకలిని జయించలేరు కదా? ఆకలికి తాళలేక ఎందరో నిర్మాతలను, హీరోలను కలుస్తూనే వున్నారు. ఐనా? ఏం లాభం? వారినుండి వచ్చే జవాబు ఒక్కటే. అబ్బో...! మీరు చాలా సీనియర్స్. ఇప్పుడంతా కుర్రకారు తరం..వెళ్లిరండి అంటూ సెలవిస్తున్నారు. ఏం చేయాలో అర్ధం కాని ధోరణి నేడు చిత్రపరిశ్రమలో రాజ్యమేలుతుంది. ఎందరో అనుభవజ్ఞుల జీవితాలు ఆవిరైపోతున్నాయి. కొందు టీవీ సీరియల్స్‌తో జీవితం గడుపుతుంటే మరికొందరు లఘు చిత్రాలు నిర్మించుకుని కాలం గడుపుతున్నారు.
ఒకప్పుడు ఫైనాన్షియర్స్‌నే సినిమాకు పూర్తి డబ్బులు పెట్టుబడిపెట్టి నిర్మించి విడుదల సమయంలో రాబట్టుకునేవారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా కనుమరుగైపోయింది. ఎవరైనా ఫైనాన్షియర్స్ వున్నారంటే ఆస్తులు తాకట్టుపెట్టమంటున్నారు. ఒకవేళ ఆస్తులు తాకట్టు పెట్టేవాళ్లు వున్నా సినిమాల్స్ అంటే ఆమడదూరం పరిగెడుతున్నారు.
డబ్బున్న వాళ్లయితేనే, తనే నిర్మాత, దర్శకుడు హీరో అన్నీ తానై సినిమా తీసుకుంటున్నాడు. అలాంటి వాళ్లు కూడా సీనియర్స్‌ని ఏమాత్రం పెట్టుకోవడంలేదు.
అలాంటి సినిమాలు ఆడితే ఫర్వాలేదు కానీ బాక్స్ తన్నిందా నెత్తిమీద తుండు వేసుకుని వెడుతున్నాడు. అదీ పరిస్థితి! మరో పక్క చిన్న సినిమాలను కొనే చానల్స్ లేవు. దానితో చిత్ర పరిశ్రమలో సీనియర్ దర్శకులు, రచయితలు త్రిశంకు స్వర్గంలో ఇరుక్కున్న చందాన పరిశ్రమలో ఇరుక్కుపోయి ఆకలి బాధలతో అలమటిస్తున్నారు. వారి బాధలు ఎప్పుడు తొలగుతాయో వేచి చూడాల్సిందే.

- ఆకుల రాఘవ