తెలుగు చిత్రసీమ హద్దులు దాటుతోంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అనగానే ఇప్పుడు వస్తున్న ఏదో నాలుగు పాటలు, నాల్గు ఫైట్లు, కాస్త కామెడీ వున్న సినిమాలు కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఎఎన్నార్ లాంటి ప్రముఖ నటులు నటించిన పౌరాణిక సినిమాలైన ‘పాతాళభైరవి’, ‘సువర్ణసుందరి’లాంటి చిత్రాలు హిందీలో రీమేక్ చేయబడి జాతీయ స్థాయిలో అఖండ విజయాన్ని సాధించి వాటికున్న సత్తాను చాటుకున్నాయి. ఇదంతా 1950, 1960 సం.లో జరిగిన విషయం. అదేవిధంగా ఇప్పుడు దర్శకులు రాజవౌళి ‘బాహుబలి’ సినిమాను రెండు భాగాలుగా తీసి తెలుగు చిత్ర పరిశ్రమను అందనంత ఎత్తుకు తీసుకుపోయారు. ఇప్పటి హీరోలతో ఇలాంటి సినిమాలు చేయించడం కష్టమనుకోకుండా ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నాలను ఆయన అనుకున్న విధంగా మలచుకుని సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనాల్లోకి తీసుకెళ్లి ఔరా అనిపించుకున్నారు రాజవౌళి. బాహుబలి-2లో వున్న ప్రతి పాటా ఒక అద్భుతమైన అర్థంతో కూడిన పాటలు అవి. ఆ పాటల్లో సాహిత్యం, మాధుర్యం చెప్పలేం. నటీనటుల నటన అమోఘం. ప్రభాస్, రానాలు గడ్డాలు, మీసాలు తల వెంట్రుకలు భారీగా పెంచేసుకుని సినిమా చిత్రీకరణ పూర్తయ్యే వరకు చాలా ఓపికగా ఉండటం ఒక తీపి అనుభూతి. ‘బాహుబలి-2’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించే తీరును బట్టి ఈ సినిమాలో 2వేల కోట్లు వసూలు చేసిందంటే ఆశ్చర్యమేమీ లేదు.
తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొంతకాలం చోటుచేసుకున్న గొప్ప పరిణామాలు తెలుగు సినిమా వైభవాన్ని పూర్వవైభవం దిశగా తీసుకెళ్తున్నాయి. గత ఏడాది 2016 సం.లో జాతీయ అవార్డుతో ‘శతమానం భవతి’ ఉత్తమ ప్రజారణ పొందిన చిత్రగా ఎంపిక కావడం, పెళ్లిచూపులు చిత్రం రెండు జాతీయ అవార్డులు పొందటం, ఈ చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా తరుణ్ భాస్కర్ అవార్డును గెలుచుకోవడం, 2015 సం.లో బాహుబలి (ది బిగినింగ్) జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికై తెలుగు సినిమా చరిత్రలో పెద్ద సంచలనం సృష్టించింది. అలాగే బాహుబలి-2 ఒక్క తెలుగులోనే కాక హిందీ, ఇంగ్లీషు, తమిళ భాషల్లో విడుదల చేయడం గొప్ప సాహసం. 9వేల థియేటర్స్‌లో విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు.
తెలుగు సినిమా మార్కెట్ దినదినాభివృద్ధి చెందుతోంది. తెలుగు సినిమా పరిశ్రమను అంచనా వేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు అగ్ర కథానాయకులు, నాయికలు నటించిన సినిమాలు మాత్రమే 100కోట్ల రూపాయలు వసూళ్లు చేసేవి. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమీ కనిపించడంలేదు. పూర్తిగా అంచనాలు తలకిందులయ్యాయి. ఇపుడు మన తెలుగు దర్శకులు తీసిన సినిమాలు, విడుదలకు ముందే ఇతర ప్రాంతీయ భాషల్లోకి రీమేక్ చేయబడి అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయడంవలన భారీ స్థాయిలోనే వసూళ్లు చేస్తూ వున్నాయి.
మన తెలుగు చిత్ర పరిశ్రమ కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడమే కాకుండా రీమేక్ చేయడంవల్ల ప్రాంతీయ ముద్రను చెరిపేసుకుంటోంది. ఇప్పుడిప్పుడే తెలుగు చిత్ర పరివ్రమ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది.
కాశీనాథుని విశ్వనాథ్‌గారికి అతి గొప్పదైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం, చిన్న చిన్న సినిమాలకు కూడా జాతీయ వేదికలపై అవార్డులు వస్తూండడంతో ప్రపంచ సిని పరిశ్రమ వర్గాల దృష్టి మన తెలుగు చిత్ర పరిశ్రమవైపు పడుతున్నాయి. తెలుగు సినిమా ఒక వెలుగు వెలిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు సినిమా ప్రకాశించబోతోందని ఈ పరిణామాలు చూస్తే అర్థమయిపోతుంది.
ఏరంగంలో అయినా ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో కష్టపడితే చరిత్ర తిరగరాయవచ్చు. ఒకప్పటి పూర్వ వైభవాన్ని ఇప్పుడు తీసుకురావచ్చు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతుంది ఇదే. యువ దర్శకులు, రచయితలు ఒకప్పటి దర్శకులకు, రచయితలకు తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అదే బాటలో యువ హీరోలు కూడా ఇప్పటి జనరేషన్‌కు తగినట్లే కాకుండా పౌరాణిక జానపద యుద్ధ విన్యాసాలున్న సినిమాలు కూడా మేం చేయగలమని నిరూపిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే భారతీయ సినీ పరిశ్రమలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కళాతపస్వి కె.విశ్వనాథ్ పొందడం తెలుగువారికి గర్వకారణమైంది. తెలుగు సినిమాకు ఘన చరిత్ర ఉన్న సంగతి గతంలో దాదా అవార్డు అందుకున్న బి.ఎన్.రెడ్డి, జయరాజ్, ఎల్.వి.ప్రసాద్, ఎ.ఎన్. ఆర్, డి.రామానాయుడు వంటివారితో ద్విగుణీకృతమైంది. వారితోపాటు విశ్వనాథ్ ఇప్పుడు చేరారు. ఆయనకు ఆలస్యంగా వచ్చినా సరైన గౌరవం దక్కిందని తెలుగువారు ఆనందపడుతున్నారు. ఆయన గొప్ప దర్శకుడే కాక మంచి నటుడు. ఈ అవార్డు దక్కడంతో మరోమారు జాతీయ వేదికపై తెలుగు చిత్ర పరిశ్రమ పేరు మారుమోగింది. ఒకప్పుడు దక్షిణాది సినిమా అంటే కేవలం తమిళ సినిమా అనే ఉద్దేశ్యం ఉండేది. తమిళ సినీ రంగంలో పేరుమోసిన బాలచందర్, భారతీరాజా, శంకర్‌లాంటివాళ్ళతోపాటుగా కమల్‌హాసన్, రజనీకాంత్ లాంటి అగ్రనాయకులు ఉండేవారు. తెలుగు పరిశ్రమ ప్రాంతీయ హద్దుల వరకు మాత్రమే పరిమితమైంది. రాజవౌళి తీసిన బాహుబలి చిత్రం ఆ పరిధుల్ని దాటి రాష్ట్రాలు దాటి తెలుగు సినీ పరిశ్రమ గొప్పతనాన్ని నిరూపించింది.
ఏది ఏమైనా తెలుగు పరిశ్రమ 70వ దశకం నాటి సినిమాలు రూపొందించిన నిర్మాతలు, దర్శకులు, కథానాయకులు ఎంత గొప్ప సినిమాలు తీసి పేరు ప్రఖ్యాతులు గడించారో, నేటి తరం దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా అలాంటి సినిమాలు తీసి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉండేలా ప్రయత్నాలు చేయాలి.

- శ్రీనివాస్ పర్వతాల